తమిళనాడులో పీఎంకే బీజేపీతో జతకట్టడానికి కారణాలేంటి?

బీజేపీతో పొత్తుపెట్టుకున్న పీఎంకే ఈ సారి లోక్ సభ ఎన్నికలలో 10 స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఇదే పొత్తుతో 2026 జరిగే అసెంబ్లీ ఎన్నికలో సత్తా చాటుతామంటుంది.

Byline :  The Federal
Update: 2024-03-20 11:51 GMT

వన్నియార్ సామాజిక వర్గ మద్దతు ఎక్కువగా ఉన్న పట్టాలి మక్కల్ కట్చి (PMK). ఇప్పుడు ఇదే పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకుని 10 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఎన్డీఏ కూటమి నుంచి ఏఐఏడీఎంకే దూరం కావడంతో కమలం పార్టీ పీఎంకే మద్దతు తీసుకుంది. పీఎంకే పార్టీ అధినేత అన్బుమణి రామదాస్‌కు మోదీ కేబినెట్‌లో స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఈ డీల్‌ కుదిరినట్లు సమాచారం.

గెలుపు ఖాయం..

బీజేపీతో పొత్తుపై పీఎంకేలోని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీకి మిత్రపక్షాల అవసరం ఉన్నందునే జతకట్టిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి లోక్‌సభ పోరులో డిఎంకె, ఎఐఎడిఎంకె రెండూ కూడా తమ పార్టీ మద్దతు ఇస్తుందని భావించారని పిఎంకె అధికార ప్రతినిధి కె బాలు పేర్కొన్నారు.

‘‘మొత్తం 39 సీట్లలో 10 సీట్లలో మేం పోటీచేసేందుకు బీజేపీ ఒప్పుకుంది. ఎన్‌డిఎ కూటమితో దేశానికి సేవ చేయడమే మా లక్ష్యం. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం” అని బాలు విశ్వాసం వ్యక్తం చేశారు.

పీఎంకే-బీజేపీ భవిష్యత్తు..

2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి తమిళనాడులో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బాలు చెబుతున్నారు.

‘‘తమిళనాడు రాజకీయాల్లో మా కూటమి చరిత్ర సృష్టిస్తుంది. కేంద్రం మద్దతుతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పును పిఎంకె తీసుకువస్తుంది, ”అని అన్నారు.

పొత్తుపై ఏఐఏడీఎంకే నేతల ఆగ్రహం..

PMK బీజేపీతో జతకట్టడాన్ని అన్నాడీఎంకే నేతలు తప్పుబడుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పీఎంకే తన సమాధిని తానే తవ్వుకుందని తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత డీ జయకుమార్ అన్నారు. పీఎంకే 2014లో పోటీ చేసిన ఎనిమిది నియోజకవర్గాల్లో 1 లోక్‌సభ సీటును గెలుచుకుంది. 2019లో ఏడు స్థానాల్లో నిలబెట్టినా ఏ ఒక్కరూ గెలుపొందలేదు.

వారి డిమాండ్లకు మేం తలొగ్గలేదు..

“బీజేపీ డిమాండ్లకు మేం ఒప్పుకోలేదు. బీజేపీని, దాని విధానాలను అన్బుమణి రామదాస్ తీవ్రంగా విమర్శించిన వైరల్ వీడియోలను తమిళనాడు ఓటర్లు ఇంకా మరచిపోలేరు” అని జయకుమార్ ది ఫెడరల్‌తో అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అన్బుమణి రామదాస్‌పై 2015లో సీబీఐ ఫైల్ చేసిన అవినీతి కేసు పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు.

క్షీణిస్తున్న పీఎంకే ఓటు బ్యాంకు..

2009 లోక్‌సభ ఎన్నికల తర్వాత పీఎంకే ఓటు బ్యాంకు తగ్గుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అన్నాడీఎంకేతో పీఎంకే పొత్తు పెట్టుకుని ఉంటే కరూర్, విల్లుపురం, కడలూరు, ఆరణి, కాంచీపురం వంటి నియోజకవర్గాల్లో డీఎంకేకు గట్టి పోటీ ఇచ్చి గెలుపొందేదని విమర్శకులు అంటున్నారు.

బీజేపీ - మిత్రపక్షాలు..

“బీజేపీ ఒక పార్టీపై పూర్తి నియంత్రణ కోరుకుంటుంది లేదా దానిని విచ్ఛిన్నం చేస్తుంది. తదుపరి బాధితుడు పీఎంకే అని అన్నాడీఎంకే సభ్యుడు అన్నారు. “తమిళనాడులో ఏఐఏడీఎంకే, పంజాబ్‌లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన వంటి భాగస్వామిని బీజేపీ నాశనం చేసిందని గుర్తు చేశారు.

Tags:    

Similar News