లక్షలాది బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన కేంద్ర ప్రభుత్వం.. ఎందుకు?

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో 4.5 లక్షల వివిధ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇందులో ఎక్కువ ఖాతాలు ఎస్ బీఐ లో ఉన్నాయి.

Update: 2024-11-12 10:58 GMT

భారత ప్రభుత్వం లక్షలాది బ్యాంకు అకౌంట్లను ఈ ఏడాది కాలంలో స్తంభింపచేసింది. ఈ అకౌంట్లు అన్ని సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నారని గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. సైబర్ క్రైమ్ చేసి నగదును లాండరింగ్ చేస్తున్న 4. 5 లక్షల ఖాతాలను రద్దు చేసింది.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లలో ఎక్కువ ఖాతాలను ఇలా సైబర్ క్రైమ్ చేయడానికి నేరగాళ్లు ఉపయోగించుకున్నారు.
చాలా మంది నేరగాళ్లు రిటైర్ అయిన వృద్ధులను టార్గెట్ చేసుకుని సైబర్ మోసాలు చేస్తున్నారని విచారణలో తేలింది. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు నేరాలకు ఉపయోగిస్తున్న అకౌంట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ విషయాన్ని తెలియజేసినట్లు పత్రికా కథనం పేర్కొంది.
చాలా నకిలీ ఖాతాలు ..
మోసగాళ్లు చెక్కులు, ఏటీఎంలు, ఇతర వ్యక్తుల కేవైసీ పత్రాలతో రూపొందించిన ఖాతాల నుంచి డిజిటల్‌గా డబ్బులు డ్రా చేసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. కొన్ని నివేదిక ప్రకారం, SBIలో సుమారు 40,000 నకిలీ బ్యాంక్ ఖాతాలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 10,000, కెనరా బ్యాంక్‌లో 7,000, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 6,000, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో 5,000 సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలు కనుగొన్నారు.
" జనవరి 2023 నుంచి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో సుమారు 1 లక్ష సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. గత ఏడాది కాలంలో సుమారు ₹17,000 కోట్ల నగదు మోసాలు జరిగాయి" అని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
లొసుగులను గుర్తించారు
హోం మంత్రిత్వ శాఖ దేశంలో కొన్ని లొసుగులను గుర్తించిందని, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని పోలీసు బలగాలు అటువంటి ఖాతాలపై క్రియాశీలక చర్యలు తీసుకోవాలని సూచించిందని ప్రధాన మంత్రి కార్యాలయానికి తెలియజేశారు. ఇలాంటి నకిలీ ఖాతాలు తెరవడంలో బ్యాంకు మేనేజర్లు, అధికారుల పాత్రపై కూడా విచారణ జరగనుంది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో బ్యాంకు మేనేజర్లు, కొంతమంది సైబర్ నేరగాళ్లకు నకిలీ ఖాతాలను సృష్టించి ఇస్తున్నారని తేలింది. కమిషన్ ప్రాతిపదికన కొంతమంది ఇలా ఖాతాలను సమకూరుస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.


Tags:    

Similar News