గాజాలో ఇజ్రాయెల్ దాడుల వెనక లాభసాటి వ్యాపారం ఉందా?

గాజా, వెస్ట్‌బ్యాంక్‌ లోని పాలన్తీనియన్లను తరిమేసి ‘గ్రేటర్‌ ఇజ్రాయిల్‌’ను నెలకొల్పు కోవాలన్నది ఇజ్రాయిల్‌ పన్నాగం;

Update: 2025-08-31 03:30 GMT

ఇజ్రాయెల్ దాడుల వెనక లాభపడుతున్న ఒక ఆర్థిక వ్యవస్థ ఉన్నట్లుగానే గాజాలో జరుగుతున్న నరమేధం వెనక, పసిపాపల హత్యల వెనక కూడా లాభాలు ఆర్జిస్తున్న ఒక ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం దాగి ఉన్నది. పాలస్తీనాలో జరుగుతున్న ఎడతెగని హత్యాకాండపై ఐక్యరాజ్య సమితి ఒక ప్రత్యేక పరిశీలకురాలిని నియమించింది. ఆమె ఇటలీకి చెందిన న్యాయ నిపుణురాలు, మానవహక్కుల ఛాంపియన్- ఫ్రాంచెస్కా ఆల్బనీస్ (Francesca P. Albanese). ఇజ్రాయెల్ బహిరంగం గా ఒక జాతిపై మారణ కాండ జరుపుతుండగా మరో వైపు దాని స్టాక్ ఎక్స్ఛేంజ్ పైపైకి ఎగబాకడం వెనక ఉన్న రహస్యా న్ని ఛేదించి లోకానికి వెల్లడించిన బుద్ధి జీవి ఈమె.

ఫ్రాన్సెస్కా అల్బనీస్

ఆమె రిపోర్ట్ ద్వారా అమెరికన్, యూరపియన్ కార్పోరేట్ సంస్థలు జినోసైడ్ [మానవ మారణ కాండ] ద్వారా ఎలా లాభపడుతున్నాయో, పిల్లల హంతకుడైన నెతన్యాహూ తో ఎలా చెట్టాపట్టాలేసుకుని నడుస్తున్నాయో తిరుగు లేని సాక్ష్యాలతో నిరూపించింది.

ఇప్పుడు అమెరికా ఆమెపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా ఆమె న్యూయార్కు లోని తన కార్యాలయానికి కూడా పోలేదు. ఆమెగానీ, ఆమె కుటుంబ సభ్యులుగానీ కనీసం విమాన ప్రయాణాలు కూడా చేయలేరు. ఆమెకు మరో ఉద్యోగం కూడా ఎక్కడా దొరికే అవకాశం లేదు. ఇదే విషయంపై ఆమెను ఒక జర్నలిస్టు ప్రశ్నించినప్పుడు ఆమె. “పాలస్తీనా ప్రజలు అనుభవిస్తున్న దారుణ హింసతో పోలిస్తే నా వ్యక్తిగత కష్టాలు ఏమాత్రం లెక్కలోకి రావు -నథింగ్-" అని అన్నది. అంతరాత్మలను తాకట్టు పెట్టని మనుషులుంటారని ఆమె మరోసారి నిరూపించింది.

