కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి, 27 మంది పర్యాటకుల మృతి

Update: 2025-04-22 17:43 GMT

కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ దాడిలో 27 మంది దాకా చనిపోయినట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారని సాక్షులు తెలిపారు. ఈదాడిలో అనేక మంది గాయపడ్డారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ భారత్ పర్యటనలో ఉన్నపుడు ఈ దాడి జరగడం ఆశ్చర్యం. 2019లో పుల్వామాలో  జరిగిన దాడిలో  47 మంది జవానులు చనిపోయారు. ఆ తర్వాత ఇంత పెద్ద టెర్రరిస్టు దాడి జరగలేదు. 

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ దాడిని ఖండించారు.



మిలటరీ డ్రెస్సు ధరించిన  టెర్రరిస్టులు బైస్‌రన్‌లోని పర్యాటకులపై కాల్పులు జరిపారు. పర్యాటకులు ముస్లింలా కాదా అని తెలుసుకుని మరీ కాల్చి చంపారు. దీనికోసం వారు పర్యాటకుల ఐడి కార్డులను కూడా పరిశీలించినట్లు తెలిసింది.

మృతి చెందిన వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారని సమాచారం. గాయపడిన వారిని హుటాహుటిని హెలికాప్టర్ ద్వారా పహల్గాం ఆసుపత్రికి తరలించారు. పహల్గావ్ హిల్ స్టేషన్‌కు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరాన్‌కు కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే వీలుంది.

గాయపడినవారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఉగ్రదాడిని ఖండించారు. తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనాస్థలాన్ని సందర్శించాలని కేంద్రమంత్రికి సూచించారు. దీంతో ఆయన శ్రీనగర్‌కు పయనమయ్యారు.

జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా రాంబన్‌ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని శ్రీనగర్‌కు చేరుకున్నారు. అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రదాడిని జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.  


హైదరాబాద్ వాసి మృతి

జమ్ము కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్‌ కి చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్ మృతి చెందారు.తన భార్య, ఇద్దరు పిల్లల ముందే  ఉగ్రవాదులు ఆయనను కాల్చి చంపినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఐబీ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న మనీష్ రంజన్ కాశ్మీర్ పర్యటన కోసం వెళ్లి తీవ్రవాదలు దాడికి బలయ్యారు. ఆయన బీహార్ కు చెందిన వాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ కు వచ్చారు.


ఆయన మృతి పట్ల తెలంగాణ రవాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిలో ఐబీ అధికారి మనీష్‌ రంజన్‌గా మృతి పై డీజీపీ జితేందర్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనీష్ రంజన్ మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి లో 20 మందికి పైగా మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందని ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

పర్యాటకుల కోసం హెల్ప్‌లైన్..

ఉగ్రవాద దాడి నేపథ్యంలో పర్యాటకుల వివరాలు తెలిపేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 24 గంటల అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. 01932222337, 7780885759, 9697982527 లేదా 6006365245 నంబర్లను సంప్రదించవచ్చు. పహల్గామ్ ఉగ్రవాద ఘటనలో క్షతగాత్రుల వివరాలు తెలుసుకునేందుకు 01942457543, 01942483651 లేదా 7006058623ను సంప్రదించవచ్చు.

"నా భర్త తలపై కాల్పులు జరిగాయి, మరో ఏడుగురు కూడా ఈ దాడిలో గాయపడ్డారు" అని ప్రాణాలతో బయటపడిన ఒక మహిళ ఫోన్ ద్వారా పిటిఐకి తెలిపింది.



'దాచుకోవడానికి చోటు లేదు'

కాల్పుల శబ్దాలు వినిపించడంతో..భయాందోళనలు పరుగులు తీశారు. విశాలమైన ప్రదేశం కావడంతో దాక్కోవడానికి స్థలం లేదని మరొక మహిళా పర్యాటకురాలు చెప్పారు.

ఇక దుండగులను వేటాడేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.

Tags:    

Similar News