మండుతున్న మంచిర్యాల్ అడవిలో ‘గాంధారి యాత్ర’

యాత్ర జలతే జంగిల్ ఔర్ గాంధారి కే మేలే కీ;

Update: 2025-02-16 08:02 GMT

-అక్కల చంద్రమౌళి


అదిలాబాద్ నాగోబా కేస్లాపూర్ (Nagoba Keslapur) జాతర అయీనంకా కొద్ది రోజులకే మంచిర్యాలకు చాలా దగ్గర మరో పెద్ద జాతర గాంధారి ఖిల్లా (Gandhari Khilla).సమ్మక్క సారలమ్మ తీరుగానే ఆదివాసీ జాతర ఇది. 

ఒకప్పుడు ఇదంతా దట్టమైన అడవి,పులులు సంచరించే ప్రదేశమని అప్పటి మనుషులు చెప్పగా విన్నాను.1920 సంవత్సరంలో ఆసిఫాబాద్ నుంచి లక్షేటిపేట్ దాకా కొత్తరోడ్డు వేశారని వేలితపాటలో చదివాను.

వందేళ్ళు దాటిన ఆ తోవ అనుకునే మా ఇల్లు కూడా ఉంది.మందమర్రి,ఆసిఫాబాద్కు అప్పుడోటి ఇప్పుడోటి ఆ తోవ గుండా మోటార్ సైకిల్ ,బస్సులు పోయేటివి.అంతేకాదు ఈ తోవలో పోవాలంటే నలుగురైదుగురు తప్పా ఒకళ్ళైతే పోయేటోరు కాదు.  దొంగల భయం బాగా ఉండేది .చీకటైతే బందే .బొక్కల గుట్ట రోడ్డు నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో రవీంద్రఖని రైల్వే స్టేషన్ ఉండేది.అప్పటికి భాగ్యనగర్ రైలు ఇంకా షురు కాలేదు‌.ఆ స్టేషన్ పక్కన ఉన్న వారు అడవిలో నుంచి కాలినడకనే వచ్చి మంచిర్యాల పోయేటోళ్ళు.

ఈ ప్రాంతంలో ఎక్కువగా సింగరేణిలో నౌకరి చేసేటోళ్ళే.రాను రాను ఉపాధి కోసం మిగత వృత్తులవారు ఇక్కడికి వలస రావడం జరిగింది.అలాంటి కుటుంబమే మాది‌.దండేపల్లి నుండి రామక్రిష్ణ పూర్ మా బాపు వచ్చిండు. నా బాల్యమంతా సింగరేణిలోనే గడిచింది.

రైలు పట్టాల అవతల వైపుకు బొక్కల గుట్ట ఊరు ఉండేది. ఓ గుట్టాను అనుకోని ఊరు చాలా బాగుంటుంది.పులులు చంపిన వాళ్ళను,కలరా వచ్చిన వాళ్ళ బొక్కలు,ఎముకలు గుట్ట దగ్గర పాడేసేవారని  ఊరి వారిని అడిగితే తెలిసింది.అందుకే ' బొక్కల గుట్ట' (Bokkalagutta) అని పిలుస్తారు.బొక్కల గుట్ట ఊరులో నుండి రాళ్ళవాగు పోతుంది. అది తిర్యాణి గుట్టల్లో నుంచి ప్రయాణం చేసి ఈ ఊరుని కలుసుకోని గోదాట్ల కలుస్తుంది‌.అప్పట్లో దాహనికి, పంటలకు జీవదాతువు అయ్యింది.

అటు గద్దెరాగడి, తిమ్మాపూర్,పులిమడుగు ఊర్లు ఉండేవి.వీటి చరిత్ర కూడా గమ్మతి ఉంటుంది.రోడ్డు పక్కనే పులిమడుగులో లంబాడీలు .అప్పట్లో ఊరిలో నాటుసారా అమ్మేవారు.ఇప్పుడు లేదనే చెప్పాలి.పెదవాగు మడుగు ఎగ్గండిలో పులులు జంతువులు చంపి తినేది అందుకే" పులి మడుగు "పేరొచ్చిందని ఓ పెద్దమనిషిని కలిసినప్పుడు చెప్పిండు.

