పెరడొక రంగస్థలం! (ఇల్లు సీక్వెల్ కవిత -9)

గీతాంజలి Sunday Poem పెరటికి కొన్ని పూల మొక్కలను, విత్తనాలను కానుకగా ఇవ్వు, గుర్తు పెట్టుకో పెరడు ఉన్నది ఇంటి వెనక కాదు! ఇంట్లోనే లేదా ఇల్లంతా పెరట్లోనే !

Update: 2024-05-19 03:50 GMT


ఇంకేం కావాలి నీకు?
పెరడంత ఆకాశం..చాలదూ నీ కలల్ని ఎగరేయడానికి ?
పెరట్లో నక్షత్రమంత భూమి చాలదూ..కల్లోల జ్ఞాపకాల విత్తనాల్ని నాటుకోవడానికి.?
***
ఎన్నెన్ని మాంత్రిక పుష్పాలు... మల్లెలు..నందివర్ధనాలు..గులాబీలు !
కనపడని ఏ చేతులు నాటినవి ఇవి ?
ఎవరు...ఇంటి వాళ్ళా ?
భూమిలో., వాళ్ళు ఒట్టి విత్తనాలే నాటారా..జీవితాలా ?
ఆశలా...ప్రాణాలా ?
ఏవి నాటి ఉంటారు?
చేద బావి నీరో...తమ కన్నీళ్ళో పోసి బతికించి ఉంటారా ?
పెరడు.. ఆ ఇంటి మనుషుల ఆశల మరుభూమి కాదుకదా ?
కొన్ని పెరళ్లు... చచ్చిన ప్రేమ పిండాల్ని తినేసి గమ్మున ఉంటాయి.
ఏమీ తెలీనట్లే అమాయకంగా వెన్నెల్లో మెరిసి పోతూ ఉంటాయి.
మృతపుష్పాలు మాత్రం రేకులు రాలుస్తూ
ఇంటి లోపల రుధిర పుష్పంలా రక్తసిక్తమైన ఆమెతో పాటు ఏడుస్తాయి.
బావి నుంచి సాగే మోరీ నాలాలో నీళ్లు కూడా ఎర్రనై
కంగారుగా ఎండకి మెరుస్తూ..వణుకుతూ ముందుకు పారిపోతాయి
నిజాన్ని, నిశ్శబ్దంగా పెరడు తనలో భూస్థాపితం చేసుకుంటుంది.
ఆ రాత్రి ఇల్లు ప్రశాంతంగా నిద్రపోతే...
పెరడు అశాంతితో మెలకువగానే ఉంటుంది.
అనాదిగా పెరడుకి ఇదొక పునరావృత పురా జ్ఞాపకం మాత్రమే !
పెరడు ఎన్నో జ్ఞాపకాల్ని తన మట్టిపోరల్లో బరువుగా..
మెత్తగా,కఠినంగా,చెమ్మగా ,ఎండిపోయి కరుకుగా..
సువాసనగా మురికిగా మోస్తూనే ఉంటుంది.
ఇంటికి ధ్వజ స్తంభం లాంటి ముత్థవ్వ..తాతయ్య
అరుగు లాంటి అమ్మమ్మ నాన్నమ్మ
అమ్మ..నాన్న.. తర తరాలకి పుట్టుకొచ్చిన పిల్లలు ..
వాళ్ళ పాద ముద్రలతో సహా మోసిన పెరడు...
వాళ్ళని తలుచుకుని తలుచుకుని...కన్నీరు పెడుతుంది.
పెరటిదో యాత్ర !
***
ఎన్నింటినో దాచిపెడతారు కదా పెరటి గర్భంలో
డబ్బుల సంచీని, మాయ సంచీని,ముత్థవ్వ నగల సంచీని
వందల కొద్దీ దుఃఖపు సంచీలను ,
ఇంట్లోని రక రకాల మనుషుల కథల సంచీలను 
గర్భ సంచీల వెతలను..కన్నీళ్ల మూటలను!
నువ్వు పాదం మోపి చూడొక్కసారి ఈ పెరటి నేల మీద...నూటొక్క వేదనల సంగీతాన్ని భోరుమని విలపిస్తూ పియానోలా వినిపిస్తుంది చూడు పెరడు !
***
పెరడు అచ్ఛం ఇల్లులా రంగులు..భావాలు నిత్యం మారిపోతూ ఉండే రంగ భూమి..వేదిక !
ఇంటికి హృదయమే పెరడంటే !
కానీ ఇల్లు తలుపులు.. కిటికీలు మూసేసి కొన్ని దాచిపెడుతుంది.
పెరడు లో మాత్రం అంతా బహిరంగమే !
వరుసగా ఇంట్లోంచి ఒక్కొక్కళ్ళు వచ్చి పెరట్లో తమ ఏకాంకిక పాత్రలు పోషించి పోతుంటారు.
ఎవరూ తమని చూడ లేదనుకుంటారు !
కానీ పెరడు చూస్తుంది !
ఏ పాత్రకి మొదటి బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటుంది !
****
పెరడు మల్లెల..గులాబీల , ఆకాశ మల్లెల రేరాణుల వెన్నెల సువాసననే వేస్తుందా?
మురికి మోరీ వాసన, సల సల కాగే నీళ్ల పొయ్యి వాసన
మనుషుల దేహాల మీద ఉన్న దెబ్బల వాసన, నొప్పి వాసన, కన్నీళ్ల వాసన, ఆకలి వాసన
ఆకలికి అన్నం దొరక్క పెరటి మన్ను బుక్కిన వాసన
కాలిన రొట్టెల వాసన..రొట్టెల కాల్చే కట్టెల పొగ వాసన
బావి నీళ్ల వాసన, బావిలో శవాలు ఉబ్బి నానిన వాసన,
వాన చినుకులు మట్టిపై పడి నప్పటి మట్టి వాసన
ఆత్మహత్యల వాసన, బాలింతల వాసన
పసిపిల్లల స్నానపు వాసన.. గర్భిణీ వాంతుల వాసన
ఆకలి వాసన,ఎండి రాలిన ఆకుల వాసన, ఫెళ్లున కాల్చే ఎండ వాసన..
వాన నీళ్ళల్లో కుళ్ళిన పూవుల వాసన
కోడి కెలికిన భూమి వాసన... ఆవులు...మేకలు తిరిగే కొట్టం వాసన..
పితుకుతున్న పాల వాసన..తలారా స్నానం చేసిన అమ్మల వెంట్రుకల వాసన...
చేద బావి దగ్గర అమ్మల, నాన్నల మడి స్నానాల వాసన
తడి మడిచీరల అంటు వాసన,
ఇంటి పనికి పనికొచ్చే ఈశ్వరమ్మని మడిచీరని ముట్టనివ్వక
దూరం..దూరం అని తరిమే కులగజ్జి వాసన...
చిరుగుల ఈశ్వరమ్మ చీర బీద వాసన
ఇంటిబావికి ..ఉరబావికి కులం వాసన..
ఎక్కడినుంచో వీచే కోసిన పచ్చ గడ్డి గాలి వాసన...
పెరట్లో ఉడికే పిండి వంటల వాసన... పొయ్యి రేపే పొగ వాసన..
పెరటి నుంచి పెరటికే వచ్చే పెరడు వాసన !
****
పెరడు ఎంతటి అస్తవ్యస్తమో..అంత అందగత్తె కూడా...
ఇంట్లోంచి వినిపిస్తున్న పాటని తన వైపుకి లాక్కుని...
రాత్రి పూట  గుక్కిళ్ళ కొద్దీ వెన్నలను తాగి
అందమైన స్త్రీ పురుషుల నగ్న దేహాలుగా విడిపోయి పెనవేసుకొని ..
చెట్ల కొమ్మలతో పాటు మత్తులో ఊగిపోతూ నాట్యం చేస్తుంది.
తనపై వేసవి చంద్రుడు అధ్దిన వెన్నెల పూతతో పెరడు ఇక విరహం తగ్గి చల్లబడిపోతుంది.