పాలస్తీనా వాసులకు మెరుగైన భవిష్యత్తు ఏర్పరుస్తామని ప్రకటించిన దేశాలను గుర్తించడానికి, వారితో కలిసి పని చెయ్యడానికి అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు కృషి చేస్తున్నాయని 2025 జులై 7న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించాడు. ఈ దిశగా అనేక దేశాలకు భాగస్వామ్యాన్ని కల్పించడం దాదాపు ఖరారు కావస్తుందని అందుకు అమెరికాతో అతి సన్నిహితంగా కృషి చేస్తు న్నామని ఆయన ప్రకటించాడు. ఒక ఆక్రమణదారు గా మరింత భూభాగాన్నికలిపేసుకోవాలన్న తన తలంపును ఆయన నిస్సిగ్గుగా బయట పెట్టాడు. గాజా, వెస్ట్‌బ్యాంక్‌ భూభాగంలో నివసిస్తున్న పాలన్తీనియన్లను తరిమేసి ‘గ్రేటర్‌ ఇజ్రాయిల్‌’ను నెలకొల్పు కోవాలన్న ఇజ్రాయిల్‌ పన్నాగానికి ఇది తార్కాణం. దీనికి ఇతర దేశాల మద్దతు కూడగట్టుకోవడమే నెతన్యాహూ చేస్తున్న సన్నిహిత కృషికి అర్ధం. ప్రపంచ భౌగోళిక పటం నుండి పాలస్తీనాను తుడిచి పెట్టాలన్న దుర్మార్గపు ఆలోచన ఇది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన అనంతరం 1948లో ఐకరాజ్య సమితి తీర్మానం ద్వారా పాలస్తీనా భూభాగం నుండి వేర్పాటు చేసిన దేశం ఇజ్రాయిల్‌ అన్నవాస్తవాన్ని అంతర్జా తీయ సమాజం మరిచిపోవాలని, ఇజ్రాయిల్‌ను ఒక పురాతన దేశం గా భావించాలని అక్కడి పాలకులు ఆశిస్తు న్నారు. ఇజ్రాయిల్‌ నానాటికీ తన సరిహద్దులను విస్తరిస్తూ పోతున్నది, దానికి పాలస్తీనా ప్రజలు మూల్యం చెల్లిస్తు న్నారు. తమ ఉనికినే కోల్పోతున్నారు.

ఇజ్రాయిల్‌ దురాక్రమణదారీ అణచివేతను ప్రపంచ దేశాల్లోని లక్షలాది మంది ప్రజానీకం తీవ్రంగా నిరసిస్తున్నారు. కానీ మితవాద శక్తులు ఇజ్రాయిల్‌ దురాక్రమణ వైఖరిని మరింతగా ప్రోత్సహిస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లోపాయకారీగా ఇజ్రాయిల్‌తో కుమ్ముక్కయ్యింది. బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం మితవాద శక్తులన్నీ దగ్గరవుతున్నాయి. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న ఫ్రాంచెస్కా ఆల్బనీస్‌ ఇజ్రాయిల్‌ సాగిస్తున్న జాతి హత్యాకాండకు ఏయే బహుళజాతి కంపెనీలు తోడ్పడుతూ, అందుకు బదులుగా పొందుతున్న వ్యాపార ప్రయోజనాలను కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూ ఒక నివేదిక విడుదల చేశారు. పాలస్తీనాలో కొనసాగుతున్న దారుణ మానవ మారణకాండ, విస్థాపన, పునరావాస కల్పనలను లాభాలు దండుకునే వ్యాపారంగా ఎలా మార్చి వేశారో ఈ నివేదిక బట్టబయలు చేసింది.

లాక్‌హీడ్‌ మార్టిన్‌, ఎల్బిట్‌ సిస్టమ్స్‌ (ఈ కంపెనీ అదాని గ్రూప్‌తో కలిసి హైదరాబాద్‌లో డ్రోన్ల ఉత్పత్తి సాగిస్తున్నది), గూగుల్‌, ఐ.బి.యం, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌వంటి సంస్థలతో పాటు ఆర్థిక దిగ్గజ కంపెనీలైన బ్లాక్‌ రాక్‌, వాన్‌గార్డ్‌ కంపెనీలు ఈ దుర్మార్గంలో పాలు పంచుకుంటున్నాయి.

