ఎక్కువ పన్ను వల్లే పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగాయి

ఆర్థిక శాస్త్ర వేత్త జ్యోతి రాణితో ఇంటర్వ్యూ - 3 : పెట్రోల్, గ్యాస్ పై న ప్రభుత్వం ఎక్కువ పన్ను వేయడం వల్లే వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో బిలియనీర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది.

Update: 2024-05-05 04:39 GMT

"పెట్రోల్, గ్యాస్ పై న ప్రభుత్వం ఎక్కువ పన్ను వేయడం వల్లే వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో బిలియనీర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. సోషలిస్టు తరహా లక్ష్యం రద్దు చేసేశారు. సంపన్నుల సంపదను ఎట్లా పెంచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి ఉద్యోగ రహిత ప్రపంచం ఏర్పడుతుందేమో! వెలిగిపోతున్నది భారత దేశం కాదు, గుత్త పెట్టుబడిదారులు, ఆదానీ, అంబానీలు." అంటారు ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి.


ప్రశ్న : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. అలాంటప్పుడు పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

జ్యోతి రాణి : పెట్రోల్ గ్యాస్ ధరల్లో టాక్స్ ఎక్కువగానే ఉంటాయి కదా. వంట చేసుకోవడానికి గ్యాస్ తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం ఉన్నదా? గ్యాస్ ఎంత ధర పెంచినా కొనుక్కోవ్వాలి కదా! పెట్రోల్ డీజిల్ లగ్జరీ కాదు. ఇవి నిత్యావసరాలు. దాని ధర ఎంత పెంచినా కూడా కొంటారు కదా! పేదవర్గం, మధ్యతరగతి వర్గం ఉపయోగించే 480 వస్తుల మీద జీఎస్ టీ 12 నుంచి 18 శాతం వరకు వేస్తున్నారు. మొత్తం రెవెన్యూలోజీఎస్ టీ వాటా 75 శాతంవరకు ఉంది. వీటిని ఎక్కువగా వాడేది పేద, మధ్యతరగతి ప్రజలే కదా?

సంపన్న వర్గాలు ఉపయోగించే బంగారం, వజ్రాల పైన 3 శాతం మాత్రమే టాక్స్ వేశారు. సామాన్యులపైన పెద్ద మొత్తంలో జీఎస్ టీ వేశారు. మెజారిటీ ఆదాయం సామాన్య, మధ్య తరగతి నుంచే వస్తోంది. సామాన్యుల నుంచి పన్నులు వసూలు చేసి, సంపద గల వారికి ఖర్చు చేయడమే ప్రభుత్వ లక్ష్యం.

ప్రశ్న : నిరుద్యోగం తాండవిస్తున్న ఈ సమయంలో, రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ప్రజలు ఆత్మాభిమానంతో హుందాగా ఎలా బతకగలుతుతారు? రాజ్యాంగంలో రాసుకున్నట్టు సోషలిస్టు తరహా సమాజాన్ని ఎలా నిర్మించగలుగుతారు?

జ్యోతి రాణి : సోషలిస్టు తరహా సమాజ ప్రస్థావనే లేకుండా ప్రభుత్వ ఆర్థిక విధానాలు రూపొందుతున్నాయి. సోషలిస్టు తరహా సమాజ స్థాపన లక్ష్యం అని రెండవ పంచవర్ష (1956) ప్రణాకలిలో రాసుకున్నాం. గుణాత్మకమైన మార్పుకోసం పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నాం. సోషలిస్టు తరహా సమాజం అనుకున్నా, ఆ దిశగా మన సమాజం ఉందా అన్నది ప్రశ్న.

2014లో ప్రణాలికా సంఘాన్నే రద్దు చేశారు. తరువాత సోషలిస్టు తరహాకు వ్యతిరేకమైన కేంద్ర బడ్జెట్లోనే రూపొందిస్తున్నారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువలగల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అన్నారు. 5 ట్రిలియన్ డాలర్లు కలిగితే దేశమంతా హుందాగా బతకగల వచ్చనుకున్నాం. 2019-20 నాటికి 959 మంది బిలియనీర్లు ఉన్నారు.

