ఆహా, ఎంతటి మంచి వార్త... 'అధికం'గా తింటూ బరువు తగ్గొచ్చా!!
అసలు విషయానికి వస్తే తినే తిండి ద్వారానే అధిక బరువు తగ్గొచ్చట. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కూర్చుని చేసే ఉద్యోగాలు, తినే ఆహరం, మారుతోన్న లైఫ్ స్టైల్... బరువు పెరగడానికి ఇలా కారణాలేవైనా కావొచ్చు. అయితే ఈ బరువు తగ్గడానికి కొంతమంది రకరకాల ప్రయాసలు పడుతుంటారు. కొత్త కొత్త డైట్స్ ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఇష్టమైన ఆహరం కూడా తినకుండా బలవంతంగా నోరు కట్టుకోవాల్సి వస్తుంది.
నోరు కట్టుకోవాల్సి రావడం ఎంతలా ఉంటుందంటే... సహజంగా సౌత్ ఇండియన్స్ దోశ బాగా ఇష్టపడుతుంటారు. నూనె దిట్టంగా దట్టించి బాగా రోస్ట్ చేసిన వేడి వేడి దోశని పల్లీ చట్నీతోనో, అల్లం చట్నీతోనో ముంచుకుని తింటుంటే... ఆహా ! స్వర్గం. కానీ బరువు తగ్గించుకోవాలనే భావనతో నో ఆయిల్ దోశ ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది. ఒక పది కేజీలు బరువు ఎక్కువుంటే ఏమవుతుంది? మరీ నూనె లేని దోశని ఎలా తింటున్నారబ్బా అని జాలేస్తోంది. నోటికి రుచి తగలని చప్పటి తిండి తింటే ఏంటి? తినకపోతే ఏమిటి? అనిపిస్తుంది. కానీ పడే వాడిది బాధ మనకేంటి ఎన్నైనా అనుకుంటాం. అధిక బరువుతో ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఇంత కఠోర దీక్ష తీసుకున్నారు అని అనిపిస్తోంటుంది మరోసారి.
అధిక బరువు శారీరక సమస్యలనే కాదు మానసికంగానూ వేధిస్తుంటోంది. రంగు, ఎత్తు, శారీరక సౌష్టవాన్ని బట్టి మనిషి అందాన్ని ప్రామాణికంగా భావించే సమాజంలో అధిక బరువున్నవారే కాదు, బాగా సన్నగా ఉన్నవారు కూడా బాడీ షేమింగ్ కి గురవుతుంటారు. ఇది కొన్ని కొన్ని సార్లు డిప్రెషన్ కి కూడా గురి చేసి మనుషుల్ని కోలుకోలేకుండా చేస్తుంటుంది. అందుకే చాలామంది ఆరోగ్యం కోసం కంటే కూడా అవహేళనలు తట్టుకోలేక నోరుకట్టుకుని రుచి లేని ఆహరం తినేస్తున్నారు. ఇక గ్లామర్ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు అట్రాక్టివ్ ఫిజిక్ మెయింటెయిన్ చేయడం కోసం తప్పనిసరిగా డైట్ ఫాలో అవుతారు. ఇక అసలు విషయానికి వస్తే తినే తిండి ద్వారానే అధిక బరువు తగ్గొచ్చట. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువుకి అధిక ప్రోటీన్స్ తో చెక్...
వెయిట్ తగ్గాలి అనుకునేవారు కోసం కోసం న్యూట్రీషనిస్ట్ లు ఒక సలహా ఇస్తున్నారు. అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా బరువు కూడా పెరగడానికి అవకాశం ఉండదు. మనం రోజూ తినే భోజనంలో అదనపు ప్రోటీన్లను జోడించాలి. క్రమంగా ఒక వారం పాటు ప్రొటీన్‌ని పెంచుతూ పోవాలి. అయితే కేలరీస్ తక్కువ ఉన్న ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి. లివర్, కిడ్నీ రోగాలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ డైట్ ఫాలో అవ్వాలి. అధిక ప్రోటీన్ తీసుకోవాలి అన్నారు కానీ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలేంటో చెప్పాలి కదా అంటారేమో.. అవి కూడా తెలుసుకుందాం. అందులోనూ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. పోషకాలు అధికంగా ఉండి, శాచురేటెడ్ ఫ్యాట్స్, కేలరీస్ తక్కువగా ఉండే ప్రోటీన్ పదార్ధాలు మాత్రమే ఎంచుకోవాలి.
హై ప్రోటీన్ ఫుడ్స్...
తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండే మాంసాహారం
సీఫుడ్
బీన్స్
సోయా
తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు
గుడ్లు
నట్స్ అండ్ సీడ్స్
ప్రోటీన్ ఆహారాలను మార్చడం మంచిది. ఉదాహరణకు, ఒమేగా-3లు సమృద్ధిగా ఉన్న సాల్మన్ లేదా ఇతర చేపలను, ఫైబర్, ప్రోటీన్ లభించే... బీన్స్, పప్పు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. సలాడ్‌లో వాల్‌నట్‌లు, ఓట్ మీల్‌లో బాదం పప్పులను చేర్చుకోవడం కూడా బెటర్ ఆప్షన్స్.
ఏ ఆహారాలలో సుమారు ఎన్ని గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి:
1/2 కప్పు లో ఫ్యాట్ కాటేజ్ చీజ్: 12.4g
85 గ్రాములు టోఫు: 9 g
1/2 కప్పు వండిన పప్పు: 9 g
2 టేబుల్ స్పూన్లు న్యాచురల్ పీనట్ బటర్: 7 g
2 టేబుల్ స్పూన్లు ఆల్మండ్ బటర్ : 6.7 g
85 గ్రాముల స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్: 26 g
85 ఫిష్ ఫిల్లెట్ (చేపల రకాన్ని బట్టి): 17-20 g
28 గ్రాముల ప్రొవోలోన్ చీజ్: 7g
1/2 కప్పు వండిన కిడ్నీ బీన్స్: 7.7g
28 గ్రాముల బాదం: 6g
1 పెద్ద గుడ్డు: 6g
100 గ్రాముల లో ఫ్యాట్ పెరుగు : సుమారు 5g
100 మీ.లీ సోయా మిల్క్: 3 g
100 మీ.లీ తక్కువ కొవ్వు పాలు: 4 g
పిండి పదార్థాలు, కొవ్వులు:
మనం తినే ఆహారంలో ప్రోటీన్‌ని జోడిస్తున్నప్పుడు, "స్మార్ట్ కార్బోహైడ్రేట్లు" వంటి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఏ ఫుడ్స్ లో ఉంటాయో తెలుసుకుందాం.
పండ్లు
కూరగాయలు
తృణధాన్యాలు
బీన్స్
లో ఫ్యాట్ మిల్క్, పెరుగు (రెండూ ప్రోటీన్ కలిగి ఉంటాయి)
ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా ప్రయత్నించండి:
నట్స్, న్యాచురల్ స్టైల్ నట్ బటర్స్
సీడ్స్
ఆలివ్స్
ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్
చేప
అవకాడో
ఆకలిని నియంత్రించడానికి, నాలుగు లేదా ఐదుసార్లు చిన్న మీల్స్ గా విభజించుకుని తినడం ఉత్తమం. స్నాక్స్ లో వీటిని చేర్చుకుంటే ఆకలి తగ్గి బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.