తెలంగాణధీశ ...చంద్రశేఖర భూపాల!
భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల ప్రస్థానం సమీక్షిస్తున్న ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత తెలకపల్లి రవి;
భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కె చంద్రశేఖర్ రావు (KCR) 2014 తొలి ఎన్నికల్లో బొటాబొటిగానే అధికారంలోకి వచ్చారు. తెలంగాణ సాధించాక తొలి ము ఖ్యమంత్రి దళితుడే వుంటాడని హామీ ఇచ్చారు.తెలంగాణ సాధించన ఘనత కన్నా ముఖ్యమంత్రి పదవి ఏమీ గొప్పకాదని వ్యాఖ్యానించారు. తీరా ఆ సమయం వచ్చాక తనే పదవి చేపట్టడానికి సిద్ధమైనారు. కొత్త రాష్ట్రం నిలదొక్కుకోవడానికి, సమ్కైక్యాంధ్ర నేతల కుట్రలు వమ్ము చేయడానికి తను వుండాలని పార్టీ వారు కోరారని చెప్పారు. ఈ మాట ఒక దళిత నేతతోనే చెప్పించి తర్వాత ఆయనను ఉపముఖ్యమంత్రిని చేసి అనతికాలంలోనే తొలగించారు.
2014 జూన్ 2 అపాయింటెడ్ డే (Appointd Day) రోజున చాలా నిరాడంబరంగా త్వరత్వరగా ప్రమాణస్వీకారం చేశారు. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి చంద్రబాబు చాలా రోజులు సమయం తీసుకున్నారు. ఇక కెసిఆర్ అధికారంలోకి రాగానే చేసిన తొలిపని మజ్లిస్ (MIM) పార్టీతో జట్టుకట్టడం. కెటిఆర్ అక్బరుద్దీన్ ఒవైసీని కలసి వచ్చారు. నామకార్థపు మెజార్టి వున్న తాము మజ్లిస్‌తో కలవడం కోసం కొన్ని కోర్కెలు తీరిస్తే సరిపోతుందని, మత కలహాలను కూడా తగ్గించవచ్చునని కెసిఆర్ భావించారు.తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు సాగుతున్నాయని అసదుద్దీన్ ఒవైసీ చెప్పాడనీ అందుకే ఇతర పార్టీల వారిని చేర్చుకుని వాటిని వమ్ము చేశానని తర్వాత ఆయన సమర్థించుకున్నారు.
తొలినాళ్లలో ప్రతిపక్షాలు సుహృద్భావం
తెలంగాణ కొత్త రాష్ట్రమైనా హైదరాబాద్ వంటి రాజధాని కొనసాగింపు, మిగులు బడ్జెట్‌తో సహా కొన్ని అనుకూలాంశాలూ వున్నాయి. రాష్ట్రం కోసం కదంతొక్కిన ూద్యమ శ్రేణులు అంకిత భావంతో వచ్చిన అధికారులు,మద్దతుగా వుంటామనే ఉద్యోగులు వున్నారు.. అధికార పీఠం అధిష్టించిన టిఆర్‌ఎస్ (TRS) అధినేతపై సుహృద్భావం రీత్యా ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయడానికి కొంత సమయం తీసుకున్నాయి, ఇన్ని అనుకూలాంశాలున్నా ముఖ్యమంత్రి వ్యవహారశైలి అసౌఖ్యవాతావరణానికి కారణమైంది. రాష్ట్రావతరణ తర్వాత కొత్తలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్టు, ఫీ రీ ఇంబర్స్‌మెంట్ వంటి విషయాల్లో కెసిఆర్ ఎంతోకొంత ఇబ్బందికరమైన విధానం తీసుకుని కోర్టుల జోక్యంతో వెనక్కు తగ్గారు. నిజానికి విభజన తర్వాత చెప్పుకోదగిన ప్రాంతీయ తేడా లేమీ ప్రజల మధ్య కనిపించలేదు. అప్పటికి ఇంకా ఉమ్మడి రాజధాని మాత్రమే గాక గవర్నర్ నరసింహన్ కూడా ఉమ్మడిగానే వున్నారు. ఏదో సందర్భంలో విమానాశ్రయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి వెళ్లినప్పుడు కెసిఆర్ చొరవతీసుకుని చంద్రబాబుతో ముచ్చట్లు ఫోటోలు నడిపించి ఉభయ చంద్రులనే కొత్త భావనకూ పదానికి చోటు కల్పించారు. అయినా సాగర్ జలాల వంటి సమస్యలు వచ్చినపుడు 2014 ఆగష్టులో గవర్నర్ నరసింహన్ ఉభయ నాయకులతో మాట్లాడి ఏదో సర్దుబాటు చేశారు. కానీ ఇప్పటికి కూడా రెండు రాష్ట్రాల మధ్య తేడాలు సద్దుమణిగాయని చెప్పలేము.
