జ్ఞాపకాల్లోకి జారిపోయిన మా పాత పెంకుటిల్లు

పొదరిల్లులాగా అందంగా అల్లుకున్నా ఒక రోజు పాత పెంకుటింటికి వీడ్కోలు చెప్పాల్సి వచ్చిన జ్ఞాపకాలు పంచుకుంటున్న రచయిత రాఘవ శర్మ

Update: 2024-05-10 02:48 GMT

పచ్చని చెట్ల మధ్య ఉన్న మా పెంకుటిల్లు మెల్లగా జ్ఞాపకాల్లోకి జారిపోయింది. ఆయువు తీర గానే హాయిగా కన్ను మూసి, నేల తల్లి కడుపులోకి వెళ్ళిపోయింది. విధిలేక మా పాత పెంకుటింటికి వీడ్కోలు పలికాం.


తిరుపతికి దక్షిణాన పచ్చని పంట పొలాల మధ్య నలభై అయిదేళ్ళ క్రితం మేం కట్టుకున్న పెంకుటిల్లు ఎండ నుంచి, వాన నుంచి, వరదల నుంచి, ఈదురు గాలుల నుంచి, అనేక ప్రకృతి బీభత్సాల నుంచి నలభై ఒక్క సంవత్సరాలు మమ్మల్ని కాపాడింది.

ఈ ఊరి అసలు పేరు ఉల్లిపట్టెడ. తిరుపతికి దక్షిణాన ఉన్న చిన్న గ్రామం. ఈ ఊర్లో అన్నీ మట్టితో కట్టిన, బోద కప్పిన పూరిళ్ళే. ఒకటో రెండో మిద్దిళ్ళు ఉండేవి. మా ఇల్లొక్కటే పెంకుటిల్లు. ఊరి బయట వేరు శెనగ, కంది చేల మధ్యలో తెల్లటి గోడలతో, ఎర్రటి కప్పుతో ఏకాంతంగా మెరిసిపోయేది మా పెంకు టిల్లు.

ఇప్పుడు మా ఇంటి ముందు కనిపిస్తున్న విశాలమైన సిమెంటు రోడ్డు ఒకప్పుడు వంక. ఆ వంక ముందు మా పెంకుటిల్లు ఎత్తుగా తలెత్తుకుని ఎంతో హుందాగా కనిపించేది. తెలతెల వారుతుండగా ఈ వంకలోంచి పొలాలకు వెళ్ళే ఎద్దుల బండ్ల శబ్దాలకు మెలకువ వచ్చేసేది. పక్షుల పలకరింపులతో పరవశించిపోయే వాళ్ళం.

వేసవిలో ఆరుబయట అరుగులపై దోమతెరలు కట్టుకుని పడుకునే వాళ్ళం. వంకకు ఆవల ఉన్న తాటి చెట్ల వెనుక నుంచి దూసుకుని వచ్చే లేత సూర్యకిరణాలకు లేచే వాళ్ళం. మేం అమ్మేయగా మిగిలిన పదిన్నర సెంట్ల జాగాలో పిచ్చివో, మంచివో అనేక చెట్లు పెంచాం. మా ఇంటి నుంచి గేటు వరకు నడిచే దారిలో నాపరాళ్ళు పరిచాం.

రాధామనోహరం పందిరి కింది నుంచి గేటు వరకు దారి


 మా అవరణ అంతా చెట్లతో నిండిపోయి, మా పెంకుటిల్లు కనపడకుండా చెట్ల మధ్య దాక్కుండి పోయింది. గేటు పక్కనే వేసిన బాదం చెట్టు ఎంత విస్తరించిందో ! ఆ బాదం చెట్టు మధ్యనుంచి ఒక కొబ్బరి చెట్టు ఆకాశంలోకి దూసుకుపోయింది. కరెంటు లైన్లకు అడ్డంగా ఉన్నాయని బాదం చెట్టు కొమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఎన్ని సార్లు కొట్టారో లెక్కే లేదు ! కొమ్మల్ని కొట్టినప్పుడల్లా మనసు విలవిల్లాడిపోయేది.


