కర్నూలు కవులకు రాష్ట్రస్థాయి పురస్కారాలు

పత్తిఓబులయ్యకు కళారత్న`యస్‌డివి అజీజ్‌ డా.హరికిషన్‌లకు ఉగాది పురస్కారాలు;

Update: 2025-03-29 15:06 GMT

-కెంగార మోహన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశ్వావసునామ సందర్భంగా కర్నూలుకు చెందిన కవులకు రాష్ట్రస్థాయి పురస్కారాలను ప్రకటించింది.

లలితకళాసమితి అధ్యక్షులు పత్తిఓబులయ్యకు కళారత్న ప్రకటించగా బాలసాహిత్యంలో విశేషంగా కృషి చేస్తున్న డా.యం.హరికిషన్‌కు ఉగాది పురస్కారం ప్రకటించారు. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లికళాక్షేత్రంలో అందుకోనున్నారు. కర్నూలు జిల్లాలో అంతర్భాగమై ప్రస్తుత ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా బల్లివారి పుల్లలచెర్వు గ్రామంలోని చిన్న పిచ్చయ్య పిచ్చమ్మ దంపతులకు జన్మించిన సుప్రసిద్ధ నటుడు దర్శకుడు పత్తి ఓబులయ్య. ప్రాధమిక, ఉన్నతవిద్యలను తురిమెళ్ళలో పూర్తి చేసిన ‘విద్వాంస’ను నెల్లూరులోని వేద సంస్కృత పాఠశాలలో చదివారు. 



 కర్నూలులోని వివియన్ కాలేజీలొ తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసి, యం.ఏ. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివారు. తెలుగు భాషా పండితులుగా ఉద్యోగ ప్రసానాన్ని విజ్ఞానపీఠంలో ప్రారంభించి అదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల స్థాయికి ఎదిగారు. అనంతరం కర్నూలు సెయింట్‌ మేరీస్‌ జూనియర్‌ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఉద్యోగ జీవితం కొనసాగిస్తూనే నాటకరంగంపై మక్కువతో 1980లో రంగస్థలంపై ఆరంగేట్రం చేసి కర్ణుడు, దుర్యోధనుడు, బభ్రువాహనుడు, బిల్వమంగళుడు, తదితర ప్రాంతాల్లో నటింది పౌరాణికనాటకాల్లో మేటినటుడనిపించుకున్నారు. నాటక రంగంలో నటుడిగా రాణిస్తూనే నటనతోపాటు దర్శకత్వం స్థాయికి ఎదిగారు. ఫ్యాక్షన్‌ లో కరడుగట్టిన రాయలసీమ ముఠాకక్షల్ని ప్రతిబింబించే సాంఘిక నాటకం పురస్వారీకి దర్శకత్వం వహించాడు. ఈ నాటకం నంది పురస్కారం పొందింది. దేశమండు తెలుగుదేశము మిన్నయ భాషలందు తెలుగుభాష మిన్న జనులలోన తెలుగు జనము మిన్నయగును, ఆయన పద్య కవితల్లోని తెలుగు మాటల మల్లెల గుభాళింపులు అలా అల్లుకుపోతాయి. 1985లోతెలుగుభోజుడు (శతకం), 1986లో యేసుశతకం, 1988లో శ్రీనెమలిగుండ్ల రంగనాయకస్వామి మహత్యం, రేనాటి చంద్రులు బుడ్డావెంగళరెడ్డి, తెలుగు వెలుగు, కనకసురభేశ్వర చరిత్రతో పాటు కర్నూలు జిల్లా సాంస్కృతిక చరిత్రకు అద్దంపట్టే 130 మంది కళాకారులను కర్నూలు జిల్లా రంగస్థలం పేరుతో గ్రంధాన్ని జనవరి1993లో తీసుకొచ్చారు. సెల్లుపురాణం, తెలుగుబోజుడు వంటిరచనలు చేశాడు. రంగస్థల కళాసాగర్‌, తెలుగు కళాస్రవంతి, కిన్నెర అవార్డులతో పాటు ఏప్రిల్‌ 14 న తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి కందుకూరి వీరేశలింగం పురస్కారం అందుకున్నారు. సుప్రసిద్ధ నటులైన అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, గజల్‌ శ్రీనివాస్‌ లాంటి ఎంతోమందితో సత్కారాలు పొందారు.

యస్‌డివి అజీజ్‌ 1964 ఆగష్టు 11 వ తేదిన కర్నూల్లో జన్మించారు. 14వ ఏట నుండి... 1980 నుండి నేటివరకు దాదాపు 45 సంవత్సరాలుగా సాహిత్య రచన చేస్తున్నారు. స్టేజి నాటకాలు అమరజీవి ప్రకాశం, సంకల్పం, ది గైడ్‌, శిధిలశిల్పాలు రాశారు.రేడియో నాటకాలు వివిధ ఆకాశవాణి కేంద్రాల నుంచి, నాటకాలు, నాటికలు, రూపకాలు 60కి పైగా ప్రసారం అయ్యాయి. 



