దేశీ నెం.1 అయిపోయిన పరదేశీ పపాయ

ఎక్కడి నుంచో వచ్చిన బొప్పాయి పండు మనదేశంలో ఎక్కువ పండించే పంట అయింది.

Update: 2024-08-12 10:49 GMT

ఎక్కడి నుంచో వచ్చిన బొప్పాయి పండు మనదేశంలో ఎక్కువ పండించే పంట అయింది. దీనికి కారణం అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉండి, అతి చౌకగా లభించడమే. మార్కెట్లో దీని ధర సైజుని బట్టి రూ.20 నుంచి రూ.50 కే లభించడం. పేదోడు కూడా కనీసం వారంలో రెండు సార్లు ఈ పండు కొనుక్కుని ఇంటిల్లిపాది తినొచ్చు. పెరట్లో ఖాళీ స్థలం ఉండి గింజలు జల్లితే ఒక్క మొక్క బతికినా సరే.. ఏడాది తిరిగేసరికి శుభ్రంగా చెట్టు పెద్దదై బొప్పాయి పండ్లు మన ఇంట్లోనే పుష్కలంగా లభిస్తాయి. దీన్ని పెంచడానికి కూడా శ్రమ పడాల్సిన అవసరమే లేదు. పెద్ద సైజులో కుండీలో కూడా బొప్పాయి మొక్కని పెంచుకోవచ్చు. మొక్కకి సరిపడా నీళ్లు పోస్తే చాలు. 

పైగా మన దేశంలో వాతావరణానికి బొప్పాయి పంట కూడా అద్భుతంగా వస్తుంది. వైరల్ ఫీవర్స్, కరోనా తర్వాత బొప్పాయి పండులోని ఔషధ గుణాల గురించి తెలిసి ప్రజలు వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా మార్చుకున్నారు. మార్కెట్లోనూ బొప్పాయి పండ్లకి గిరాకీ పెరగడంతో... రైతులు కూడా ఈ పంటని విరివిగా పండిస్తున్నారు. దీంతో బొప్పాయి పంటలో ఆంధ్ర ప్రదేశ్ నెంబర్ 1, తర్వాత గుజరాత్, ప్రపంచంలో ఇండియా నెంబర్ వన్ గా నిలిచాయి.

 

పరదేశీ పపాయ...

సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నప్పటికీ తక్కువ దీర్ఘకాలిక వరదలు ఉన్న ఉష్ణమండల ప్రాంతంలో బొప్పాయిలు బాగా పెరుగుతాయి. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు బొప్పాయి పంటను దెబ్బతీస్తాయి. బొప్పాయిలు మధ్య అమెరికాకు చెందినవి. ఆ ప్రాంతంలోని ఆదివాసీలు బొప్పాయి పండ్లను ఔషధాల కోసం ఉపయోగించారు. 1550 ప్రాంతంలో స్పానిష్, పోర్చుగీస్ వలసవాదులు ఫిలిప్పీన్స్, భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర ఉష్ణమండల ప్రాంతాలకు విత్తనాలను తీసుకువచ్చారు. నేడు, హవాయి, ఫిలిప్పీన్స్, భారతదేశం, సిలోన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని ఉష్ణమండల ప్రాంతాలు బొప్పాయిని ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రాంతాలుగా నిలుస్తున్నాయి. తక్కువ భాగంలో బొప్పాయి వ్యవసాయ కార్యకలాపాలు ఇప్పటికీ మధ్య, దక్షిణ అమెరికాలో ఉన్నాయి.

అయితే మనదేశంలో వాతావరణం బాగా సరిపోవడంతో బొప్పాయి పంట విపరీతంగా సక్సెస్ అయింది. దాదాపు ఇది తెలుగు వాళ్ల నేటివ్ ఫ్రూట్ లాగా తయారయింది. పల్లెటూళ్లలో చాలామంది ఇంటి పెరట్లో కనిపించే చెట్లలో బొప్పాయి చెట్టు కూడా భాగమైపోయింది. అంతేకాదు ఆరోగ్యప్రయోజనాల రీత్యా వీటికి గిరాకీ పెరగడంతో రైతులు కూడా బొప్పాయి పంటపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో దేశంలో బొప్పాయి పంటలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా, ప్రపంచంలో ఇండియా నెంబర్ వన్ గా నిలుస్తున్నాయి.

