ప్రపంచంపై ఆధిపత్యం మా లక్ష్యం కాదు: నిర్మలా సీతారామన్
ప్రపంచంలో నేడు ఏ దేశం కూడా భారత్ ను విస్మరించలేని స్థితికి చేరిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
By : The Federal
Update: 2024-10-24 10:32 GMT
భారత్ విశ్వ యవనికపై తన ప్రాభావాన్ని మాత్రమే పెంచుకుంటోందని, ఆధిపత్యాన్ని ప్రదర్శించట్లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నేడు ప్రపంచంలో అమెరికా, చైనా సహ ఏ దేశం భారత్ ను విస్మరించలేని స్థితికి చేరిందని అన్నారు. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ ఇక్కడ నిర్వహించిన “బ్రెట్టన్ వుడ్స్ ఎట్ 80: ప్రయారిటీస్ ఫర్ ది నెక్స్ట్ డికేడ్” అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"భారతదేశ ప్రాధాన్యత దాని ఆధిపత్యాన్ని విధించడం కాదు, ప్రపంచంలో మనకు ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్యం, అత్యధిక జనాభా ఉంది. ఇప్పుడు దాని ప్రభావాన్ని పెంచడం మా లక్ష్యం " అని ఆమె అన్నారు.
ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడని ఆమె చెప్పారు, "మీరు మా ఆర్థిక వ్యవస్థను, అది అభివృద్ధి చెందుతున్న విధానాన్ని విస్మరించలేరు." అభివృద్ధి చెందిన దేశాలు వస్త్రాలు, సైకిళ్లు, బైక్‌లు మొదలైన వాటిని ఉత్పత్తి చేసినట్లుగానే భారత్ కూడా అదే దారిలోనే ఉందన్నారు.
"మీరు నిజంగా న్యూఢిల్లీని విస్మరించలేరు. అలాగే, మనకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా, మన పక్కనే ఉన్న చైనా మమ్మల్ని విస్మరించలేవు” అని ఆమె అన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ "బహుపాక్షిక సంస్థలకు అనుకూలంగా ఉంటుంది". "వ్యూహాత్మక - శాంతియుత బహుపాక్షికత" విధానాలను అనుసరిస్తుందని ఆమె అన్నారు. బహుళ జాతి సంస్థలు ప్రపంచం కోసం తమ శక్తిని, సంస్థలను మరింత బలోపేతం చేయాలని కోరారు. భారత్ ఇలాంటి చర్యలకు అనుకూలంగా ఉన్నామని చెప్పారు.
"భారత్ అంతర్జాతీయ సౌర కూటమి, జీవ ఇంధన కూటమిలో చురుకుగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. మేము విపత్తు-తట్టుకునే మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతున్నాము. వీటన్నింటికీ డబ్బు అవసరం. వీటన్నింటికీ చిన్న ఆర్థిక వ్యవస్థలు, ద్వీప ఆర్థిక వ్యవస్థలు, అవసరమైన దేశాలకు సహాయం కావాలి ” అన్నారు. నిధుల కోసం పబ్లిక్ ఇష్యూల నుంచి నిధులు సేకరిస్తున్నామని, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలను వ్యాప్తి చేస్తున్నాం. ఇవి దేశానికి ఉపయోగపడే రంగాలని ఆర్థికమంత్రి అన్నారు.