మార్వాడీ వ్యతిరేక పోరాటం నిజంగా ఎవరి మీద?
నిజంగా ఎవరి మీదో , ఏ లక్ష్య సాధనకో స్పష్టత ఉందా ? - 2;
By : కన్నెగంటి రవి
Update: 2025-08-22 11:15 GMT
తెలంగాణలో గతంలో వినిపించిన ఆంధ్రా గో బ్యాక్ నినాదం కానీ, ఇప్పుడు వినిపిస్తున్న మార్వాడీ గో బ్యాక్ నినాదం కానీ భావోద్వేగ పరంగా, వినడానికి బాగుంటాయి కానీ, అవి నిజంగా ఆచరణాత్మక నినాదాలేనా ? రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ పరిధిలో , చట్టబద్ధంగా ఒక రాష్ర ప్రభుత్వం వాటిని అమలు చేయగలుగుతుందా? సాధ్యం కాదని ఈ నినాదాలు ఇస్తున్న వాళ్ళకు కూడా తెలుసు . అయితే ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని తెలంగాణా అభివృద్ధి నమూనా పై లోతైన చర్చ జరగాలి.
తెలంగాణాలో ఇప్పుడు వినిపిస్తున్న ఈ నినాదాలను స్వాతంత్రోద్యమ కాలంలో ముందుకు వచ్చిన సైమన్ గో బ్యాక్, క్విట్ ఇండియా నినాదాలతో పోల్చగలమా ? అసలు పోల్చలేము.
నా కోరిక ఒక్కటే, ప్రజలను కూడగట్టడానికి ఆచరణ సాధ్యం కాని భావోద్వేగ నినాదాలను ఇవ్వడం మానేసి, నిజంగా సమస్యలకు మూల కారణాలను వెతకడం, వాటికి పరిష్కారాలను సూచించడం, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి అమలు చేయించుకోవడం జరగాలి. మేము నినాదాలు ఇస్తాం, ప్రభుత్వమే అన్ని సమస్యలను పరిష్కరించాలి అంటే, ఇలాంటి విషయాలలో అది సాధ్యమే కాదు.
పైగా ఒక్కోసారి సమస్యకు పరిష్కారం పేరుతో, మరింత జటిలమైన పరిస్థితి వైపు ప్రభుత్వం ప్రజలను నెడుతుంది. అది సమాజంలో మరిన్ని కొత్త సమస్యలను సృష్టిస్తుంది. అందుకే కేవలం నినాదాలకు పరిమితం కాకుండా, పరిష్కారాలపై కూడా ప్రభుత్వం పౌర సమాజంలో చర్చలు సాగించాలి. పౌర సమాజంలో కూడా ఈ చర్చలు లోతుగా జరగాలి. మార్వాడీ గో బ్యాక్ నినాదం ఇస్తున్న తెలంగాణా యువకులను అరెస్టులు చేయడం, వారిపై కేసులు బనాయించడం ప్రభుత్వం మానుకోవాలి.
సమాజంలో తక్షణం ముందుకు వచ్చిన ఒక సమస్య విషయంలో ఒక్కోసారి అందరికీ ఏకాభి ప్రాయం ఉన్నట్లు కనపడుతుంది. కానీ ఆ సమస్యకు పరిష్కారాల విషయంలో అలాంటి ఏకాభి ప్రాయం సాధారణంగా కనిపించదు. ఒకే రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, వివిధ కుల సంఘాలు, వివిధ ప్రాంతాలు ఒక్కో రకంగా తమ దృష్టి కోణం నుండీ ఒక్కో పరిష్కారాన్ని ముందుకు తెస్తాయి. ఏదైనా ఒక పరిష్కారాన్ని లోతుగా చర్చించడానికి కూర్చుంటే దాని అమలు విషయంలో కూడా అనేక భిన్నాభిప్రాయాలు ముందుకు వస్తాయి.
ఇలాంటి సమయంలో ఒక సమస్య స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకుని, సమస్యకు కారణాలను కూడా విశ్లేషించుకుని, మెజారిటీ సాధారణ ప్రజల, ముఖ్యంగా శ్రామిక ప్రజల ప్రయోజనాలకు అనుగుణమైన పరిష్కారాలను క్రోడీకరించుకుని, వాటిని అమలు చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో ఆలోచించి, కొన్ని నిర్దిష్ట ప్రతిపాదనలు కూడా పౌర సమాజం ప్రభుత్వం ముందు పెట్ట గలిగే విధంగా ఉండాలి.
ఈ బాధ్యతను ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించే ప్రజాస్వామికవాదులు, కమ్యునిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు, డాక్తర్ అంబేద్కర్ ఆలోచనాపరులు , దళిత, ఆదివాసీ సంఘాలు, మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు ఉమ్మడిగా తీసుకోవాల్సి ఉంటుంది. పరస్పరం ఆలోచనలు పంచుకుని, రాష్ట్రం లో ముందుకు వచ్చిన కొత్త సమస్యను పరిష్కరించడానికి ధైర్యంగా కొన్ని ప్రతిపాదనలు సమాజం ముందు చర్చకు పెట్ట వలసి ఉంటుంది. కొందరికి అవి నచ్చకపోవచ్చు కనీ, ఈ బాధ్యతను పౌర సమాజం తీసుకోవాలి.
బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ వైఖరి ప్రకటించాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో BRS లాంటి పాలక రాజకీయ పార్టీలు కొన్ని అవకాశ వాదంతో వ్యవహరిస్తాయి. కానీ ప్రజా పక్ష పాతులు, లౌకిక వాదులు, పౌర సమాజ ప్రతినిధులు అలాంటి భయాలకు గురి కావలసిన అవసరం లేదు. గత 20 రోజులుగా తెలంగాణాలో పరిణామాలను పరిశీలిస్తే అనేక ప్రజానుకూల సంస్థలు కూడా ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయకుండా ఇప్పటికీ వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నాయి.
కొన్ని ఉద్యమాలలో కొన్ని సార్లు ఉద్యమ కారుల నుండీ ముందుకు వచ్చే వాదనలు బలంగా ఉంటాయి. నాయకుల ఉపన్యాసాలు , సోషల్ మీడియాలో చర్చలు, ఉరకలెత్తించే పాటలు, కవితలు, పదబంధాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కానీ వీరి వాదనలలో సారాంశాన్ని అర్థం చేసుకోవడం వేరు. ఆ వాదనలు ముందుకు తెచ్చే తప్పుడు, ఆచరణాత్మకం కాని అపసవ్య డిమాండ్లను తిరస్కరించడం, సమస్యపై సవ్యమైన చర్చను ముందుకు తేవడం వేరు.
మార్వాడీ వ్యతిరేక వాదనలలో అనేక అంశాలు, సమస్యలు కలగలసిపోయి ఉంటున్నాయి. వాటిలో ప్రధానంగా కొన్ని వాదనలు ఇలా ఉన్నాయి.
వ్యాపార పరంగా :
1. స్థానికుల వ్యాపారాలను మార్వాడీలు దెబ్బ తీస్తున్నారు.
2. రాష్ట్రంలో మూల మూలలకూ వాళ్ళు విస్తరిస్తూ, పెద్ద పెద్ద కిరాణా షాపులు పెడుతున్నారు. స్థానికంగా అప్పటికే ఉన్న స్థానికుల చిన్న చిన్న కిరాణా షాపులు మూతపడుతున్నాయి.
3. స్థానిక వ్యాపారులు ఇంతకు ముందు ప్రజలకు అవసరమైన అప్పులు ఇచ్చే వారు. ఇప్పుడు మార్వాడీలే అప్పులు ఇస్తున్నారు.
4. షాపుల కోసం భవనాల, మడిగల అద్దెలు పెంచు కుంటూ పోతున్నారు. ఫలితంగా స్థానిక వ్యాపారులు దుకాణాలు నడపలేని పరిస్థితి ఉంది.
5. వాళ్ళు ప్రజలకు సరుకులు తక్కువ ధరకు అమ్మడం వల్ల, స్థానిక వ్యాపారులు వాళ్ళతో పోటీ పడలేక పోతున్నారు.
6. స్థానికులను పనిలో పెట్టుకోకుండా, వాళ్ళ స్వంత రాష్ట్రాల నుండీ పని వాళ్ళను తెచ్చుకుంటున్నారు.
7. నాణ్యత లేని, కల్తీ సరుకులను అమ్ముతున్నారు. ప్రజల ఆరోగ్యాలు చెడగొడుతున్నారు.
పెద్ద పెట్టుబడి , ప్రపంచీకరణ :
1. వాళ్లకు ఎక్కువ పెట్టుబడి ఉంది. ఏ వ్యాపారమైనా వాళ్ళు చేయగలుగుతున్నారు. స్థానిక వ్యాపారుల దగ్గర అంత పెట్టుబడి లేదు.
2. మార్వాడీల పెద్ద దుకాణాల వల్ల విశ్వకర్మలు, వడ్రంగులు తమ వృత్తులను పూర్తిగా కోల్పోతున్నారు. అన్ని రంగాలలోకీ వాళ్ళ వ్యారం విస్తరిస్తున్నది.
3. ప్రపంచీకరణ, బడా రిటైల్ సంస్థల వల్ల కూడా స్థానిక వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి.
ఆదిపత్య సంస్కృతి – స్థానికుల పట్ల చులకన
1. ఉత్తరాది పండగలను ఇక్కడ అట్టహాసంగా చేస్తూ, ఇక్కడి ప్రజలకు వాళ్ళ సంస్కృతి అంటిస్తున్నారు.
2. స్థానిక ప్రజల పట్లా, ఇక్కడి ప్రజల సంస్కృతి పట్లా వాళ్లకు చులకన భావం ఉంది. ఇక్కడి ప్రజలు సోమరిపోతులు, తాగుబోతులనే అభిప్రాయం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ విషయాన్ని బయట కూడా మాట్లాడుతున్నారు.
ప్రభుత్వాలకు వస్తున్న నష్టం:
1. ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా ఎగ్గొడుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోతున్నది.