****

ఒకదానితో ఒకటి మాట్లాడుకునే చెట్లతో.. పక్షులతో ..పెరడు జీవిస్తుంది.
చెట్ల నీడల్లో రహస్యంగా గుస గుసలాడే మనుషులతో పాటు పెరడు కూడా నిఘూడమై పోతుంది.
వాళ్ళ రహస్యాల్ని కాపాడే పెద్ద మనిషై పోతుంది.
రాత్రి పూసే రేరాణులతో...పారిజాతాలతో
పెరడొక అత్తరు సీసాలో ముంచిన దూది ఉండ అయిపోతుంది.
సాయంత్రం పూసిన పరిమళాల పూలన్నీ కుట్రపన్ని ఇంటినొక అత్థరు బుడ్డీలా మార్చేస్తాయి.
పెరడు పసిపాపలకే కాదు..
పెళ్లి కూతురుకి పసుపు గంధాలతో అభ్యంగన స్నానం చేయించే వేదిక అవుతుంది.
ఆడపిల్లల చేతుల్లో గోరింటాకుని ఎర్రగా పండించే కుంచె అవుతుంది.
సంధ్య వాలితే చాలు ..తులసి మొక్క ముందు దీపమై వెలిగి పోతుంది పెరడు!
చలికాలపు వనభోజనాలకి ఉసిరి చెట్లని..కార్తీక దీపాలని సిద్ధం చేస్తుంది.
ధ్వజస్థంభపు పెద్ద పండక్కి సిద్ధమైన మేకపోతుని చూస్తూ కన్నీరు కారుస్తుంది పెరడు !
ఇంటి పంచాయతీలు తెంపడానికి అలుకు పోసి..
నులక మంచాలు వేసి వేదిక తయారు చేస్తుంది పెరడు !

