మేఘాలయ... మేఘాలలో తేలిపొమ్మన్నది

నల్లనల్లని లేత నేరేడు రంగు మబ్బులు. అప్పుడప్పుడు కనిపించే సూర్యుడి వెలుగులు. పచ్చటిచెట్లు, అడవి పూల అందాలు, పరిమళాలు ఓహో! ఇంతకన్నా ఏం కావాలి.

Update: 2024-07-14 07:56 GMT

- కాంతి నల్లూరి 

మేఘాలయ రాష్ట్రంలోని నోంగ్‌పొ, జోవై జిల్లాల గుండా రాజధాని షిల్లాంగ్ వైపుకు మా ప్రయాణం. దారిలో రోడ్డుకిరుప్రక్కల పచ్చటి రమణీయమైన ప్రకృతి ఒడిలో అచ్చంగా పదిహేడుమంది మహారాణుల (ఎవరు వంటిల్లు, మొగుళ్ళు, పిల్లలు అనుకోవటం లేదు. కనక మహారాణులమే కదా?) ప్రయాణం. మబ్బులన్ని చుట్టపు చూపుగా కొండల మీదకి వచ్చాయి. వచ్చిన తర్వాత వర్షించకుండా మానతాయా! వాన జల్లులు మమ్మల్ని పలకరించాయి. అందరం కళ్ళు చెవులు వ్యాన్ కిటికీల గుండా కొండలపైకి, ప్రకృతికి మేఘాలకు అప్పజెప్పాం. నల్లనల్లని లేత నేరేడు రంగు మబ్బులు. అప్పుడప్పుడు కనిపించే సూర్యుడి వెలుగులు. పచ్చటిచెట్లు, అడవి పూల అందాలు, పరిమళాలు ఓహో! ఇంతకన్నా ఏం కావాలి.

మధ్యలో చిన్న చిన్న ఊర్లు. ఎక్కువగా యు (umiseller,umdihar,umiget) అక్షరంతో పేర్లు ఉన్న ఊర్లు. దారిలో డౌకి (dawki) నది చేరుకున్నాం. ఈ నది నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి. ఎంతంటే అడుగునున్న చిన్న చిన్న గులకరాళ్లతో సహా కనపడుతున్నాయి. నీళ్లు కొబ్బరినీళ్ళలా తియ్యగా ఉన్నాయి. నీళ్ళ దగ్గరనుండి ఒడ్డుదాక రకరకాల రాళ్లు రకరకాల సైజులలో ఎవరో అందంగా పరిచినట్లు కనుచూపుమేర మహా అందంగా ఉన్నాయి. ఒడ్డునున్న గోడ కూడా రాళ్ల వరసలతో భలే అందంగా ఉంది. ఆహా! ఓహో! అంటూ అందరూ దబదబ ఫోన్లకు పని పెట్టారు. తలా ఓ చిన్న రాయి ఏరుకొని తెచ్చుకున్నాం.




 రెండు కొండల పచ్చదనం మధ్య పొద్దుగూకుతూ ఉన్నప్పుడు డౌకి నదిలో పడవ ప్రయాణం. ఓహో! ఆహా! లాహిరి లాహిరిలో ఓహో! తారాచంద్రుల విలాసంతో విరిసే వెన్నెల పరవశంతో పూల వలపులతో గుమగుమ పిల్ల వాయువుల లాలనలో ఊగినగా తూగినగా పాట పేరడీ, జోక్స్, ఫోటోలు, దూరంగా బ్రిడ్జి. అక్కడిదాకా తీసుకెళ్ళు అని గోల. పడవ నడిపే వాళ్ళు కూడా మా గోలతో నవ్వుతూ మా ఫోటోలు మా ఫోన్లో తీశారు. ఆ రెండు కొండలను కలుపుతూ అంత ఎత్తున బ్రిడ్జి, దానిపైన వాహనాల ప్రయాణం నోరెళ్ళబెట్టి చూసాం.




 డౌకి (dawki) నుండి అమలారం (Amlarem) లో స్టే అయ్యాం. అమలారం గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఏడు గంటలకల్లా సందడి మొదలైంది. దాదాపు షాపులన్నిటిలో ఆడవాళ్లే. లేడీస్ అందరూ ఎడమ చేతికింది నుండి కుడి భుజం మీద ఓ లుంగీలాంటి (క్లాత్) దాదాపు మూడు మీటర్ల గుడ్డ ను ముడి వేసుకున్నారు. ఈ క్లాత్ ను "యకియాంగ్" అంటారట. మెచ్యూర్ అయినప్పటినుండి ఈ "యకియాంగు"ను వేస్తారట. పెళ్లి అయితే కంపల్సరిగా వేయాలట. పిల్లలను ఓ గుడ్డతో వీపుకు కట్టుకొని చేతులూపుకుంటూ దర్జాగా నడుస్తున్నారు. సరుకులు ఆఖరికి సిమెంట్ బస్తాలు కూడా వీపు మీదనుండి ఓ గుడ్డతో తలమీద తగిలించుకొని మోస్తున్నారు. ఈ మహిళలు భలే భలే ఆకర్షించారు.

