కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై లైంగిక వేధింపుల కేను ..
17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో కర్ణాటక సీఎం యడుయూరప్పపై బెంగళూరు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.
By : The Federal
Update: 2024-03-15 08:28 GMT
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పపై కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో బెంగళూరులోని సదాశివనగర్ స్టేషన్ పోలీసులు ఆయనపై పోక్సో (POCSO) కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న యడ్యూరప్ప (81) తన టీనేజీ కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తల్లి ఆరోపించింది.
ఆరోపణపై యడియూరప్ప స్పందిస్తూ.. ‘‘మోసం కేసులో తమను ఆదుకోవాలని బాలిక, ఆమె తల్లి కొద్ది రోజుల క్రితం నన్ను కలిసేందుకు వచ్చారు. ఆ విషయం గురించి బాలికతో మాట్లాడుతుంటే ఏదీ సరిగా చెప్పలేదు. అప్పుడే ఆమె మానసిక స్థితిపై నాకు అనుమానం వచ్చింది. పోలీసు కమిషనర్ బి దయానందను పిలిపించి మాట్లాడాను. ఆమెకు ఏదో అన్యాయం జరిగిందని చూడమని చెప్పాను. నాపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని విన్నాను. నేను చట్టపరంగా ఏంచేయాలో చేస్తాను. ఎవరికైనా సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇలా జరుగుతుంది. ఇవన్నీ నిరాధార ఆరోపణలు’’ అని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు అన్నారు.
విచారణ జరుగుతోంది..
ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర స్పందించారు. ‘‘ఇది చాలా సున్నితమైన అంశం. మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినది కూడా. అందువల్ల ఈ విషయంలో మేం జాగ్రత్తగా మాట్లాడాలి. విచారణ పూర్తయ్యే వరకు ఏం చెప్పలేం. ఆ మహిళ మానసిక స్థితి సరిగా లేదని కొందరు అంటుండగా విన్నాను’’ అని చెప్పారు.
కర్ణాటకకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యడియూరప్ప సీఎం పదవి వీడిన తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. గత నవంబరులో ఆ బాధ్యతలను హైకమాండ్ ఆయన తనయుడు విజయేంద్రకు అప్పగించింది. ప్రస్తుతం యడియూరప్ప భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.