****
పండగల సందడంతా పెరడు దే.... పెద్ద పొయ్యి మీద ఎక్కే బాండాలు... దిగే గుండిగల తో పెరడు యమ సందడిగా ఉంటుంది.
గరిటల గిన్నెల శబ్దాలతో విందు భోజనానికి వాయిద్యమైపోతుంది పెరడు !

***
పెరడు చాలా కథల్ని రాసుకునే పుస్తకంగా మారిపోతుంది !
మునిమాపు వేళ పుట్టింటికొచ్చిన బిడ్డనో..ఆ ఇంటి కోడలో
పెరట్లోనే కదా ఎవరూ చూడకుండా కన్నీరు తుడుచు కుంటుంది.
బావిలో బొక్కెనతో పాటు తన కన్నీటి ముఖాన్ని కూడా ముంచి కడుక్కుంటుంది.
పరీక్ష తప్పిన నాని గాడు పెరట్లోనే కదా..ఉరిపోసుకోవాలో..
బావిలో దుంకాలో తెలీక సతమతమయ్యేది ?
అమ్మలేమో..అప్పుడప్పుడు వెన్నెల్లో బావి చప్టా మీద కాలు చాపి తొడల మీద వాతలకు వెన్నపూసని...
పెదవదిమో నొప్పిని భరిస్తూ...అధ్ధుకుంటూ ఉంటారు.
దెబ్బలు తట్టుకోలేని తాగుబోతు భార్య దాక్కునేది బావి వెనకో.. చెట్ల వెనకో కదా...
ఆకలికి ఇంకా అన్నం పిలుపు రాని తాత
పెరట్లో నులక మంచంపై కాలని చితి పై పడుకున్నట్లే పడుకుంటాడు.
అరిచే పేగులని కండువాతో బిగుతుగా కట్టి నోరు మూయిస్తాడు.
బావి ఎన్ని నీళ్లు తాపినా తాతకు అన్నమే కావాలి.
అందుకే...చెవులను వంటింటి తలుపు లోంచి
'తిందువు రా' అని పిలిచే గొంతుకి ఇచ్చేస్తాడు !
ఇక తన వీధి పెరట్లో ఏవో దుఃఖపు పాటలు..
అరుపులకి అర్థాలు వెతుకుతుంది పెరడు.
అర్థ రాత్రి పెరడు కూడా ఒక సాక్జోఫోన్(saxophone) వాయిద్యంగా మారిపోయి..
ఏడుస్తూ నవ్వుకుంటూ ఒక్కోసారి అంతులేని వేదనతో పిచ్చిదానిలా
ఊగిపోతూ భాష లేని ధ్వనితో ఏదో మంత్ర నగరిలో ఉన్నట్లే మార్మిక గీతమేదో పాడుకుంటుంది
.తెల్లారేదాకా కన్నీరింకకుండా కొనసాగే పాట.. యుగాలుగా సాధన చేసిన పాట !
ఇంటి పిల్లాడు ప్రేమలో.. పడినా.. అమ్మాయి ప్రేమ విఫలమైనా
పెరటిలోనే ఆ సంగమ-వియోగాల సంగీతాల కచేరి జరిగిపోతుంది.
పెరడు అప్పుడు దుఃఖంతో ఒకసారి.. మోహంతో మరోసారి వణుకుతుంది.
****
పెరడు ఋతువులతో మాట్లాడుతుంది
ఋతువులతో తన పూల సుగంధాలతో సహా సంగమిస్తుంది..
ఎండలో రాత్రి చల్లని వెన్నల రేడు ని కౌగలించుకుని చల్లబడుతుందా..
వర్షంలో చలిలో సూర్యుడిని ప్రేమిస్తుంది.
****
ఇంటి మనుషులందరూ పెరడును
రణ గొణ ధ్వనులతో కకావికలం చేసి వెళ్ళిపోయాక
దక్కించుకున్న తన నిశ్శబ్ద రాత్రుళ్ల తన్హాయి లో...
ఆకాశానికీ చంద్రుడికీ..నక్షత్రాలకీ తనని ఆవరించిన మల్లె సుగంధపు గాలికి...
చెట్లకి...కొమ్మల్లోని పక్షులకి మోర ఎత్తి తాను రహస్యంగా రాసుకున్న కవిత్వం వినిపిస్తుంది.
తాను రోజూ చూసే ..వినే దుఃఖ భాజనమైన దృశ్యాలు..మాటలే పెరటి కవితా పదాలవుతాయి.
వాటిని పెరడు అపురూపంగా మధు పాత్రలో మధువులా నింపుకుంటుంది !