బిలియనీర్ల సంఖ్యను మూడు రెట్లు పెంచడమే లక్ష్యమని ప్రకటించుకున్నారు. అంటే కోటీశర్లను తయారు చేయడమే లక్ష్యం కానీ, ప్రజలకు ఉపాధిగురించి కాదు. ప్రపంచకుబేరులలో భారతదేశ కుబేరులకు స్థానం లభిస్తున్నది. కోవిడ్-19లో మెజారిటీ ప్రజల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అదే సమయంలో మొదలైన స్పేస్ టూరిజం గురించి టీవీల్లో చెపుతారు. దాని గొప్పదనం, వారి అనుభవాల గురించి చెపితే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నామో!

సోషలిస్టు తరహా సమాజ స్థాపన లక్ష్యాన్ని రద్దు చేశారు. సంపన్నుల సంపదను ఎట్లా పెంచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. సంపన్నుల సంపదపెరగాలంటే, సమస్త సంపదను గుత్త పెట్టుబడులకు, కార్పొరేట్ శక్తులకు అప్పగించడమే వారి లక్ష్యం. అందులో భాగంగానే మొత్తం రవాణా రంగాన్ని వారికి అప్పగించేశారు.

కార్పొరేట్ శక్తులకోసమే ఇస్రో పని చేస్తోంది. చివరకు స్పేస్ సెక్టార్ను కూడా గుత్త పెట్టుబడి దారులకు అప్పగించిన ప్రభుత్వం మనది. ఆధిపత్యం, అధికారం వాళ్ళదే. ఎలక్టోరల్ బాండ్లు అందుకే కదా! క్విడ్ ప్రోకో మాత్రమే కాదు. గుత్తపెట్టుబడులు ప్రయోజనం కోసమే పనిచేసే ప్రభుత్వాలు ఏర్పడతాయి. సమస్త దేశ సంపదను వారికి అప్పచెపుతారు.

ప్రశ్న : కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చింది. కానీ అమలు చేయలేదు. టీఆర్ఎస్ కూడా ఇదే హామీ ఇచ్చింది అది కూడా అమలు చేయలేదు. అసలు నిరుద్యోగ భృతి ఇవ్వడం సాధ్యమా, సాధ్యం కాదా?

జ్యోతి రాణి : నిరుద్యోగభృతి అనేది తాత్కాలికంగా ఉండాలి. ప్రపంచీకరణ క్రమంలో నయా ఉదారవాద విధానాలను మార్చకుండా గౌరవ ప్రదమైన ఉద్యోగాలను కల్పించడం సాధ్యమౌతాయా? అసలు ఏ ప్రభుత్వమైనా కనీసం విద్య, వైద్య రంగాలను ప్రభుత్వ రంగంలో ఉంచడానికి చర్యలు తీసుకోగల దా? మెడికల్ ఇన్స్యూరెన్స్ పెంచుతుందే కానీ, ప్రభుత్వ వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తుందా?

ప్రభుత్వ ఆస్పత్రులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే ఐసీయులో ఉన్న రోగిని ఎలుకలు కొరకడం వల్ల అతను మరణించాడు. ఉన్న ఆస్పత్రులను ఎలా నిర్వహించాలని లేదు. కానీ వాటిని కార్పొరేట్లకు అప్పగించేస్తున్నారు. కరోనా కాలంలో ఏఎన్ఎంల సేవలకు హెలికాఫ్టర్ల పైనుంచి వారికి పూలు వేస్తుంటే, మాకు పూలు కాదు కావాల్సింది, మమ్మల్ని పర్మనెంట్ చేయమని అడిగారు. ఆదిశగా ప్రభుత్వ చర్యలు లేనే లేవు. ఇంతకంటే దారుణం ఏముంటుంది?

మూడు కోట్ల మంది మహిళలను లక్పతి దీదీలుగా చేస్తారట. సంవత్సరానికి లక్ష సంపాదించుకుంటే గొప్పా!? సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ద్వారా కోటీశ్వర్లను ఎలా చేస్తారు? సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ద్వారా ఎవరైనా కోటీశ్వరులు అయ్యారా? చిల్లర వర్తకాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించేశారు.

ఏ వస్తువైనా సరే బ్రాండ్నేమ్ లేకుండా కొనుక్కుంటామా? ఆన్లైన్ అమ్మకాలలో అమెజాన్లతో పోటీ పడగలమా? ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వాలు ఉండవు. ఈ మౌలిక ప్రశ్నల గురించి ఎన్నికల్లో ఎవరైనా మాట్లాడతారా? భూమి పంపకంలో అసమానతలు ఉన్నాయి. గిట్టుబాటు ధర కల్పిస్తే అందరికీ ప్రయోజనముంటుంది. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యం ఏ ప్రధాన పార్టీకి లేదు.