 

అనేక పేర్లు..

కారికా పపాయ అనేది బొప్పాయి పండు శాస్త్రీయ నామం. అయితే బొప్పాయికి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పేర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో, దీనిని పావ్‌పా అని పిలుస్తారు. దక్షిణ ఆసియాలో దీనిని కెపాయా, లాపయా, తపయా అని పిలుస్తారు. ఫ్రెంచ్‌లో ఫిగ్యుయిర్ డెస్ ఐల్స్ అని ఫిగ్ ఆఫ్ ఐలాండ్స్ ఫేమస్. స్పానిష్ లో మెలన్ జపోట్, ఫ్రూటా బొంబా, మమోనా అని బొప్పాయికి పేర్లున్నాయి. 

బొప్పాయిలో వెరైటీలు:

మనలో చాలామందికి బొప్పాయి వెరైటీలు తెలియదు. అన్నీ ఒకటే అనుకుంటాం. కానీ మార్కెట్‌లో చాలా వెరైటీలలో బొప్పాయిలు లభిస్తున్నాయి.. వాటిలో కొన్ని పాపులర్ వెరైటీస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

కపహో సోలో (పునా సోలో అని కూడా పిలుస్తారు)

వైమానాలో

హిగ్గిన్స్

వైల్డర్

హోర్టస్ గోల్డ్ 

హనీ గోల్డ్ 

బెట్టినా

ఇంప్రూవ్డ్ పీటర్సన్

సన్నీబ్యాంక్

గినియా గోల్డ్ 

కూర్గ్ హనీడ్యూ

వాషింగ్టన్

బొప్పాయి ప్రయోజనాలు:

గుండెకి మేలు...

బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ ని నిరోధిస్తాయి. కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అయినప్పుడు, అది గుండె జబ్బులకు దారితీసే అడ్డంకులను సృష్టించే అవకాశం ఉంది. బొప్పాయిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

అమైనో ఆసిడ్ హోమోసిస్టీన్‌ను తక్కువ హానికరమైన అమైనో ఆసిడ్ గా మార్చడానికి అవసరమైన ఫోలిక్ ఆసిడ్స్ బొప్పాయిలో లభిస్తాయి. మాంసం ఉత్పత్తులలో ఎక్కువగా కనిపించే అమైనో ఆసిడ్స్ హోమోసిస్టీన్‌స్ గుండె జబ్బులకు ప్రమాద కారకంగా ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గిస్తుంది.

 

మెరుగైన జీర్ణక్రియ...

బొప్పాయిలో పపైన్, చైమోపపైన్ అనే రెండు ఎంజైములు ఉంటాయి. ఈ రెండు ఎంజైమ్‌లు ప్రోటీన్‌లను జీర్ణం చేస్తాయి. అంటే అవి జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే కడుపులో మంటను తగ్గిస్తాయి. పపైన్ అనేది చిన్నపాటి కడుపు నొప్పి తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది. పపైన్, చైమపాపైన్ రెండూ కూడా వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అవి సాధారణ గాయాలు, కాలిన గాయాలు వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలోనూ దోహదం చేస్తాయి. ఆర్థరైటిస్, ఆస్తమా వంటి క్రోనికి ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నవారి ఆరోగ్యానికి కూడా మెరుగ్గా పని చేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది...

విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైరల్ వ్యాధులతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది. బొప్పాయిలో ఈ యాంటీ ఆక్సిడెంట్ బాగా ఉంటుంది. ఆరోగ్యకరమైన, క్రియాత్మక రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన విటమిన్ ఎ కి బొప్పాయి మంచి మూలం.

ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది...