గ్రేటర్‌ ఇజ్రాయిల్‌ స్థాపన ద్వారా పాలస్తీనాను ఉనికిలో లేకుండా చెయ్యాలనేదే వాటి లక్ష్యంగా కనబడుతున్నది. అందుకు అవసర మైతే పాలస్తీనా ప్రజానీకం మొత్తాన్నీ తుడిచి పెట్టడానికి కూడా అవి సిద్ధపడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు రెండూ పాలస్తీనా దేశాన్ని గుర్తించడానికి గానీ, రెండు రాజ్యాల పరిష్కా రానికి గానీ సిద్ధంగా లేవని స్పష్టమవుతుంది

గత 22 నెలలుగా ఇజ్రాయిల్‌ పాలస్తీనా ప్రజానీకం మీద దారుణ మారణకాండకు పాల్పడుతున్నది. 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌ మీద హమాస్‌ చేసిన దాడికి ప్రతిదాడి అనీ, ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఉద్దేశించిన సైనిక చర్య అని తొలుత ఇజ్రాయిల్‌ నమ్మబలికింది. కానీ రాను రానూ దాని అసలు లక్ష్యం గాజా, వెస్ట్‌ బ్యాంక్‌ల సహా మొత్తం పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకోవడం అని తేలిపోతున్నది .

2025 జులై 10 నాటికి గాజాలో 57,680 మంది మరణించారు. 1,37,409 మంది గాయాల పాలయ్యారు. మరో 14,000 మంది ఆచూకీ లేకుండా పోయారు. ప్రతి 20 నిమిషాలకు ఒక శిశుమరణం సంభవిస్తున్నది. యూనివర్శిటీ ప్రొఫెసర్ల బృందం చేపట్టిన క్షేత్ర స్థాయి అధ్యయనం ప్రకారం మరణించిన వారిలో 56.2 శాతం మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. 2023 అక్టోబరు నుండి 25 జులై వరకూ ఇజ్రాయిల్‌ గాజా మీద 85,000 టన్నుల బాంబులు కురిపించింది. అంటే గాజా లోని ప్రతి కిలోమీటరుకు 233 టన్నుల బాంబులు కురిపించినట్లు.

గాజా ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రతగల ప్రదేశం. ప్రతి చదరపు కిలో మీటరులో 5,967 మంది జనాభా నివసించే ప్రాంతం గాజా. ఈ లెక్కన గాజాలో నివసించే ప్రతి పాలస్తీనా పౌరుడి మీద 39 టన్నుల బాంబులు కురిపించింది ఇజ్రాయిల్‌ కూృరత్వానికి ఇంతకుమించిన నిదర్శనం మరొకటి ఉండదు.

ఇలాగే వెస్ట్‌ బ్యాంక్‌లో కూడా ఇజ్రాయిల్‌ సైనికులు 202 మంది పిసిపిల్లల సహా 1000 మంది పాలస్తీనియన్లను హతమార్చారు. 9,230 మంది గాయపడ్డారు. అక్టోబరు 2023-జులై 2025 మధ్య కాలంలో వెస్ట్‌ బ్యాంక్‌ మీద 1800 దాడులు జరిగాయి. ఈ దాడులు మూలంగా 3,091 మంది పాలస్తీనియన్ల నివాస గృహాలు ధ్వంసమై పోయాయి. వారిలో చాలా మంది నిరాశ్రయులయ్యారు.

ఇజ్రాయిల్‌ దురాక్రమణ దాడులు పాలస్తీనాతో పాటు. లెబనాన్‌, సిరియా, యెమన్‌, ఇరాక్‌ దేశాలకూ విస్తరించాయి. ఈ దేశాల మీద విచక్షణా రహితంగా వైమానిక దాడులకు పాల్పడింది. తాజాగా ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని యుద్ధానికి తెగబడింది. ఈ దాడుల మూలంగా రోజురోజుకీ పౌరమరణాల సంఖ్య పెరుగుతున్నది. ఇరాన్‌ మీద 12 రోజుల పాటు సాగించిన దాడుల మూలంగా 4000 మంది పౌరులు మరణించారు. ఇజ్రాయెల్ సైన్యం 16-జులై న పొరుగున ఉన్న సిరియాలో బాంబు దాడులను ఉధృతం చేసి సిరియా రాజధాని డమాస్కస్ లోని అధ్యక్ష భవనం సమీపంలో, రక్షణ మంత్రిత్వ శాఖపై, వైమానిక దాడులు నిర్వహించింది. మొత్తంగా చూస్తే దక్షిణాసియా దేశాల మీద ఇజ్రాయిల్‌ చేసిన దాడులతో 65,000 మంది పౌరులు మృతి చెందారని ఒక అంచనా