ప్రశ్న : సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, శాంతి భద్రతలు పరిరక్షించడం ప్రభుత్వ మౌలిక బాధ్యత. ఈ మౌలిక బాధ్యతలను ప్రభుత్వం ఎంతమటుకు నెరవేర్చగలుగుతోంది?

జ్యోతి రాణి : 1990-91 వరకు సంక్షేమ ప్రభుత్వాలున్నాయి. అంటే ప్రజల సంక్షేమం నెరవేర్చినా నెరవేర్చకపోయినా వారి బాధ్యత సంక్షేమంగా పెట్టుకున్నాయి. నూతన ఆర్థిక విధానాలు వచ్చినప్పటి నుంచి నయా ఉదార వాద విధానాలు అమలు చేస్తున్నప్పుడు ప్రజల సంక్షేమం అన్న ప్రతిపాదన ప్రభుత్వ ఎజెండాలో లేదు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే పనిచేసే విధానాలు వచ్చాయి. ఆటోమేటిగ్గా ప్రజల సంక్షేమాలు, శాంతి భద్రతలు విస్మరించారు. ఈ విధానంలో భాగంగానే ప్రజల సంక్షేమం అభావమైంది.

ప్రశ్న : భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల వేగం చాలా ఎక్కువగా ఉందని, భారత దేశం బ్రిటన్ ను దాటేసి, ప్రపంచంలో అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుకుందని ప్రధాని చెపుతున్నారు. ఇదే నిజమైతే ఉద్యోగావకాశాలు అంత వేగంగా ఎందుకు కల్పించలేకపోతున్నారు? దేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి ఎందుకు చేరలేకపోతోంది?

జ్యోతి రాణి : మనది అభివృద్ధి చెందిన దేశమని మసిపూసి మారేడుకాయ చేశారు. ఎన్ఎస్ఓ అంచనాల ప్రకారం 2021-22లో మన వృద్ధిరేటు 9.2 శాతంగా చాలా వేగంగా ఉంది. ఈ వృద్ధిరేటు ఎక్కువగానే ఉంటుంది. ధరలు ఆకాశాన్నంటుతున్నప్పుడు వంద రూపాయలకు కొనే వస్తువును వెయ్యిరూపాయలకు కొంటున్నాం. వస్తు పరిమాణం మారలేదు. డబ్బురూపంలో చూసినట్టయితే దాని విలువ పెరిగింది.

వైరుధ్యమేమిటంటే ధరల పెరుగుదలతో సరిచేస్తే నిజమైన వాస్తవ వృద్ధి రేటు (జీడీపీ) -7.9 శాతం. వేగంగా పెరిగే ఆర్థిక వ్యవస్థలో అంకెల గారడీ కనిపిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలు సంక్షోభంలో ఉన్నాయి. సంపదల విపరీతమైన పెరుగుదల ఏర్పడుతున్నది. సమస్త సంపదను సంపన్నులకు ఇవ్వడం వల్ల, వారి బ్యాంకుల రుణాలను రద్దు చేయడం వల్ల వారి సంపద పెరుగుతోంది. సంపద పెరగడానికి కారణం ఉత్పత్తి కాదు.

హిండెన్ బర్గ్ చెప్పింది అంకెల గారడీ అనే కదా! ఇది వాస్తవ అభివృద్ధి కాదు. దేశాభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే సంపన్నుల సంపద పెరగడం. అంటే ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారడం. దేశం ప్రజలదైనప్పుడు ప్రజలందరు కష్టపడతారు. దేశం కార్పొరేట్ శక్తులదైనప్పుడు ప్రజలు ఎందుకు కష్టపడతారు? 20 గంటలు పనిచేయమంటే వారి జీవితాలకు గ్యారంటీ ఏముంటుంది!?

ప్రశ్న : దేశంలో ఆకలి సమస్యను అధిగమించాం అంటున్నారు ప్రధాని. అదే ప్రధాన మంత్రి దేశంలో 82 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామంటున్నారు. నిజంగా ఆకలిని జయిస్తే ఈ ఉచిత బియ్యం పంపిణీ ఎందుకు?

ఆకలి సమస్యను అధిగమిం చే దేశాల జాబితాలో మన స్థానం 111. మన వెనుక 14 దేశాలే ఉన్నాయి. మనం పాకిస్థాన్ కంటే వెనకబడి ఉన్నాం. ఆకలి సమస్య 2015 నుంచి తీవ్రమవుతోంది. ఈ సమస్యను నిర్మూలించడం తగ్గిపోతోంది.

