స్టాక్ మార్కెట్: ప్రారంభ ట్రేడింగ్ అదుర్స్
అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం కనిపించడంతో దేశ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులను నెలకొల్పుతూనే ఉన్నాయి. అలాగే రేటింగ్ సంస్థ ఫిచ్ కూడా దేశ వృద్ధి రేటును..
By : The Federal
Update: 2024-06-19 09:45 GMT
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల ధోరణులు, బ్యాంక్ స్టాక్ కొనుగోళ్లలో దూకుడు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల వరద పారడంతో భారత స్ఠాక్ మార్కెట్లు బుధవారం ఆల్ టైం హై కి చేరుకున్నాయి. ప్రారంభ ట్రేడ్ లో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు, సెన్సెక్స్, నిప్టీ కొత్త జీవితకాల శిఖరాలను నమోదు చేశాయి.
ఐదవ వరుస సెషన్ లో కొనసాగుతున్న ర్యాలీని కంటిన్యూ చేస్తూ, బిఎస్‌ఇ సెన్సెక్స్ 280.32 పాయింట్లు ఎగబాకి, ప్రారంభ ట్రేడ్‌లో తాజా జీవితకాల గరిష్ట స్థాయి 77,581.46ను తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 72.95 పాయింట్లు పెరిగి 23,630.85 వద్ద సరికొత్త రికార్డుని నెలకొల్పింది.
30 సెన్సెక్స్ కంపెనీలలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అత్యధికంగా లాభపడ్డాయి.అయితే టైటాన్, ఎన్‌టిపిసి, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ షేర్ ర్యాలీలో వెనకబడి ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో హాంకాంగ్ అధికంగా ట్రేడవుతుండగా, షాంఘై తక్కువగా కోట్ చేసింది. మంగళవారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మంగళవారం రూ. 2,569.40 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం తెలుస్తోంది.గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.01 శాతం పెరిగి 85.34 డాలర్లకు చేరుకుంది.
వినియోగదారుల వ్యయం రికవరీ, పెరిగిన పెట్టుబడులను పేర్కొంటూ ఫిచ్ రేటింగ్స్ మంగళవారం భారత వృద్ధి అంచనాను 7.2 శాతానికి పెంచింది. మార్చిలో ఈ సంస్థ దేశ వృద్దిరేట్ ను 7 శాతంగా సూచించింది. మంగళవారం బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ 308.37 పాయింట్లు లేదా 0.40 శాతం పెరిగి 77,301.14 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 92.30 పాయింట్లు లేదా 0.39 శాతం పెరిగి 23,557.90 వద్ద తన ట్రేడ్ ను ముగించింది.