పరువు హత్య నిందితులకు జీవిత ఖైదు సబబే: సుప్రీంకోర్టు
2003 లో అందరూ చూస్తుండగా హత్యకు పాల్పడిన అమ్మాయి తరఫు బంధువులు;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-28 11:39 GMT
(మూలం..ప్రమీలా కృష్ణన్)
తమిళనాడులో సంచలనం సృష్టించిన కన్నగి- మురుగేశన్ పరువు హత్య కేసులో పది మంది దోషులకు మద్రాస్ హైకోర్టు విధించిన జీవిత ఖైదును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. ఈకేసులో దంపతులకు బలవంతంగా విషం పెట్టి చంపి బంధువులు దహనం చేశారు.
మద్రాస్ హైకోర్టు ఆ మహిళ సోదరుడు మరుతుపాండికి ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. మరో ఇద్దరిని అన్ని ఆరోపణల నుంచి నిర్ధోషులుగా విడుదల చేసింది.
తొమ్మిదిమంది దోషుల శిక్ష, జీవిత ఖైదులను సమర్థించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం.. ఆ జంటను బలవంతంగా ప్రజల సమక్షంలోనే విష ప్రయోగం చేసి, వారి మృతదేహాలను గ్రామంలోని శ్మశాన వాటికలో దహనం చేశారు. ఆ మరణాలను ఆత్మహత్యలుగా చిత్రీకరించారు. ఈ సంఘటన 2003లో జరిగింది.
నేరారోపణలు..
కులాంతర దంపతులైన మురుగేశన్ అనే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. కన్నగి అమ్మాయి వన్నియార్ వర్గానికి చెందిన వారిని కన్నగి సోదరుడు, ఆమె బంధువులు దారుణంగా హత్య చేశారు. మురుగేశన్ తండ్రి ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు దర్యాప్తును పక్కదోవపట్టించారు.
అనేక నిరసనల తరువాత మురుగేశన్ తండ్రి అభ్యర్థన మేరకు సీబీఐకి కేసు బదిలీ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ 2009 లో కేసు తుది నివేదికను అప్పగించింది.
కేసును లోతుగా దర్యాప్తు చేసిన సీబీఐ ఈ నేరంలో 15 మంది కీలకంగా వ్యవహరించారని అభియోగాలు మోపింది. ఈ కేసును కడలూర్ లోని ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారించింది.
15 మంది నిందితుల్లో 13 మందిని దోషులుగా తేల్చింది. ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది. కన్నగి సోదరుడు మరుతుపాండికి మరణ శిక్ష, మిగిలిన 12 మందికి జీవిత ఖైదు విధించారు.
ఆ తరువాత దోషులు ఈ తీర్పుపై మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. మరుతుపాండికి మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. కన్నగి తండ్రితో సహ మరో తొమ్మిది మంది జీవిత ఖైదులను సమర్థించింది. ఇప్పుడు ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా గట్టిగా సమర్థించింది.
ఆశా కిరణం..
తమిళనాడులో పరువు హత్యలకు వ్యతిరేకంగా గళం వినిపించే ఎవిడెన్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ. కతిర్ ది ఫెడరల్ తో మాట్లాడారు. కన్నగి - మురుగేషన్ కేసులో తీర్పు ఆలస్యమయినప్పటికీ ఆశను కలిగించిందని అన్నారు.
‘‘తమిళనాడులో ప్రతి సంవత్సరం ఎనిమిది నుంచి పది వరకూ కుల ఆధారిత హత్యలు జరుగుతున్నాయి. కానీ ఈ సమస్యను పరిష్కరించడంలో రాజకీయ నాయకులు, అధికారులు తగినంత చొరవచూపడం లేదు.
లోక్ సభలో పరువు హత్యల గురించి ప్రశ్నలు లెవనెత్తినప్పుడూ వచ్చిన డేటా ప్రకారం.. 2017 -2021 మధ్య కేవలం మూడు హత్యలు మాత్రమే జరిగాయి. వాస్తవానికి ఈ సమయంలో దాదాపు 10 నుంచి 12 వరకు జరిగాయి.
మన సమాజం పరువు హత్యలను నేరంగా కాకుండా గర్వంగా పరిగణించడం దిగ్భ్రాంతికరం’’ అని కతిర్ ఫెడరల్ తో అన్నారు. కన్నగి సోదరుడికి జీవిత ఖైదు కూడా విధించడాన్ని ఆయన సమర్థించారు.
పోలీసులపై అభియోగాలు..
‘‘ ఈ కేసులో సరైన రీతిలో దర్యాప్తు చేయనందుకు పోలీసులను కూడా కోర్టు దోషులుగా నిర్దారించినందుకు మనం అభినందించాలి. పరువు హత్యలను జాగ్రత్తగా దర్యాప్తు చేయాలని ఈ విషయం ఒక ఉదాహారణగా నిలుస్తుంది’’ అని ఆయన అన్నారు.
కన్నగి- మురుగేషన్ తీర్పును చాలా మహిళా హక్కుల సంస్థలు స్వాగతించాయి. హత్యకు దర్యాప్తులో వైఫల్యానికి వ్యతిరేకంగా అనేక నిరసనలు నిర్వహించిన సీపీఐ(ఎం) మహిళా విభాగం ఐద్వాకు చెందిన పి. సుగంధి మాట్లాడుడారు.
చట్ట అమలు సంస్థలకు శిక్షణ లేకపోవడంతో పాటు పరువు హత్య కేసులను దర్యాప్తు చేస్తున్నప్పుడూ వారి కులతత్వ మనస్తత్వాన్ని కూడా వదులుకోలేకపోతున్నాయని అన్నారు.
‘‘మురుగేశన్- కన్నగి 2003 లో కులాంతర వివాహం చేసుకున్న కారణంగా హత్యకు గురయ్యారు. మురుగేశన్ ఒక కెమికల్ ఇంజనీర్, కన్నగి బీకాం చదివింది. కానీ వివాహం తరువాత వారి చెవుల్లో ముక్కుల్లో విషం పోసి దారుణంగా చంపారు.
తరువాత వారి శరీరాలను దహనం చేశారు. ఈ సంఘటన పూర్తిగా ప్రజల సమక్షంలో జరిగింది. కానీ స్థానిక పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయడంలో విఫలమయ్యారు.
పరువు హత్యకు మద్దతు ఇచ్చారు. స్థానిక పోలీసుల దర్యాప్తును వ్యతిరేకిస్తూ అనేక సంస్థలు నిరసన వ్యక్తం చేశారు. తరువాత సీబీఐకి కేసును బదిలీ చేశారు.లేకపోతే కేసు బయటకు వచ్చేది కాదు’’ అని సుగంధి అన్నారు.