ప్రపంచంలో పౌష్టికాహార లోపం 25 శాతం ఉంటే, మన దగ్గర 16.6 శాతం ఉంది. ఆకలి సమస్య రక్తహీనతకు దారి తీస్తుంది. రక్త హీనత అయిదు సంవత్సరాల లోపు పిల్లల్లో 67 శాతం, మహిళల్లో 57 శాతం ఉంది. రక్తహీనత వల్ల శిశు మరణాల రేటు, 5 సంవత్సరాల లోపు పిల్లల్లో మరణాల రేటు, ప్రసవ మరణాల రేటు కొనసాగుతూనే ఉన్నాయి.

మనకు తగినన్ని ఆస్పత్రులు లేవు. పేదరికం పెరిగినప్పుడు, ఆకలి సమస్య ఏర్పడినప్పుడు ఎంత దోపిడీకి గురైనా సరే, ఎంత తక్కువ వేతనానికైనా సరే, ఎంత విసుగు కలిగించే పనైనా సరే చేస్తారు. గౌరవ ప్రదమైన ఉపాధి వస్తే లేబర్ పా ర్టీసిపేషన్ పెరిగిందనుకోవచ్చు. ఇవ్వన్నీ ఆకలితో ముడిపడిన సమస్యలు.

ప్రశ్న : 'సాంకేతిక పరిజ్ఞానం కార్మికుల శ్రమను తగ్గించడానికి ఉపయోగపడాలి' అని గాంధీజీ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంవంటి కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ), రోబోటిక్స్ వంటివి శ్రమను తగ్గిస్తున్నాయా? ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నాయా?

జ్యోతి రాణి : కృత్రిమ మేధను కనుకొగొన్నది మానవ మేధ. దాని ముందు మానవ మేధ కాలం చెల్లింది. నిరుద్యోగానికి కారణం టెక్నాజీలో వచ్చిన మార్పంటే సరికాదు. దాన్ని నడిపించే కార్పొరేట్ శక్తుల వల్లే నిరుద్యోగం వచ్చేది. టెక్నాలజీ వారి చేతిలో ఉండడం వల్ల వారి లాభాల కోసమే ఉపయోగపడుతోంది. ఎన్ని సర్వేలు ఐఎంఎఫ్, యూఎస్ఓ మొదలైన ప్రపంచ స్థాయి సంస్థలు చేసిన సర్వేలు ఏం చెపుతున్నాయంటే 2030 నాటికి ఉద్యోగ రహిత ప్రపంచం ఏర్పడుతుందేమో అని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

కృత్రిమేధకు సంబంధించిన చాట్ జీబీటీ పెయింటింగ్, కవిత్వం, సినిమా, కథలు, మెడికల్ డాక్యుమెంట్లు అన్నీ అదే చేసేస్తుంది. ఫలితంగా ఉద్యోగరహిత ప్రపంచం ఏర్పడుతుంది. మెజారిటీ ప్రజలకు బతుకు తెరువు లేదు. ఉత్పత్తిని అమ్ముకుంటే కదా లాభాలు. ఉత్పత్తిని విక్రయించాలంటే మెజారిటీ ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి లేదు కదా! ఉత్పత్తిని ఎవరు కొనాలి? ఇదొక సంక్షోభానికి దారి తీస్తుంది. దీనినే అల్పవినియోగ సంక్షోభం అంటాడు మార్క్స్.

అటు గోడౌన్లో అమ్ముడు పోని సరుకు పెరుగుతున్నది, ఇటు నిరుద్యోగమూ పెరుగుతున్నది. ఇటువంటి వ్యవస్థకు మనుగడ ఉంటుందా? ప్రస్తుత పెట్టుబడి దారి వ్యవస్థ చట్రంలో ఈ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందా? యువత అంతా నిరుత్సాహం చెందుతుంది. మెజారిటీ ప్రజల్లో జీవనసంక్షోభం ఉన్నప్పుడు, ఎన్నికలొచ్చినప్పుడల్లా ఒక లంపెన్ గ్రూప్ తయారవుతోంది.

ప్రశ్న : ఎలక్ట్రోరల్ బాండ్ల వ్యవహారం రాజ్యాంగవ్యతిరేకమని సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. ప్రభుత్వ పరంగా ఇంత భారీ ఆర్థిక దోపిడీ గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఆర్థిక నేరాల్లో గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి మధ్య తేడా ఏమైనా ఉందని భావిస్తున్నారా?