*****

ఇంట్లోని స్త్రీలు ..అమ్మనో..అమ్మమ్మనో ..కోడలో..కూతురో
ఎప్పుడూ.. పెరట్లో ఒకసారి బట్టల దండెంగా..
మరోసారి చేదబావిగా..తళ తళ లాడే గిన్నెలా
బొక్కెనతాడుగా..గిర గిరా తిరిగే రుబ్బురోలుగా ..
సల సల మరిగే నీళ్ల గంగాళంలా..భగ భగా మండే పొయ్యి గా 
దండెం మీద ఆరేసిన బట్టలాగా, తెల్లవారు ఝామున
కొక్కోరకో అని కూసే కోడిలా మారిపోతూ పెరడుని ఆశ్చర్య పరుస్తుంటారు.
కొట్టంలో ఆవులాగా అంబా అని అరుస్తున్న ఆడవాళ్లను చూస్తూ పెరడు భయపడుతుంది.
అంతెందుకు స్త్రీలంతా.. ..పెరడు తన కళ్ళతో చూస్తూ...
చూస్తుండగానే..మరొక పెరడుగా మారిపోవడాన్ని దిగ్భ్రాంతిగా చూస్తుండిపోతుంది.
రోజొక వెయ్యిసార్లు తిరిగే స్త్రీల పాదముద్రలతో
పెరటి భూమి ఒక శిల్ప కళా వేదికగా మారాక
పెరడు భక్తిగా ఆ పాద ముద్రల్ని కళ్ల కద్దుకుంటుంది.

***

పెరడు ఆ ఇంటి మనుషుల అనేక దుఃఖ,
విషాదాల్ని మోస్తూ,జీవనమృత్యులవడాన్ని చూస్తుంది.
చాలా సార్లు వాళ్ళు జీవంతో తొణికిస లాడడాన్ని...
ఆనందంతో పగల బడి నవ్వడాన్ని కూడా చూస్తుంది.
మృత్యు స్పర్శతో స్నానించిన పెరడు అదే సమయంలో..
పసిపాపకి అమ్మమ్మ మెరిసే కాళ్ళ మధ్యలో నలుగు రాసి స్నానం చేయించడాన్ని చూస్తూ
పెరడు కూడా తడిసిన కొత్త శిశువైపోతుంది.
పెరడు నిదుర రాని పాపకి జోల పాటవుతుంది.

*****

పెరట్లోకి ఏం కావాలి ?
పెరటికి తెలుసు !
తన ఆకాశానికి ఒక చందమామ...
కొన్ని నక్షత్రాలు.. కప్పుకోడానికి ఇన్ని మబ్బులు...
కాసిని మల్లెలు..కొంత వెన్నెల..
ప్రేయసీ ప్రియులు..
ఆకలితో ఏడవని పసిపిల్లలు...
వాళ్ళు ఊగే చెట్టు ఊయలలు..
పరుగులు పెట్టె మువ్వల పాదాలు
చెట్టు నీడన నులక మంచంలో
అమ్మమ్మ చెప్పే కథలు..పాడే పాటలు...చెప్పుకునే రహస్యాలు..
రాసిన లేదా చింపేసిన ప్రేమలేఖల కాగితపు ముక్కలు..
ఎడ తెగని నిరీక్షణల నిట్టూర్పులు..
కన్నీరు కారని ఇంటి ఆడపిల్లల కళ్ళు..
ఎక్కడినుంచో తేలి వచ్చే ...ఒక పాట...
నిదుర రాని రాత్రుళ్ల కోసం కాసింత మధువు కూడా !
ఇంతకంటే ఏ పెరటికైనా ఏం కావాలి ?
ఏదో ఇంటివెనక ఉంది కదా అని పెరడుని చిన్న చూపు చూడకు.
ఇంటి కథలన్నీ తెల్లారేది పెరట్లోనే !
అందుకే పెరటిని సజాయించి పెట్టుకో!
పెరటికి కొన్ని పూల మొక్కలను కొన్ని విత్తనాలను కానుకగా ఇవ్వు...
గుర్తు పెట్టుకో పెరడు ఉన్నది ఇంటి వెనక కాదు ! ఇంట్లోనే...లేదా ఇల్లంతా పెరట్లోనే ఉంది !


Similar News