కాశ్మీర్ లో ఆకాశం బద్ధలైంది... 46 మంది మృతి

విషాదంగా మారిన హిమాలయ తీర్థయాత్ర;

Update: 2025-08-15 02:46 GMT
Photo/X@INCJAMMUKASHMIR

జమ్మూకశ్మీరులో మేఘవిస్ఫోటం (Cloud Burst) జరగడంతో అకస్మాత్తుగా భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. భారీ గా ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రాంతమంతా విషాదం ఆవరించింది. కిష్ట్వార్‌ (Kishtwar) జిల్లాలోని మారుమూల గ్రామం చోసితిలో గురువారం హఠాత్తుగా ఈ విపత్తు ఎదురయింది. హిమాలయాల్లోని మాచైల్‌ మాత ఆలయానికి వెళ్లే యాత్ర ఈగ్రామం నుంచే మొదలవుతుంది.అందుకే పెద్ద ఎత్తున యాత్రికులు ఇక్కడ గుమిగూడారు. అక్కడి నుంచి పుణ్యక్షేత్రానికి 8.5 కి.మీ. నడక ప్రారంభమవుతుంది. యాత్రికుల కోసం లంగర్‌ (సామూహిక వంటశాలలు) ఏర్పాటు చేస్తారు. భక్తులు ఇక్కడే వాహనాలు వదిలి, కాలినడకన మాచైల్‌ మాత గుడికి వెళ్తారు. భక్తులు టెంట్లు వేసుకుని బస చేస్తున్నారు. దుకాణాలు, వసతి సౌకర్యాలు, సెక్యూరిటీ అవుట్‌ పోస్టులు ఏర్పాటు చేశారు.



ఈ యాత్ర సంరంభం కొనసాగుతున్నపుడు ఆకాశం బ్రద్ధలయింది. మెరుపు వర్షాలు, వెన్వెంటనే వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెంతాయి. టెంట్లు, దుకాణాలు, సెక్యూరిటీ అవుట్ పోస్టులు కొట్టుకుపోయి. 46 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. శిథిలాలు, బురద కింద మరింత మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి 167 మందిని కాపాడారు. వారిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరొక 200 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తున్నది. మృతుల్లో ఇద్దరు సీఐఎస్ ఎఫ్ ఎఫ్‌ సిబ్బంది కూడా ఉన్నారు. ఘటనా స్థలంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, ఆర్మీ, స్థానిక వాలంటీర్లు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News