బొక్కల గుట్ట కాడనే ఓ రింగు రింగుల ఆ మూలమలుపు ఒక కర్వ్ లా ఉండేది.ఆ మూలమలపులో ప్రమాదాలు ఎక్కువై చనిపోయినారు.కొన్ని రోజులకు అక్కడ మైసమ్మ రాయిని ప్రతిష్ట చేయడంతో ఇక ప్రమాదాలు తగ్గుతాయని అందరికి నమ్మకం కలిగి మెల్లగా మెల్లగా అక్కడ భక్తులు మేకలు, కోళ్ళు ,గొర్రెలు కోసి రోడ్డు పక్కన వంటలు చేసుకుని తినేవారు.అలా చూస్తుండగానే గడి నలుదిశలా వ్యాపించింది.

2014 లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలా అప్పుడు " గాంధారి వనం" (Gandhari Vanam) అని ఒక అర్బన్ లంగు స్పెస్ పేరు మీద అందమైన పార్క్ రావడం సంతోషంగా ఫీలయ్యారు .ఎక్కడో పట్టణాల్లో ఉండేటియి ఇడ కొచ్చిందని ఖుషీ అయ్యిండ్రు.

మూడువందల యాభై ఎకరాల అడవి "గాంధారి వనం"గా అప్పుడు మంచిర్యాల డి ఎఫ్ వో బిట్టు ప్రభాకర్ గారూ ఉన్నప్పుడే ప్రపోజల్ చేసిండు‌.అందరి సూచనలు సలహాలు తీసుకుని చర్చించేవారు మేము కూడా మా వంతుగా గాంధారి పార్క్ అభివృద్ధిలో ఉండటం ఆనందం.ఈ వనంలోన తల్లిదండ్రులు మరణాంతరం వారి గుర్తుగా ఒక మెక్కను నాటితే దాని సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే.అట్లా నక్షత్రవనం, ఔషధ వనంలో వివిధ రకాలైన మూలికలు ఉండేవి.అంతేగాక ఒక చెరువులో బోటింగ్ సౌకర్యం కూడా ఉండేది.ఆదివారం వస్తే మంచిర్యాల చుట్టూ పక్కల ప్రాంత ప్రజలకు ఆహ్లాదమే .

ఏడాదికిందటా ఇప్ఫుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పెద్దపల్లి నియోజకవర్గం ఏం పి వివేక్ వెంకటస్వామి గారూ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు.ప్రస్తుతం డి ఎఫ్ వో అషిస్ సింగ్ గారూ కూడ బాగానే చేస్తున్నారు.కొత్త పనులు ఈ మధ్యనే మొదలు పెట్టిందని తెలిసింది.గాంధారి వనం తోరణం ఒక విశేషం ఉంది ప్రముఖ చిత్రకారుడు బ్నిం తను త్రీడిలో వేస్తే దాని బ్లూ ప్రింట్ తీసుకొచ్చాము.

ఇదివరకు చాలా చిన్న రోడ్డు గతుకులు గతుకులు ఆసిఫాబాద్ పోవాలంటే మూడు గంటలైనా పట్టేది.ఇప్పుడు దూరం తగ్గిందనిపిస్తుంది.

గాంధారి ఖిల్లా

మంచిర్యాల( గర్మిళ్ళ) ,మందమర్రి మండలం వైపుకి పోతావుంటే పెద్ద గుట్టలు ఎడమ చేతికి కనిపిస్తయి. జాతీయ రహదారి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో గాంధారి ఖిల్లా లోపలికీ ఉంటుంది.మనకు మొదట రాళ్ళవాగు దాటగానే బొక్కగుట్టల గ్రామం మనల్ని రమ్మని పిలుస్తుంది. ఊరి మధ్యలో రాముల వారి గుడి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా బిసి కులాలు, కాపుదనపు మిగతావారు ఉంటారు.ఈ ఊరిలో వెలమ‌ కుటుంబం చెందిన ఒక గడి ఉంది .ఇప్పుడది ఖరాబ్ అయ్యింది. 


ఇప్పుడు జాతీయ రహదారి ఉన్న చోట ఒకప్పుడు చిన్నరాయిని ప్రతిష్టించి మొక్కులు తీర్చేవారు.ఎందుకంటే దట్టమైన అడవి భయంకరం కాబట్టి ఎవరు ముఖ్యమైన గుడి దగ్గర వెళ్ళలేక ఇక్కడ జరుపుకునేవారు.దానికంటే ముందే ,అదే సమయంలో అక్కడ ఒక స్త్రీ  చనిపోవడం వల్ల కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ జాతరను ఎవ్వరు చేయలేదు.