ఈ రాష్ట్ర ప్రత్యేకత "మాతృస్వామ్య వ్యవస్థ". పెళ్ళికొడుకే పెళ్ళికూతురు చేయి పట్టుకుని పెళ్ళికూతురు ఇంటికి వస్తాడట. కుటుంబంలో, బిజినెస్ లో ప్రధాన పాత్ర, నిర్ణయాలు మహిళలే తీసుకుంటారు అనడంతో ఇంకా పిచ్చపిచ్చగా నచ్చేశారు. గారో తెగలో చిన్న కూతురు వారసురాలవుతుంది. ఆస్తులు ఆడపిల్లలకు వస్తాయట. ఇప్పుడిప్పుడే మగపిల్లలకు ఆస్తులు ఉంటున్నాయి అన్నారు. కర్మకాండలు మత విశ్వాసాలు ప్రకారం జరుగుతాయి. మగపిల్లలు చేస్తారట. వీరి భాష కసి (khsi), గారో (garo) లు. ఇంగ్లీష్ నడుస్తుంది.

 

పంపుల్లో వస్తున్న నీళ్ళు కొబ్బరినీళ్ళలాగా తియ్యగా ఎంత బాగున్నాయో! బాటిల్స్, బబుల్తో సహా నింపుకున్నాం. చుట్టూ కొండల లోయల పచ్చదనం. కొండల మీద చిన్న చిన్న మడులు నిచ్చెన మెట్ల (స్టెప్స్ స్టెప్స్) లాగా పచ్చగా రా రమ్మని పిలుస్తున్నాయి.

షిల్లాంగ్ వీధులన్నీ నీట్ గా, అందంగా ఉన్నాయి. సండే మార్కెట్ విపరీతమైన రద్దీగా ఉంది. దాదాపు అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి. కొంత ఐజ్వాల్ కట్టు బొట్టు కనిపిస్తుంది. పూల మొక్కలు, సొర. బీర, చిక్కుడు గులాబీల అందాలు కనిపిస్తున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 20 సీటర్ల వ్యానులే. కార్లు టాక్సీలు, ఆటోలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. (Wards I Land) వర్డ్స్ ఐలాండ్ లో రంగురంగుల పువ్వులు భలే ఉన్నాయి. డస్ట్ బిన్స్ కూడా నేలలో పాతిన మూడు సువ్వల మధ్య వలయాకారంలో (శంఖు ఆకారంలో) ఆకారంలో ఎదురుతో చేసిన బుట్టలు. షిల్లాంగ్ లోనే యునియన్ (unian) లేక్ చూశాం.

 



 సేక్రేడ్ హార్ట్ థియోలాజికల్ కాలేజ్ (1938) చర్చి ప్రాంగణం లో ఉన్న డాన్ బాస్కో మ్యూజియంలో ఈశాన్య రాష్ట్రాల మనుషులు, అలంకరణలు, నృత్య భంగిమలు, కళాకారులు, కళలు, వాళ్ళు వాడిన వస్తువులు, డాన్ బాస్కో(Dan Basco) చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు, బొమ్మలు, ఎదురుతో చేసిన బుట్టలు, పెట్టెలు, చేపలు పట్టే రకరకాల బుట్టలు, సైనికులు, కవచాలు ఆయుధాలు దేనికదే దాదాపుగా 20 గ్యాలరీలు ఉన్నాయి.

 




 గ్రౌండ్ ఫ్లోర్, రెండు అండర్ గ్రౌండ్ ఫ్లోర్లు, పైన నాలుగు ఫ్లోర్లు అంటే మొత్తం 7 ఫ్లోర్లతో నీట్ గా ఉంది. నాలుగో ఫ్లోర్ (sky walk లో) పైకి వెళితే షిల్లాంగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. అసెంబ్లీ, కోర్టు మొదలైనవి ఏ ఏ ఏరియాలో ఉన్నది బోర్డులు పెట్టారు స్కై వాక్ లో. స్టీల్ రాడ్లతో వెళ్లడానికి రావడానికి టూ పార్ట్స్ గా స్కై వాక్ వెరైటీ గా ఉంది.

జలకళలు. నీళ్ళ కలకల కలకల సంగీత ఝురులు, రంగురంగుల లేతాకుల శోభ, పచ్చటి ఆకుకొండలు కుప్పపోసినట్లున్నాయి. కొండలు, ఆకాశం (అక్కడక్కడ) నేరేడు, లేలేత కనకాంబరం రంగులతో మంచి చిత్రకారుడు పులిమినట్లున్నాయి. సూదిగా బోడిగా శిఖరాలు ఆకాశమంటేటట్లున్నాయి. కొన్ని పూర్తిగా, కొన్ని కొన్ని మేఘాలతో, మొక్కలతో దోబూసులాడుతూ సగం సగం ఇస్తున్నాయి.

