అంగన్‌వాడీ అమ్మలపై ఇంత కాఠిన్యమెందుకు?

ఏపీలో అంగన్‌వాడీలపై జగన్ సర్కారు ఎస్మాను ప్రయోగించింది. ఈ చట్టంతో బందులు, సమ్మెలు, హర్తాళ్లు వంటివి చేయకూడదు.

Update: 2024-01-07 11:10 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ (అత్యవసరర సేవల నిర్వహణ చట్టం)ను ప్రయోగించింది. ఈ చట్టంతో బందులు, సమ్మెలు, హర్తాళ్లు వంటివి చేయకూడదు. అటువంటి ఎస్మాను సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలపై ప్రయోగించారు. అంగన్‌వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కేంద్రాలు, కార్యాలయాల వద్ద ఎస్మా జీవో ప్రతులను దహనం చేశారు. ఎల్లుండి జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరిస్తే బంద్ చేపడతామని హెచ్చరించాయి కార్మిక సంఘాలు.

పెల్లుబుకిన నిరసనలు...

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న1.6 లక్షల మంది అంగన్‌వాడీలు కదం తొక్కారు. సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో అంగన్‌వాడీల నిరసనలు పెల్లుబికాయి. ఆర్డీవో కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఎస్మా జీవో ప్రతులను దహనం చేశారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వ ఆల్టిమేటమ్‌..

సమ్మెలో ఉన్న వారందరూ సోమవారం లోగా విధుల్లో చేరాల్సిందేనంటూ ప్రభుత్వం అంగన్వాడీలకు అల్టిమేటం జారీ చేసింది ప్రభుత్వం. అంగన్‌వాడీలను అత్యవసర సేవల కిందకు తీసుకొస్తూ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఈ మేరకు జీవో నంబర్‌ 2 జారీ చేసింది. దీని ప్రకారం 8వ తేదీన అంగన్‌వాడీలు విధులకు హాజరు కావాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. గడువు లోపు విధులకు హాజరు కాని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

తగ్గేదే లేదంటున్న అంగన్‌వాడీలు...

మరోవైపు ఇప్పటికే ఎస్మాకు తలొగ్గేది లేదని అంగన్వాడీలు చెబుతున్నారు. రాష్ర్టవ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు విధులకు హాజరవుతారా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

మా మాట వినండి- మంత్రులు...

అంగన్‌వాడీలతో పలు దఫాలు జరిపిన చర్చల్లో ఇప్పటికే మెజారిటీ డిమాండ్లను పరిష్కరించినట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం వివరించింది. సమ్మె కారణంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపింది. 7.5 లక్షలు ఉండాల్సిన రోజువారీ ప్రీస్కూల్‌ పిల్లల హాజరు 2 లక్షలకు తగ్గిందని వెల్లడించింది. కొత్తగా నమోదయ్యే గర్భిణులు, బాలింతల సంఖ్య కూడా తగ్గిందని పేర్కొంది. రోగనిరోధకశక్తి, ఆరోగ్య పరీక్షలు, పోషకాహార లోపమున్న పిల్లలపై పర్యవేక్షణ వంటి అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతోందని వెల్లడించింది.

చర్చలు విఫలం...

ఇక మున్సిపల్‌ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చలు సంపూర్ణంగా ముగియలేదని, ప్రధాన అంశాలపై ప్రభుత్వం ఎటూ తేల్చలేదని కార్మిక నాయకులు తెలిపారు. సమ్మెను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం ఇస్తున్న జీతానికి రూ.6 వేలు కలిపి ఇస్తామని చర్చల సందర్భంగా మంత్రి బొత్స చెప్పారు. విధుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇప్పుడు ఇస్తున్న రూ.5 లక్షల పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News