వ్యవసాయరంగ మార్కెట్ ను కార్పొరేట్లకు అప్పగించడమే మోదీ లక్ష్యం

2021 లో రైతుల ఆందోళనలతో ప్రభుత్వం ఉపసంహరించుకున్నచట్టాన్ని NPFA డాక్యుమెంట్ రూపంలో మళ్ళీ ముందుకు వచ్చింది.;

Update: 2025-03-13 10:39 GMT

2020 జూన్ లో నిండు కరోనా కాలంలో దేశ ప్రజలంతా భయభ్రాంతులతో వణికిపోతూ ఇళ్ళకే పరిమితమైన రోజుల్లో మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాలకు అప్పగించడానికి మూడు ఆర్డినెన్సులను(తరువాత వాటిని చట్టాలుగా మార్చారు) తీసుకు వచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఒకటి – ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో, ఎంతో కొంత రైతులకు అనుకూలంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (APMC) చట్టాలను నిర్వీర్య పరిచి, మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టడానికి ఉద్దేశించి తెచ్చిన చట్టం.

ఈ చట్టంతో పాటు తెచ్చిన మిగిలిన రెండు చట్టాలలో కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ తెచ్చిన చట్టం ఒకటి కాగా,నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ చట్టాన్ని రద్ధు చేస్తూ, తెచ్చిన చట్టం రెండవది.

కార్పొరేట్ అనుకూల ఈ మూడు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా రైతులు వీరోచితంగా పోరాడారు. దేశ రాజధాని డిల్లీకి సమీపంలో ఉన్న పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రైతులు దిల్లీని చుట్టుముట్టి, దిగ్బంధనం చేశారు. సంవత్సర కాలానికి పైగా సాగిన ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు అమరులయ్యారు. రైతుల పట్టుదలకు లొంగి వచ్చిన కేంద్ర మోడీ ప్రభుత్వం అనివార్యంగా మూడు చట్టాలను వెనక్కు తీసుకుంది. నాటి నుండీ రైతులు మరి కొన్ని ముఖ్యమైన డిమాండ్లతో రైతులు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

అందులో కేంద్రం ప్రతి సంవత్సరం ప్రకటించే కనీస మద్ధతు ధరలకు చట్ట బద్ధత కల్పించాలనేది ప్రధానమైనది. ఇందుకోసం ఎం. ఎస్. స్వామినాథన్ కమిషన్ సూచించినట్లుగా పంటల సమగ్ర ఉత్పత్తి ఖర్చులను ( C2) లెక్కించి, డానికి 50 శాతం కలిపి కనీస మద్ధతు ధరలను కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి భిన్నంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తప్పుడు పద్ధతిలో A2+FL+ 50 శాతం చొప్పున కనీస మద్ధతు ధరలను ప్రకటిస్తున్నది. ఫలితంగా రైతులు ప్రతి సీజన్ లో ఎకరానికి కొన్ని వేల రూపాయలు నష్ట పోతున్నారు. దీని కారణం గానే రాష్ట్ర GSDP లో వ్యవసాయ రంగం (ముఖ్యంగా పంటల విలువ) వాటా అతి తక్కువగా నమోదు అవుతున్నది.

గత నాలుగేళ్లుగా రైతుల డిమాండ్ ను పరిష్కరించకుండా కాలయాపన చేసిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగంలో కార్పొరేట్ లకు మేలు చేసేందుకు మాత్రం తాజాగా మరో ప్రయత్నం చేసింది. అదే “ National Policy Framework On Agriculture Marketing (NAFA)” పేరుతో ఒక డాక్యుమెంట్ ను వ్యవసాయ శాఖ ద్వారా ద్వారా 25-11-2024 న విడుదల చేసింది. అత్యంత కీలకమైన 35 పేజీల ఈ డాక్యుమెంట్ పై 15 రోజుల్లో అభిప్రాయాలు చెప్పాలని దేశ ప్రజలను, రాష్ట్రాల వ్యవసాయ మార్కెటింగ్ శాఖలను కోరింది. ఈ డాక్యుమెంట్ ను పరిశీలిస్తే, 2021 లో రైతుల ఆందోళనల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఒక చట్టం, ఈ డాక్యుమెంట్ రూపంలో మళ్ళీ ముందుకు వచ్చినట్లు మనకు అర్థమై పోతుంది.

