‘ఓట్ ఫ్రమ్ హోమ్’కు ఎలా అప్లై చేయాలంటే!

లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా వృద్ధులు, వికలాంగులకు ‘ఓట్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దానికి ఎలా అప్లై చేసుకోవాలంటే..

Update: 2024-03-22 02:20 GMT
Source: Twitter


ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నాలు చేస్తుంటుంది. అందుకోసం అనేక కొత్త కొత్త మార్గాలను కూడా ఆలోచిస్తుంటుంది. ఇందులో భాగంగానే పోలింగ్ స్టేషన్‌కు రాలేని వృద్ధుల ఓట్లను వృధా కానివ్వకూడదని ఈసీఐ నిర్ణయించుకుంది. అందుకోసమే ‘ఓట్ ఫ్రమ్ హోమ్’ను పరిచయం చేసింది. ఈ ‘ఓట్ ఫ్రమ్ హోం’ వెసులుబాటు కొత్తది కాకపోయినా ఈసారి జరగనున్న ఎన్నికల్లో దీనిని ఎన్నికల సంఘం విస్తృతంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా పోలింగ్ సెంటర్లకు రాలేని, లైన్లలో నిల్చోలేని వృద్ధులు తమ ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. కేవలం వృద్ధులే కాదు అంగవైకల్యం ఉన్న వారు కూడా ‘ఓట్ ఫ్రమ్ హోమ్’ను వినియోగించుకోవచ్చు. తద్వారా వారు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగలుగుతారు.
వారే అర్హులు
‘ఓట్ ఫ్రమ్ హోమ్’కు 85 ఏళ్ల వయసు పైబడిన వారు, 40 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు అర్హులు. వారు ఈ కార్యక్రమం ద్వారా ఇంటి నుంచే తమ ఓటను తమకు నచ్చిన నేతకు వేయొచ్చు. పోలింగ్ సిబ్బంది సదరు ఓటర్ ఇంటి వద్దకు వచ్చి ఆ వ్యక్తి చేత ఓటు వేయించుకుంటారు. ఈ కార్యక్రమంలో ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూసుకోవడానికి ఒక కంపార్ట్‌మెంట్‌తో పాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను కూడా తెస్తారు. అంటే ఇంటి నుంచే ఓటు వేసిన ఓటరు ఎవరికి ఓటు వేశారు అన్న విషయం ఓటరుకు తప్ప మరెవరికీ తెలియదు.

ఎలా అప్లై చేసుకోవాలంటే
‘ఓట్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటును వినియోగించుకోవాలని భావించే వృద్ధులు, వికలాంగులు నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల్లో ఈ వెసులుబాటుకు దరఖాస్తు చేసుకోవాలి. అందుకోసం సదరు ఓటరు ఫార్మ్ 12డీని నింపాలి. ఈ దరఖాస్తులో ఓటరు తన పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు‌ను పొందుపరచాలి. ఈ దరఖాస్తును ఓటర్లు ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత అందులో వివరాలను నింపి రిటర్నింగ్ అధికారికి లేదా సహాయక రిటర్నింగ్ అధికారికి అందించాలి.
ఓటర్ల దరఖాస్తులు అందుకున్న తర్వాత సంబంధిత దరఖాస్తుదారుల ఇళ్లకు అధికారులు వెళ్లి సదరు వ్యక్తికి ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించాలా వద్దా అని నిర్ధారిస్తారు. వారు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దరఖాస్తును రిటర్నింగ్ అధికారికి అందిస్తారు. వారి దరఖాస్తును అంగీకరిస్తే పోలింగ్ అధికారులు దరఖాస్తుదారుల ఇంటి దగ్గరకు వచ్చి ఓటు వేయించుకుంటారు. ఇందులో కూడా ఓటరు ఎవరికి ఓటు వేస్తున్నారో ఎవరికీ తెలియకుండా చర్యలు తీసుకుంటారు.
1.73 కోట్ల మందికి అవకాశం
దేశంలో ప్రస్తుతం 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు 88.4 లక్షల మంది ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన వారు 82 లక్షల మంది ఉన్నారు. వయసు వంద సంవత్సరాలు దాటిన వారు 2.18 లక్షల మంది ఉన్నారు. వీరంతా మొత్తం 1.73 కోట్ల మంది ఉన్నారు. వారందరూ ఈసారి ఎన్నికల్లో ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని, ఒక్క ఓటును కూడా వృధా కానివ్వకుండా చర్యలు చేపడుతున్నామని ఎన్నికల అధికారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా 85 ఏళ్ల లోపు వృద్ధులు, 40 శాతం కన్నా తక్కువ వైకల్యం ఉన్న వారికి పోలింగ్ కేంద్రాల దగ్గర అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం తొలిసారి కరోనా సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించింది. ‘‘స్వాతంత్య్ర ఉద్యమాన్ని చూసిన 80 ఏళ్లు పైబడిన వారు ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వారు యువతకు ఆదర్శం కావాలి. కానీ వారు మరొకరి సహాయం లేనిదే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని పరిస్థితి. అందుకే వారి కోసం ‘ఓట్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటును కల్పిస్తున్నాం’’అని ఎన్నికల అధికారి వెల్లడించారు.


Tags:    

Similar News