శాసనసభ సమావేశాల కొత్తలో కెసిఆర్ చాలా శ్రద్ధగా విని పేర్లతో సహా ప్రస్తావిస్తూ సమాధానమిచ్చేవారు. ఇదిచాలా స్పల్పకాలమే. కొద్ది రోజుల్లోనే ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం మొదలు పెట్టాక అంతా మారిపోయింది. సభలో సామూహిక సస్పెన్షన్లు నిత్యకృత్యంగా మారాయి. పరిపాలన శత దినసంపూర్తి చేసుకున్న సంతోషకర సందర్భంలో. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ అవసరం గుర్తించబట్టే తన పాలన సంతృప్తిగా లేదని ప్రకటించుకున్నారు. మొదట చాలా దూకుడుగా మొదలై ప్రకటన పరంపరతో హామీలు వాగ్దానాల వరద ఉప్పొంగిన పరిస్థితి. దాంతో పోలిస్తే ఫలితాలు పరిమితంగానూ సందేహాస్పదంగానూ తయారైనాయి. పాతబస్తీని ఇస్తాన్బుల్ చేస్తామనీ, కరీం నగర్‌ను లండన్‌గా మారుస్తామని అతిశయోక్తులు నిరంతరాయంగా సాగాయి. రైతుల రుణమాఫీపై కొంతకాలం అస్పష్టత వున్నా తర్వాత సూటిగానే అమలు చేశారు.
కెసిఆర్‌కు తెలంగాణ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన వున్నమాట ఎవరూ కాదనలేరు. మరీ ముఖ్యంగా ప్రాజెక్టులు ఆయన ఛాయిస్ సబ్జె క్ట్. అదే తమ ప్రాణాధారమంటూ గంటలతరబడి ఎవరికి ఎ ంత అనే తేడా కూడా లేకుండా చెబుతుండేవారు. ఇప్పుడు వివాదాస్పదంగా విచారణసాగుతున్న కాళేశ్వరం ఆయనే డిజైన్ చేశారని టిఆర్‌ఎస్ నేతలు గొప్పగా చెబుతుండేవారు. అదే తమ యుఎస్‌పి (USP) ఆని ఆయన భావన, రైతులు రుణమాఫీపై కొంతకాలం అయోమయం వున్నా తర్వాత చెప్పిన మేరకు చేశారు. కానీ దళితులకు మూడెకరాల భూమి పంపకం మొక్కుబడిగా ముగిసిపోయింది. పారిశ్రామిక వేత్తలకు లక్షల ఎకరాల భూనిల్వ వుందంటూనే ప్రభుత్వం దళితుల కోసం మాత్రం భూమి కొని ఇస్తాననడం దళారుల దందా కోసమేనని విమర్శలు వచ్చాయి. తర్వాత అదీ జరగలేదు. కెజి టు పిజి విద్య, వైద్యం, ఉద్యోగాలు ఉపాధి కల్పన, నిధుల విడుదల వంటి అనేకానేక తక్షణ సమస్యలు కూడా వాయిదా పడ్డాయి. రోజుకో కార్పొరేట్ కరోడ్‌పతిని కలుసుకునే కెసిఆర్ కార్మిక ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు కాలం కేటాయించకపోవడం విమర్శలకు దారితీసింది. విద్యార్థులు, రైతులు ఆఖరుకు మహిళా జర్నలిస్టులపైన కూడా లాఠీచార్జిలు జరిగాయి.
