ఎన్ఐఏకు బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనను ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనుంది. అంతకుముందు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేశారు.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనను ఇక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేయనుంది. తొలుత బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తొలుత ఈ కేసు విచారణ చేపట్టారు. ప్రతిపక్ష బీజేపీ నాయకుల డిమాండ్‌తో కేసు ఎన్‌ఐఏకు అప్పగించారు.
తూర్పు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. టోపీ, ముసుగు, అద్దాలు ధరించిన వ్యక్తి కేఫ్ లో ప్రవేశించడాన్ని సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. అతనే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే అతని కోసం గాలిస్తున్నారు.
తొలుత ‘నో’ చెప్పిన సిద్ధరామయ్య..
కాగా ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు అప్పగించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ఎన్ఐఏకు అప్పగించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తున్నా.. తామే త్వరితగతిన ఛేదిస్తామని సిద్ధరామయ్య సర్కారు విశ్వాసం వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఆదివారం చిక్‌మగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఈ కేసును బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) దర్యాప్తు చేస్తోందని, అవసరమైతే ఎన్‌ఐఎకి బదిలీ చేస్తామని చెప్పారు. అదే సందర్భంలో బీజేపీకి చురకలు అంటించారు.
బీజేపీ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. “నేను బాంబు దాడిని ఖండిస్తున్నాను. చావు, బాధల విషయంలో బీజేపీ రాజకీయాలు చేయకూడదు' అని అన్నారు.
అయిష్టంగానే..
ఈ కేసును కేంద్ర ఏజెన్సీ ఎన్‌ఐఏకు అప్పగించేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ కేసు విషయంలో డిజిపి, ఐజిపి, ఎడిజిపి (లా అండ్ ఆర్డర్), రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులతో సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సిద్ధరామయ్య, హోంమంత్రి జి పరమేశ్వర శనివారం సమావేశమయ్యారు. కేసును రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో దర్యాప్తు చేయించాలని నిర్ణయించారు.
ఎన్‌ఐఏకు కేసు అప్పగిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి కథలు అల్లుతుందని అధికార పార్టీ ఆందోళన. బీజేపీ ఈ అంశాన్ని రాజకీయం చేసే అవకాశం కూడా ఉందని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సమస్యలపై కేంద్రంతో పోరాడుతున్న సమయంలో ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోననిపేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మంత్రి ది ఫెడరల్‌తో అన్నారు.
బాంబు పేలుళ్ల తీవ్రత దృష్ట్యా కేసును ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేయాలని ఇటు బీజేపీ ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ పట్టుబడుతున్నారు. పేలుడును 'ఉగ్రదాడి'గా పేర్కొంటూ.. అనుమానితులతో ఉగ్రవాదులతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు కోసం ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయాలని బీజేపీ కోరింది.