సాహిత్య విమర్శలో కొత్త పంథా ‘చెమట చెక్కిన వాక్యం’
కెంగార మోహన్ ‘చెమట చెక్కిన వాక్యం’ చరిత్రలో నిలిచిపోయే సాహిత్య విమర్శ;
ఇటీవలి వచ్చిన సాహిత్యవిమర్శలో అరుదైన విశ్లేషణాత్మకమైన శైలి కలిగిన కవిత్వ పరామర్శ ‘చెమట చెక్కిన వాక్యం’ అని పలువురు వక్తలు అన్నారు.
సాహితీ స్రవంతి రాష్ట్రఅధ్యక్షులు, కవి కెంగారమోహన్ రాసిన ‘చెమట చెక్కిన వాక్యం’ గ్రంథ పరిచయ సభ నగరంలోని టీజివి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం జరిగింది.
సభాధ్యక్షులుగా సాహితీస్రవంతి రాష్ట్రకార్యదర్శి జంధ్యాల రఘుబాబు వ్యవహరించగా సభకు రచయిత్రి నాగమణి ఆహ్వానం పలికారు. గ్రంథాన్ని ప్రముఖ విద్యావేత్త, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు విజయసారథి ఆవిష్కరించారు.
ఆవిష్కర్త మాట్లాడుతూ కవిత్వంలో సాహిత్య సృజనలో కెంగార మోహన్ ప్రశంసనీయమయిన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. “ నేను చిన్నప్పుడు ఆయనకు గణితం బోధించిన విషయం గుర్తుపెట్టుకుని తన పుస్తకాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు కల్పించింనందుకు గర్వపడుతున్నాను. సాహిత్యంలో విమర్శకుడి స్థాయికి నా శిష్యుడు ఎదగడం ఆనందాన్నిచ్చింది,” అని అన్నారు.
సభాధ్యక్షులు జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ ఒక విమర్శ గ్రంథం రాయడానికి వందలాది పుస్తకాలు చదవాల్సివస్తుందని ఇది విమర్శకుడి ప్రతిభకు, ప్రజ్ఞకు నిదర్శనమన్నారు. సభలో విరసం రాష్ట్రనాయకులు పాణి మాట్లాడుతూ అరవై పుస్తకాలపై విమర్శ అన్నది సాదారణ విషయం కాదన్నారు. పుస్తకంలో కవుల కవిత్వరచన తీరు, వర్ణన, శైలి, శిల్పాలను వర్ణించడంలో కవి వైవిధ్యతను ప్రదర్శించారన్నారు. మానవ సమాజం శ్రమతోనే నిర్మతమౌంతుదని శ్రమతో కూడిని ఈ కవిత్వ పరామర్శ శ్రమలోంచి ఉద్భవించిందన్నారు. ఇందులో కవి అనేక పార్శ్వాలు కనబడతాయన్నారు. తెలుగు విమర్శలో నిలిచిపోతుందన్నారు.
ప్రముఖ కథారచయిత్రి డా యం ప్రగతి మాట్లాడుతూ కవిత్వ అంతరంగాన్ని శోధించిన గ్రంథమని ఈ పుస్తకాన్ని వర్తమాన కవులు చదివితే గొప్ప కవిత్వం రాస్తారన్నారు. ఇది నవతరం కవులకు పాఠ్యగ్రంథంగా ఉపయోగపడుతుందన్నారు. తెలుగు కళాస్రవంతి అధ్యక్షులు ఇనాయతుల్లా మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో విమర్శపాత్ర చాలా తక్కువగా ఉందని ఈ గ్రంథంతో పరిపూర్ణత సాధించినట్లైందన్నారు. లబ్ద ప్రతిష్టులైన కవులు మొదలుకొని ఈనాటి కవుల వరకు సాగిన కవిత్వ ప్రయాణమే ఈ పుస్తకమన్నారు. దళిత స్పృహ, స్త్రీవాద స్పృహతో కూడిన శైలి అనేకచోట్ల కనబడుతందన్నారు. ఇది సామాజిక స్థితిని వర్తమాన సాహిత్య సమాజాన్ని ప్రభవాతం చేస్తుందన్నారు.
సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు ఆవుల బసప్ప మాట్లాడుతూ ఈ కవిత్వ పరామర్శలో కవిత్వాన్ని తులనాత్మకంగా పరిశీలించారన్నారు. పరిశోధనాత్మకంగా సాగిన రచనగా అభివర్ణించారు.
టీజివి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కవిగా, కథకుడిగా, విమర్శకుడిగా బహుముఖీయ ప్రజ్ఞకల్గిన కవి కెంగార మోహన్ అని అన్నారు. ఐక్య ఉపాధ్యాయ పత్రిక చీఫ్ ఎడిటర్ కెంగార మోహన్ మాట్లాడుతూ సాహిత్యరంగంలో ముఖ్యంగా విమర్శలో కవి కెంగార మోహన్ తనదైన ముద్రవేశారన్నారు.ఈ చెమట చెక్కిన వాక్యం ఆధునిక సాహిత్యచరిత్రలో గొప్పగా నిలిచిపోతుందన్నారు. ఈ సధర్భంగా కవిని కథారచయిత యస్‌డివి అజీజ్ సన్మానించగా, ఆవిష్కర్త విజయసారథిని కెంగార మోహన్ సన్మానించారు.
సభకు సమన్వయకర్తగా సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు యంపి బసవరాజు సమన్వయకర్తగా వ్యవహరించగా కవులు మారుతీ పౌరోహితం, టి.వెంకటేష్, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, చౌశా, పుల్లారామాంజనేయులు, సాహితీస్రవంతి జిల్లా నాయకులు సూగూరు సుధాకర్, విజయులు తనగల, పఠాన్ సుల్తాన్‌ఖాన్, డి.పార్వతయ్య, బత్తిని మహదేవి, యూటిఎఫ్ జిల్లా నాయకులు డి.రాములు, హేమంత్ కుమార్,కెవిపియస్ జిల్లా ప్రధానకార్యదర్శి యండి ఆనంద్ బాబు ఆద్య మెడికల్ అధినేత అవిజ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.