జస్టిస్ చంద్రచూడ్ తీరును జస్టిస్ చలమేశ్వర్ ఎందుకు తప్పుబట్టారు?

మాజీ సీజేఐ చంద్రచూడ్ ప్రధాని మోదీతో కలిసి ప్రార్థనలు చేయడం సరైనదేనా అని ప్రశ్నించగా, స్వాతంత్య్రానంతర చరిత్రలో ఓ అసాధారణ చర్య అని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు.

Update: 2024-12-04 12:39 GMT

(రంజిత్ భూషణ్)

ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ తప్పుబట్టారు. "ఏదైనా నిర్ణయాన్ని లేదా తీర్పును రద్దు చేసే హక్కు సుప్రీం కోర్టుకు ఉంది, అయితే పాత నిర్ణయాన్ని రద్దు చేయడానికి స్పష్టమైన కారణం, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది" అని ఆయన ఫెడరల్‌తో చెప్పాడు.
1947 ఆగస్టు 15నాటికి ఉన్న మతపరమైన స్థలాల క్యారెక్టర్ ను (స్వభావాన్ని) మార్చడాన్ని నిషేధించే 1991 నాటి ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టంపై సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని ఆకస్మాత్తుగా మార్చుకుందని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. ఇంతకు ముందు నుంచి అమల్లో ఉన్న నిబంధనలను మార్చేటపుడు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం వినాల్సి ఉందన్నారు. "దురదృష్టవశాత్తూ, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇటువంటి విషయాలపై తీర్పులు చెప్పే ధోరణి అనారోగ్యకరమైందన్నారు. ఇటువంటి ధోరణి ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు. "ఇటువంటి సమస్యలకు ప్రాముఖ్యత ఉన్నందున పూర్తిస్థాయి బెంచ్ పరిశీలించాలి" అన్నారు.

2022 మే 20న వారణాసిలోని జ్ఞానవ్యాపి మసీదుకు సంబంధించిన వివాదాన్ని విచారిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు కొన్ని మోఖిక వ్యాఖ్యలు చేసింది. ప్రార్థనా స్థలాల మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడం ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం నిరోధించబడదని పేర్కొంది. 2023 జూలై లో ఆ చట్టం చెల్లుబాటుపై కేసును వాయిదా వేసింది. కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయడానికి 2023 అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చింది. చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తన వైఖరేమిటో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
సుప్రీం కోర్టు వైఖరిలో మార్పును పరిగణనలోకి తీసుకుంటూ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని న్యాయస్థానాలు మసీదులు, ఇతర మతపరమైన ప్రార్థనా స్థలాలను సమీక్షించాలని కోరుతున్నాయి.
ఈనేపథ్యంలో, 1991 ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గత వారం ఇద్దరు కాంగ్రెస్ పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 1991 చట్టానికి విరుద్ధంగా మతపరమైన నిర్మాణాలు లేదా మసీదుల సర్వేలు చేయకుండా చూడాలని, కోర్టులు ఇచ్చే ఉత్తర్వులను రాష్ట్రాలు అమలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఇటీవల, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదుపై సర్వేకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడానికి ఓ బృందం వెళ్లినపుడు రెండు వర్గాల ప్రజలు ఘర్షణకు దిగారు. ఇందులో నలుగురు మరణించారు. పురాతన హరిహర మందిరం స్థలంలో 16వ శతాబ్దపు మసీదును నిర్మించారని, హరిహర మందిరాన్ని 1529లో మొఘల్ పాలకుడు బాబర్ కూలగొట్టారని వేసిన పిటిషన్ల ఆధారంగా సంభాల్ కోర్టు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది. దీన్ని ముస్లిం మతస్తులు వ్యతిరేకించారు. దీనిపై నిరసనకు దిగారు.
అజ్మీర్‌లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాను ప్రతిరోజూ వేలాది మంది సందర్శిస్తుంటారు. ఆ దర్గాను దేవాలయంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్థానిక కోర్టు దర్గా కమిటీకి, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు శాఖకు నోటీసులు జారీ చేసింది.
ఆనాటి జాతీయ భావాలకు అత్యున్నత న్యాయస్థానం అతీతం కాదా అని అడిగిన ప్రశ్నకు జస్టిస్ చలమేశ్వర్ నేరుగా సూటిగా జవాబు చెప్పకుండా.. "దేశంలో సోషలిస్టు స్ఫూర్తి ఉన్న 1967లో గోలక్‌నాథ్ కేసు ఒక మైలురాయిగా ప్రశంసలు పొందింది. కానీ కేశవానంద భారతి కేసులో వెలువడిన తీర్పుతో అది మారిపోయింది" అన్నారు.
అయితే, చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేసే భరతభూమిలో- ప్రార్థనా స్థలాల చట్టం -సమస్య మున్ముందు ఎలా రూపుదిద్దుకుంటుందో చూడడానికి మరింత సమయం అవసరమని ఆయన అన్నారు.
గోలక్‌నాథ్ కేసు (1967), కేశవానంద భారతి కేసు (1973) మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, గోలక్‌నాథ్ కేసు ప్రాథమిక హక్కులకు సంబంధించింది. పార్లమెంటు ప్రాధమిక హక్కులను సవరించలేదన్నది గోలక్ నాథ్ కేసులో తీర్పు కాగా కేశవానంద భారతి కేసు రాజ్యాంగ సవరణకు సంబంధించింది. పార్లమెంటు - రాజ్యాంగాన్ని సవరించగలదు కానీ దాని ప్రాథమిక నిర్మాణాన్ని కాదన్నది కేశవానంద భారతి కేసు తీర్పు.
అయోధ్యలో బాబ్రీ మసీదు వ్యవహారం రగులుతున్న సమయంలో 1991లో పీవీ నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో ప్రార్థనా మందిరాల చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది.
2019 నవంబర్ లో సుప్రీంకోర్టు- అయోధ్య తీర్పు రాజ్యాంగంలోని ప్రాథమిక విలువలను పరిరక్షిస్తుందని పేర్కొంటూ 1991 చట్టాన్ని సమర్థించింది. అంతేకాకుండా 1047 ఆగస్ట్ 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాల మతపరమైన స్వభావాన్ని చట్టం పరిరక్షిస్తుందని కూడా పేర్కొంది.
మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రార్థనలు చేయడం సరైనదేనా అని ప్రశ్నించగా, స్వాతంత్య్రానంతర చరిత్రలో ఓ అసాధారణ చర్య అని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..“సీజేఐ తన ఇంట్లో ఎవరితో కలిసి ప్రార్థనలు చేసుకున్నారు, ఎవర్ని తన ఇంటికి ఆహ్వానించారు అన్నది ఆయన వ్యక్తిగతం. అది తప్పు కూడా కాదు, కానీ ఈ చిత్రాలను పబ్లిక్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేయకూడని పనే” అన్నారు.
జాస్తి చలమేశ్వర్ 2018 జూన్ లో సుప్రీంకోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 2010 నుంచి 2011 వరకు కేరళ హైకోర్టు, 2007 నుండి 2010 వరకు గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు.
Tags:    

Similar News