వివాదాస్పద ఎంపీలకు టికెట్ ఇవ్వని డీఎంకే.. ఆ జాబితాలో ఉన్నవారెవరు?

ఎంపీ టికెట్ ఆశించిన వారికి భంగపాటు తప్పడం లేదు. అందుకు కారణం గతంలో వారు చేసిన వ్యాఖ్యలే. అలాంటి వారిని ఈ సారి పోటీకి దూరం పెట్టింది డీఎంకే..

Update: 2024-03-21 07:43 GMT

ఈ సారి లోక్‌సభ ఎన్నికలకు ఆరుగురు సిట్టింగ్ ఎంపీలను దూరం పెట్టింది డీఎంకే. వీరిలో ధర్మపురి ఎంపీ, ఎస్ సెంథిల్‌కుమార్ ఒకరు. ఈయన గతంలో పార్లమెంట్‌లో "గౌమూత్ర రాజ్యాలు" అని వ్యాఖ్యానించి అపఖ్యాతి పాలయ్యారు.

అసలు సెంథిల్ ఏమని మాట్లాడారు..

బీజేపీ కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మాత్రమే గెలవగలదని.. వాటిని గోమూత్ర (ఆవు మూత్రం) రాష్ట్రాలతో పోల్చారు సేంథిల్. పార్లమెంటులో జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో (డిసెంబర్ 5, 2023) ఈ వ్యాఖ్యలు చేశారు. "మీరు (బిజెపి) దక్షిణ భారతదేశానికి రాలేరు" అని కూడా అనడంతో బీజేపీ ఆ వ్యాఖ్యలను ఖండించింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా మందలించడంతో సెంథిల్ తరువాత క్షమాపణ చెప్పారు.

మరో సందర్భంలో..

స్థానిక ప్రాజెక్ట్ కోసం 2022లో జరిగిన ఒక వేడుకలో పాల్గొన్న సెంథిల్.. క్రిస్టియన్, ముస్లిం మతగురువులు ఎందుకు హాజరు కాలేదో, హిందూ ఆచారాలను మాత్రమే ఎందుకు నిర్వహించాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.

మిగతా ఐదుగురు ఎంపీలెవరు?

డిఎంకె తిరిగి నామినేట్ చేయని మరో ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు.. 1.ఎస్ఆర్ పార్థిబన్ (సేలం), 2.ధనుష్ ఎం కుమార్ (తెన్కాసి), 3.కె షణ్ముగ సుందరం (పొల్లాచ్చి), 4. ఎస్ఎస్ పళనిమాణికం (తంజావూరు). 5. గౌతమ్ సిగమణి (కల్లకురిచ్చి). గౌతమ్ సిగమణి మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నాయకుడు కె పొన్ముడి కుమారుడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పొన్ముడిని మద్రాసు హైకోర్టు గతేడాది డిసెంబర్‌లో దోషిగా తేల్చింది. ఆ తర్వాత శిక్షను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సలహా మేరకు పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి నిరాకరించారనే వ్యాజ్యం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

శ్రేయోభిలాషులకు సెంథిల్ కృతజ్ఞతలు..

సెంథిల్‌కుమార్ తన శ్రేయోభిలాషులకు ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లుగా ధర్మపురి లోక్‌సభ నియోజకవర్గం ప్రజల కోసం పని చేశానని, అనేక పథకాలను తీసుకువచ్చినందుకు సంతృప్తిని ఉందని పేర్కొన్నారు. ధర్మపురి స్థానానికి డీఎంకే అభ్యర్థిగా పోటీచేస్తున్న న్యాయవాది ఎ మణికి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ‘‘ఇంత గొప్ప కల్తీ లేని ప్రేమను అందుకోవడానికి నేనేం చేసాను. నేను సంప్రదాయేతర రాజకీయ నాయకుడిని కావడం తప్ప. నేను దీన్ని ఎలా తీర్చుకోగలను...." అని రాసుకోచ్చారు సెంథిల్ కుమార్. 

Tags:    

Similar News