పోస్టల్ స్టాంపు కెక్కిన తెలంగాణ ఉద్యమ కెరటం..
ఆయన తెలంగాణలో మొఘలుల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడు. వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్న పోరాట యోధుడు.
తెలంగాణ వీరుడు పాపన్నగౌడ్ చిత్రంతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని కేంద్రం గతేడాది నిర్ణయించింది. తపాలా శాఖ రూపొందించిన ఆ స్టాంప్‌ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పాపన్న గౌడ్ గురించిన ప్రత్యేక కథనం మీ కోసం..
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌ది వరంగల్ జిల్లా. జనగాం సమీపంలోని ఖిలాషాపూర్ ఆయన స్వగ్రామం. 1650లో జన్మించాడు. గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు. తండ్రి పేరు నాసగోని ధర్మన్న గౌడ్. తల్లి సర్వమ్మ, పశువుల కాపరి. చిన్న వయసులోని పాపన్న తండ్రిని కోల్పోయాడు. తల్లి అభ్యర్థన మేరకు ఆమె బలవంతం చేయడంతో తాటిచెట్ల నుంచి కల్లు తీయడాన్ని వృత్తిగా ఎన్నుకున్నాడు. సైనికులు కల్లు తాగి పాపన్నకు డబ్బులు చెల్లించేవారు కాదు. రకరకాల పేర్లతో ప్రజల నుంచే పన్నులు వసూలు చేసేవారు. మొఘలుల అణచివేతలు, దౌర్జన్యాలను చాలా దగ్గరి నుంచి చూసిన పాపన్న పీడిత ప్రజల విముక్తి కోసం మొఘలులపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. చిన్నపాటి సైన్యాన్ని తయారుచేసి తెలంగాణలో ముస్లింల పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.
పేదల పక్షపాతిగా...
1687 నుంచి 1724 మధ్య మొఘల్ పాలన నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించారు. అందుకే పాపన్నకు సర్దార్ సర్వాయి పాపన్న అని పేరు వచ్చింది. ఔరంగజేబు కాలంలో జీవించిన పాపన్న గౌడ్ నిరుపేదల కోసం కొన్ని భవనాలను నిర్మించి పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాతి కాలంలో ఖిలాషాపూర్‌లో ఓ కోటను నిర్మించారు. దాన్ని అప్పట్లో రాజధాని నగరంగా పరిగణించారు.
పాపన్న పరమ భక్తుడు..
పాపన్న ఎల్లమ్మ భక్తుడు. శివుడిని కూడా ఆరాధిస్తాడు. బౌద్ధమతాన్ని గౌరవించాడని చెప్పడానికి ధూల్మిట్టలో అతని విజయ శాసనాలు శిల్పాల ద్వారా తెలుస్తోంది.
చారిత్రక ఆధారాలివి..
1874 ఎ.డిలో బ్రిటిష్ చరిత్రకారుడు జేఏ బోయల్ పాపన్న గౌడ్ గురించి తెలుసుకున్నారు. ఇప్పటికీ ఉన్న కోటలు, శాసనాలు, దేవాలయాలు, పురావస్తు ఆధారాలు పాపన్న గౌడ్ చరిత్రను వెలుగులోకి తెచ్చాయి.
30 ఏళ్ల పాలనలో..
పాపన్న తన 30 ఏళ్ల పాలనలో వరంగల్, కొలనుపాక, చేర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రాంతాలకు చెందిన నల్గొండ తాటికొండ భువనగిరిని పాలించాడు.
సర్వాయిపేటలో తొలి కోట నిర్మాణం..
క్రీ.శ. 1675లో సర్వాయిపేటలో పాపన్న తన మొదటి కోటను నిర్మించాడు. చరిత్రకారుడు పేర్వారం జెగనాథం ప్రకారం.. తన పాలనను విస్తరించడం, గోల్కొండను జయించాలనే లక్ష్యంతో పాపన్న 1678లో తాటికొండ, వేములకొండలో కోటలను నిర్మించాడు. 1700 - 1705 మధ్య కాలంలో తాటికొండలో మరో కోట నిర్మించాడు.
పాపన్న హయాంలో చెక్ డ్యామ్ నిర్మించారు. ఆయన హయాంలోనే కరీంనగర్ హుస్నాబాద్‌లోని నిర్మించిన ఎల్లమ్మ ఆలయం పాపన్న దైవభక్తిని నిదర్శనం. కాల క్రమేణా ఈ ఆలయంలో కొత్త విగ్రహాలు ఏర్పాటుచేశారు. కానీ మట్టితో నిర్మించిన అసలు దేవత ఎల్లమ్మ విగ్రహం ఇప్పటికీ ఉండడం విశేషం.
భూస్వాములపై యుద్ధానికి ..
సుబేదార్, జమీందార్లు, భూస్వాములపై పాపన్న యుద్ధానికి సిద్ధమయ్యాడు. గోరిల్లా దాడుల ద్వారా సైన్యం కోసం నిధులను సేకరించాడు. పాపన్నకు ప్రజాదరణ పెరిగిపోవడంతో సహించని ఔరంగజేబు పాపన్నను అంతమొందించాలని రుస్తుం దిల్ ఖాన్‌ను ఆదేశించాడు. రుస్తుం దిల్ ఖాన్ పాపన్నతో పోరాడి షాపురా కోటను సొంతం చేసుకోడానికి ఖాసిం ఖాన్‌ను పంపాడు. ఖాసిం ఖాన్‌ను పాపన్న చంపేయడంతో నేరుగా రుస్తుందిల్ ఖాన్ స్వయంగా యుద్ధరంగంలోకి దిగాడు. మూడు మాసాల పాటు యుద్ధం కొనసాగింది. చివరకు రుస్తుం-దిల్ ఖాన్ యుద్ధం నుంచి పారిపోయాడు. యుద్ధంలో పాపన్న తన స్నేహితుడు, సన్నిహితుడు సర్వన్నను కోల్పోయాడు. 1707లో ఔరంగజేబు మరణించాడు.
వరంగల్ కోట స్వాధీనం..
తర్వాత రాజ్యాధికారం చేపట్టిన అప్పటి దక్కన్ సుబేదార్ కంబక్ష్ ఖాన్ క్రమేణా పాలనపై పట్టు కోల్పోయాడు. ఇదే సమయంలో పాపన్న 1708లో ఏప్రిల్ 1 న వరంగల్ కోటపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నాడు.
1708 ప్రారంభంలో గోల్కొండ కోటను దాడి చేశాడు పాపన్న గౌడ్. అయితే ఈ దాడిలో ఆయన పట్టుబడ్డాడు. శత్రువు చేతిలో చావడం ఇష్టం లేని పాపన్న.. తన బాకుతోనే గుండెలో పొడుచుకొని చనిపోయాడు. 1710లో పాపన్న తలని గోల్కొండ కోట ముఖద్వారానికి వేలాడ దీశారు.
పాపన్న శిలా విగ్రహం ఏర్పాటు..
ప్రపంచ ప్రసిద్ధి చెందిన లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పాపన్న చరిత్రపై అధ్యయనం చేయించి పుస్తకాలను ముద్రించింది. సర్ధార్ పాపన్న ముఖ చిత్రంతో యూనివర్సిటీ రెండు పుస్తకాలలో (ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ది సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్) చరిత్రను ముద్రించింది. బ్రిటిష్ ప్రభుత్వం లండన్‌లోని ‘‘విక్టోరియా అండ్ ఆల్బర్ట్’’ మ్యూజియంలో సర్ధార్ పాపన్న శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.