మా బాదం చెట్టుకు ఎంత ఆత్మ స్థైర్యం ! కొమ్మల్ని ఎన్ని సార్లు కొట్టినా రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ పచ్చగా ఆకాశంలోకి ఎగబాకి విస్తరించేది. వేసవి వచ్చిందంటే చాలు, ఆ దారిన పోయే వాళ్ళు ఈ చెట్టు కింద సేదదీరేవారు. మా బాదం చెట్టు ఎంత మందికి నీడ నిస్తోందో ! ఎంత దుమ్ము ధూళిని అడ్డుకుంటోందో!

మా ఇంటికి ఎదురుగా కాలువ పనులు జరుగుతున్నాయి. ఆ కూలీల్లో పనిచేసే ఒక తల్లి మా బాదం చెట్టు కొమ్మకు చీరను ఉయ్యాల్లా కట్టి బిడ్డను పడుకోబెట్టింది. ఆ ఉయ్యాల గేటుకు అడ్డంగా ఉంది. నేను బైట నుంచి ఇంట్లోకి వస్తుంటే ఆ తల్లి గబగబా వచ్చి ఉయ్యాలను తీయబోయింది. వద్దని వారించి పక్కనుంచి ఇంట్లోకి వచ్చేశాను. ఆ తల్లి కళ్ళలో ఎంత ఆనందం !

ఇంటి ముందున్న బాదం చెట్టు లోంచి దూసుకొని పోయిన కొబ్బరి చెట్టు


మా ఇంటికి దగ్గర లోనే అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది. బాదం కాయలు ఏరుకోడానికి స్కూలు పిల్లలు పోటీలు పడేవారు. ఆ పిల్లల ఆనం దం ఇంతా అంతా కాదు ! ఆ పిల్లలంతా ఇప్పుడు పెద్దవాళ్ళైపోయారు. బిడ్డల తల్లులైపోయారు. నేనిప్పుడు వాళ్ళని గుర్తు పట్టకపోయినా, అప్పుడప్పుడూ నన్ను పలకరించి, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకు నేవారు.


బాదం కాయలు రాలుతున్నా ఇప్పుడు ఏరుకునే పిల్లలు లేరు. గవర్నమెంటు స్కూలును దూరంగా మార్చారు. చుట్టూ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళైపోయాయి. ఆ పిల్లలకు బాదం కాయలు ఏరుకోవడం అంటే ఏమిటో తెలియదు. అలా ఏరుకోవడం వారికి నామోషి కదా! బాదం కాయలు ఏరుకునే ఆ తరం తన వెంట బాల్యపు ఆనందాలను తీసుకుని వెళ్ళిపోయింది !

గుంటూరు నుంచి మా పెదనాన్న ఉత్తరీయంలో మూటగట్టుకుని వచ్చిన పారిజాతం విత్తనాలను వేస్తే, అవి పెద్ద పెద్ద మానులైపోయాయి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను నేలపై పరిచినట్టు, శరత్కాలం రాగానే పారిజాతాలు నేలంతా పరుచుకునేవి. మా పెరటి నిండా పారిజాత సువాసనలు వెదజల్లేవి.

మా ఇంటి ముందు పందిరికి అల్లించిన రాధామనోహరం చెట్ల పూలు ఎరుపు తెలుపు రంగులతో మా పెంకుటింటిని కప్పేసింది. రాధామనోహరం ఎంత మనోహరంగా ఉండేదో! అది పెంకులపైకి పాకుతుంటే, ఎన్ని సార్లు కొమ్మలను కత్తిరించినా మళ్ళీ పెంకులపైకే పాకేది. వేసవిలో అది మమ్మల్ని ఎంత కాపాడిందో!

ఒకప్పుడు మాకు ఆవులుండేవి. చుట్టూ ఇళ్ళు పెరిగిపోయాక పచ్చిమేత దొరకక వాటిని అమ్మేశాం. పశువుల కొట్టం కోసం వేసిన రాతి కూసాలు పందిరి గుంజలుగా పనికొచ్చాయి. ఆ పందిరి పక్కనే వేసిన అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఎంత మంది స్నేహితులొచ్చినా ఈ అరుగులపైనే కూర్చునేవారు.

ఇంటి ముందున్న అరుగులు


 అరుగుల పైన కూర్చున్నప్పుడు ఎండిన కొబ్బరి కాయలు రాలి నెత్తిన పడతాయేమో నని భయపడే వాళ్ళం. కానీ, అవి ఎప్పుడూ మా పైన పడలేదు. ఈశాన్యం మూలన 50 అడుగుల బావిని తవ్వించాం. ఇరవై అడుగుల నుంచి నీళ్ళుండేవి. తొలి రోజుల్లో బావి నీళ్ళు చేది చెట్లకు పోసి, వాటిన బతికించాం. మోటరు పెట్టాక ఎన్ని నీళ్ళు తోడినా అయిపోయేవి కావు.