 ఇందులో సాంఘిక, చారిత్రక నాటకాలు రాశారు. సీరియల్‌ గా ప్రసారం అయిన రేడియో నాటకాలు: తుర్రె బాజ్భాన్‌, శ్రీకృష్ణదేవరాయలు,బౌద్ధజాతక కథలు ఉన్నాయి. చారిత్రక నవలలు పాలెగాడు,తెర్నెకంటి ముట్టడి’’ (క్రీ.శ.1801లో కర్నూలు జిల్లా తెర్నెకల్లు రైతులు బ్రిటీష్‌ వారిపై జరిపిన పోరాట గాధ), బుడ్డావెంగళరెడ్డి, కర్నూలు జిల్లాలో గాంధీజ పర్యటన, ఓబన్న, గులాం రసూలాఖాన్‌ , అల్లూరి సత్యనారాయణరాజు, టిపుసుల్తాన్‌ రాశారు.

పరిశోధనా గ్రంథాలు: భారతదేశంలో స్త్రీ, . శ్రీకృష్ణదేవరాయలు,సాంఘిక నవలలు , మనస్విని,వనజ,శిథిలశిల్పాలు, హరిణి,వైశాలి రాశారు. కథ సంపుటాలు: లయ తప్పిన గుండె,స్వేచ్ఛ, మనిషి, బ్రతుకు చిత్రం, తడి, చారిత్రక గాథలు (చారిత్రక కథల సంపుటి)అజీజ్‌ కథలు (కథల సంపుటి) రాశారు. ఇతర భాషలలోనికి అనువదించిన నవలలు: పాలెగాడు, గులాం రసూలాఖాన్‌’ గులాం రసూలాఖాన్‌,శ్రీకృష్ణదేవరాయలు, ఓబన్న అల్లూరి సత్యనారాయణరాజులు ఉన్నాయి.


ఇప్పటివరకు 2007 లో కందుకూరి పురస్కారం, 2017 లో తెలుగు యూనివర్సిటీ ‘కీర్తి’ పురస్కారం, 2018 లో హీరాలాల్‌ స్మారక సాహితీ పురస్కారం, 2019 లో లలితకళాసమితి కర్నూలువారి ప్రతిభా పురస్కారం’, 2019 లో తెలుగు కళాస్రవంతి, కర్నూలు వారిచే ‘‘చారిత్రక సాహితీ ప్రపూర్ణ’’ బిరుదు ప్రదానం చేశారు.2020లో ‘అజీజ్‌ రచనలు-పరిశీలన’ అంశంపై యస్‌.వి. యూనివర్సిటీ నుంచి నర్సయ్య అనే పరిశోధక విద్యార్థి పి.హెచ్‌.డి. పొందాడు. 2022 లో తెలుగుకళాసమితి పురస్కారం,2023 లో డాక్టర్‌ ఇస్మాయిల్‌ ఎక్స్‌ లెన్సీ అవార్డు, 2023 లో ‘తుర్రే బాజాఖాన్‌’ నాటకానికి (2021) తెలుగు యూనివర్సిటీ ఉత్తమ గ్రంథం పురస్కారం, 2023 లో ‘నక్కల మిట్ట ఫౌండేషన్‌’, కర్నూలు వారి జీవిత సాఫల్య పురస్కారం అందింది.


డా.యం.హరికిషన్‌: హరికిషన్‌ 1972లో కర్నూలుజిల్లాలోని పాణ్యంలో కృష్ణవేణమ్మ, హుసేనయ్య దంపతులకు జన్మించారు. నగరంలోని సెయింట్‌ మేరీస్‌ హైస్కూల్‌లో విద్యాభ్యాసం ప్రారంభించిన వీరు కర్నూలు పీజీ సెంటర్‌లో ‘’కేతు విశ్వనాథరెడ్డి కథలు - సామాజిక దర్శనం’’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొందారు.




