ఎవరీ నోయల్ టాటా, రతన్ టాటాకి ఏమవుతారు?

రతన్ టాటా తండ్రికి రెండు పెళ్లిళ్లు. మొదటి భార్య కుమారుడు రతన్ టాటా. రెండో సంబంధం కుమారుడే ఈ నోయల్. అంటే సవతి సోదరుడవుతారు.

Update: 2024-10-11 01:28 GMT

వేల కోట్ల రూపాయల అధిపతి, టాటా మోటార్స్ ఛైర్మన్, టాటా ట్రస్టుల చైర్మన్ రతన్ టాటా వారసుడెవరనే దానిపై కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తెరపడింది. అవివాహితుడైన రతన్ టాటా అక్టోబర్ పదిన మరణించారు. ఆయన తన వీలునామాలో వారసుడెవరనేది రాయలేదు. రతన్ టాటా తండ్రి నావల్ టాటా. తల్లి సూని కమిషనరేట్. రతన్ టాటా తండ్రి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. రెండో సంబంధం కుమారుడైన నోయెల్ టాటా త్వరలో రతన్ టాటా వారసుడు కాబోతున్నారు. అంటే రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులో ట్రస్టీగా కూడా పనిచేస్తున్నారు. నోయల్ టాటా ప్రస్తుతం వివిధ టాటా గ్రూప్ కంపెనీల బోర్డులో పనిచేస్తున్నారు.

రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్ పదవిని ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. రకరకాల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు నోయల్ టాటా. నావల్ హెచ్. టాటా, సిమోన్ ఎన్. టాటాల కుమారుడు నోయల్.
రతన్ టాటా తన వారసుడెవరో ప్రకటించినందున ట్రస్టు బోర్డులు కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకుంటాయి. నోయల్ ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, టాటా స్టీల్ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెడ్‌కి వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా గ్రూపుతో 40 ఏళ్లుగా అనుబంధం ఉంది. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులో ట్రస్టీగా కూడా ఉన్నారు.
టాటా గ్రూప్ నిర్వహించే ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్ విభాగమైన టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. 2010 ఆగస్టు నుంచి 2021 నవంబర్ వరకు ఆయన కంపెనీ టర్నోవర్ ను 500 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు పెంచారు. 1998లో ఉన్న ఒక-స్టోర్ ఆపరేషన్స్ ను 500 స్టోర్లకు పైగా పెంచారు. టాటా ఇంటర్నేషనల్‌లో చేరడానికి ముందు 11 ఏళ్లకు పైగా ట్రెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

నోయల్ టాటా 1957లో జన్మించారు. తల్లిదండ్రులు నావల్ టాటా, సిమన్ టాటా. ప్రస్తుతం వయసు 67 ఏళ్లు. భారతీయ సంతతికి చెందిన ఐరిష్ వ్యాపారవేత్త. ఐరిష్ పౌరసత్వం ఉందని సమాచారం. తన మేనమామ ల్లోంజి మిస్త్రీ కుమార్తె ఆలూ మిస్త్రీని పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు-లేహ్, మాయ, నెవిల్లే.
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా, జిమ్మీ టాటాల సవతి సోదరుడు. బ్రిటన్ లోని సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన నోయల్ ఫ్రాన్స్ లోని ఇనిస్టిట్యూట్ యూరోపియన్ డిఅడ్మినిస్ట్రేషన్ డెస్ ఎఫైర్స్ (ఇన్సెడ్) నుంచి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (ఐఇపీ) పూర్తి చేశారు. టాటా ఇంటర్నేషనల్‌లో తన కెరీర్ ను ప్రారంభించారు. విదేశాలలో టాటా సంస్థలు అందించే ఉత్పత్తులు, సేవలను ఆయన పర్యవేక్షించేవారు. 1999 జూన్ లో తన తల్లి స్థాపించిన రిటైల్ ఆర్మ్ ట్రెంట్‌కు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వత ట్రెంట్ పేరును వెస్ట్‌సైడ్‌గా మార్చారు. వెస్ట్‌సైడ్‌ను బాగా అభివృద్ధి చేశారు. లాభదాయకమైన వెంచర్‌గా మార్చారు. 2003లో టైటాన్ ఇండస్ట్రీస్, వోల్టాస్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
2010-2011లోనే నోయల్- రతన్ టాటా వారసుడవుతాడన్న ఊహాగానాలు వచ్చాయి. ఆ ఏడాదిలో ఆయన టాటా ఇంటర్నేషనల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌ అవుతాడని, టాటా గ్రూప్ అధిపతి తయారవుతున్నాడని పత్రికలు రాశాయి. అయితే అది అప్పుడు జరగలేదు. 2011లో ఆయన బావమరిది సైరస్ మిస్త్రీని రతన్ టాటా కంపెనీల మేనేజింగ్ ట్రస్టీగా చేస్తే ఆ తర్వాత రతన్ టాటాకీ ఆయనకి మధ్య భేదాభిప్రాయలు వచ్చాయి. 2016 అక్టోబర్ లో సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్‌గా తొలగించారు. 2017 ఫిబ్రవరి నుంచి నాలుగు నెలల పాటు గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా వ్యవహరించారు. సైరస్ మిస్త్రీ కోర్టుకు వెళ్లారు. దాంతో ఇకపై ఆయన టాటా గ్రూపు ఛాయలకు కూడా వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. ఆ తర్వాతే నోయల్ పేరు బలంగా వినపడింది. 2018లో టైటాన్ కంపెనీకి వైస్ ఛైర్మన్‌ అయ్యారు. 2019 ఫిబ్రవరి లో సర్ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులో చేరారు. 2022 మార్చిలో టాటా స్టీల్ వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
త్వరలో టాటా ట్రస్టు బోర్డుల సమావేశం జరుగనుంది. ఆ సమావేశంలో నోయల్ టాటాను రతన్ టాటా వారసునిగా నియమిస్తూ ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.


Tags:    

Similar News