‘అంతర్యుద్ధం’ నుంచి పెల్లుబికిన లహరి కవితలు

‘స్పర్శ లేని శిల మహిళా స్వరం’ : పుస్తకపరిచయం బిఎస్ రాములు;

Update: 2025-07-29 03:48 GMT

'స్పర్శ లేని శిల' అనే పేరుతో ఎన్ లహరి వెలువరించిన కవిత్వం సంపుటి ఇది. ఇందులో కవయిత్రి రాసిన నా మాటతో పాటు 60 కవితలున్నాయి. మహిళా కోణంలో రాసిన కవితల్లో తల్లిగా, జీవిత భాగస్వామిగా, కూతురుగా, ప్రేయసిగా, మనిషిగా , ప్రకృతి ప్రేమికురాలిగా, పల్లె పడుచుగా, ఏకాకి/ ఏకాంతంలోని ఆనంద విషాదాలను ఈ కవితల్లో చిత్రించారు.

బాల్యంలోని సంతోషాలను, తెలంగాణ పండుగలు మనుషులను కలిరపే ఆత్మీయతలను, ప్రకృతి ప్రేమికురాలిగా స్పందనలను అనేక కవితల్లో చిత్రించారు. " తీరం అంచున గత స్వప్నాలను నెమరేసుకుంటూ నేనూ సముద్రమూ.. ఆశలు రాలిన మోడునై ... నాలో నేనే ఒంటరినై...ఓ విషాద గీతంగా మిగిలి పోతాను అంటారు స్పర్శ లేని శిల" కవితలో!
ఇలా ఈ కవితా సంపుటి లో అంతర్లయగా విషాద గీతం కంటిన్యూగా కొనసాగుతుంది. స్త్రీ కష్టాలు , కన్నీళ్లు , అవమానాలు, అభద్రత, బరువు బాధ్యతలు ఎన్ని రకాలో ఈ కవితల్లో చూడవచ్చు. జీవితం పట్ల ఒక ఆశ, ఒక నిరాశ మధ్య కొట్టాడే స్థితి కవితల నిండా పరుచుకుంది. ఈ కవితలు ఇలా రూపుదిద్దుకోవానికి లహరి జీవిత నేపథ్యం బలంగా పని చేసింది. నా మాటలో ఇలా పేర్కొన్నారు. " కొన్ని పరిస్థితుల వలన నేను కొన్ని రోజుల పాటు మంచం పట్టినపుడు మనుషుల విలువ బాగా తెలిసి వచ్చింది. ఆ కఠిన సమయం నుండి బయటపడి ఇపుడిలా మీ ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇది నాకు గొప్ప ఊరటనూ ప్రశాంతతనూ కలిగించింది.

మహిళా స్వరం "బంధాలూ బంధుత్వాలూ అంటూ మనకు ఎన్నో ఉంటాయి. కానీ అవన్నీ అవసరానికి అవి తామరాకు మీది నీటి బిందువులే. అవి మన ఎదుగుదలకు ఎందుకూ పనికిరావని గ్రించడానికి ఎంతో కాలం పట్టలేదు. స్వతహాగా అన్నిటిని తట్టుకొని ఎదిగి నిలదొక్కుకోవడంలో ఉన్న తృప్తి వెల కట్ట లేనిది". ఇలా లహరి తాను చుట్టూ సమాజంపెట్టుకున్న ఆశలు, ఆశించడాలు నిరాశలై దిగులు , డిప్రెషన్ నుండి తనకు తాను కోలుకోవడానికి చేసిన ప్రయత్నం, అంతర్యుద్దం లో భాగంగా ఇందులోని కవితలు రూపుదిద్దుకున్నాయి. 