ఇజ్రాయిల్‌ దాడుల మూలంగా గాజా ప్రాంతంలో నివసిస్తున్న 23 లక్షల మంది జనాభాలో 90 శాతం మంది అనేక మార్లుగా విస్థాపనకు గురయ్యారు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం గాజాలోని ప్రతి 10 ఇళ్ళలో తొమ్మిది ఇళ్ళు ధ్వంసమైపోయాయి. 92 శాతం ప్రధాన రహదార్లు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ చేసిన దాడులు మూలంగా గాజాలో 84 శాతం ఆరోగ్య సేవా కేంద్రాలు శిథిలాల కుప్పలుగా మారాయి. దాదాపుగా ప్రతి ఆసుపత్రి కూడా బాంబు దాడులకు గురికావడం వల్ల ప్రస్తుతం గాజాలో ఏ ఆసుపత్రీ పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందించే పరిస్థితిలో లేదు. ఇంటెన్సివ్‌ కేర్‌, సర్జికల్‌, ఎమర్జెన్సీ కేంద్రాలకు కూడా తగినన్ని మందుల సరఫరా లేని మూలంగా కనాకష్టంగా నడుస్తున్నాయి. మొన్న 25 వ తేదీన కూడా ఒక ఆసుపత్రి భవనం పై చేసిన దాడిలో ఐదుగురు జర్నలిస్టులతో సహా 20 మంది కన్ను మూశారు 100 మందికి పైగా గాయపడ్డారు.

గాజాలో 70 శాతం తాగునీరు, మురుగునీటి పారుదల సౌకర్యాలు దెబ్బతినిపోయాయి. 88.8 శాతం పాఠశాలలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రాథమిక సౌకర్యాల నష్టానికి తోడు గాజా వెస్ట్‌ బ్యాంక్‌లో నివసిస్తున్న పాలస్తీనా ప్రజానీకం జీవనోపాధులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాలస్తీనా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అంచనాల ప్రకారం నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి ప్రబలిపోయింది. 2023 అక్టోబరు నాటికి 45 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2024 చివరి నాటికి 68 శాతానికి చేరుకుంది. ఇందులో 15-29 సంవత్సరాల వయసులో ఉన్నవారు 74 శాతం మంది. వీరంతా చదువులు, శిక్షణ పూర్తిచేసుకుని ఉద్యోగాల కోసం వేచి ఉన్నవారే. వెస్ట్‌బ్యాంక్‌లో కూడా ఇజ్రాయిల్‌ దాడులు నిర్బంధాల మూలంగా స్థానిక ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయింది. 2023 చివరి నాటికి 1,83,000గా ఉన్న నిరుద్యోగుల సంఖ్య 2024 నాటికి 3,13,000కు చేరింది. 18 శాతం నిరుద్యోగం 31 శాతానికి మించి పోయింది.

అక్కడున్న మొత్తం వ్యవసాయ యోగ్య భూమిలో మూడోవంతు భూమి ఉత్తర గాజా ప్రాంతంలోనే ఉన్నది. ఆహార పంటలు, కూరగాయలు, పండ్లు, ఆలివ్‌ చెట్లు విస్తారంగా పండే భూములు ఇవి. ఇజ్రాయిల్‌ దాడుల మూలంగా రోజుకి 20 లక్షల డాలర్ల వ్యవసాయ నష్టం వాటిల్లుతున్నది. ఐక్యరాజ్యసమితి అనుబంధ ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం ఆహారానికి వినియోగించే పాడి పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గొర్రెలు 36 శాతం, మేకలు 39 శాతం తగ్గిపోయాయి. ఆవులు 3.8 శాతానికి పడిపోయాయి. ఇక కోళ్లు దారుణంగా 1.4 శాతానికి పడిపోయాయి. ఇజ్రాయిల్‌ దాడుల మూలంగా గాజాలో సాగునీటి వ్యవస్థ మూడింట ఒక వంతు దెబ్బతిని పోయింది. అటు ఆదాయ వనరు ఇటు పౌష్టికాహార వనరుగా ఉన్న చేపల వేట ఘోరంగా దెబ్బతిని పోయింది. 70 శాతం వేట పడవలు ధ్వంస మయ్యాయి.