లైకోపీన్ అనేది ఎరుపు, నారింజ రంగు ఆహారాలలో కనిపించే సహజ వర్ణద్రవ్యం. టొమాటోలు, పుచ్చకాయ, బొప్పాయి లైకోపీన్ అత్యధికంగా కలిగి ఉండే మంచి వనరులు. లైకోపీన్ ఎక్కువగా ఉండే ఆహరం తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కొందరు నిపుణులు నమ్ముతున్నారు. అయితే దీనిపై కొన్ని పరిశోధనలు అసంపూర్తిగా ఉన్నాయి. అయినప్పటికీ, ఇతర అధ్యయనాలలో, గ్రీన్ టీ తో పాటు లైకోపీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని కనుగొనబడింది. 

బొప్పాయి విత్తనాలతో ప్రయోజనాలు:

బొప్పాయి గింజలు సాంప్రదాయకంగా ఇంటస్టైనల్ పారాసైట్స్ ని ఎదుర్కోవడానికి సహజ నివారణగా ఉపయోగించబడుతున్నాయి. బొప్పాయి గింజలు యాంటీ పారాసిటిక్ ప్రభావాలను కలిగి ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి, జీర్ణవ్యవస్థ నుండి హానికరమైన జీవులను తొలగించడంలో సహాయపడతాయి. బొప్పాయి గింజలు కాలేయంపై రక్షిత ప్రభావాన్ని చూపుతాయని కూడా కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. విత్తనాలలోని కొన్ని కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు వంటివి కాలేయ ఆరోగ్యానికి, పనితీరుకు తోడ్పడతాయి. బొప్పాయి గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఈ కాంపౌండ్స్ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇన్ఫ్లమేటరీ పరిస్థితుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.

 

బొప్పాయి ఎంజైమ్ ప్రయోజనాలు:

బొప్పాయి ఎంజైమ్‌లు.. ముఖ్యంగా పపైన్, వాటి జీర్ణక్రియ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ఇవి కడుపులోని ఆహార ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. ఇవి కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తిని తగ్గిస్తాయి. బొప్పాయి ఎంజైమ్‌ కలిగి ఉన్న క్రీమ్‌లు, ఆయింట్‌మెంట్లను పూయడం వల్ల గాయం నయం అవుతుందని నమ్ముతారు. ఎంజైమ్‌లు చనిపోయిన లేదా దెబ్బతిన్న కణజాలాన్ని తొలగించడంలో సహాయపడతాయి, వైద్య ప్రక్రియలో సహాయపడతాయి అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఉండడంతో బొప్పాయి ఎంజైమ్‌లను ఉపయోగిస్తున్నారు. బొప్పాయిలో ఉండే పపైన్ చర్మంలోని మృతకణాలను తొలగించి, చర్మం మృదువుగా, మరింత కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

న్యూట్రిషన్:

మీడియం సైజ్ బొప్పాయిలో రోజుకు అవసరమైన 200% కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫోలేట్, విటమిన్ ఎ, ఫైబర్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం, పాంతోతేనిక్ యాసిడ్ వంటి మంచి పోషక గుణాలున్నాయి.

మీడియం సైజ్ బొప్పాయిలో ఉండే న్యూట్రియెంట్స్ 

119 కేలరీలు

1.3 గ్రాముల ప్రోటీన్

30 గ్రాముల కార్బోహైడ్రేట్లు

కొవ్వు 1 గ్రాము కంటే తక్కువ

4.7 గ్రాముల డైటరీ ఫైబర్

21.58 గ్రాముల చక్కెర

గమనిక: సాధారణంగా బొప్పాయి తింటే మంచిదే. కానీ కొంతమందికి బొప్పాయి అలెర్జీ ఉండవచ్చు అలాంటి వాళ్ళు తినకపోవడమే బెటర్. బొప్పాయిలో సహజ చక్కెరలు ఉన్నాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వారి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా డాక్టర్ల సూచన మేరకు తినాలి.

Tags:    

Similar News