పార్మా, ఫ్యూచర్ సీటీలు ‘తెలంగాణ’ని మింగేస్తాయి, కబడ్దార్
“తెలంగాణ వ్యవసాయాన్ని, పర్యావరణాన్ని, ప్రజల భవిష్యత్తును కోసం ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ ప్రణాళికలు ఆపేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.”;
-కన్నెగంటి రవి, సరస్వతి కవుల
తెలంగాణ రాష్ట్రం మధ్యలో, హైదరాబాద్‌కు దక్షిణంగా సుమారు 50 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా ఉంది. ఈ ప్రాంతం అనేక రిజర్వ్ ఫారెస్ట్ లు, రాతి కొండలు, గడ్డి భూములు, చెట్లు, పొదలు నిండిన భూములత, గొలుసు లాగా అనుసంధానమైన సరస్సులతో, చుట్టూ ప్రకృతి సంపదతో కూడి ఉంది. ఇక్కడ అనేక రకాల వృక్ష జాతులు, జంతుజాలం ఉన్నాయి, వీటిలో ఉడుములు, సరీసృపాలు, చిరుత పులులు లాంటి అరుదైన మరియు అంతరించి పోతున్న జాతులు కూడా ఉన్నాయి. నెమళ్లు, కొంగలు వ్యవసాయ క్షేత్రాల్లో సమృద్ధిగా ఉన్నాయి, తేనె టీగలు, సీతాకోక చిలుకలు, అనేక రకాల ఇతర పక్షులు కూడా ఉన్నాయి.
ఈ ప్రాంతంలోని ప్రజలు ప్రధానంగా వ్యవసాయ దారులు. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వ్యవసాయ క్షేత్రాలు అడవులతో, అడవులు వ్యవసాయ భూములతో సజావుగా కలిసి పోతాయి. మంచి వర్షా కాలంలో, చిన్న చిన్న పాయలు నీటితో సజీవంగా మారతాయి. సరస్సులు, చేపలతో నిండి ఉంటాయి, ఇది ప్రజలకు చేపల వేటను మరొక ముఖ్యమైన జీవనోపాధిగా మారుస్తుంది.
అలాంటి ఈ ప్రాంతంలోని యాచారం, కందుకూరు, కడ్తల్ మండలాలలో 2016లో కె. చంద్రశేఖర్రావు పాలనలో సుమారు 19,333 ఎకరాల భూమిలో హైదరాబాద్ ఫార్మా సిటీని స్థాపించడానికి నిర్ణయించారు. దాదాపు 1000 ఫార్మా తయారీ యూనిట్లు, ఒక ఫార్మా యూనివర్సిటీ, ఒక థర్మల్ పవర్ ప్లాంట్, ఒక రెసిడెన్షియల్ ఏరియాను స్థాపించడం ఈ ప్రణాళికలో భాగం. స్థానిక ప్రజల గొంతులను అణచివేసి, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణ అనుమతిని మోసపూరిత పద్ధతుల ద్వారా పొందింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మోసంలో భాగమైంది.
స్థానిక గ్రామాల ప్రజలు, శాస్త్రవేత్తలు మరియు పర్యావరణ వాదులు పలుమార్లు MoEF కు వినతి పత్రాలు సమర్పించి, ఈ పర్యావరణ సున్నితమైన ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వవద్దని కోరారు. అయినప్పటికీ, మోదీ నేతృత్వం లోని భారత ప్రభుత్వం ఉదాసీనతను ప్రదర్శించి, ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది.
పర్యావరణ అనుమతి మంజూరు కాకముందే, అప్పటి ప్రభుత్వం అప్పటికే, పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములను రైతుల నుండీ తీసేసుకుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు చిన్న రైతులు. మొదట, ఈ ప్రాజెక్టు కోసం కేవలం అసైన్డ్ భూములు మాత్రమే తీసుకుంటామని రైతులకు చెప్పారు. అసైన్డ్ భూములు అనేవి 1970 లలో భూమి లేని వారికి సాగు చేసుకోవడానికి మాత్రమే ఇచ్చిన భూములు, వీటిని విక్రయించే అధికారం వారికి లేదు. తమ హక్కుల గురించి పెద్దగా తెలియక, ప్రజలు అసైన్డ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆ సమయంలో అంగీకరించారు. అయితే, వారికి నేటికీ సరైన నష్ట పరిహారం చెల్లించలేదు.
