కంగనా రనౌత్‌పై అభ్యంతరకర పోస్టు - ఈసీకి ఫిర్యాదుచేసిన ఎన్‌సీడబ్ల్యూ
ప్రముఖ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై జాతీయ మహిళా కమిషన్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ప్రముఖ నటి కంగనా రనౌత్ మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఆమెపై కాంగ్రెస్ నేతలు సుప్రియా శ్రీనెత్, హెచ్‌ఎస్ అహిర్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
మహిళల గౌరవానికి భంగం..
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఇలా స్పందించారు. ‘‘సుప్రియ శ్రీనెట్ పోస్టు చూశాక.. ఆమె ప్రవర్తనతో దిగ్భ్రాంతి చెందాను. మహిళల పట్ల ఈ తరహా ప్రవర్తన క్షమించరానిది. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తుంది. సుప్రియ శ్రీనెట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
రనౌత్ కూడా..
సోషల్ మీడియాలో వైరలవుతున్న పోస్టుపై రనౌత్ స్పందించి ఇలా పోస్టు చేశారు. ‘‘క్వీన్‌లో అమాయక పాత్ర నుంచి తలైవిలో పవర్‌ఫుల్ మహిళా నేత వరకు, మణికర్ణకలో దేవత పాత్ర నుంచి చంద్రముఖిలో దెయ్యం పాత్ర వరకు.. 20 ఏళ్ల తన సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రల్లో నటించా’’నని తెలిపారు. మహిళలను దురాభిమానపు సంకెళ్ల నుంచి కాపాడుకోవాలని, సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ ఇతరులను దూషించడం మానుకోవాలని కంగనా కోరారు. ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలని తెలిపారు.
శ్రీనెట్ స్పందనేంటి?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుపై శ్రీనెట్ కూడా స్పందించారు. వాస్తవానికి దాన్ని నేను పోస్టు చేయలేదని చెప్పుకొచ్చారు. తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లపై చాలా మందికి యాక్సెసబిలిటీ ఉందని, ఎవరో పోస్టు చేసి ఉంటారని చెప్పారు. “తెలిసిన వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసాను. నేను ఏ స్త్రీ పట్ల వ్యక్తిగత ,అసభ్యకర వ్యాఖ్యలు చేయనని నాకు తెలిసిన వారందరికి బాగా తెలుసు. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను" అని చెప్పారు. అహిర్ కూడా ఇదే తరహా వివరణ ఇచ్చాడు. పోస్ట్‌ను తొలగించినట్లు చెప్పాడు.