తెలంగాణ జాతరలు సంస్కృతి ఆ తర్వాత నాయకులు ఆలోచన చేసి అప్పటి ఎం ఆరో వో కిషన్ గారూ, మరికొంత మంది మళ్ళీ జాతరను మొదలు పెట్టాలని 2016లో అంగరంగ వైభవంగా ఆదివాసీలు జరుపుకున్న విషయాన్ని రాత్రి గాంధారి ఖిల్లాలో నిన్న కలసినప్పుడు ఒకాయన చెప్పాడు.

ఆదిలాబాద్ గొండు ,కొలాం,నాయక్ పోడ్, పర్థాను,ఒజారీ ఆదివాసీలు ఇక్కడ ఉంటారు.ఇయ్యాల జాతర నాయక్ పోడులది . స్త్రీ  లైతే పెద్దవారు చీరలు,పైభాగంలో రైకలు ముడివేసి కనిపిస్తారు‌.ఇప్పుడు యువకులు ప్యాంటు వేసుకుంటున్నారు.తెల్లగా నారింజ ఎరుపు రంగు గుడ్డలపై సూర్యుడు, చంద్రుడు ముద్రించి ఇల్లార్ల వద్ద ఎగురేస్తారు.

ఒక్కో తెగలకు ఒక్కో సంస్కృతీ రీతిరివాజులు వేరు వేరుగా ఉంటాయి.  గాంధారీ ఖిల్లాకు అనాదిగా  నాయకపోడ్లే పూజారులు  అనీ,ఇది మరోక వైపు గొండులదని, కొన్నిరోజులు దీని చుట్టూ పంచాయితీలు జరిగేటియి‌.ఇప్పుడైతే ఏలొల్లి లేదు.   

గాంధారి మైసమ్మ జాతర

దీన్ని ప్రతేడాది గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర (Maisamma Jatara) మాఘ శుద్ధ పౌర్ణమి నాడు నాయకపోడ్ జాతర చేసుకుంటరు.ఈ నెల 14,15,16 వ తేదీన మూడురోజులు ఆదివాసీల పండుగ పేరు మీద కరపత్రమేసిండ్రు.

మొదటి రోజైతే వారు ‘తప్పెటగూళ్ళు-పిల్లన గ్రోవి’ తో ఆటపాటలతో తెల్లగా మెరిసేటి బట్టలు వేసుకుని గంగాజలాన్ని గోదావరి నది నుంచి తీసుకత్తరు. 



ఇగ రెండవ రోజు నాయక్ పోడ్ ఆచారాలు ప్రకారం గోదావరి జలాలతో మంచిగ కడిగి గ్రామ దేవత పోశమ్మ తల్లికి పూజ, భీమన్న దేవుడి పట్నాలు, పూజలు అదేరోజు వేరు వేరు ఊళ్ళ నుంచి వచ్చినప్పటికి కూడా లక్ష్మీదేవిలా కళాకారులచే సాంప్రదాయబద్ధంగా ఆట పాటలు ఉంటాయి.ఇగ రాత్రి 12 గంటలకు పెద్ద పట్నంతో మొక్కులు కూడా చెల్లిస్తారు. ఇది  ఒక్కసారైనా చూడాల్సిన కన్నుల పండుగ



 






ఆఖరి రోజూ అంటే మూడో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క ఆదివాసీ పండుగకు దర్బార్ ఉంటది. వాళ్ళ ఆపతి సంపతి సెప్పనీకీ ఒక వేదిక. లీడర్లు, అధికారులు వస్తారు కానీ ఈ సారి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ సారి ఎవరు రాకపోవచ్చనీ అక్కడ అనుకుంటే విన్నాను.

ఇందులో పక్క రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర ,చతీస్గడ్, జార్ఖండ్ ఆదివాసీలు కూడా పాల్గోంటారు.   పక్కనే పులి మూమెంట్ ఉందని,మొన్ననే చిరుత తిరుగిందని, అందరు జాగ్రత్తగా ఉండాలని అక్కడికి వచ్చిన ఆర్ డి వో కు ఫారెస్ట్ అధికారులు చెప్పారు. ఎన్ ఆర్ శ్యామ్ (ప్రముఖ హిందీ రచయిత) గాంధారీ జాతర చూడడానికి మాతో పాటు ఉన్నాడు.

