అమ్మంటే ఎవరికిష్టం ఉండదు? (కవిత)

ఈ రోజు ఇంటర్నేషనల్ మదర్స్ డే... చెంగల్వ రామలక్ష్మి కవిత

Update: 2024-05-12 02:16 GMT
source: CHEER INTERNATIONAL GROUP


 -డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

అమ్మంటే ఎవరికిష్టం ఉండదు?
డబ్బున్న అమ్మ అయితే కొంచెం ఎక్కువ ఇష్టం
తన డాక్టర్ ఖర్చులు తను పెట్టుకుంటుంది
కొంచెం డబ్బులు కొడుక్కి ఇస్తుంది
కోడలికి, మనవలికి బహుమతులిస్తూ ప్రేమను కొనుక్కుంటుంది
అమ్మ ఇచ్చిన డబ్బులతో కేర్ టేకర్ ని పెట్టి
మల్లెపువ్వు లాంటి దుప్పటి మీద డెట్టాల్ తో తుడిచి శుభ్రం గా ఉన్న అమ్మను
ప్రేమగా పలకరించటానికి బాగుంటుంది
కేర్ టేకర్ పోషకాల జ్యూస్ తాగిస్తుంటే కోడలు ఎదురుగా కూర్చుని
మీ ఆరోగ్యం మాకు ముఖ్యం అత్తయ్య తాగండి అంటూ ప్రేమ గా చూసుకుంటుంది
అమ్మ ను చూడటానికి వచ్చే బంధువులు ఖరీదైన పళ్ళే తెస్తారు
అమ్మ కండిషన్ సీరియస్ అని డాక్టర్ చెపితే
అమ్మ ప్రాణాలతో ఉంటే చాలు
ఎంత ఖర్చయినా అంటాడు కొడుకు
అమ్మంటే అంత ప్రేమ!
కొడుక్కు ఒక జీవితాన్నివ్వటానికి
పాపం!తన రెక్కలు ముక్కలు చేసుకుని, తనకంటూ ఏమీ మిగుల్చుకోలేని తల్లి
దేహమంతా అరిగిపోయి
మంచం లో అనారోగ్యం తో, మురికి బట్టలతో కొడుకు కోసం ఎదురు చూస్తుంటే
అమ్మంటే ప్రేమే ఆ కొడుకుకీను!
ఆ తల్లి బాధ చూడలేక
ఆ మురికి కూపం వైపు వెళ్లలేక, వెళ్లకుండా ఉండలేక
వైద్యం చేయించలేక
నిస్సహాయంగా
అశక్త, శూన్య హస్తాలతో
విలపిస్తున్న ఆ కొడుకుకీ అమ్మంటే ప్రేమే!
అమ్మ మీద ప్రేమ కూడా ఆర్థికానికి చెందినదే!
అమ్మంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి!


Tags:    

Similar News