పూల జల్లులు. నిశ్శబ్దంగా కురిచే జోరువానలు. నాలుగు నాలుగున్నర కల్లా తెల్లంగా తెల్లారిపోయి ఆరు గంటలకు లేచినా, ఏమిటి? ఎనిమిది గంటల దాకా పడుకున్నామా అని కంగారు పరిచే ఉషోదయాలు. నాలుగున్నరకే చీకట్ల ముసుర్లు, నింగిలో ఓవైపు సూర్యుడు మరోవైపు చంద్రుడుల దోబూసులాటలు. వర్షించడమే గాని గర్జించని మేఘాలు. మనలాగా దోమల ఈగల పందిళ్లు, వాటి ఝుమ్ముమనే శబ్దాలు లేని రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాల్లోమండిపోతున్నామని ఫోన్లు వస్తుంటే, ఈశాన్యంలో మంచి ఎండ్ల కాలంలో, కాలమే మర్చిపోయి (మేఘాలయ హోటల్లో ఫ్యాన్లు లేవు) మరి ఎండ్ల కాలంలో హోటళ్లలో ఫ్యాన్లు లేకపోతే ఎలా అన్నాను. మా టీం లీడర్ బేబక్క! అమ్మడు! ఇది ఎండ్లా కాలమే, వేసవిలోనే ఇంత వర్షంపడి చలి పుడుతుంటే శీతాకాలంలో ఇంకెంత చలిగా ఉంటుందో? ఇంకా ఫ్యానలెందుకు. ఇక్కడ ఎవరు ఫ్యానులు వేసుకోరు అంది.

ప్రతి ఒక్కరి చేతిలో (ఎండలకో వానలకో ఉపయోగపడేటట్లు) చిన్నది నుండి పెద్దది వరకు మోడ్రన్ గోడుగులున్నాయి. మ్యూజియం లో చూసినట్లు రకరకాల సాంప్రదాయ గొడుగులు మాత్రం ఎక్కడా కనిపించలేదు.

ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని సునిచిత వ్యత్యాసాలున్నప్పటికీ, జాతులు, ఉపజాతులు భిన్నతెగలున్నప్పటికీ, జానపద గాథలు, ఆహారపు అలవాట్లు, వంటలు, పండుగలు, సంగీత నృత్యాలు, సంగీత వాయిద్యాల లో (భూమిలో తుప్పలనరికి, కాల్చేసి, నేలను సదునుచేసి దున్నటం, విత్తనాలు చల్లటం, పంటలు పండించడం, కోయటం ప్రధాన పండుగలుగా,

పంటలు పండించడం కోయడం ప్రధాన పండుగలుగా) ఉమ్మడితనం కనపడుతుంది. అందుకే ఈశాన్య రాష్ట్రాలను ఏడుగురు అక్కాచెల్లెళ్ళు (సెవెన్ సిస్టర్స్) అంటారు. సిక్కిం ను సోదరుడని భావిస్తారు.

ఈశాన్యంలో ప్రతి మూలా తిరిగిన "భూపేన్ హజారికా" లాగా తిరిగితే గాని ఈశాన్య రాష్ట్రాల కొండకోనల, మబ్బుల, జలపాతాల,తోటల అందాలను, వివిద గిరిజన జాతుల సంస్కృతి, సాంప్రదాయాలను ఆస్వాదించిన తృప్తికలుగుతుందేమో?

అమలారం నుండి సిల్చేరుకు ఎన్ హెచ్ 06 రోడ్ లో జయంతి హిల్స్ కొండల లోయల పొగ మబ్బులలో (ఈ మేఘాల వలనే మేఘాలయ నే పేరు వచ్చిందేమో)! ఓవైపు ఎండ ఓ వైపు లో ప్రయాణం. కొండల్లో నుండి లోయల్లోకి బోలెడన్ని జలపాతాలు ఉత్సాహంగా ఉరకలెత్తుతున్నాయి సోనాపూర్ నది ప్రశాంతంగా ప్రవహిస్తున్నది. సోనాకలి (ఇచ్చామతి నవలలోని) నది గుర్తొచ్చింది. ఇక్కడా కొండలను తవ్విపోస్తున్నారు. దారంతా ట్రక్కులు లారీలే బార్లు బార్లుగా ఓ వెయ్యి పైగా కనిపిస్తున్నాయి. ఈ విధ్వంసం చేయని పాలకులు ఎపుడొస్తారో?

7 గంటల ప్రయాణం సొన్ పో, నొయిపో హిల్స్ అడివి. ఎక్కడ ఒక్క పెంపుడు, అడవి జంతువు కూడా కనిపించలేదు. పోక, అరటి, కుంచె చీపుర్ల మొక్కలు, వరి పంటలు కనువిందు చేస్తున్నాయి.


(కాంతి నల్లూరి ఉపాధ్యాయురాలుగా 30 ఏళ్ల సర్వీస్ చేసి ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారు. "ఆమె చూపు ఎర్రజెండా వైఫై"(వేటపాలెం వెంకాయమ్మ జీవిత చరిత్ర) ఓ పది వరకు కథలు, కొన్ని కవితలు రాశారు.)

Tags:    

Similar News