రాష్ట్రసాధన తర్వాత మారిన కెసిఆర్ వ్యూహం
రాష్ట్ర సాధనతో సంతోషం మిన్నంటినా సమస్యలకు మూలమైన సరళీకరణ నమూనాకు భిన్నంగా వెళ్లే అవకాశం లేదని కెసిఆర్ ఆచరణలో తేల్చేశారు. ఇతర పార్టీల వారిని టోకున తెచ్చుకుని శాసనసభ్యుల సంఖ్యను 63 నుంచి 75కు పెంచుకోవడానికి మొదటి మూడు నెలల సమయం సరిపోయింది. పదవీ సంతర్పణలు రాజకీయ పునరావాసాలు షరా మామూలుగానే నడిచాయి. కేబినెట్ సమిష్టి సూత్రం వెనక్కు పోయి సర్వం ముఖ్యమంత్రి ప్రవచితమేనన్న విచిత్ర పరిస్థితి ఏర్పడిరది రుణమాఫీ విషయంలో తొలి వారంలోనే ఆర్థిక మంత్రికి అక్షింతలు వేసిన అధినేత బడ్జెట్ వాయిదాను కూడా తనే ప్రకటించే పరిస్థితి ఏర్పడిరది. ఇవన్నీ ఒకటైతే రెండు ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోవడం నవ తెలంగాణ తొలి ఘట్టంలో ఒక మచ్చగా మారింది. ఈ గడ్డపై వుండదల్చుకుంటే మాకు సెల్యూట్ చేయాలి’ అని చెప్పడంలో ముఖ్యమంత్రి ఆంతర్యం ఏమైనా ప్రణమిల్లాలని శాసించే హక్కు రాజ్యాంగంలో లేదు. ఈ నిలిపివేత వల్ల అభద్రత పాలైన ఆ సంస్థల తెలంగాణ జర్నలిస్టులు మహిళలు ఆందోళన చేస్తే లాఠీచార్జి కూడా దారుణమే. సమరశీలతతోపాటు సహనశీలత కూడా కలిగిన తెలంగాణ సమాజం పత్రికా స్వేచ్చ కోరుకునే వారు ఈ ఆంక్షలు ఆటంకాలను ఎంతమాత్రం ఆమోదించలేదు. ఇవన్నీ వివిధ దశల వాస్తవాలు. తెలంగాణ ప్రజల్లో బలంగావున్న ఒక ఆకాంక్షను తీసుకుని ప్రధాన పార్టీల మద్దతు పొంది చివరలో స్వంతంగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది?