గాంధారి చరిత్ర


దీనికి వెయ్యి సంవత్సరాల చరిత్రకు దగ్గర ఉంటుంది ‌.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1993 సంవత్సరంలా ఐదువేల రుపాయలతో జాతర చేశారట అప్పుడు  ఐటిడిఏ అధికారి  బిడి శర్మ వచ్ఛిన చిత్రాలు అక్కడ ఒక సాంస్కృతిక పోస్టర్ మీద కనబడింది.ఇంకా రాంచందర్,రాజయ్య వి కూడా ఉన్నాయి.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక చరిత్రలోకి పోతే, గాంధారి ఖిల్లా చరిత్ర  ఏటవాలు కొండమీద శిలాశాసనంలో "శ్రీరస్తు శుభమస్తు శ్రీ పెద్థిరాజు ఆనంతరాజు రఘనాయకులకు సమర్పించిన హనుమంత్త తిరువని ప్రతిష్ట శ్రీ యున్" అని ఉంటది.

దాని పక్కనే సూర్య చంద్రుల ఆకారం ఉంటుంది.నేను మొదటిసారి చూసినప్పుడు నాకు అర్థం కాలేదు. చాలాసార్లు దాని  చూసి చదవడం వల్ల అర్థం అయ్యింది. గాంధారి ఖిల్లా చరిత్ర మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడుప్పుడే చరిత్ర బయటకువస్తున్నది. బొక్కల గుట్టలో అరవై యేళ్ల సాంబయ్య అనే వ్యక్తి ‘మైథాలజీ’  గురించి బాగా చెప్పేవాడు.నేను ఆ విషయాలను రికార్డు చేయడం జరిగింది. ఇంకాా చుట్టు పక్కల వూళ్లలో, మేడారంలో   పాత తరాన్ని అడిగితే ఇంకా కొంచెం తెలుస్తది.

మొదటిసారి ప్రయాణం

2012 వ సంవత్సరం వరకు గాంధారి ఖిల్లా నేను చూడలేదు.  కానీ అప్పుడు చిన్న తొవ్వ మధ్య మధ్యలో కాలువలు, ఖిల్లా పోవడానికి చాలా కష్టమే.పెద్ద వాహనాలు పోవడం మరీ కష్టం.ఒకసారి వానా కాలంలో  ఐపిఎస్ అధికారి విజయ్ కుమార్  ఇద్దరం కలిసి వెళ్లి తిరిగి వస్తాంటే , పెద్ద వర్షం మమ్మల్ని ఏటూ పోనికుండా చేసింది‌. మట్టి రోడ్డులో వాహనం బురదలా దిగబడింది.ఒక మూడు గంటలు మేము వెహికల్ తోసి,చెట్లకోమ్మలు ఇరిసి పయ్యల కింద వేస్తూ ముందుకు దొబ్బితే బయటకొచ్చింది.

అడవిలో చీకటి పడింది.అక్కడ ఆ వైపుకి ఎవరు రాలేదు.ఎందుకంటే  నిర్మానుష్య ప్రాంతం.అది ఇప్పటికి యాది చేసుకుంటాము.ఇప్పుడైతే ఆ ఇబ్బంది ఏమిలేదు ఊరు కోస దాకా డాంబర్ రోడ్ ఉంది. చుట్టూరా తాటిచెట్లు,ఈత చెట్లు ఉంటాయి.ఆటలు ఆడేందుకుమైదానం రెండు, మూడు ఎకరాలు ఉన్నట్లు ఉంది.ఊరికి చాలా మంచి విషయం.అంతటా రియల్ ఎస్టేట్ జరుగుతుంది. ఆడుకోవాలని ఉన్న స్థలం లేక పిల్లలు యువకులు ఆడటం లేదు.ఇంకా ఏదో సంపాదించలన్న ఆకాంక్ష పోలేదనిసిస్తుంది. ఇక్కడ కొండలు కరగడం చూస్తుంటే .ప్రక్రృతి విధ్వంసం తెరలేసిందన్నమాట.