మా ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న అవిలాల చెరువులో కాంగ్రెస్ జాతీయ ప్లీనరీ జరిగింది. చెరువు నేలమట్టమై, భూగర్భ జలాలు అడుగంటాయి. మా బావి ఎండిపోయింది. మా వెనకింటి వాళ్ళు మూడొందల అడుగుల బోరు వేసినా నీటి జాడలేదు. తరువాత పంచాయతీ పంపు నీళ్ళే గతయ్యాయి.

మా పెరట్లో వేసిన కరివేపాకు చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగిందో! ఒక పెద్ద దబ్బ చెట్టుండేది. ఒక్కొక్క దబ్బకాయ పసుపు పచ్చగా మిసమిసలాడుతూ కొబ్బరికాయంత లావుగుండేది. ముప్పై ఏళ్ళు కాసి, ఎందుకో ఉన్నట్టుండి చచ్చిపోయింది. పడి మొలిచి న సీతాఫలం రెండస్తుల మేడ దాటిపోయింది. ఆ పక్కనే జామ చెట్టు అదీ అంతే. మేం నాటకుండానే పడిమొలిచాయంటే, మమ్మల్ని ఏరి కోరి మరీ వచ్చి పెరిగిన చెట్లు. మేమంటే వాటికి ఎంత ఇష్టమో, ఆ చెట్లంటే మాకూ అంతే ఇష్టం!

వరండాలోనే కాదు, ఇంట్లో నేలంతా బీటలు వారి అతుకులే. వరండాలో పాతకాలపు దీపపు గూళ్ళు. అదిగో అదే మా విశాలమైన హాలు. అదే మాకు లివింగ్ రూం, అదే మాకు డైనింగ్ హాల్, అదే మాకు టీవీ రూం. మా అమ్మకు ఆ హాలే బెడ్ రూం. నా మిత్రులతో పాటు మా ఇంటికి వచ్చిన శివసాగర్ కూడా ఈ హాలులోనే కింద కూర్చుని భోజనం చేశారు.

ఈపెంకుటిల్లు కట్టిన కొత్తల్లో నేను, మా తమ్ముడు కలిసి ఇంటి దూలానికి బాదల్ ఫ్యాన్ బిగించాం. ఫ్యాను బిగించేటప్పుడే ‘గట్టిగా బిగించండి మీదపడకుండా’ అన్నారంతా. హాలులో అంతా కలిసి భోజనం చేసి, ఫ్యాను కిందే నేల పైన ఆదమరిచి నిద్రపోయాం. ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. ‘ఫ్యాను పడిపోయింది లేవండి లేవండి’ అంటూ మా పిన్ని గట్టిగా అరిచి హడావిడి చేసింది.

ఇంకేముంది! పడుకున్న వాళ్ళంతా లేచి వరండాలోకి పరుగులు తీశారు. మా బాబాయి కొడుకుకు ఆరేడేళ్ళుంటాయి. వాడు మాత్రం నవ్వుకుంటూ అక్కడే ఉండిపోయాడు. మంచి నీళ్ళు తాగుదామని మూలకు పెట్టిన కూజానుంచి నీళ్ళు ఒంచుకుంటూ పడేశాడు. ఇంకేముంది ఫ్యాన్ పడిపోయిందని అంతా పరుగులు తీశారు.

దారికి ఇరువైపులా ద్వారపాలకుల్లా కొబ్బరి చెట్లు. దూరంగా రోడ్డుపైన వెళ్ళే వాహనాలు మా వరండా నుంచే కనిపిస్తుంటాయి. బీటలువారిన గొడలకువేసిన సిమెంటు అతుకులు. ఆ అతుకుల మధ్య కిరణ్ కుమారి గారు వేసిన మా అమ్మ పెయింటింగ్. హాలును రెండు భాగాలుగా విభజిస్తూ మధ్యలో కట్టిన గోడ. ఆ పక్కనే దోమ తెర కట్టిన నా పడక గది.