కానీ 2017 నాటికి అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం పట్టా భూములను ప్రైవేట్ భూములను) కూడా స్వాధీనం చేసుకోవడానికి నోటిఫికేషన్‌లు జారీ చేయడం ప్రారంభించింది. అందుకు ఈ ప్రాంత రైతుల నుండి నిరసనలు వచ్చాయి.
మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల నుండి సుమారు 1000 మంది రైతులు భూసేకరణను సవాలు చేస్తూ హై కోర్టును ఆశ్రయించారు. గౌరవనీయ హైకోర్టు భూముల నుండి రైతులను బలవంతంగా తొలగించవద్దని, ఇతర ఏ బలవంతపు చర్యలు తీసుకో వద్దని స్టే ఆర్డర్ లు జారీ చేసింది.12 కేసులలో సాధారణ అవార్డులు, డిక్లరేషన్‌లు మరియు భూ సేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ లను సస్పెండ్ చేస్తూ తుది ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.
అలాగే, భూమి లేని కూలీలు దాఖలు చేసిన కేసులలో, రాష్ట్ర హైకోర్టు గ్రామంలోని ఏ భూములను (అసైన్డ్ భూములు మరియు యజమానులు సమ్మతి ఇచ్చిన పట్టా భూములను) స్వాధీనం చేసుకోవద్దని ఆదేశించింది. దీంతో మేడిపల్లి, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలు పూర్తిగా స్టే ఆర్డర్‌ల కిందకు వచ్చాయి. అయినప్పటికీ, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఇతర ఏ బలవంతపు చర్యలు తీసుకోవద్దన్న కోర్టు ఆదేశాలను కూడా అతి క్రమించి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) భూముల ఆన్ లైన్ రికార్డుల నుండి (ధరణి) రైతుల పేర్లను తొలగించి, వాటి స్థానంలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC)పేరును చేర్చారు. అప్పటి ప్రభుత్వ ఈ చర్యపై రైతులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆన్ లైన్ రికార్డులలో రైతుల పేర్లను పునరుద్ధరించాలని, రైతులకు పంట రుణాలు, రైతు బంధు పథకాలు అందించాలని స్పష్టంగా ఆదేశించింది.
ఈ సమయంలో, అప్పటి కాంగ్రెస్ నాయకులు( రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎం. కోదండ రెడ్డి) ఫార్మా సిటీ కి వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఉద్యమానికి మద్ధతు ఇచ్చారు. రైతులతో కలసి కలిసి ఉద్యమాలలో పాల్గొన్నారు. అంతే కాకుండా, ఫార్మా సిటీ ప్రాజెక్ట్‌ను తాము వ్యతిరేకిస్తున్నామనీ, భూసేకరణ చట్ట విరుద్ధ మైనది గానూ, అన్యాయమైనది గానూ ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము అధికారంలోకి వస్తే, ఫార్మా సిటీని రద్దు చేస్తామని, రైతుల పేర్లను ఆన్‌లైన్ రికార్డులలో పునరుద్ధరిస్తామని, రైతులకు అన్ని పథకాలు అందిస్తామని, గత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అసైన్డ్ మరియు పట్టా భూములను కూడా రైతులకు తిరిగి ఇస్తామని వాగ్దానం చేశారు. ఫార్మా సిటీ రద్ధు పై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో కూడా హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఫార్మా సిటీ రద్దు చేయబడిందని ప్రకటించారు. దాని స్థానంలో మెగాసిటీ / ఫోర్త్ సిటీ / ఫ్యూచర్ సిటీ మొదలైనవి నిర్మిస్తామని చెప్పారు. కానీ రైతులకు వాగ్దానం చేసినట్లు ఇప్పటి వరకూ రైతుల భూములు వెనక్కు తిరిగి ఇవ్వలేదు. తొలగించిన రైతుల పేర్లు చేరుస్తూ ఆన్‌లైన్ రికార్డులు కూడా సరిదిద్దలేదు.