కోడుమూరు మండలంలోని అమడగుంట్లలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం నిర్వర్తిస్తున్న హరికిషన్‌ పీజీలో వారి అధ్యాపకుడు, కథా రచయిత అయిన డా. తుమ్మల రామకృష్ణగారి సహచర్యం వల్ల సాహిత్య రచనపట్ల ఆసక్తి పెంపొందిచుకున్నారు. 1997లో ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా రాసిన తొలికథ ‘పడగనీడ’ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమ్కెంది. ఆ తరువాత తనను నిరంతరం ఘర్షణకు లోనుచేస్తున్న అనేక సామాజిక సమస్యలపట్ల స్పందిస్తూ 13 కథలతో ‘మాయమ్మ రాచ్చసి’ అనే కథా సంపుటిని,అలాగే కర్నూలు జనజీవితాన్ని ప్రతిబింబించే 22 కథలతో ‘’ కందనవోలు కథలు ‘’ అనే కథా సంపుటాన్ని ప్రచురించారు. మతం గురించి మాట్లాడడానికి, విమర్శించడానికి అనేకులు జంకుతున్న తరుణంలో అన్ని మతాలలోని లోపాలను ఎత్తిచూపుతూ ‘నయాఫత్వా’, ‘మూడు అబద్దాలు’ అనే పుస్తకాలు ప్రచురించడం ద్వారా అనేక మంది సాహితీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.చదువరుల మనస్సులు అర్థ్రమయ్యేలా భర్తను కోల్పోయిన తన తల్లి చేసిన జీవిత పోరాటాన్ని, తన బాల్యాన్ని కలిపి కథలుగా మలచి ‘’నేనూ మా అమ్మ’’ అనే పుస్తకాన్ని హృద్యంగా రచించారు. కర్నూలు జిల్లాలో వుండే కథకుల్ని, వారి కథలను పరిచయం చేస్తూ ‘’కర్నూలు కథ’’ అనే బృహత్‌ సంకలనాన్ని సంపాదకుడిగా వెలువరించారు. బాలసాహిత్యంలో ఠింగురుబిళ్ళ, కిర్రుకిర్రులొడ్డప్పా, ఒకటితిందునా రెండుతిందునా, నక్కబావ - పిల్లిబావ, కుందేలు దెబ్బ, నల్లకుక్క, నలుగురు మూర్ఖులు, నాకుమూడు నీకురెండు ఇలా అనేక సంపుటాలు ప్రచురించారు. విశాఖపట్టణం జిల్లా పాడేరు ప్రాంతంలోని ఆదివాసీ భాష ‘కొండ’కు లిపిలేదు. ఆ భాషలోని జానపద కథలు కొన్ని సేకరించి ‘’బంగారు చేప - గంధర్వకన్య’’ పేరుతో మన తెలుగువారికి అందించారు.

2017 లో 121 జానపద కథలతో ‘’ కర్నూలు జిల్లా జానపద కథలు ‘’ అనే సంపుటాన్ని ప్రచురించారు. రాయలసీమ రచయిత్రుల కథలు, రాయలసీమ ప్రేమ కథలు, రాయలసీమ కరువు కథలు, రాయలసీమ హాస్య కథలు, రాయలసీమ వ్యంగ్య కథలు, రాయలసీమ ఉపాధ్యాయ కథలు, రాయలసీమ వృత్తి కథలు అనే సంకలనాలు ప్రచురించారు.

తెలుగు భాషలో అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతూ, చదవడం నేర్చుకుంటున్న చిన్నారులు గూడా పుస్తకాలు చదవాలనే తపనతో హరికిషన్‌ ఒత్తులులేని గేయాలు, సంయుక్త అక్షరాలు లేని కథలు, బొమ్మలతో సామెతలు, జానపద గేయాలు అత్యంత సరళమ్కెన భాషలో సృష్టించి ఒక కొత్త ఒరవడికి బాటలు వేశారు. రేపటి వెలుగులు, మెరుపుల వాన తెలుగుభాషలో వచ్చిన మొట్టమొదటి ఒత్తులులేని గేయాల పుస్తకాలు. తిక్క కుదిరిన నక్క, మూతిపగిలిన పిల్లి, పిండిబొమ్మ వీరుడు, కందిరీగ తేనెటీగ సంయుక్త అక్షరాలే లేకుండా రంగురంగు బొమ్మలతో ఆకర్షణీయంగా ప్రచురించారు. సంయుక్త అక్షరాలు లేకుండా తెలుగులో మొట్టమొదటిసారిగా ‘’మిన్ను‘’ అనే బాలల నవల రచించారు.

కర్నూలు జిల్లా చరిత్రను ఆదిమానవులు ఈ జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి 1956 లో ఆంధ్ర రాజధాని కర్నూలు నుండి హైదరాబాదుకు తరలిపోయేదాకా జరిగిన విషయాలన్నీ .... పిల్లల నుంచీ పెద్దలవరకు అందరికీ అర్థమయ్యే రీతిలో, అరుదైన 250 ఫొటోల సహాయంతో వివరించారు. అలాగే ఇంతవరకు వెలుగు చూడని కొండారెడ్డి బురుజు పాత ఫొటోలను సేకరిస్తూ కొండారెడ్డి బురుజు చరిత్ర వెలువరించారు. కర్నూలు జిల్లా మహనీయులు అనే పేరుతో 20 మంది మొదటితరానికి చెందిన గొప్పవారి ఫొటొలను చిత్రకారులతో వేయించి వారిని గురించి వివరిస్తూ పుస్తకాన్ని రూపొందించారు. ఇప్పటివరకు బాలసాహితీ రత్న (2011),అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023లను అందుకున్నారు.

Tags:    

Similar News

అవిటి నత్త