హత్య చేసి ముప్పై మూడేళ్లుగా పరారీలో ఉన్నాడు.. చివరకు..
భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించిన నిందితుడిని పట్టుకున్న ముంబై పోలీసులు
By : The Federal
Update: 2024-12-24 07:01 GMT
తన భార్యను హత్య చేసి గత 33 ఏళ్లుగా పరారీలో ఉన్న 70 ఏళ్ల వ్యక్తిని నవీ ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. నిందితుడి పేరును ‘బాబు గుడ్గిరామ్ కాలే’ అని పోలీసులు తెలిపారు. ముంబైలోని ములుంద్ శివారు సమీపంలో ఆదివారం పట్టుకున్నామని, అతను కూలీగా పనిచేస్తూ జీవనోపాధి కోసం పూలు విక్రయిస్తున్నాడని సంబంధిత అధికారి తెలిపారు.
ఈ కేసు జనవరి 28, 1991 నాటిదని, కాలే తన భార్యతో తరచూ ఇంట్లో గొడవలు జరగడంతో, నవీ ముంబైలోని పన్వెల్ ప్రాంతంలోని తన ఇంట్లో కిరోసిన్ పోసి నిప్పంటించాడని పన్వెల్ టౌన్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ నితిన్ థాకరే తెలిపారు. తీవ్ర గాయాలపాలైన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.
కాలేపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 302 (హత్య) కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. స్థానిక కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని అధికారి తెలిపారు. అయితే కాలే పట్టుబడకుండా తప్పించుకుని మూడు దశాబ్దాలకు పైగా అజ్ఞాతంలో ఉన్నాడు.
పోలీసులు అనేకరోజులు దర్యాప్తు చేసిన బాబు జాడ దొరకలేదు. అయితే తరువాత పారిపోయిన వ్యక్తిని ట్రాక్ చేయడానికి ఇంటెలిజెన్స్ - సాంకేతిక ఇన్‌పుట్‌లను ఉపయోగించారు. చివరకు ముంబైలోని ములుంద్ ప్రాంతంలో అతని జాడలు పసిగట్టారు. మొదట బాబు గుడ్గిరామ్ కాలే మరట్వాడాలోని పర్భనీలో ఉన్నట్లు ఫోన్ డేటా ఆధారంగా గుర్తించారు. తరువాత ముంబైకి తిరిగి రాగా ఆదివారం పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
అతని అరెస్టు తరువాత, కాలేను స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి జనవరి 3, 2025 వరకు పోలీసు కస్టడీ విధించింది.