కవ్వాల్ టైగర్ రిజర్వు (కెటిఆర్)

మంచిర్యాలలో అడవి ప్రాంతం అంతా ‘కవ్వాల్’ కిందికి వస్తుంది.మనం గాంధారి ఖిల్లా పోతావుంటే అది కెటిఆర్(Kawal Tiger Reserve)సెంట్రల్ గవర్నమెంట్ అధికారంగా నోటిఫై చేసింది.అప్పటి నుంచి అడవిలోకి కట్టెలు కొట్టడం,మంటలు పెట్టడం జంతువులు వేటాడటం నిషిద్దమన్నమాట.ఈ అడవిలో పులులు,అడవి దున్నలు ,స్లొత్ బీర్,జింకలు, ఇండియన్ గార్ లను మనం చూడవచ్చు.

నలభై గ్రామాలను ఖాళీ చేయించి టైగర్ రిజర్వ్ చేశారు‌. గిరిజనులు చాలా బాధపడ్డం చూశాను. అడవి నుంచి బయటికి పోవడం వాళ్లకి ఇష్టం లేదు‌. ఎందుకంటే తిండి తిప్పలు అంతా అడవిలోనే కదా .ఈ కవ్వాల్ అడవిలా ఔషధ మొక్కలు, నిర్మల్ కోయ్యబోమ్మలకు అక్కరకచ్చే పోనికల్ కనబడుతాయి.ఇప్పుడు ఈ అడవిలో తక్కువైతన్నయ్.ఈ మధ్యలో కవ్వాల్ వార్తల్లో ప్రతిరోజూ కనబడుతుంది. ఈ మధ్య కాగజ్ నగర్ అడవిలకు పత్తిసేన్లకు పులి వచ్చి లక్ష్మి అనే యువతిని  సంపినది. దేశమంతటా అది వార్త అయ్యింది.

పర్యాటక ప్రదేశాలు టూరిజం

ఈ మధ్యనే ఈ మంచిర్యాల ప్రాంతంలోని అడవిని ఇకో టూరిజం కింద అభివృద్ధి పనులను అటవీశాఖ చూసుకుంటుంది.అక్కడక్కడ లోపలికి వెళ్ళేదారి చాలా అధ్బుతంగా చేశారు‌. సైక్లోథాన్ అనే ఓ పాతిక కిలోమీటర్ల సైకిల్ ప్రయాణంలో చాలామంది పాల్గోన్నారు. మా పిల్లలు సుస్వర ఏడు సంవత్సరాలు,స్వరన్ అడవిలో సైక్లింగ్ ఉత్సాహంగా పాల్గొన్నారు.అది ఇప్పటికే చెబూతూనే ఉంటారు.

క్వారీ నుంచి గాంధారి ఖిల్లా వెనుక వైపు అడవి మధ్యలో నుంచి మనం ప్రయాణం చేయవచ్చు.ఇదోక గమ్మతి. తడోబాకు వెళ్ళే కంటే ఇక్కడ పర్యటన చేయడం బాగుంటుందనే వెళ్ళినవారు చెబుతున్నారు. సఫారీ కొండల మధ్యలో మంచెను ఆనుకొని ఉంటుంది.ఈ మధ్యనే మా మిత్రురాలు ఫ్రాన్స్ నుంచి గుహలు మీద అధ్యయనం చేయడానికి వచ్చింది. తనకి మొత్తం చూపించాను. పదివేల సంవత్సరాలు మానవుని మనుగడకు సంబంధించిన అనుభవాలను ఫోటో తీసుకుని రీసెర్చ్ వాడకున్నారు. ఈ అడవిలో వివిధ రకాలు చెట్లు, తప్సి,పాచి,నల్లమద్ది,జిట్టిరేగు,టేకు, వీపరితంగా ఉంటాయి.

ఇదివరకు చుట్టుపక్కల మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు, ఉండేటివి. కానీ ఇప్పుడు కొంచెం తగ్గిందనిపిస్తుంది. పాఠశాల విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు కూడా చూడటానికి వస్తున్నారు.చెట్లు, ప్రకృతి మీద అవగాహన చేయించడం చాలా సంతోషకరమైనది అనిపిస్తుంది.

 మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలోని జలగుట్ట , పూల గుట్టల మధ్యన నాచురల్ గా ఉంటుంది.  ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడి  గుహలలో పదుల సంఖ్యలో మానవుల పాదముద్రలు, జంతువుల అవయవాల అచ్చులు, మొదలైన రాతి చిత్రాలను  కనుగొన్నారు.  రాతియుగల కాలం  చిట్టపు రాళ్ళ బొగడ,చెరువు తూములో రాతిని తొలచిన కాలువనిర్మాణం కనిపించాయి.  భోగం దాని గుళ్ళు, కోటకొండలపై బైరవుని విగ్రహాలు శివలింగాలు, శూలాలు, ఆంజనేయుడి విగ్రహాలు, దర్వాజాలు, దర్వాజా పై లక్ష్మీ దేవర ఎనుగుల విగ్రహాలు, నాగశిష్ణ ఆలయం గుట్టన ఏర్పడిన దారులు కనిపిస్తాయి. ఇవన్నీ కాకతీయుల, పద్మనాయకుల కాలం వరకు జరిగిన నిర్మాణాలయి ఉండొచ్చని రిపోర్టులో ఉంది‌. ఇంకా ఖిళ్లాలో లభించిన మట్టి పాత్రల విశేషాలను (కుండ పెంకులు )చరిత్ర పూర్వ యుగంలో మానవుని వాడినవి కుండ పెంకులు లభ్యమయ్యాయి.  ఈ కోట ప్రాంతాన్ని కందార పట్నం పిలిచేవారట. ఇదే ఇప్పటి గాంధారి ఖిల్లాఅని ఈ మధ్యనే తెలిసింది. ఇది గాంధారి ఖిల్లా తాలూకాలోనిదని ఆదివాసీ కల్చర్  మీద అవగాహన ఉన్న మెసినేని రాజయ్య అనే వ్యక్తి చెప్పిండు 

మనం చూడవలసినవి గాంధారి ఖిల్లా విశేషాలు

ఈ దట్టమైన అరణ్యం సహజమైన శిల్పాలతో ఉంటుంది. ఎన్ని సార్లు చూసినా మంచిగనిపిస్తుంది. బొక్కలగుట్ట దాటినంకా ఓ గుట్ట మూల మలుపు కాడ సదరు భీమన్న విగ్రహం చూడవచ్చు.  సదర్ భీమన్న గద్దె నుండి కొద్ది దూరంలో గాంధారిఖిల్లా.ఖిల్లా ఉత్తరం వైపుటి మేడిచెరువుని మేడిరాజు కట్టాడని అక్కడివారు చెప్పారు.  

కొంచెం దక్షిణం తిరగగానే దర్వాజా రాతిగోడలపై పది అడుగుల కాలభైరవ విగ్రహం బారీగా ఉంటుంది. ఆ కళాకారుని నైపుణ్యం చూస్తే అబ్బురపరుస్తుంది.   అది దాటగానే దారికి ఎడం వైపున జీడికోట స్థలం ఉంటుంది. అది వ్యాపార కేంద్రం లాగా ఉపయోగించేవారట ‌

పైకి ఎక్కుతా ఉంటే దారిలో  తొండానికి సర్పం చుట్టుకుని ఉన్న ఏనుగు శిల్పం కనబడుతుంది.  దానికి ప్రక్కన రాతి గోడలపై మొండి భైరవుల ప్రతిమలు ఉన్నాయి.  దర్వాజా కుడిపక్క కమ్మీపై మైసమ్మ తల్లి విగ్రహంకనిపిస్తుంది. పైనున్న అడ్డకమ్మి పై లక్ష్మీ దేవర, పూలమాలలతో ఏనుగు బోమ్మలు రారామ్మని ఆహ్వానం పలుకుతూ ఉంటాయి. పెద్ద దర్వాజాకు తూర్పు వైపు ఎత్తైన శిఖరం నగార గుండు భీముని పాదం. అటు పోతా ఉంటే పడమరలో ఇంకొక కొండపై  ఆంజనేయ విగ్రహం కనిపిస్తుంది.  

