పెళ్ళి పీటలెక్కిన తుపాకి రాణి, తూటాల రాజా.. ఎక్కడంటే..

‘నాకు వాడే కావాల్రా తమ్ముడూ’ అని అక్క పలవరించింది. ఇంతలో అన్న కాలా జాతేరి కటకటాల పాలయ్యారు. మనిషికి ఊచలు అడ్డం గాని మనసుకు కాదు గదా.. ఊహలు గుసగుసలాడాయి.

Update: 2024-03-13 03:59 GMT

‘అక్క’.. రివాల్వార్ రాణి.. ‘అన్న’.. కాలాంతకుడు, సుపారీ గ్యాంగ్ స్టర్.. ప్రేమలో పడ్డారు. మనసిచ్చిపుచ్చుకున్నారు. అదేదో సినిమాలో లాగా.. ‘నాకు వాడే కావాల్రా తమ్ముడూ’ అని అక్క పలవరించింది. ఇంతలో అన్న కాలా జాతేరి కటకటాల పాలయ్యారు. జైలే జీవితం అని కోర్టు చెప్పింది. మనిషికి ఊచలు అడ్డం గాని మనసుకు కాదు గదా.. ఊహలు గుసగుసలాడాయి. ఊసులు కోర్టుకు వచ్చాయి.. అన్న గ్యాంగ్‌స్టర్ సందీప్. అక్క రౌడీషీటర్ అనురాధ చౌదరి...


ఢిల్లీ కోర్టు.. మహాప్రభు (అనగా మిలార్డ్).. నా క్లయింట్ తీహార్ జైల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనిప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. 1955నాటి హిందూ వివాహచట్టంలోని సెక్షన్ సో అండ్ సో ప్రకారం నా క్లయింట్ కి, ఆయన ప్రేయసి పెళ్లీడు కూడా వచ్చింది. అందువల్ల సెలవు మంజూరు చేయండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పెళ్లి అనేది హక్కు, దాన్ని తోసిపుచ్చలేరు మిలార్డ్ అంటూ గ్యాంగ్ స్టర్ తరఫు న్యాయవాది రోహిత్ దలాల్ బల్లగుద్ది వాదించారు. దానికి న్యాయమూర్తులు సరేనంటూ మానవతా దృక్పదంతో పెరోల్ మంజూరు చేస్తున్నామన్నారు. అది మంజూరు కాగానే మళ్లీ లాయర్ గారు లేచి... మిలార్డ్, నా క్లయింట్ కి ఇంకో చిన్న కోరిక కూడా ఉంది విన్నవించారు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు కదా మిలార్డ్.. అలాగే నా క్లయింట్ కి పెళ్లి అయిన తర్వాత మా రివాల్వర్ రాణి కట్టుకున్న ఇల్లు గృహ ప్రవేశం కూడా ఉంది, అక్కడికి వెళ్లేందుకు కూడా అనుమతించాలి మహాప్రభూ అన్నారు. దానికి కోర్టు వాళ్లు కాసేపు ఆలోచించి ఈ పెరోల్ సమయంలో ఆ గృహప్రవేశానికి కూడా వెళ్లరమ్మనండి, అయితే ఎప్పటికప్పుడు ఏమేమి జరుగుతుందో మాకు తెలియజేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చి సెలవు మంజూరు చేశారు.

ఇక చూస్కో.. ‘అన్న’ సందీప్ తీహార్ జైలు నుంచి అడుగుపెట్టారు. గ్యాంగ్ స్టర్ అనుచరుల కన్నా ఎక్కువ మంది పోలీసులు వచ్చారు. వాళ్లందరూ ఢిల్లీ స్పెషల్ పోలీసులట. మనుషుల్ని చంపడానికి ఉపయోగించే ఆయుధాలు, వాటి టెక్నికులు పసిగట్టేందుకున్న ప్రత్యేక దళంలోని మూడో విభాగానికి చెందిన 150, 200 మంది ఒక్కసారిగా తుపాకులతో ప్రత్యక్షమయ్యారు. సాదరంగా కాదు గాని ఆ మోస్తరులో ఈ గ్యాంగ్ స్టర్ ని దేశ రాజధాని ద్వారకలోని పెళ్లి మండపానికి తోడ్కోనిపోయారు. అప్పటికే మన రివాల్వార్ రాణి అనురాధ మందీమార్బలంతో సిద్ధంగా ఉన్నారు. పెళ్లిమండపం యజమానికి ముందే చెప్పి ఉండడంతో ఎటుచూసినా నిఘా నేత్రాలు (కెమెరాలు) గుండ్రంగా తిరిగేలా ఏర్పాటయ్యాయి. అత్యంత ముఖ్యులైన కుటుంబ సభ్యులు, అంతకు మూడింతల మంది ఉన్న పోలీసులు, తుపాకులున్న ఇతరుల సమక్షంలో పెళ్లి ధూమ్ ధామ్ గా జరిగింది.