దేశంలో వ్యవసాయం తమ హయాంలో అద్భుతం గా అభివృద్ధి చెందుతుందనీ, పంటల ఉత్పత్తి కూడా భాగా పెరిగిందనీ, ఉద్యాన పంటల ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరిగాయనీ, 2016-2017, 2022-2023 మధ్య కాలంలో 7 సంవత్సరాలపాటు, వరుసగా వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 5 శాతానికి పైగా ఉందని, దేశ వ్యవసాయ ,అనుబంధ రంగాలలో చేపల ఉత్పత్తి వృద్ధి రేటు 9.08 శాతం గా ఉందనీ, పశువుల ఉత్పత్తుల వృద్ధి రేటు 15.76 శాతం గా ఉందనీ, పంటల ఉత్పత్తి వృద్ధి రేటు 2.34 శాతం గా ఉందని ( దీనిని గమనించండి)

2023 ఆర్ధిక సర్వే ప్రకారం భారత దేశం నుండీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు కూడా 50.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఈ పత్రం ప్రకటించింది.

ఈ డాక్యుమెంట్ లో ఎక్కడా స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ఉత్పత్తి ఖర్చుల లెక్కింపు, రైతులకు కనీస మద్ధతు ధరల అందుబాటు, రైతులు కోరుతున్నట్లుగా కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత గురించి కనీస ప్రస్తావన కూడా లేదు. అనేక చోట్ల ఈ డాక్యుమెంట్ లో రైతులకు “Realise Best Price” అనే పదాలు మాత్రమే వాడారు.

భారత రాజ్యాంగం ఆర్టికిల్ 246 ప్రకారం – 7 వ షెడ్యూల్ లో – రాష్ట్రాల బాధ్యతల జాబితాలో ( స్టేట్ లిస్ట్ ) 28 వ అంశంగా వ్యవసాయ మార్కెట్లు ఉంది. అంటే, ఒక రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, పరిశోధన, విద్య, మార్కెటింగ్ వ్యవస్థ, ధరలు – ఇలా అన్ని అంశాలూ రాష్ట్ర ప్రభుత్వ అధికారాల పరిధిలోకి వస్తాయి. కేంద్రం వీటిలో రాష్ట్రం అనుమతి లేకుండా జోక్యం చేసుకోలేదు. ఈ అంశం మోడీ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. రాష్ట్రాల జాబితాలో ఉన్న ఈ అంశాన్ని కేంద్ర జాబితాలోకి లాక్కుంటే, అప్పుడు దానిపై తనకు ఇష్టం వచ్చినట్లుగా మార్పులు, చేర్పులు చేయవచ్చు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టాలలో బడా కార్పొరేట్ కంపనీలకు ఉపయోగపడేలా పూర్తి సవరణలు చేయవచ్చు. ఈ ఉద్దేశ్యంతోనే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం మళ్ళీ ఈ డాక్యుమెంట్ రూపంలో ముందుకు వచ్చిందని అర్థం చేసుకోవాలి.

2020 లో షెడ్యూల్ 7 లో ఉన్న కేంద్ర జాబితా ( సెంట్రల్ లిస్ట్ ) FOOD stuff అనే అంశాన్ని వాడుకుని, తాను వ్యవసాయ మార్కెట్లు, కాంట్రాక్టు ఫార్మింగ్, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ చట్టం లో మార్పులు చేస్తూ, కొత్త చట్టాలను తేవడానికి ప్రయత్నించింది. దానిని రైతులకు తిప్పి కొట్టారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం చేసిన ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకించాయి.