నాయకపోడ్ల చరిత్ర

కొలాములు నివసించే ఆదిలాబాద్ జిల్లాలోని కొండ లోయలు అటవి ప్రాంతంలో మరోక తెగనే నాయకపొడ్లు(Naikpods). అయితే ఇక్కడ కొలాం నివాసించేచోటనే వీరు చిన్న చిన్న సముహాలుగా బతుకుతుంటారు. 1940 వరకు పోడు వ్యవసాయం చేసుకునేవారు. ఇప్పుడు కొండ ప్రాంతాల్లో ఓ పిడికెడు మంది మాత్రమే ఉన్నారు‌. చాలామంది పట్టణాలలో కూలీలై బతుకుతున్నారనేది వారి చూసినప్పుడు నాకు అర్థమైంది.

అదిలాబాద్ నాయక్ పోడులు దాదాపు తెలుగులోనే మాట్లాడుతారు.వారంతా హిందూ సమాజంలో కలిసిపోయారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక లక్షమంది వరకు ఉండవచ్చు. ‌‌ కొంతమంది   ముసలి వాళ్ళును చూస్తే పచ్చబొట్లు కనబడతాయి. మానవ సంబంధాలలో హాస్యం ఉన్నట్లు వీరు కూడా దగ్గరివారితో పరాచికాలాడుతుంటారు. అప్పటిలో వ్యవసాయ పనిముట్లు వారే తయారుచేసుకునే వారు, ఇపుడది మారింది‌.

ఒకప్పుడు పచ్చజోన్నలు ,గట్క తినేవారు అది ఇప్పుడు మారింది.   గోండులు ,నాయక్ పోడుల ఇంటిలో తిండి తింటారు కానీ నాయక్ పోడులు గోండుల ఇండ్లలో తినరని ఒక నాయక్ పోడు వ్యక్తి తెలిపాడు. నాయక్ పోళ్ళలో పాలకాయ, నల్లెల్ల అనేవి గోత్రాలు.  మద్ది,కోలకాని, ముచినేని ,మేశినేని,ఏదుల అనేవి ఇంటి పేర్లు.

ఆచారాలు పుట్టుక నుండి సావు దాకా

నాయక్ పోడ్లు తమ ఇంటిలో బిడ్డ పుడితే చనిపోయిన పూర్వీకులు తిరిగి పుట్టినట్లు సంతోషిస్తారు. బాలింతలను ఇంటిలో ఒక పక్క తడికలతో చాటు కట్టి వేరుగా ఉంచుతారు. భూతప్రేత పిశాచాల చూపు పడకుండా అడవి నుండి తెచ్చిన ఆరే,గార మండలను ఇంటి గుమ్మానికి తగిలిస్తారు. బిడ్డ పుట్టిన దగ్గరనుంచి 11 రోజుల వరకు స్నానం చేయించారు.చిన్న పిల్లలకు రోగాలు వస్తే చనిపోయిన పెద్దల కొంటెతనం అనుకుని  చల్లగా కాపాడాలని  కోడిని కోసి నీలారబోసి మొక్కుతారు. బిడ్డ పుట్టిన  సాంప్రదాయాలు నేటికి ఆచరిస్తారు. ఇంటిలో బిడ్డ పుట్టడం ఒక అపూర్వ సంఘటన భావిస్తారు. బిడ్డ పుడితే సంతోషంగా పుట్టిన బిడ్డను పోలికలను పోలికలతో ఎవరికీ సంబంధం చూసుకుంటారు.

కుండ మార్పిడి పెండ్లి

ఈ రకం పెళ్లిళ్లు సాధారణంగా మేనరికం సంబంధంలో జరుగుతాయి. పూర్వం తమ్ముళ్లు చాలా చిన్న వయసు వారు ఉంటె అక్కపిల్లలను  ఇచ్చి పెండ్లి చేసేవారు‌.  ఒక ఇంటి ఆ పిల్లను  ఏ ఇంటి వారికైతే ఇస్తారో అదే ఇంటి పిల్లను మొదటి పిల్లనిచ్చిన వారి పిల్లవాడికి ( పెళ్లి కొడుకు )ఇచ్చేస్తారు. ఇలాంటి సంబంధంతో పాలపేరిట వారు నీళ్ల పేరిట వారిని తమ వాళ్ళుగా ఆమోదించించి ఎంచుకుంటారు. 