జ్యోతి రాణి : ఆర్థికనేరాలు గత 10 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. 1991 నుంచే సంక్షోభం మొదలైంది. గత పదేళ్ళ నుంచి నయా ఉదార వాద విధానాలు బలపడుతున్నాయి. ఒక్కొక్కరి అకౌంట్లలో 15 లక్షలు వేస్తామన్నారు, వేశారా? నల్లధనం బైటికి తెస్తామన్నారు, తెచ్చారా? నల్లధనం బైటికి తీసుకురావడానికి కనీసం చర్యలేమైనా చేపట్టారా?

నిజానికి ప్రస్తుతం ఉన్న వ్యవస్థ బ్లాక్ మార్కెట్, బ్లాక్ మనీ, బ్లాక్ ఎకానమీ పునాదిగా ఉన్నాయి. భారీ స్థాయిలో జరిగే ఆర్థిక లావాదేవీలలో బ్లాక్ లో ఎంతివ్వాలి, వైట్లో ఎంతివ్వాలి అని మాట్లాడుకుంటున్నారు కదా! బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుతున్నారు. బ్లాక్ మనీని రక్షించుకోవడానికే పెద్ద నోట్ల రద్దు. ప్రభుత్వమే 2000 రూపాయల నోటును సామాన్యుల దగ్గర నుండి చెలామణి కాకుండా తొలగించింది.

దీని కోసం మూడు నెలల టైం ఇచ్చారు. సంపన్న వర్గం వద్ద పోగుబడిన రెండు వేల రూపాయల నోట్ల రూపంలో ఉన్న నల్లడబ్బును మార్చుకోవడం ద్వారా దాన్ని వైట్ మనీగా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. 2017-18లో ప్రకటించిన ఎలక్టోరల్ బాండ్ల పథకం 2018 జనవరిలో అమలులోకి వచ్చింది. దీనికి పన్ను మినహాయింపు ఇచ్చారు. ఈ బాండ్లను ఎవరైనా కొనుక్కోవచ్చు. వాళ్ళకిష్టమైన రాజకీయ పార్టీకి ఇవ్వచ్చు.

ఎలక్టోరల్ బాండ్లను ఎవరు ఎవరికి ఎంతిస్తున్నారో తెలియదు. ఈ రహస్యం సీక్రెట్ బాలెట్తో సమానం అంటారు. కార్పొరేట్ శక్తులు ఎవరికి ఇస్తున్నారో రహస్యం. ఇది ఎస్ బి ఐ ద్వారా జరుగుతుంటే ప్రభుత్వానికి తెలియదా! ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రమే తెలుసుకోకూడదా! ఈ రహస్యం జీవించే హక్కులాంటిది అన్నారు. ఎవరు జీవించే హక్కు అంటే, కార్పొరేట్ శుక్తులకు జీవించే హక్కు కోసమే.

పార్లమెంటు నిబంధనలను ఉల్లంఘించి దీన్ని ప్రవేశపెట్టారు. నిజానికిది ఆర్థిక బిల్లు. మనీ బిల్లు అని రాజ్యసభలో ప్రవేశపెట్టలేదు. ఇలా చేయడం రాజ్యాంగంలోని 110వ ఆర్టికిల్ను ఉల్లంఘించడమే. బాండ్స్ ను విడుదల చేయమని ఇచ్చే అధికారం ఆర్ బి ఐకి ఉంటుంది. ఆర్ బి ఐ చట్టం 30 లోని సెక్షన్ 30ని సవరించి క్లాజ్ 3ని అదనంగా చేర్చారు. దీంతో ఎస్ బీ ఐకి బాండ్లు విడుదల చేసే అధికారం ఆర్ బి ఐ నుంచి సెంట్రల్ గవర్నమెంటుకు బదిలీ అయ్యింది.

కంపెనీ డొనేట్ చేయాలంటే 3 సంవత్సరాల క్రితం ఆ కంపెనీ ఏర్పడి ఉండాలి. కానీ, కొద్ది నెలల క్రితమే స్థాపించిన కంపెనీలు కోట్ల విలువగల ఎలక్టోరల్ బాండ్లను కొన్నాయి. గత మూడు సంవత్సరాల నుంచి వరుసగా నష్టాలే వస్తున్న కంపెనీలు కూడా భారీ ఎత్తున ఎలక్టోరల్ బాండ్లను కొన్నాయి. ఇది ఎలా సాధ్యం!? బడా కార్పొరేట్ సంస్థలకు ఇవి ఫ్రంట్ కంపెనీలు కావడానికి అవకాశం ఉన్నది. ఇది మనీ లాండరింగ్ దా!?

