ఏది రాస్తే నవ్వొస్తుందో గోపిరెడ్డికి ఎలా తెలుసు?

’జాతిరత్నాలు’ గోపిరెడ్డి యేదుల మొదటి కథల సంపుటి. హ్యూమర్ అదరగొట్టాడు. రేపు సాయంత్రం సింపుల్ గా ఆవిష్కరణ అంది. ఈ సందర్భంగా తాడి ప్రకాశ్ పుస్తక పరిచయం.

Update: 2024-11-02 10:01 GMT

జోకు పేల్చడం, సెటైర్ వేయడం, హాస్యాన్ని పండించడం అందరివల్లా అయ్యేపని కాదు.


కథలు చాలామంది రాస్తారు. హ్యూమరే ఆక్సిజన్‌గా కథలు రాయడం అంత వీజీ కాదు. దానికో ప్రత్యేకమైన చూపు కావాలి. యాంత్రికమైన నిత్య జీవన రొటీన్ నుంచి హాస్యాన్ని పిండాలంటే అతను ఏదుల గోపిరెడ్డి లాగా వంకర దృక్పథ ధారియై ఉండాలి. ఎంత చక్కని, తిన్నని, స్పష్టమైన విషయాన్ని అయినా ఒంకర టింకరగా చూడగలిగే కొంటెతనం ఏదో నరాల్లో ప్రవహిస్తూ ఉండాలి.


కొండొకచో ఇన్నోసెంట్ పీపుల్ మీద కూడా క్రూయల్ జోక్స్ కట్ చేసే దుస్సాహసానికి పాల్పడే మొండి ధైర్యమేదో ఉండి తీరాలి. ఒకింత ఆశ్చర్యమూ, మరింత విభ్రమమూ కలిగించే విషయం ఏమిటంటే, నిరాశనిండిన నిస్సారమైన బతుకులోని హాస్యాన్నీ, అల్లరినీ డిస్కవరీ చేయగలగడం! అదేమంత చిన్నా చితకా పనికాదు. బతుకులోని కాఠిన్యము, కన్నీళ్లూ...రెండింటినీ నిర్మమకారంగా చూడగలిగే గోపిరెడ్డి లాంటి పోలీసులు కథా రచయితలు కాగలుగుతారు.


గోపిరెడ్డి చాలా కాన్షస్ రైటర్. ఏం రాస్తున్నాడో, ఎందుకు రాస్తున్నాడో, ఈజీగా, హేపీ గో లక్కీగా అనిపించే ఆ హాస్యపు చివరి మలుపులో ఏ జీవన సత్యం దాగివుందో ఆయనకి స్పష్టంగా తెలుసు. విషయం ఎంత చెప్పాలో అంతే చెబుతాడు. క్లాసులు పీక్కూడదనీ, ధర్మోపన్యాసాలు దంచకూడదనీ తెలిసినవాడు. చిన్న కథని నడిపించే టెక్నిక్‌ని ఒడిసిపట్టుకున్నవాడు. వాక్యాల్లో బిగువు, పట్టు, జవం, జీవం ఉంటాయి. మెరుపుల్లాంటి మాటలు, హ్యూమన్ బిహేవియర్‌లోని అలసత్వాన్ని, అల్పత్వాన్ని పట్టుకుంటాడు. అంతరంగ చిత్రణ అనే పెద్ద గొడవని అలవోకగా సాధిస్తాడు. చివర ఒక వ్యంగ్యాత్మక వ్యాఖ్యతో పాఠకుడు పులకరించిపోయే ముగింపు ఇస్తాడు. దానికి కావలసిన సమయస్ఫూర్తి, సంయమనం ఈ కొంటె కోణంగికి పుష్కలంగా ఉన్నాయి.