గ్యాంగ్ స్టర్ సందీప్ ఈవేళ ప్రేయసి అనురాధ చౌదరి ఇంటికి వెళ్లారు. హర్యాణా సోనిపట్ జిల్లా జాతేరి గ్రామంలో వధువు అనురాధ గృహ ప్రవేశం జబర్దస్ గా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం గృహ ప్రవేశం తర్వాత ఆ రోజు రాత్రి ఎలాగూ నిద్రచేయాలి కదా. అలా ఈవేళ రాత్రికి వాళ్లిద్దరూ అక్కడే ఉంటారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీ వచ్చి సందీప్ బుక్ చేసుకున్న హోటల్లో పోలీసు పహారా మధ్య ఉంటారు. పెరోల్ గడవు ముగిసిన తర్వాత జైలుకు తీసుకువెళతారు. ఈ జంట దాదాపు నెలన్నర పాటు బయట ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.

పెరోల్ అంటే ఎన్ని రోజులు...

సహజంగా కోర్టులు మానవతా ధృక్పదంతో ఈ పెరోల్ ను జైళ్లలో ఉండే ఖైదీలకు మంజూరు చేస్తాయి. అంటే సెలవు ఇవ్వడం. ఏదైనా ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు ఈ సెలవు మంజూరు చేస్తారు. కోర్టు ఆదేశాల మేరకు జైళ్ల డెప్యూటీ డివిజినల్ కమిషనర్ ఖైదీలను విడుదల చేస్తారు. బాగా ఎక్కువలో ఎక్కువనుకుంటే 30 రోజులు, ఆ తర్వాత పరిస్థితిని బట్టి మరో 14 రోజులు ఇస్తారు. ఈ 14 రోజుల్ని జైళ్ల శాఖ డీఐజీ గ్రాంట్ చేస్తారు.

ఇంతకీ ఎవరీ గ్యాంగ్ స్టర్ సందీప్...

1984లో హర్యాణా సోనేపట్ జిల్లా కాలాజాతేరి గ్రామంలో పుట్టాడు సందీప్ ఎలియాస్ కాలాజాతేరి. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు.. చిన్నప్పటి నుంచే నేరాలు చేయడంలో ఆరితేరాడట సందీప్. చివరికో ముఠాను తయారు చేశారట. ఓ పద్ధతి ప్రకారం మూడో కంటికి తెలియకుండా హత్యలు, దోపిడీలు చేసి తప్పించుకోవడంలో దిట్ట. ఆ తర్వాత అదే ఊరిపేరిట కాలాజాతేరి ముఠా ఏర్పాటు చేసుకున్నారు. అనేక నేరాలకు పాల్పడ్డారు. 2020లో హర్యాణా జైలు నుంచి అత్యంత చాకచక్యంగా తప్పించుకుని బయటకు వచ్చి తన పనులు పూర్తి చేసుకుపోయారట. కిరాయికి మనుషుల్ని చంపడంలో ఈ గ్యాంగ్ పెట్టింది పేరు. వీళ్ల పాపం పండి 2021 జూలై 31న ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ లో ఈ ముఠా పట్టుబడింది. అందులో ఇతనొకడు. ఈ నేరగాణ్ణి అరెస్ట్ చేశారు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు. మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని ఏయే దోపిడీని ఎలా చేశావు, ఎవరెవర్ని ఎలా చంపావు వంటి వివరాలను తెలుసుకుని ద్వారకా కోర్టుకు హాజరుపరిచారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్‌ను నిర్వహిస్తున్నారనే ఆరోపణతో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ తో సహా పలు ఘోరమైన నేరాలు ఈ కాలా జాతేరి చేశారట. కాలా జాతేరి ముఠా సభ్యుడు మరొకడు ఆనంద్ పాల్ సింగ్ అని ఉండేవాడు. అతణ్ణి పోలీసులు కాల్చేవేశారు. ఆయన సన్నిహిత సహచరురాలు అనురాధ. రాజస్థాన్, ఢిల్లీలో దోపిడీ, కిడ్నాప్, హత్య, అపహరణ వంటి అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఇద్దరూ. ప్రస్తుతం ఆమె బెయిల్‌పైన, ఆయన పెరోల్ పైన విడుదలయ్యారు. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సందీప్. అతన్ని పట్టిచ్చిన వారికి 7 లక్షల రూపాయల రివార్డ్ కూడా ప్రకటించారు. ఢిల్లీ పోలీసులతో పాటు హర్యాణా, రాజస్థాన్, పంజాబ్ పోలీసులు ఇతని కోసం వేటాడారు. 2021 మార్చి 25 నాటి జిటిబి హాస్పిటల్ షూట్ అవుట్ కేసులో ప్రధాన నిందితుడు ఈ సందీప్. ఛత్రసాల్ స్టేడియంలో రెజ్లర్ సాగర్ ధంకడ్ హత్య కేసు దర్యాప్తులో ఇతని పేరు బయటపడింది. ధంకడ్ ను దారుణంగా హత్య చేశారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్ సుశీల్ కుమార్, అతని 12 మంది సహచరులు కూడా ఈ హత్య కేసులో నిందితులే. జాతేరి ముఠాలో వచ్చిన స్పర్థలే సందీప్ ను పట్టించాయనే ఆరోపణ ఉంది. ఆ ముఠా సభ్యురాలే ఈ శ్రీమతి అనురాధ చౌదరి.

Tags:    

Similar News