మన దేశ కంపెనీలలో విదేశీ కంపెనీల వాటా ఎక్కువగా ఉంటే, ఎన్నికల విరాళాలు ఇవ్వవచ్చు అని చట్టాన్ని సవరించారు. అందుకే గత పది సంవత్సరాల నుండి ఎన్నో రంగాలు, పరిశ్రమలలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతులివ్వడం ముమ్మరమైంది. అంటే విదేశీ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎన్నికల విరాళాలను ఇస్తాయి. ఈ విధంగా సమస్త దేశ సంపదను పంచేసుకుంటున్నారు. ఇందుకు ఎలక్టోరల్ బాండ్లు దోహదం చేస్తున్నాయి. దీన్ని ఒక్కదాన్ని రద్దు చేసినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టు భావించలేం.

ప్రశ్న : బీజేపీ పాలకులు ఇప్పుడు 'హిందూ జాతీయ వాదాన్ని ' ముందుకు తెచ్చారు. 'హిందూ' అనేది మతం కదా! హిందూ జాతీయత ఎలా అవుతుంది? మతానికి, జాతికి మధ్య స్పష్టమైన విభజన రేఖ లేదంటారా?

జ్యోతి రాణి :భారత జాతీయత ఉంటుంది కానీ, హిందూ జాతీయత ఉండదు. ఒక జాతి అనేది ఒక దేశానికి చెందింది. మతం అనేది ఒక దేశానికి చెందింది కాదు. దేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కనుక, ఈ పరిపాలన వల్ల నష్టపోయేది కూడా హిందువులే కదా. అసలు సమస్యను అర్థం చేసుకోకుండా డైవర్ట్ చేయడానికే ఇవి ఉపయోగపడతాయి. విద్వేష పూరిత ఉన్మాదం పెరిగిపోతోంది. ఒకరినొకరు చంపుకోవడానికే కదా ఇవ్వన్నీ, ఇది రాజ్యాంగ వ్యతిరేకమే!

ప్రశ్న : చివరగా ఒక ప్రశ్న. మన ప్రధాని 'భారత దేశం వెలిగిపోతోంది' షైనింగ్ ఇండియా) అన్నారు. దేశంనిజంగా వెలిగిపోతోందా!?

జ్యోతి రాణి : 'దేశం వెలిగిపోతోంది' అని తొలుత అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రభుత్వం అన్నది. ప్రజల జీవితాలను గమనిస్తే దేశం వెలిగిపోవడం లేదు. సంక్షోభం పెరిగిపోతోంది. ప్రపంచ స్థాయి సంస్థలన్నీ అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాపితంగా నిరుద్యోగంతో పాటు ధరలు పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలతో నిరుద్యోగం పెరిగిపోతోంది. మెజారిటీ ప్రజల జీవితాలు సంక్షోభంలో చిక్కుకు పోతున్నాయి. వెలిగిపోవడమనే ప్రశ్నే లేదు.

సంక్షోభం అమెరికాలో ఉంటే ఆ ప్రభావం మనపైన ఉండదని ఆర్బీఐ డైరెక్టర్ అంటారు. అమెరికాకు ఎగుమతులు చేస్తూ, దానిపైన ఆధారపడిన దేశం మనది కనుక, అక్కడ సంక్షోభం మనపైన పడకుండా ఎలా ఉంటుంది? ప్రతిదీ అమెరికా డాలర్ నిర్ణయిస్తుంది. అమెరికా వడ్డీ రేట్లు తగ్గించినట్టు ప్రకటిస్తే, మన ఎఫ్ డీఐలు తరలి పోతాయి. గందర గోళం అయిపోతుంది. విదేశీ పెట్టుబడులు కూడా వెళ్ళిపోతాయి.

డాలర్ విలువ పెరిగి, మన కరెన్సీ రేటు తగ్గిపోయి, ఎక్కువ వస్తువులు ఎగుమతిచేయాల్సి వస్తుంది. ఇది శ్రమ దోపిడీకి దారి తీస్తుంది. భయంకరమైన సంక్షోభంలో భారత దేశం ఉన్నది. వెలిగిపోతున్నది గుత్తపెట్టుబడిదారులు. ఆదానీ, అంబానీ వెలిగిపోతున్నారు. ఇది తీవ్రమయ్యే పరిస్థితి కనపడుతోంది.


Tags:    

Similar News