“సమాజాన్ని వెయ్యి కళ్ళతో కనిపెట్టగలిగినవాడే సిసలైన రచయిత” అన్నాడు శ్రీశ్రీ. అలా కనిపెట్టగలిగినవాడే గోపిరెడ్డి. మనుషుల్ని చూడగలగాలి. వాళ్ళ మాటల్ని, ప్రవర్తన నీ సహజంగా పట్టుకోగలగాలి. లోకరీతి తెలియాలి. అతి కష్టమైన పని ఏమిటంటే, దాన్ని సాహిత్యంలో అమర్చే నైపుణ్యం ఉండాలి. దానికి తగిన భాషా పాటవంతో పాటు మానవ జాతి మీద అపారమైన ప్రేమానురాగం ఉండాలి. మంచి రచనకు ఉండాల్సిన ప్రథమ లక్షణం ‘కసి’ అంటారు. ఆ కసిని కళతో కలిపి ఆల్కెమీ చేయగల రస రహస్యం తెలిసి ఉండాలి. Always be a poet, even in prose అన్నారు ఛాల్స్ బొదిలేర్. ఒట్టి హాస్యదృష్టితోనే కాకుండా, గొప్ప సంయమనంతో, ఉదాత్తమైన భావుకత్వంతో, దరిద్రపు బతుకుమీద అవ్యాజమైన ప్రేమతో గోపిరెడ్డి దాన్ని సాధించారనే అనుకుంటున్నాను.

 

హాస్యాన్ని విరగ పండిస్తూ రచయిత వేసిన కోతి వేషాలకు ఎంతో భావస్ఫోరకంగా “జాతిరత్నాలు” అని పేరు పెట్టారు. అలా చిలువలు పలువలుగా ఆయన రాసిన 34 కథల్లో చాలా తక్కువ రాళ్ళూ, ఎక్కువ రత్నాలూ, మంచి ముత్యాలూ ఉన్నాయి. Just for the sake of writing అనుకుంటూ రాసిన కథలు కావివి! నిత్య జీవన సంక్లిష్టతని పట్టుకోగల నేర్పు, Humour లో దాగివుండే రొమాన్స్ నీ ఎంజాయ్ చేసే హృదయమూ ఈ పోలీసుకు ఉన్నాయి. Comedy is simply a funny way of being serious అన్న ఆల్బర్ట్ కామూ మాటలకి ఈ కథల్లో రుజువులూ సాక్ష్యాలు కనిపిస్తాయి.


సభలు ఎలా జరుగుతాయి?


సన్మానాల వెనుక ఉండే కామెడీ ఏమిటి? అనేది మొదటి నాలుగు కథల్లో నవ్వులాట లాడించారు.

రచయిత స్వతహాగా తాత్వికుడు అయి ఉండడం వల్ల కొన్ని జీవన సత్యాల్ని ఇలా విడమరిచి చెప్పారు.

“మనిషన్నవాడెవడూ సుకృతాలు చేయడానికి కాదు పుట్టింది. సుకృతాలు చేయమని చెప్పడానికి మాత్రమే”.

“ఈ సృష్టిలో అత్యంత మధురమైన పదం - సన్మానం.”

“పొగడనోడు పోరంబోకు అనే నానుడి ఉంది.”

“అభ్యుదయవాది లోకవిరోధి.”

“మీకు బాలసరస్వతి తెలుసా? అని అడిగితే... మీకు సుబ్బేష్ రంజన్ తెలుసా?” అని ఎదురు ప్రశ్న వేసేవాడే గోపిరెడ్డి. ఈయనతో వేగడం చాలా కష్టం సుమా!


“సంసారం-పెళ్లి అనే విషయాలు ఎంత సరదా అయినవో అంత ప్రమాదకరమైనవి కూడా. ఈ ప్రమాదాల వల్ల అయ్యే గాయాలు పైకి కనిపించవు” అనే మాటల్తో మొదలవు తుంది ‘జాతివైరం’ అనే కథ. భార్యాభర్తల రోజువారీ గొడవల సందడిని పిల్లీ ఎలుకలతో పోల్చి చెప్పిన కథ ‘టామ్ అండ్ జెర్రీ’ చదివితే బ్రోకెన్ లైఫ్ అంటే ఏమిటో అర్థం అవుతుంది. చెళ్ళుమనిపించే మాటలతో సంసార జీవితం మీద విసిరిన చెణుకులు ఫెళ్లున నవ్వు తెప్పిస్తాయి.