నిజానికి ఈ పదేళ్ళ కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి చేసి, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ ల చట్టాలలో అనేక సవరణలు చేయించింది. రెండు మూడు అంశాలలో తెలంగాణ ఇంకా చట్ట సవరణ చేయలేదు. రూల్స్ రూపొందించలేదు. కాకపోతే, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చట్టంలో కేంద్రం చెప్పిన సవరణలు చేయడం వల్ల, తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థపై పడిన ప్రభావాల గురించి , వ్యవసాయ కమిషన్ ఒక లోతైన అధ్యయనం చేయించాలి.

దేశంలో 2024 మార్చ్ 31 నాటికి 2605 ప్రధాన మార్కెట్ యార్డులు , 4452 సబ్ మార్కెట్ యార్డులు మొత్తం 7057 మార్కెట్ యార్డులు ఉన్నాయి. దేశ వ్యాపితంగా 22,931 గ్రామీణ సంతలు ఉన్నాయి. వీటిలో 63.25 శాతం స్థానిక సంస్థలు నిర్వహిస్తుండగా, 28.93 శాతం ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. దేశ వ్యాపితంగా మరో 450 చోట్ల మార్కెట్ కమిటీలను వేశారు కానీ, మార్కెట్ యార్డ్ లు ఏర్పాటు చేయలేఊ. కొన్ని చోట్ల మార్కెట్ యార్డులను నోటిఫై చేసినా, అక్కడ మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. 3 ఈశాన్య రాష్ట్రాలలో ఇంకా మార్కెటింగ్ కమిటీ చట్టాలు లేవు .

దేశ వ్యాపితంగా 125 ప్రైవేట్ హోల్ సెల్ మార్కెట్లు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్,రాజస్థాన్ లో ఉన్నాయి. కానీ ఇవి ఎలా పని చేస్తున్నాయి అన్న విషయంలో నిర్ధిష్ట అధ్యయనం ఏదీ జరగలేదని ఈ డాక్యుమెంట్ అంగీకరించింది.ప్రైవేట్ మార్కెట్ల పని తీరుపై అధ్యయనం లేకుండానే కొత్తగా మళ్ళీ ప్రైవేట్ మార్కెట్ ల ఏర్పాటుకు అన్ని రాష్ట్రాలు అనుమతించాలని ప్రతిపాదించడం ఎంతవరకు సమంజసం?

దేశ వ్యాపితంగా e –NAM లో 1389 మార్కెట్ లు భాగంగా ఉన్నాయి. 219 వ్యవసాయ ఉత్పత్తులను ఇవి డీల్ చేస్తున్నాయి. అయితే e-NAM వచ్చాక రైతులకు నిజంగా లాభం జరిగింది అనడానికి కూడా నిర్దిష్ట ఆధారాలు లేవు. ఎందుకంటే, ఏ మార్కెట్ లో ఏ ధరలకు ఉత్పత్తులు లభిస్తున్నాయి అని చూసుకోవడానికి ఈ ప్లాట్ ఫారం వ్యాపారులకు ఉపయోగపడుతున్నది కానీ, e-NAM లో వ్యాపారానికి, కనీస మద్ధతు ధర బేస్ ప్రైస్ గా లేదు. అందువల్ల, వ్యాపారులు, చాలా తక్కువ ధరకే బేరం మొదలు పెడుతున్నారు. ఎక్కడ తక్కువకు లభిస్తే అక్కడ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.

రైతులపై జాతీయ కమిషన్ ( NCF) 2006 నివేదికలో చేసిన సిఫారసుల ప్రకారం 80 చదరపు కిలో మీటర్లకు ఒక మార్కెట్ యార్డ్ ఉండాలి. కానీ సగటున దేశంలో 467 చదరపు కిలో మీటర్లకు ఒకటి ఉంది. పంజాబ్ లో ప్రతి 115 చదరపు కిలో మీటర్లకు ఒక మార్కెట్ యార్డ్ , హర్యానా లో ప్రతి 223 చదరపు కిలో మీటర్లకు ఒక మార్కెట్ యార్డ్ ఉంటే, తెలంగాణలో 2024 మార్చ్ 31 నాటికి సగటున 397 చదరపు కిలోమీటర్లకు ఒక మార్కెట్ యార్డ్ సేవలు అందిస్తోంది. నిజానికి జరగవలసిన పని , 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభయ హస్తం మానిఫెస్టో లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా మండలానికి ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడం.