ఇప్పుడు మళ్ళీ అధికారులు గ్రామాలకు వచ్చి, రైతులను తమ భూములను వదులుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ఫార్మా సిటీ రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినందున, గత ప్రభుత్వం తీసుకున్న భూ స్వాధీనం కూడా రద్దు చేయాలని రైతులు హైకోర్టు లో వాదించారు. అప్పుడు, అసలు నిజం బయటపడింది. “ప్రభుత్వం ఫార్మా సిటీ నిర్మాణం కోసం తెచ్చిన GO 31 ని సస్పెండ్ చేయలేదు. దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నామని “ కోర్టు లో ప్రకటించారు.
మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచరులందరూ ఫార్మా సిటీ రద్దు చేయ బడిందని, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని గ్రామాలలో రైతులకు బహిరంగంగా చెబుతున్నారు. ఫార్మా సిటీ కోసం ఇప్పటికే గుర్తించిన భూమిని తీసు కోవడమే కాకుండా, అదనంగా మరో 30,000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను ఫ్యూచర్ సిటీ కోసం స్వాధీనం చేసుకోవాలని కూడా వీరు కోరుకుంటున్నారు. ఇందు కోసం ఒకే ఒక్క ప్రభుత్వ GO ద్వారా, రంగారెడ్డి జిల్లా 7 మండలాలలోని 56 గ్రామ పంచాయతీలను రద్దు చేసి, వాటిని ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) లో భాగం చేశారు.
ఫ్యూచర్ సిటీలో ఏమి నిర్మించబోతున్నారు?
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటిస్తున్న ఫ్యూచర్ సిటీ లో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు, స్మార్ట్ ఫోన్ కంపెనీలు, ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, గోల్ఫ్ కోర్సులు, జంతు సంరక్షణ కేంద్రం, స్పోర్ట్స్ స్టేడియం, రేస్ కోర్స్ , ఎత్తైన భవన సముదాయాలు, ఫార్మా స్యూటికల్ యూనిట్ల తో కూడిన ఫార్మా సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ నిర్మాణం చేస్తామని చెబు తున్నారు. వీటిని "యువతకు ఉపాధి కల్పించడం” పేరుతో నిర్మించ బోతున్నారు.
ఏఐ, అతి యాంత్రీకరణ, రోబోటిక్స్ వల్ల హై-ఎండ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలే యువత కోల్పోతున్న ఈ కాలంలో, స్థానిక చేతి వృత్తుల కుటుంబాలు, వ్యవసాయదారులు ఈ అత్యంత ఆధునిక, యాంత్రీకరణతో నడిచే కంపెనీలలో ఉద్యోగాలు పొందగలరా ? గత కొన్ని దశాబ్దాల అనుభవం ఆధారంగా కనిపిస్తున్నది ఏమంటే, పారిశ్రామిక జోన్ ల కోసం భూమిని కోల్పోయినవారు, స్థానిక ప్రజలు ఎక్కడా ఉద్యోగాలు పొంద లేదు. ఒక వేళ ఉద్యోగం పొందినా, ఇవి శాశ్వత ఉద్యోగాలు కావు. మరోవైపు, ఈ ప్రాంతంలో వ్యవసాయం, పశు పోషణ మొత్తం కుటుంబాలకు ఏడాది పొడవునా ఉపాధిని అందిస్తున్నాయి.
పొంచివున్న ప్రమాదం ఏంటి?
ఈ అభివృద్ధి నమూనా కోసం అనుసరిస్తున్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతుల వల్ల ప్రజాస్వామ్యం, ప్రజల ద్వారా పాలన ప్రమాదంలో ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో, గ్రామ పంచాయతీల రద్దు ప్రకటన, ఇప్పటికే, ప్రజల స్వయం పాలన హక్కును తొలగించింది.
మరో వైపు ఫార్మా సిటీ పేరుతో భూసేకరణకు పూనుకున్న 13, 800 ఎకరాల చట్ట పరమైన వివాదంలో ఉన్న వ్యవసాయభూములే కాక, ఈ ప్రాంతంలో మరో 1,80,000 ఎకరాల వ్యవసాయ భూముల భవిష్యత్తు కూడా ప్రమాదంలో ఉంది. ఫలితంగా రాష్ట్ర ప్రజల ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడ నుంది. ఈ గొప్ప జీవ వైవిధ్య ప్రాంతం, చుట్టు పక్కల ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లు, వాటిలో వన్య ప్రాణుల భవిష్యత్తు తో పాటు, సుమారు 3 లక్షల మంది ప్రజల జీవనోపాధులు కూడా ప్రమాదంలో పడ నున్నాయి.
