కరోనా గుబులు మళ్లీ మొదలైందా?

కరోనా తిరిగి వచ్చిందా? కోవిడ్ కొత్త సబ్‌వేరియంట్ ఏమిటి? కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలేంటి?

Update: 2023-12-30 03:18 GMT
Pic credit: Yale Medicine

కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ JN.1 దీని కారణంగా దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4వేలకు మించింది.

WHO ఏం చెబుతోంది..

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించింది. లక్షణాలుంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. కోవిడ్ నిర్దారణ అయిన వారు ఐసోలేషన్‌లో ఉండాలి అని పేర్కొంది.

రాష్ట్రాలకు లేఖ..

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ గత వారం లేఖ రాశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు. ‘‘న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రాలు ప్రజారోగ్య చర్యలను చేపట్టాలి’’ అని కోరారు.

NITI ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ VK పాల్ కొత్త వేరియంట్‌పై మాట్లాడారు. కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచాలని, టెస్ట్, ట్రేస్ విధానాన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కోరారు.

AIIMS ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇలా అన్నారు. " శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు అధికం. ఇన్‌ఫ్లుఎంజా, కోవిడ్, ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్లను ఏటా చూస్తాము. ఉష్ణోగ్రతలో తగ్గుదల, రద్దీ కారణంగా కోవిడ్ వ్యాప్తికి కారణాలు. సెలవుదినాల్లో ప్రజలు వివిధ ప్రాంతాలకు, సొంత ఊర్లకు వెళ్తుంటారు. వారు తమతో వైరస్‌ను తీసుకువెళతారు. చలి కారణంగా ఇంట్లోనే ఎక్కువ మంది ఒకే చోట ఉంటారు. వారు దగ్గినా, తుమ్మినా వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, మాస్కులు ధరించడం అలవరుచుకోవాలి. ఫలితంగా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు.’’ అని తెలిపారు.

కేరళలో తొలిసారిగా..

కేరళలో కరోనావైరస్ కొత్త సబ్ వేరియంట్ (జేఎన్1) వెలుగు చూసింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని, వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో కోవిడ్ నివారణకు

గతంలో తీసుకున్న జాగ్రత్తలను మరోసారి పాటించాలని మార్గదర్శకాలు జారీచేసింది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కొత్త కేసులపై నిఘా ఉంచాలని, కోవిడ్‌ బాధితులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన అన్నిరకాల వ్యాక్సిన్‌లు వాడొచ్చని తెలిపింది.

‘‘గడిచిన కొన్నివారాలుగా కేరళలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా తరహా లక్షణాలతో బాధపడుతున్నవారికి పరీక్షలు చేయగా ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇంతకుముందు ఈ వేరియంట్‌ను అమెరికా, చైనా సహా చాలా దేశాలలో కనుగొన్నారు.’’ అని భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ రాజీవ్ భల్ చెప్పారు.

కేరళలో నలుగురు మృత్యువాత..

కేరళలో ప్రస్తుతం 1,324కు పైగా కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నలుగురు మరణించారు. పరీక్షలు ఎక్కువగా చేస్తుండటం వల్ల కేసులు బయటకు వస్తున్నాయని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. కొన్ని నెలల కిందట సింగపూర్ విమానాశ్రయంలో జరిపిన స్క్రీనింగ్ లో కొంత మంది భారతీయులలో ఈ వేరియంట్ ఉన్నట్టు బయటపడిందని ఆమె తెలిపారు.

Tags:    

Similar News