ఆ మార్కెట్ యార్డులలో అన్ని సౌకర్యాలు కల్పించడం. మగ రైతుల, మహిళా రైతుల విశ్రాంతికి కూడా తగిన సౌకర్యాలు అభివృద్ధి చేయడం, కాటా లో మోసాలు లేకుండా, వ్యాపారులు రింగ్ గా ఏర్పడి రైతులను మోసం చేయకుండా చూడడం. రైతులు తీసుకు వచ్చిన అన్ని పంటలకు కనీస మద్ధతు ధరలు అందేలా మార్కెట్ కమిటీ, మార్కెటింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయడం, రైతులు తెచ్చిన పంటలు వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడం, తడిచిన ధాన్యానికి, ఇతర పంటల కొనుగోలుకు మార్కెట్ కమిటీ బాధ్యత వహించడం, మార్కెట్ కమిటీ ఆధ్వర్యం లోని గిడ్డంగులలో, కోల్డ్ స్టోరేజ్ లలో దళారీ వ్యాపారులు కాకుండా రైతులు, రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల కంపనీలు మాత్రమే తమ పంటలను దాచుకునేలా చూడడం , రైతులు నిల్వ చేసుకున్న పాంతలపై రైతు బంధు పథకం క్రింద తప్పకుండా 6 నెలల కాలానికి వడ్డీ లేని బ్యాంకు రుణాలు దక్కేలా చూడడం,రైతుల దగ్గర పంటలను కొనుగోలు చేసిన వ్యాపారులు రైతులను మోసం చేస్తే,రైతులకు అండగా నిలబడి, వ్యాపారుల నుండీ పరిహారం ఇప్పించడం మార్కెట్ కమిటీల బాధ్యతగా ఉండాలి.

కేంద్రం తెచ్చిన తాజా డాక్యుమెంట్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు, తమ తమ రాష్ట్రాలలో మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి పూనుకోవాలని, రైతులకు మరిన్ని సేవలు అందించాలని సూచించలేదు. పైగా వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆసక్తి లేదని, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ అధికారులకు, కమిటీలకు సామర్ధ్యాలు, నైపుణ్యాలు లేవని నిందించింది. అందువల్ల మొత్తం వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ( PPP) పద్ధతిలోకి మార్చాలని ప్రతిపాదించింది. ప్రైవేట్ వ్యాపారులు , ఇప్పుడున్న వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను చాలా మెరుగ్గా నిర్వహిస్తారని, అందువల్ల మార్కెట్ కమిటీలకు, రైతులకు కూడా లాభమని చెప్పింది.

ప్రతి రాష్ట్రం కనీసం ప్రతి రెవెన్యూ డివిజన్ కు ఒకటి చొప్పున ప్రైవేట్ హోల్ సేల్ మార్కెట్ లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాలని, క్రమంగా ప్రతి జిల్లాలో కనీసం ఒకటి ప్రైవేట్ మార్కెట్ ఉండేలా చూడాలని ఈ డాక్యుమెంట్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన వెనక లక్ష్యం స్పష్టం. కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించకుండా, ప్రైవేట్ మార్కెట్ లు ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వడం అంటే, రైతులను వ్యాపారుల దోపిడీకి బలి చేయడమే. APMC చట్టాల ప్రకారం మార్కెట్ కమిటీలు ఉంటాయి. అధికార గణం ఉంటుంది. ఆ కమిటీలకు, అధికారులకు రైతులకు న్యాయం చేయాలనే బాధ్యత ఉంది. ఇప్పుడు ఆచరణలో కమిటీలు, అధికారులు అలా వ్యవహరిస్తున్నారా లేదా అనేది వేరే విషయం. ఈ వ్యవస్థను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ, ఈ వ్యవస్థ ఇప్పుడు బాగా పని చేయడం లేదని, ప్రైవేట్ మార్కెట్ వ్యవస్థను అనుమతించడం ప్రమాదకరం అవుతుంది.