కరెంటు ఉత్పత్తి పెంపుదల, కాళేశ్వరంతో సహా నీటి సదుపాయం విస్తరణ,వేల చెరువుల మత్తడి,రైతులకు భరోసా,హైదరాబాద్‌లో ఫ్లైవోవర్లు,కెటిఆర్ చొరవతో హబ్‌లు,మహిళలకు కిట్‌లు, చీరలు,మతకలహాల నివారణ,మతసామరస్య సంరక్షణ,విభజన తర్వాత కూడా ప్రశాంతత,ఫ్లోరోసిస్ నివారణ,పంటల దిగుబడి అపారంగా పెంపుదల,కొత్త జిల్లాల ఏర్పాటు మౌలిక సదుపాయాల కోసం కృషి అన్నిటినీ మించి భూముల రేట్ల పెరుగుదల ఇవన్నీ తమ విజయాలుగా టిఆర్‌ఎస్ చెప్పుకోవచ్చు. ఆ విధమైన ఫీల్‌గుడ్ ప్యాక్టర్ వచ్చింది కూడా. అయితే దాని పక్కనే కెసిఆర్ ని ఎంతగా గౌరవించేవారైనా ఆయన మాటలను ఎంతగా ఆస్వాదించేవారైనా ప్రభుత్వంలోకి వచ్చాక ఏర్పడిన ఆయన ఏకపక్ష ఏకవ్యక్తి ధోరణని హర్షించలేదన్నది వాస్తవం. తెలంగాణలో బలపడటానికి చంద్రబాబు ఎక్కువ సమయం ఇస్తానని చెబుతుంటే ఆంధ్ర మూలాలున్నవారిని ఆకట్టుకోవడానికి కెసిఆర్ వ్యూహాలు నడిచాయి.
లోకేశ్ తెలంగాణ చూసుకుంటాడనీ, అసలు చంద్రబాబు వాళ్లకు ఇచ్చినంత సమయం తమకు ఇవ్వడంలలేదని టిడిపి నేతలు అంటుండేవారు. నిజానికి అదో ప్రచ్చన్న యుద్ధ కాలం. మీ కాలులో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తాననడం అటూ ఇటూ పేలింది. యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆలయంపై ఫోకస్ కూడా భారీ ఎత్తున మొదలైంది.
తెలంగాణలో చంద్రబాబు చివరి చాప్టర్
2015 మేలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పరేషన్ (GHMC) ఎన్నికలలో టిఆర్‌ఎస్ అఖండ విజయం, పూర్తి స్థాయిలో సవాలు విసిరిన చంద్రబాబు లోకేశ్ ప్రయత్నాలు దారుణంగా దెబ్బతినడంతో కెసిఆర్ పాలనలో మరో ఘట్టం మొదలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే 2015 జూన్ 9న అప్పటికి టిడిపి ఎంఎల్‌ఎగా వున్న రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎంఎల్‌ఎ స్టీవెన్‌సన్ ఇంటి దగ్గర అరెస్టు కావడం సంచలనం కలిగించింది. ఈ కేసు ఇలా వుండగా చంద్రబాబు ఫోన్ సంభాషణ ఆడియో లీక్‌లతో కథ పూర్తిగా మారిపోయింది. అప్పట్లో హోం మంత్రి ఇతర కేంద్ర పెద్దల మధ్యవర్తిత్వంతో చంద్రబాబు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవడం పదేళ్ల ఉమ్మడి రాజధాని అధ్యాయానికి ఏడాదిలోనే ముగింపు సీన్ తెచ్చిపెట్టింది. ఇవన్నీ కెసిఆర్‌కు ఎదురు లేకుండా పోయిందనే అభిప్రాయం కలిగిస్తున్నా ఆయన అంత సౌఖ్యంగా వున్నది లేదు.
ఉద్యమ సహచరులు దూరమయ్యారు
ఉద్యమ సహచరులు దూరమవుతుంటే వున్న వారు కూడా సణుక్కుంటుంటే ఆరోపణలూ అసంతృప్తులూ ప్రత్యక్షమవుతుంటే ఏదో విధంగా దాటేయడం తప్ప నల్లేరుమీద బండిలా నడిచింది లేదు. ‘జో జీతా వహీ సికిందర్’ తరహాలో బండి నడిపిస్తున్నా మళ్లీ అధికారంలోకి రావడానికి కొత్త ఎత్తులు తప్పలేదు.కాంగ్రెస్‌నే ప్రత్యర్థిగా చూస్తూ బిజెపి, మోదీ పట్ల చాలా విధేయంగా వ్యవహరించడం,కమ్యూనిస్టులపై రకరకాలుగా మాటలు మార్చడం, కోదండరాం వంటివారిని దూరం చేసుకోవడం ఈ క్రమంలోభాగాలే. మీడియాదిపతులతో కూడా ఈ దాగుడుమూతలు కొనసాగాయి.