అర్థంలేని, సిగ్గులేని, బుద్ధిలేని తెలుగు పచ్చి వ్యాపార సినిమాల్ని తుత్తునియలు చేస్తూ, పడీపడీ నవ్వేలా హాస్యం పండించిన కథ ‘సినీ’మాలోకం.’ సెన్సేషనల్, కమర్షియల్, బుల్షిట్, బ్లాక్‌బస్టర్ ఫిల్మ్‌మేకింగ్ గురించి గోపిరెడ్డి విజృంభించి రాసిన ఈ కథ పది కాలాలపాటు నిలిచిపోతుంది. ‘ఉత్తర బొత్తర ఉత్తాలే’ అంటే ఏంటో మీకు తెలుసా? మనకే కాదు, రచయితకీ తెలీదు. ఆ భాషని డెసిఫర్ చేసిన క్యూరియాసిటీ కథ చదివి తీరాలి. దయ్యాలమర్రి, ఎంకులయ్య తాత, ఎలుగ్గొడ్డు పరార్ కథలు నిర్మలమైన, నిరాడంబరమైన గ్రామీణ జీవితాల్లోని సొగసు నీ, మంచితనాన్ని నవ్వుల  కెంపులు మన దోసిలి నింపుతాయి.


చివరి కథ ‘వీర బాదుడు’లో ఘోరంగా ఓడిపోయిన క్రికెట్ టీమ్ కెప్టెన్‌తో ఒక పత్రికా విలేఖరి ఇంటర్ వ్యూ చేస్తూ “మీ కెరీర్ లో ఇదే అత్యంత దారుణ పరాజయామా?” అని అడిగితే “ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్నాయి. ఇప్పుడే ఎలా చెప్పగలం?” అని ఆత్మవిశ్వాసంతో బదులిస్తాడు. ఇలాంటి హిలేరియస్ పంచులతో గోపిరెడ్డి వీరబాదుడు మోత మోగింది.


‘సంతా మావూరి సంతా’, ‘సల్లగుండాలి బాబు ఆయిగుండాలి’ పాటల్లో గోరటి వెంకన్న గొప్ప హాస్యం పండించారు. శ్రీరమణ. పతంజలి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, జి.ఆర్.మహర్షి చక్కిలిగిలి పెట్టేలా రాయడంలో స్పెషలిస్టులు. ఏళ్ల తరబడి పగలనకా రాత్రనకా మంచి సాహిత్యమూ, కవిత్వమూ చదివి చదివి, తనని తాను వినిర్మించుకొని, విధ్వంసమై, సర్వభ్రష్టుడైన వాడికి మాత్రమే హాస్య దృష్టి అనే అరుదైన వరం లభిస్తుంది. సంస్కారవంతమైన హాస్యాన్ని అందించిన పెద్ద రచయితల వరుసలో చేరడానికి జానెడు దూరంలోనే ఉన్నాడు గోపిరెడ్డి. జర్నలిస్టులైతే ‘తెలుగు కథాకాశంలో ఒక నూతన తార ఆవిర్భావం’ అని రాస్తారు. ఆ స్టార్ పేరే గోపిరెడ్డి యేదుల.


ఎంత హాస్య చతురతతో ఉర్రూతలూగించినా, పేకాట పేకాటే అన్నట్టు గోపిరెడ్డి పోలీసే అని గుర్తు పెట్టుకోవాలని ఇందుమూలంగా హెచ్చరించడమైనది. నమ్మి స్నేహం చేసినందుకు బంగారు బ్రహ్మం, గోరటి వెంకన్న లాంటి మిత్రులను కథల్లో పాత్రలుగా వాడుకొని స్నేహ ధిక్కార నేరానికి పాల్పడినందుకు గోపిరెడ్డికి కోదండం వేయించాలో, థర్డ్‌డిగ్రీ రుచి చూపించాలో తెలివైన పాఠకులే నిర్ణయించాలి.


హెచ్చరిక: ‘Rich Man's joke is always funny’ అన్నట్టు, అంతకంటే ఘనమైన పోలీసు జోకేస్తే పడీపడీ నవ్వాలని తెలుసుకోగోరుతున్నాను. నవ్వితే పోయేదేం లేదు, దారుణమైన లాఠీ దెబ్బలు తప్పించుకోవడం తప్ప.

Tags:    

Similar News