మానవతా సాయంగా వివిధ సంస్థలు, దేశాలు పంపిన ఆహార పదార్థాల సరఫరాలను గాజా, వెస్ట్‌ బ్యాంక్‌లలో ప్రవేశించ కుండా ఇజ్రాయిల్‌ నిలిపివేస్తున్నది. 2025 ఫిబ్రవరి నుండి ఏప్రిల్‌ వరకూ రెండు నెలల పాటు గాజాలోకి ఎలాంటి ఆహార పదార్థాల సరఫరాలూ అందకుండా ఇజ్రాయిల్‌ నిలువరించింది. గాజా ప్రజానీకం క్షామం బారినపడే తీవ్ర ప్రమాదంలో ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా ఇజ్రాయిల్‌ లెక్క చేయలేదు.

ఆహారాన్ని ఆయుధంగా వాడుతున్న తీరు

గాజా హ్యుమానిటేరియన్‌ ఫౌండేషన్‌ (జి.హెచ్‌.ఎఫ్‌) పేరిట ఒక ప్రైవేటు ఎన్జీఓ సంస్థ 2025 మే 26న గాజాలో ఆహార పదార్ధాల సరఫరా కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నది. అయితే ఈ సంస్థ అమెరికా కనుసన్నలలో నడుస్తున్నది. అది ఇజ్రాయిల్‌ పక్షపాత వైఖరిని అనుసరిస్తున్న కారణంగా ఐక్యరాజ్య సమితిగానీ, సహాయం ఇవ్వడాలుచుకున్న కొన్ని ఇతర దేశాలు గానీ జి.హెచ్‌.ఎఫ్‌ తో కలిసి పని చెయ్యడానికి నిరాకరించాయి. జి.హెచ్‌.ఎఫ్‌ సాకున ఇజ్రాయిల్‌ ఆహారాన్ని ఆయుధంగా వాడుతున్నదనీ, ఇది ‘యుద్ధ నేరం’ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

ఇజ్రాయిల్‌ మాత్రం ఐక్యరాజ్యసమితికి అనుమతి నిరాకరిస్తూ జి.హెచ్‌.ఎఫ్‌ మాత్రమే ఆహార పదార్ధాల సరఫరాను నిర్వహించడానికి అనుమతిస్తున్నది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్‌ అధికారిక ప్రతినిధి థామీన్‌ అల్‌ ఖీతాన్‌ జి.హెచ్‌.ఎఫ్‌ కార్యకలాపాల గురించి వివరిస్తూ సాయం కోసం పంపిణీ కేంద్రాలకు వచ్చిన పాలస్తీనియన్ల మీద ఇజ్రాయిల్‌ సైనికులు జరిపిన కాల్పులలో 410 మంది చనిపోయినట్లు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి తదితర దాతలు పంపిన మానవతా సాయాన్ని అందుకోవడానికి వచ్చిన పాలస్తీనియన్ల మీద కూడా ఇజ్రాయిల్‌ సైనికులు జరిపిన కాల్పులలో మరో 93 మంది మరణించారని, మరో 3000 మంది తుపాకి కాల్పుల వల్ల తీవ్రంగా గాయపడ్డా రని ఆయన వివరించారు.