‘‘ఎన్‌కౌంటర్ ఉదంతం, చలో అసెంబ్లీపై దాడి, శాసనసభ్యుల అరెస్టు, అర్థంతరంగా ముగింపు, ఆత్మహత్యలపై తక్షణ చర్యలలో అలసత్వం కెసిఆర్ ప్రభుత్వానికి వన్నె తెచ్చేవి కావు. తెలంగాణ పితామహుడి వంటి చుక్కా రామయ్యను చొక్కా కూడా లేకుండా గృహ నిర్బంధంలోకి తీసుకోవడం కన్నా అప్రజాస్వామికం వుండదు. (వివిధ పత్రికల్లో వచ్చిన చిత్రాలు చూడొచ్చు) ‘చరిత్ర అడక్కు చెప్పింది విను’ అన్న పాత మాటను తిరగేసి ‘చరిత్ర విను, అడిగింది వదిలెయ్’ అంటే విమర్శలూ ఉద్యమాలూ ఆగిపోవు.. పత్రికలనూ పార్టీలనూ తిట్టిపోసినంత మాత్రాన సమస్యలూ పరిష్కారం కావు.
2019 తర్వాత జరిగే ఆత్మహత్యలకు మాత్రమే తాము జవాబుదారిగా వుంటామనడం రాజ్యాంగ రాజకీయవిలువలను ఆపహసించడమే’’ ఇది నేను అప్పట్లో రాసిన వ్యాసంలో ఒక భాగం. నిజానికి ఇందులో ప్రతి ఘట్టంపైనా అప్పట్లోనే తేటతెల్లంగా వివిధ రకాల మీడియాలో వ్యాఖ్యానిస్తూనే వున్నాను. టిఆర్‌ఎస్ తో సహా అన్ని పార్టీల నేతలూ తమ భావాలు అనుభవాలు చెబుతూనే వుండేవారు. కుటుంబ సభ్యుల పేర్లు రకరకాలుగా చర్చకు వచ్చాయి గానీ ఆయన వారి మాటైనా విన్నాడని చెప్పలేము.
కలిసొచ్చిన చంద్రబాబు-కాంగ్రెస్ స్నేహం
ఇలాంటి నేపథ్యంలోనే కెసిఆర్ 2018లో హఠాత్తుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కాస్త ముందు నుంచి మీడియాలో దీనిపై వూహాగానాలు నడుస్తూనే వచ్చాయి. దానికి సిద్ధం కావడం కోసం ‘కెసిఆర్ దేశ్ కీ నేత’ అంటూ నినాదం ఇప్పించారు. తెలంగాణ బిడ్డ దేశానికి ప్రధాని కావాలనే సెంటిమెంటు తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం నడిపించారు. అదే సమయంలో తొలిపాలనలో అసంతృప్తి మూటకట్టుకున్న చంద్రబాబు నాయుడు యు టర్న్ తీసుకుని కాంగ్రెస్‌తో జతకట్టి పోటీ చేయడం కెసిఆర్‌కు పూర్తిగా కలసి వచ్చింది. కాలం అయిదేళ్లు వెనక్కు నడిచినట్టు ప్రచార సమరం సాగింది. గతసారి ఎన్నా ఎక్కువ స్థానాలతో ఆయన మళ్లీ అధికారంలోకి రాగలిగారు. రెండవ పదవీ కాలంలో మరింత నాటకీయమైన పరిణామాలు మలుపులూ కుదుపులూ చూశాం. ఓటమి తర్వాతా పార్లమెంటు ఎన్నికల ముందు దీనిపై కెసిఆర్ స్వయంగా ఏం మాట్లాడారో కూడా చూద్దాం. (సశేషం)