నా గది దాటితే మాకు నలభై ఏళ్ళు తిండి పెట్టిన వంట ఇల్లు. కిచెన్ ప్లాట్ ఫాం. సామాన్ల గూళ్ళు. శాశ్వతంగా వదిలించుకోవలసిన పాత సామాను శాశ్వతంగా దాచుకునే అటకలు. ఆ పక్కనే బాయిలేర్. ఆ గట్టుపైన ఆవకాయ వేయడానికి మామిడి కాయలు కోసే కత్తిపీట. యాభై ఏళ్ళ క్రితం మా నాన్న వనపర్తిలో చేయించిన మహత్తర పనిముట్టది.

అదిగో ఆ మూలన మా తాతల కాలం నాటి రాగి గంగాళం. వంట గది పైన కుంగిపోయిన కప్పు. వంటి ఇంటి నుంచి పెరట్లోకి వెళ్ళగానే కనిపించే బాత్ రూం. ఆ పక్కనే కాస్త దూరంగా రెండు పాకీ దొడ్లు. దానికి ఈవల తులసి కోట. బైటకొచ్చి చూస్తే, ఇక రిపేర్లకు సాధ్యం కాదనట్టు కుంగిపోతున్న పైకప్పు.

బాపట్ల నుంచి మా శేషమ్మత్తయ్య తీసుకొచ్చిన మా తాతల కాలం నాటి రోలు. దాని పక్కనే విరగ కాసిన బత్తాయి చెట్టు. దాని పక్కనే జామ చెట్టు. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు. నాకు యాభై ఏళ్ళు వచ్చేవరకు ఆ కొబ్బరి చెట్లెక్కి కాయలు కోసేవాణ్ణి. పజ్జెనిమిదేళ్ళుగా ఆ సాహసం చేయడం లేదు. 

పాత పెంకుటింటికి వీడ్కోలు.


 మా పాత పెంకుటింటికి ఇక వీడ్కోలు చెప్పక తప్పడం లేదు. గోడలుబీటలు వారిపోయాయి. కొబ్బరికాయలు, మట్టలు పడి ఒకటొకటిగా పెంకులు పగిలిపోయాయి. కొత్త ఇల్లు కడితే మా పెరటి రూపు రేఖలు మారిపోతాయి. ఇల్లు కట్టేటప్పుడు పెద్ద చెట్లేవీ కొట్టడానికి వీలు లేదన్నాను. ‘అదెట్లా?’ అన్నాడు మేస్త్రీ. కొబ్బరి చెట్లను కొట్టడానికి వీలు లేదన్నాను.


బంతి మేస్త్రీ చేతిలోకి వెళ్ళిపోయింది. కొబ్బరి చెట్లను రాసుకుంటూ వచ్చిన జేసీబీ. ఆ చెట్లు ఎంత గాయపడ్డాయో, నా మనసు అంత విలవిల్లాడిపోయింది. చిన్న చెట్లన్నీ చితికిపోయాయి. ఇంటి కప్పు తీసేస్తుంటే మా పెంపుడు తెల్లపిల్లి మూలుగుతూ వెళ్ళిపోయింది. ఇల్లు కట్టే వరకు పాపం ఎక్కడ తలదాచుకుంటుందో!?

మా గ్రామం ఇప్పుడు తిరుపతి నగరంలో భాగమైపోయింది. మా ఇంటిని దాటుకుని కొత్త కొత్త ఇళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాయి. ఒకప్పటి వంక కాస్తా మట్టి రోడ్డై, కంకర రోడ్డై, తారు రోడ్డై, ఇప్పుడు సిమెంటు రోడ్డై కూర్చుంది. మా పెంకుటింటి చుట్టూ ఉన్న పంట పొలాల్లో ఇప్పుడు సిమెంటు కొండలు లేచాయి.

పచ్చదనం మాయమైంది. పక్షుల పలకరింపులూ వినిపించడం లేదు. కళ్ళ ముందే ఎన్ని మార్పులు! మా పెంకుటింటికి ఆయువు తీరిపోయింది. కొత్త ఇంటిని కట్టుకున్నాం. మళ్ళీ మొక్కలు పెంచుకున్నాం. నాలుగు దశాబ్దాలు జీవించి, జ్ఞాపకాల్లోకి జారిపోయిన మా పాత పెంకుటింటిని మాత్రం ఎలా మర్చిపోగలం!?


Tags:    

Similar News