పాలస్తీనా శరణార్ధులకు సాయం అందించే ఐక్యరాజ్య సమితి విభాగం యు.ఎన్‌. ఆర్‌. డబ్యూ.ఎ అధిపతి ఫిలిప్పీ లాజ్జరినీ ఇజ్రాయిల్‌ సైన్యం దురాగతాలను తీవ్రంగా ఖండించారు. జి.హెచ్‌.ఎఫ్‌ నడుపుతున్న పంపిణీ కేంద్రాలు మృత్యు కుహరాలుగా మారాయనీ, అవి కాపాడిన ప్రాణాల కంటే తీసిన ప్రాణాలే ఎక్కువగా ఉన్నాయని ఘూటుగా విమర్శించారు.

పాలస్తీనాలో జరుగుతున్న ఈ దారుణ మానవ మారణకాండను నిలవరించడానికి ఇజ్రాయిల్‌ను అదుపు చెయ్యా ల్సింది పోయి మితవాద దేశాధినేతలు బహుళజాతి కార్పొరేషన్‌ల దన్నుతో ‘గ్రేటర్‌ ఇజ్రాయిల్‌ లక్ష్యాన్ని సాకారం చేసుకోమని ప్రోత్సహిస్తున్నాయి. 2023 సెప్టెంబరు నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు ప్రసంగిస్తూ ‘గ్రేటర్‌ ఇజ్రాయిల్‌ భౌగోళిక హద్దుల గురించి వివరించాడు. అందులో ప్రస్తుతం సిరియా ఆధీనంలో ఉన్న గోలన్‌ హైట్స్‌ను కూడా ‘గ్రేటర్‌ ఇజ్రాయిల్‌ లో అంతర్భాగంగా ప్రకటించాడు. అమెరికా ఒక వైపున తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం జరగాలంటూ ప్రకటనలు ఇస్తూ రెండో వైపు నుండి ఇజ్రాయిల్‌ కు భారీగా ఆయుధ, ఆర్థిక సాయాన్ని అందిన్తూ రెండు నాల్కల వైఖరి ప్రదర్శిస్తున్నది. అమెరికా ఇస్తున్న ఊతంతో ఇజ్రాయిల్‌ మరింత పేట్రేగిపోతున్నది. పాలస్తీనా ప్రజానీకాన్ని ఆకలితో మాడ్చి చంపాలనే యుద్దాల వ్యూహం పన్నుతున్నది.

పాలస్తీనా భూభాగాన్ని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఇజ్రాయిల్‌ దూకుడుగా పనిచేస్తున్నది. 2025 జులై చివరి నాటికి గాజాలో 75 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయిల్‌ సైనిక వర్గాలు చెబుతున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ 2025 మే 25 సంచికలో ఒక వార్తను ఇచ్చింది. గాజాలో 40 శాతం భూభాగం ఇప్పటికే తమ ఆధీనంలో ఉన్నదని కూడా ఇజ్రాయిల్‌ సైన్యం ప్రకటించింది. నోబెల్ శాంతి బహుమానం కోసం వువ్విళ్ళూరుతున్న ట్రంప్ భారత్.- పాకిస్థాన్ యుద్దం ఆపివేశానని, రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి ముగింపు ఇస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నాడు మరి గాజా లో విధ్వంసం మాత్రం ఎందుకు కొనసాగనిస్తు న్నట్లు?

పాలస్తీనా మీద ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని కట్టడి చెయ్యకపోతే దక్షిణాసియాలోనూ, ప్రపంచంలోనూ శాంతికి స్థానం ఉండదు. యుద్ధాన్ని నిలవరించడానికి జరిగే ఉద్యమాలకు అండగా నిలవడం కేవలం పాలస్తీనా ప్రజల కోసం కాదు, అది మానవాళి భవిష్యత్తు నిలుపుకోవడం కోసం అవసరం, అనివార్యం. ఇది మానవత్వానికి పరీక్షా కాలం. ఇది యుద్దాల కాలం కాదని పదే పదే ప్రకటించే భారత నాయకత్వం తాను ఏ పక్షాన నిలుస్తున్నదీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

Tags:    

Similar News