తుర్కోళ్ళంటే ఎవరు?

POEM OF THE DAY: భూపతి వెంకటేశ్వర్లు

Update: 2024-12-28 08:02 GMT
నెల్లూరు బారా షహీద్ దర్గా దగ్గిర హిందూ భక్తులు



— భూపతి వెంకటేశ్వర్లు

తుర్కోళ్ళంటే.....

మా ఇంటి ముందొళ్ళు …..

మా అమ్మను 'అక్కా'అని ,మా నాన్నను బావ అని, నన్ను మాత్రం 'అరే 'అనే.. మా నభిగాడే ..గుర్తొస్తాడు.

రంజాన్ పండుగ, పీర్ల పండుగయితే వాళ్ళింటికి పోయి సేమియాలు తిన్నోల్లం.

కలిసి మెలిసి, చదివినొళ్ళం

అడి,పాడినోల్లం

నాటకాలు ఎశినోల్లం.

నన్ను చూడ కుండ ఉండే వాడే కాదు. గసుంటి స్నేహమే గుర్తొస్తుంది.

దసరా పండుగ నాడు మా అమ్మకు, మా అక్కకు జమ్మి పెట్టి కాళ్ళు మెక్కె

మా నభి గాడే యాది కొస్తడు.

నీకెందుకోరా? తురుకోళ్ల అంటే పాకిస్తానే గుర్తొస్తది .

అరేయ్ ..పల్లెల్లో పెరిగినవా?

పట్నం జంగల్ లో పెరిగినవా !

మాకు తెలిసింది ఒక్కటే ..హిందూ ముస్లింలను విడదీసి చూడలే ..

పీర్ల పండుగ నాడు కలిసి అలాయి బలాయి దసరా పండుగ నాడ జమ్మి పంచి పెంచు కున్న స్నేహం రా !

మేము చదివిన పుస్తకాల్లో.. స్వాతంత్రోద్యమంలో హిందువులు ముస్లింలు కలిసి ఏకమై బ్రిటిషోడిని తరిమేసిన చరిత్ర మాది .

నువ్వు మాత్రం బ్రిటిషోడి బూట్లు నాకినావు కదా!

మాదంతా జాతీయోద్యమ చరిత్ర

నీదంతా విద్రోహ చరిత్ర.

నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధం నువ్వు చెప్పే దేశభక్తి పచ్చి మోసం

ఫాసిస్టు హిట్లర్

వారసులు మీరు

ఈ దేశానికి పట్టిన

విష కీటకాలు

అధికారం ,అహంకారం, మంద బలం ఏమైనా చెయ్యొచ్చా !

నీ లాగే నిర్ర నిలిగిన హిట్లర్ చరిత్రను తెలుసుకో..

గత చరిత్ర గుణ పాఠాలు నేర్చుకో..

నా దేహం ,దేశం భిన్నత్వంలో ఏకత్వంతో పెనవేసుకున్న దేశం నాది.

మూడు రంగుల దండలోని ధారాలు

మా నరాలు .

రంగురంగుల పూల బతకమ్మ లాంటి దేశభక్తి మాది.

దేశద్రోహుల నేప్పుడు తరిమికొట్టిన చరిత్రే మాది .

నేల అడుగులో పోరాట జల

ఇసుక రేణువుల్లో నిప్పుల అల అందుకే ఇక్కడి....

🇰🇬పిడికెడు మట్టి వాసన సూడు

మా మూలవాసుల .. నెత్తురు,

కన్నీళ్లు, కన్నెర్ర ను చూస్తావ్ !



(భూపతి వెంకటేశ్వర్లు, జర్నలిస్టు, కవి)

Tags:    

Similar News