2013 భూ సేకరణ చట్టం ప్రకారం, ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం పర్యావరణ అనుమతులు తీసుకున్న భూమిని మరొక ప్రయోజనం కోసం మళ్లించ కూడదు. అలాంటి చర్య తీసుకోవాలంటే, చట్టం ప్రకారం తగిన విధానాలు అనుసరించాలి. కొత్త ప్రాజెక్టు ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ రిపోర్ట్, వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ ని స్థానిక భాషలో ( తెలుగులో, ఉర్దూలో) తయారు చేసి, వాటిని ప్రజల ముందు ఉంచి, పబ్లిక్ హియరింగ్ లు, గ్రామ సభల ద్వారా ప్రజల ఆమోదం మళ్ళీ తీసుకోవాలి. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్స్ కు సూచించి, శాస్త్రీయ అభి ప్రాయం తీసుకుని కొత్త పర్యావరణ అనుమతిని మళ్ళీ పొందాల్సి ఉంటుంది. ప్రాజెక్టు కోసం ప్రజల సమ్మతితో మాత్రమే అదనపు భూమిని తీసుకోవాల్సి ఉంటుంది.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఒక రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం అనుసరించాల్సిన ప్రజాస్వామిక పద్ధతి ఇది. నిజానికి ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ స్థాపించబడటం లేదు కాబట్టి, దానికి ఇచ్చిన పర్యావరణ అనుమతిని సస్పెండ్ చేయాలి .కొత్త ప్రాజెక్టు కొత్త EC కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటి వరకూ ఏమీ చేయలేదు. ఎటువంటి పబ్లిక్ చర్చ లేదా ప్రజల ఆమోదం లేకుండా, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ స్థాపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఒక్క కలం పోటుతో,56 గ్రామాలు స్వయం పాలన హక్కును కోల్పోయాయి. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన ఈ గ్రామాల ప్రజలు ఇప్పుడు వారి సమ్మతి లేకుండా, వారి అభిప్రాయం తీసుకోకుండా "ఫ్యూచర్" సిటీలోకి నెట్టబడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన తీసుకొస్తామని ప్రమాణం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక ప్రజల నిరసనలను పూర్తిగా విస్మరిస్తూ, వారి గొంతుకలను అణచివేస్తూ, గౌరవనీయ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పూర్తిగా ధిక్కరిస్తూ, బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దని కోర్టు చెప్పిన వ్యవసాయ భూములను కూడా కంచెలతో చుట్టుముడుతోంది.
2025 ఏప్రిల్ 3 నుండి మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి మరియు కుర్మిద్ద గ్రామాలలో డిసిపి, అదనపు డిజిపి, ఎసిపి, 8 మంది ఇన్‌స్పెక్టర్లు, 15 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, సుమారు 200 మంది పోలీసులను భారీగా మోహరించారు.ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రజలు నిరసన తెలిపి నప్పుడు, అడ్డుకున్న రైతులను పోలీసు బలగంతో బెదిరిస్తున్నారు. చట్ట విరుద్ధంగా, కోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, పోలీసు అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ, చట్టం, కోర్టు ఆదేశాలు, ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా విస్మరిస్తూ, భూములకకు కంచె వేసే పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.
ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ కి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు సాగిస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలని, ఈ భయంకరమైన ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా గొంతును వినిపించాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఈ ప్రాజెక్టులను ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
స్థానిక వ్యవసాయ భూములను, ఇతర భూములను కాపాడండి, స్థానిక ప్రజలను కాపాడండి, వన్యప్రాణులను కాపాడండి, మన ఆహార భద్రత కోసం, స్వచ్ఛమైన గాలి కోసం, మన భవిష్యత్ తరాల జీవనం కోసం - మొత్తంగా ఈ పర్యావరణాన్ని కాపాడండి !