వాల్యూ చైన్ సెంట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ( VCCI), డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DI) ఏర్పాటు చేయాలని, గ్రామ స్థాయి గ్రామీణ హట్ లను గ్రామీణ వ్యవసాయ మార్కెట్ లుగా అభివృద్ధి చేయాలని ఈ డాక్యుమెంట్ ప్రతిపాదిస్తుంది. రైతుల సంఖ్య, పంటల విస్తీర్ణం, మార్కెట్ కు వచ్చే అదనపు ఉత్పత్తి, రవాణా సౌకర్యాలు, ఇతర వసతులు, పూర్త స్థాయిలో మాపింగ్ చేసి, అగ్రి స్టాక్ గా అందరికీ అందుబాటులో ఉంచాలని ఈ పత్రం సూచించింది. ఈ సూచనలు మంచివే. కానీ వీటిని ఎందుకోసం, ఎవరి కోసం ఉపయోగించుకోవాలనేది మనం ఆడగాల్సిన ప్రశ్న.

మార్కెట్ కమిటీలు ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి కానీ, మౌలిక వసతులు కల్పించడం లేదని ఈ పత్రం విమర్శ. గ్రామ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి, జిల్లా స్థాయిలో,ప్రాంతీయ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి చేయాలని, ఇవన్నీ పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ పద్ధతిలో చేయాలని, పత్రం ప్రతిపాదన. ఈ మొత్తం డాక్యుమెంట్ లో ఈ PPP మోడల్ ప్రతిపాదన అత్యంత కీలకమైనది. ఒక రకంగా ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థలో వ్యాపారులను భస్వాములను చేయడం ద్వారా మొదటి అడుగు వేయాలని కేంద్రం చూస్తున్నది. క్రమంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థ పై వ్యాపారులకు ఆధిపత్యం దక్కేలా పరిస్థితులు దారి తీస్తాయని మోడీ ప్రభుత్వ ఆశ. అభిలాష.

డిజిటల్ టెక్నాలజీ/AI లాంటి వాటి అభివృద్ధిలో, మార్కెట్ యార్డులలో మౌలిక వసతుల కల్పనలో , ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటులో ,మార్కెట్ యారులలో ప్రత్యేకంగా చిరు ధాన్యాలకు ప్రోత్సాహకంలో, మార్కెట్ యార్డులలో ప్రత్యేకంగా సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ లో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ ఉండాలని పత్రం ప్రతిపాదించింది.

జాతీయ విధాన పత్రానికి అనుగుణంగా , రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టం లో మార్పులు చేసి, రాష్ట్ర స్థాయి విధాన పత్రాన్ని తయారు చేసుకోవాలని పత్రం సూచించింది. వ్యాపారులకు సులువుగా ఉండేలా రాష్ట్ర మార్కెటింగ్ శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని పత్రం నొక్కి చెప్పింది. లైసెన్సుల మంజూరులో, ఫీజుల వసూలు లో ట్రేడర్స్ పై భారం పడకుండా చూడాలని పత్రం సూచించింది.

ఈ పత్రం ప్రధానంగా రాష్ట్ర చట్టాలలో ఈ క్రింది అంశాలలో మార్పులు చేయాలని ప్రతిపాదిస్తుంది.

