‘80 శాతం ఉద్యోగులకు జీతాల పెంపు’
సెప్టెంబర్ 1 నుంచి ఇవ్వనున్న టీసీఎస్..;
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మధ్య, జూనియర్ స్థాయి ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి వేతనాలను పెంచుతున్నట్లు TCS CHRO మిలింద్ లక్కాడ్, CHRO K సుదీప్ ఉద్యోగులకు తెలిపారు. TCS ఈ సంవత్సరం దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్న తరుణంలో వేతనాలను పెంచుతోంది.
ఏప్రిల్ నుంచి ఉద్యోగుల తొలగింపు..
టీసీఎస్ 2026 ఏప్రిల్ నుంచి తమ ఉద్యోగుల సంఖ్యలో 2శాతం..అంటే 12వేల మందిని తొలగించబోతున్న విషయం తెలిసిందే. భారత్‌తో పాటు వివిధ దేశాల్లో ఉన్న బ్రాంచీల్లో మొత్తం 6.13 లక్షల మంది పనిచేస్తున్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ సంస్థను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ సీఈవో కె.కృతివాసన్ తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, మారుతున్న క్లయింట్ల డిమాండ్ల నేపథ్యంలో ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని పేర్కొ్న్నారు. అయితే లేఆఫ్ ఉద్యోగులకు ముందుగానే నోటీసులు ఇస్తున్నామని, వారికి బీమా పొడిగింపు, అవుట్ ప్లేస్‌మెంట్ సపోర్టు కూడా ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. కాగా TCS నిర్ణయాన్ని మిగతా ఐటీ సంస్థలు కూడా అనుసరించే అవకాశం ఉందని ఐటీ నిపుణులంటున్నారు.