హజ్ యాత్రకు వెళ్తున్నారా.. అయితే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..

హజ్ యాత్ర 2024 ను పురస్కరించుకుని ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు.

Update: 2024-03-04 07:55 GMT

 కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ ఆదివారం హజ్ సువిధ యాప్‌ (Haj Suvidha App)ను ఆవిష్కరించారు. ఇందులో హాజ్ యాత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపర్చారు. డిజిటల్, మొబైల్ టెక్నాలజీ ఉపయోగించి యాత్రికులకు అవసరమైన విమాన వివరాలు, వసతి, అత్యవసర హెల్ప్‌లైన్ తదితర వివరాలను ఇందులో పొందుపరిచారు.


హజ్ యాత్ర 2024 ను పురస్కరించుకుని ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇరానీ ప్రారంభించారు. మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జాన్ బార్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 550 మంది శిక్షకులు హాజరయ్యారు.

హజ్‌యాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ అనుభూతి అని పేర్కొంటూ.. యాత్రికులందరికి హజ్ సువిధ యాప్‌ను ఎంతో ఉపయోగపడుతుందని ఇరానీ చెప్పారు. యాత్రికులు తమ ప్రయాణంలో ఎదురయ్యే సాధారణ సమస్యలకు యాప్ పరిష్కారం చూపుతుందన్నారు.

తీర్థయాత్రలోని వివిధ అంశాలపై యాత్రికులకు అవగాహన కల్పించడానికి సిద్ధం చేసిన హజ్ గైడ్-2024ను కూడా ఇరానీ విడుదల చేశారు. ఈ గైడ్‌ను 10 భాషలలో ముద్రించారు.

ప్రతి హజ్ యాత్రికుడు సురక్షితంగా, సౌకర్యవంతంగా యాత్ర చేసి రావడానికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని ఇరానీ శిక్షకులకు సూచించారు. గతంలో ఒక శిక్షకుడు 300 మంది యాత్రికులకు శిక్షణ ఇచ్చేవాడని, ఇప్పుడు 150 మంది యాత్రికులకు ఒక శిక్షకుడిని కేటాయించామని చెప్పారు.  

Tags:    

Similar News