1. ప్రైవేట్ హోల్ సేల్ మార్కెట్ల స్థాపన

2. వ్యాపారులను ఆకర్షించే విధంగా రూల్స్ లో మార్పులు

3. ప్రైవేట్ ప్లేయర్స్ నేరుగా రైతుల నుండీ కొనుగోలు చేయడం ( ఇప్పటి కంటే పెద్ద స్థాయిలో )

4. వ్యాపారుల గిడ్డంగులను మార్కెట్ యార్డులుగా గుర్తించడం , రైతులు వాళ్ళకు నేరుగా అమ్ముకున్నప్పుడు, మార్కెట్ ఫీజు మినహాయించడం

5. ప్రైవేట్ e - ట్రేడింగ్ ప్లాట్ ఫారంస్ ఏర్పాటుకు అనుమతించడం

6. రాష్ట్రమంతా ఒకేసారి మార్కెట్ ఫీజు తీసుకోవడం (మార్కెట్ యార్డుల వారీగా కాకుండా )

7. రాష్ట్రమంతా చెల్లేలా యూనిఫైడ్ ట్రేడింగ్ లైసెన్స్ జారీ చేయడం

8. మార్కెట్ ఫీజు ను పునసమీక్షించడం, కమిషన్ చార్జీలను పున సమీక్షించడం

9. ఇతర రాష్ట్రాల ట్రేడింగ్ లైసెన్స్ ను కూడా వేరే రాష్ట్రాలలో గుర్తించడం

10. కూరగాయలు, పండ్లు లాంటివి మార్కెట్ యార్డ్ బయట కొనుగోలు చేయడానికి అనుమతులు మంజూరు చేయడం

ఇలాంటి మరి కొన్ని ప్రతిపాదనలు ఈ పత్రం చేసింది. ఈ ప్రతిపాదనల లక్ష్యం స్పష్టమే. ప్రైవేట్ వ్యాపారులను, ముఖ్యంగా బడా కార్పొరేట్ సంస్థలను వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ లోకి సులువుగా ప్రవేశించే అవకాశం కల్పించడం. ఈ ప్రక్రియ అంతిమ ఉద్దేశం, రాష్ట్రాల పరిధిలో ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను, జాతీయ స్థాయిలో కేంద్రం చేతుల్లోకి తీసుకుపోవడం.

ఈ పత్రాన్ని ఆమోదించడమంటే రాష్ట్రాలు ఇప్పటివరకూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ పై తనకున్న అధికారాలను కోల్పోవడం, రాష్ట్ర స్థాయిలో మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి ఉన్న అవకాశాలను వదులుకోవడం. ఇవి అంతిమంగా రాష్ట్ర రైతులను ప్రైవేట్ వ్యాపారుల లాభ దాహానికి బలి ఇవ్వడమే.

రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ఈ పత్రాన్ని తిరస్కరించాలి. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈ మేరకు తీర్మానం ఆమోదించాలి. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను ప్రభుత్వ రంగంలో బలోపేతం చేయాలి. ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా మండలానికి ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి.

రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నోడల్ ఏజెన్సీ గా రైతు సహకార సంఘాలను, రైతు ఉత్పత్తిదారుల కంపనీలను మహిళా సహకార సంఘాలను, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉన్న ఇతర సహకార సంఘాలను భాగస్వాములను చేస్తూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఒక ఉమ్మడి ప్లాట్ ఫారం ఏర్పాటు చేయాలి. ఆ ప్లాట్ ఫారం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతులకు న్యాయం జరిగేలా, కార్యక్రమాలు రూపొందించాలి. వ్యవసాయం , ఉద్యాన శాఖ, పశుసంవర్ధన , మత్స్య శాఖల సమన్వయంతో గ్రామ స్థాయి నుండీ, రాష్ట్ర స్థాయి వరకూ మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ వ్యవస్థ ప్రైవేట్ పెట్టుబడి దారుల లాభాల కోసం కాకుండా, సంపూర్ణ గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం,వ్యవసాయ కుటుంబాల సంక్షేమం కోసం రూరల్ కమ్యూనిటీ, ప్రభుత్వం కలసి పని చేసే మోడల్ గా దీనిని గుర్తించాలి.

(ఈ నోట్ తెలంగాణ వ్యవసాయం, రైతు సంక్షేమ కమిషన్ సమావేశంలో 13-03-2025 న సమర్పించాము).

Tags:    

Similar News