ఆదివాసీలు మీద సాహిత్యం

 సాహు, అల్లం రాజయ్య ఆదివాసీలు మీద "కోమురం భీం" అనే నవల రాశారు. ఇప్పుడు కొలాం వారే తమ సాహిత్యం సృష్టించుకుంటున్నారు. నాయక్ పోడ్ సాహిత్యం ఇంతవరకు లేదు.  మెస్రం మనోహర్ తాను ఇప్పు పువ్వు మీద రాసిన ఇరూక్ కథల గురించి నిన్న గాంధారి ఖిల్లా జాతరలో నాకు చెప్పాడు.ఇప్పపువ్వు ఏరేటప్పుడు పందులు వస్తే గోలి కొడుతారట. ఆ గోలి పందికి తగిలితే ఒక్కసారిగా ఎలా కోపంగా మీదకొస్తాయో  చెప్పాడు.

‘అడవి’ నవల వసంతరావు దేశ్ పాండే రాశారు. నేను రాసిన కేడా కోడ్సా, మ్యూజియం కథ ,కాకోబాయి వంటి  ఒక పది కథలను పుస్తకంగా  తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము.

పరేషాన్ సినిమా గాంధారి ఖిల్లా వీడదియరాని అనుబంధం

"గాంధారి జిల్లా కొత్తవా గంగమ్మ "అంటూ స్థానికంగా రాయడం మొదటిసారి తెలంగాణ సినిమాలలో ఒక ప్రత్యేకతను చాటిందనిపిస్తుంది.నాయక పోళ్ళు,ఆదివాసీలు ఈ పాటను ఓన్ చేసుకున్నారు. అయితే ఇంకా ఈ సినిమా గురించి లోతుగా చెప్పొచ్చు‌‌.బొక్కలగుట్టలోనే ఇరవై రోజులు షూటింగ్ చేశాం. కరోనా రెండో వేవ్ టైంలో ఊరు అంత బాగా సహకరించారని అప్పటి సినిమాటోగ్రాఫర్ వాసు, సినిమా నటుడు తీరువీర్ , నటీ పావని ప్రొడక్షన్ వాళ్ళు చాలా సంతోషపడ్డారు. దర్శకుడు రూపక్ ఎప్పటికీ క్రృతజ్ణతతో ఉంటాననీ చెప్పాడు.ఈ ఊరికి అప్పటి సర్పంచ్, జిల్లా అధికారులు కూడా సహాయం  చేశారని ఈ సందర్భంగా గుర్తు చేయడం ఆనందంగా ఉంది. ఊరు వాళ్ళు కూడా ఈ చిత్రంలో చాలామంది నటించారు.

అందులో "పరేషాన్ "అనే సినిమా చిత్రీకరణ ఇక్కడే కరోనా కాలంలో జరిగింది. అంతేగాకుండా ఆ ఊరికి చెందిన డెబ్భై సంవత్సరాల సాంబయ్య అనే  బక్కపలుచ మనిషి కూడా నటించాడు. ఆయనకు నటించడం అంటే ఇష్టం. ‌బాగా మంచి నటుడు‌ కూడా. సినిమాలో బాగా పెద్ద కారెక్టర్ ఆయనది .సినిమా విడుదలకు ముండే  ఆనారోగ్యం కారాణాల వల్ల చనిపోవడం బాధాకరం.

గిరిజనులు కలిసే ప్రదేశం

గాంధారి జాతర అందరూ మంచిగ కలిసే చోటు. అందరిని కలవడానికి జాతరకు వస్తారు.తిరిగి పోయేటప్పుడు కష్టాలు సుఖాలు అడుగుతారు.అది మనిషికి సంబంధించిన ఒక భావోద్వేగ క్షణం. అందుకే ఇది ఒక అనుభూతిని అనుభవాలను పోగు చేసే స్థలం.

మా సక్కని సినిమా

 ఆదిలాబాద్ సంస్కృతీ సంప్రదాయాలు మీద ఇక్కడి యువత ఇప్పుడిప్పుడే అధ్యయనం చసేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్థానికులతో కలిసి సినిమా, కళలు అభివృద్ధి చేయడంలో ముందుకు నడక మొదలైంది. ఆదివాసీల మధ్య ఫిల్మ్, డాక్యుమెంటరీ శిక్షణను కూడా గాంధారి ఖిల్లా చారిత్రక ప్రదేశంలో మొదలుపెట్టారు. ఇది శుభ పరిణామం.


(అక్కల చంద్రమౌళి, సీనిగేయ రచయిత)

Tags:    

Similar News