ఈ కవితల్లో వస్తువు కనువైన వర్ణనలు,
పోలికలు, రూపకాలు , పద చిత్రాలు చక్కగా చిత్రీకరించారు. లహరి పల్లె తనాన్ని , పల్లె భాషను, యాసను, సంస్కృతిని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు. మహిళ గురించి రాస్తూ " ఒకప్పుడు పొయ్యిలా మండుతూ ఇంటిల్లి పాదికీ బుక్కెడు బువ్వై ఆకలి తీర్టేది. .. కాలి కింద మట్టిలా నలిగిన కాలం నుండి కాళికలా కనక దుర్గలా వివక్షపై కదం తొక్కి కత్తుల్ని దూసింది. " అంటూ మహిళా చైచన్యాన్ని ఎదిగిన క్రమాన్ని ఉత్తేజితంగా వ్యక్తీకరించారు లహరి. . ఆధిపత్య అహంకారం స్వార్థం అడుగు పడని చోటు కనుచూపు మేరలో లేదు" అంటూ పెరిగి పోయిన స్వార్థాన్ని గుర్తు చేశారు కవయిత్రి . ఇందులోని కవితా శీర్శికలు కొన్ని ... "వరకట్నపు విష బీజం, జ్ఞాపకాల వంతెన, తంగేడు పూలు, ఓదార్చేది అదే(మృత్యువే) ఆమె ఓ జీవనది, ఎగసి పడే కెరటాన్నై, ఆమె లేనిదే అవని లేదు, జ్ఞాపకాలను వెతుక్కుంటూ, దిగులు సముద్రం, రెప్ప చాటు శ్యం, కంచెలు కూల్చండి, మాట మరిచిన అరుగు, ఊరు మారింది, అమ్మమ్మ లేని ఇల్లు , ఎదురు చూపులు,శిశిర దేహం, అంతులేని వేదన.." ఇలా కవితా శీర్శికలు ఇందులో గల ప్రధాన కవితా వస్తువును తేట తెల్లం చేస్తాయి. " ప్రేమను పంచడానికి సప్త సముద్రాలు దాట నవసరం లేదు." అంటూ చక్కని సూచనతో కవితా సంపుటి ముగుస్తుంది.
రచయిత్రి చివరాఖరుకు కన్నీళ్లు తుడుచుకొని ఆత్మ విశ్వాసంతో వివక్షను, అసమానతలను ఎదిరించి సంకల్పం ప్రకటించడం సంతోషం. ఈ కవితల్లో స్త్రీ ఎదుర్కునే సమస్యలు అనేక కోణాాల్లో చిత్రించారు. గద్దర్, అలిశెట్టి ప్రభాకర్ , అమ్మమ్మ వంటి వారిని కవితల్లో తలుచుకున్న స్పర్శలో ఆత్మీయత పరిమళిస్తుంది. భర్త ఆసరాతో ఇపుడు నిరాశ దిగులు నుండి బయట పడింది. ప్రతి స్త్రీ విజయం వెనక ఒక పురుషుడు ఉంటాడు అనడానికి ఓ ప్రత్యక్ష తార్కాణం మా ఆయన అని నమస్సులర్పించారు. ఇలా దిగులు తనపై తనకు గల సెల్ఫ్ పిటీ నుండి బయటపడి తిరిగి సమాజం వైపు చూపు సారించింది రచయిత్రి. కనక ఇక జీవితంలో విశ్వరూపం ధరించి కట్టడి చేస్తున్న
కుల వివక్ష, కుల ాఅణిచి వేత, మతం పేరిట, మన సంస్కృతి పేరిట కొనసాగుతున్న కుల వ్యవస్థకు , పురుషాధిపత్యానికి మూల కారణమైన పితృస్వామిక కుటుంబ వ్యవస్థ, అందుకు పూర్తి మద్దతు తెలిపే పురాణ ఇతిహాసాలు, సంస్కృతి ఆధిపత్యాలను వెలికి తీస్తూ ఆ అనుభవాలను అవగాహనను అధ్యయనాన్ని కవితల్లో రాయడం నేటి అవసరం అని గుర్తు చేస్తూ మంచి కవితలతో తన మనసును హృదయాన్ని ప్రశాంతతను సాధించుకున్న లహరికి అభినందనలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు.
(ప్రతులకు రచయిత్రి ఎన్. లహరి, 6-4-53/301, శ్రీరాం హోమ్స్, హెచ్ ఐజి-96, ఫేజ్ 4, కాలనీ, వనస్థలి పురం , హైదరాబాద్- 500070. ఫోన్. 9885535506 లో సంప్రదించండి. )


Tags:    

Similar News

నువ్వే!