ఈపీఎఫ్ఓ చందాదారుల క్లెయిమ్ సెటిల్ మెంట్ ను సులభం చేయడానికి ఈ ఏడాది జూన్ నాటికి కొత్త మొబైల్ అప్లికేషన్, డెబిట్ కార్డు ను తీసుకురావాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చేస్తోంది. ఇందు కోసం మొత్తం ఐటీ వ్యవస్థను అప్ గ్రేడ్ చేయడంతో పాటు ఈపీఎఫ్ఓ 2.0 కి సంబంధించిన పని జరుగుతోందని అవన్నీ ఈ నెల చివరినాటికి పూర్తవుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
తరువాత 3.0 యాప్ మే- జూన్ నాటికి ప్రారంభిస్తామని, ఇది చందాదారులకు బ్యాంకింగ్ సౌకర్యాలను అందిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఇదే మొత్తం ఈపీఎఫ్ఓ వ్యవస్థను కేంద్రంగా ఉంటుందని, అలాగే డబ్బు తీసుకునే ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఒకసారి చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ సెటిల్ మెంట్ చేసుకుంటే తరువాత నేరుగా ఏటీఎం నుంచి ఉపసంహరించుకునేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. ఈ వ్యవస్థ అంతా కుదురుకున్న తరువాత చందాదారులకు ఏటీఎం కార్డులను అందజేయనున్నట్లు మాండవ్య వెల్లడించారు. తమ చందాలను ఉపసంహరించుకున్న తరువాత ఏటీఎం కార్డులను ఉపయోగించి నేరుగా డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా మార్గదర్శకాలను రూపొందించబోతున్నారు.
ఏటీఎం కార్డ్ ప్రయోజనం...
ఈ ప్లాన్ కింద ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్ లు పొదుపులను ఉపసంహరించుకోవడానికి ఏటీఎం లను ఉపయోగించగల ప్రత్యేక కార్డులను అందుకుంటారు. కొత్త సిస్టమ్ లో ఇది కార్డులతో మాత్రమే చందాను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లోని డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద మరణించిన చందాదారుల వారసులకు గరిష్టంగా రూ. 7 లక్షలు అందిస్తారు.
కొత్త విధానంలో మరణించిన చందాదారుల వారసుడు కూడా క్లెయిమ్ సెటిల్ మెంట్ తరువాత డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి ఏటీఎంలను ఉపయోగించుకోవాలని కేంద్ర కార్మిక కార్యదర్శి సుమితా దావ్రా జాతీయ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ చందాదారులు తమ క్లెయిమ్ లను ఆన్ లైన్ లో పరిష్కరించుకోవడానికి 7-10 రోజుల సమయం పడుతోంది. సెటిల్ మెంట్ తరువాత మనం సూచించిన బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ అవుతోంది.
కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ అన్ని ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలలో పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. ఈ ప్రారంభోత్సవాన్ని చారిత్రక మైలురాయిగా అభివర్ణించారు.
‘‘ ఈ మార్పు పెన్షనర్లు తమ పెన్షన్లను దేశంలోని ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్ నుంచి అయినా సులభంగా యాక్సెస్ చేయడానికి వీలుంటుంది. ఇది సందర్శకుల వ్యక్తిగతంగా హజరు కావడాన్ని తొలగిస్తుంది. పెన్షన్ల పంపిణీ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది’’ అని కేంద్రమంత్రి అన్నారు. సీపీపీఎస్, ఈపీఎఫ్ఓ సేవలను ఆధునీకరించడం, పెన్షనర్లకు సౌలభ్యం పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంతో మా నిబద్దతకు నిదర్శనమని ఆయన అన్నారు.