2. అన్ని రాజకీయ పార్టీలకు, స్థానికంగా అధికారులకు వాళ్ళు విరాళాలు, లంచాలు ఇచ్చి తమకు అనుకూలంగా వాళ్ళను మార్చుకుంటారు.
వనరులను కొల్లగొట్టడం, రాజకీయ ఆధిపత్య అవకాశాలు :
1. రాష్ట్రంలో భూములను మార్వాడీలు పెద్ద ఎత్తున కొంటున్నారు. నగరాలలో ఖాళీ స్థలాలను , భవనాలను , అపార్ట్మెంట్ ప్లాట్స్ ను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు
2. వాళ్ళు తమ వ్యాపారం ద్వారా అన్ని చోట్లకూ విస్తరించి, ఆర్ధిక ఆధిపత్యం సాధించి, రాబోయే రోజుల్లో ఇక్కడి రాజకీయాలలో, పాలనలో కీలక పాత్ర నేరుగా పోషిస్తారు. రాష్ట్రాన్ని తమ అదుపు లోకి తెచ్చుకుంటారు.
ఇటీవలి కాలంలో మార్వాడీలపై నా దృష్టికి వచ్చిన కొన్ని వాదనలు ఇవి. వీటన్నిటినీ ఒక దగ్గర పెట్టి చూస్తే, మార్వాడీలు తెలంగాణా రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యారని అనిపిస్తుంది కదా...
కానీ తరచి చూస్తే నిజానికి పైన చెప్పిన అంశాలలో ఎన్ని రాష్ట్ర సాధారణ ప్రజలకు హాని చేసేవి? ఎన్ని స్థానిక వ్యాపారులను ఇబ్బంది పెట్టేవి సంబంధించినవి ? ఎన్ని స్థానిక చేతివృత్తుల వారి జీవనోపాధులను పోగొట్టేవి ? ఎన్ని ప్రపంచీకరణ దుష్ఫలితాలకు సంబంధించినవి ? ఎన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పని తీరులో వైఫల్యానికి సంబంధించినవి ? ఎన్ని రాష్ట్ర రాజకీయ నాయకత్వం జోక్యంతో పరిష్కారమయ్యేవి ? వీటిని ఇలా విడి చేసి చూస్తే, ఆయా సమస్యలకు తప్పకుండా పరిష్కారాలు దొరికే అవకాశం ఉంది.
“మార్వాడీ గో బ్యాక్” ఈ ఒక్క నినాదం పనికి వస్తుందా ?
ఈ సమస్యలకు అనేక లేయర్లు ఉన్నాయి. ఈ సమస్య ప్రభావితులు అనేక మంది వివిధ రూపాలలో ఉన్నారు. ఇలాంటి దశలో మార్వాడీల వల్ల ఎదురయ్యే ఇన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి “మార్వాడీ గో బ్యాక్” అనే ఒకే ఒక్క నినాదం పనికి వస్తుందా ? సాధ్యం కాదని నేను అభిప్రాయపడుతున్నాను. పైగా కొన్ని మత, సాంస్కృతిక పరమైన అంశాలను ప్రభుత్వాలు చట్ట పరంగా పరిష్కరించే అవకాశమే లేదు.
ఒక రాజ్యాంగం అమలులో ఉన్న దేశంలో, చట్ట ప్రకారం విషయాలను పరిష్కరించే దేశంలో పై సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడైనా కొన్ని పద్ధతులు ఉంటాయి.అందుకు ఒక యంత్రాంగం ఉంటుంది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ఆ నియమాల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుంది. తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా ప్రభుత్వాలు చేస్తున్నాయా లేదా అనేది వేరే విషయం. ముఖ్యంగా ప్రపంచీకరణ కాలంలో, అన్ని అధికారాలను కేంద్ర ప్రభుత్వమే తన చేతుల్లోకి తీసుకుంటున్న కాలంలో పై సమస్యలకు ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే ఎలాంటి పరిష్కారాలను చూపిస్తుంది ? పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రపంచీకరణను ప్రోత్సహిస్తున్న కాలం ఇది.
ఈ అంశాలను క్రమ పద్ధతిలో చర్చించకుండా, “మార్వాడీ గో బ్యాక్” అనే నినాదంతో ప్రచారం చేసినా, ఉద్యమాలు చేసినా ఫలితాలు ఉంటాయా ? ఈ నినాదాలు కొంత కాలం సమాజంలో స్థానికత కోణంలో చర్చలకు ఉపయోగ పడతాయి. కొన్ని సార్లు తెలంగాణా ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని, మార్వాడీ వ్యాపార వర్గాలు, తమ దూకుడును, రోజువారీ ఆచరణను కొంత మార్చు కోవడానికి తోడ్పడవచ్చు. కానీ ఈ నినాదాలు, ఉద్యమాలు పాలకుల ప్రపంచీకరణ వ్యామోహం, గత 100 ఏళ్లుగా, ముఖ్యంగా గత పదేళ్లుగా హిందుత్వ ఫాసిజం, సృష్టించిన నిజమైన ఏ సమస్యకూ పరిష్కారం చూపించవు.
“ మార్వాడీ గో బ్యాక్” అనే నినాదం, నిజానికి కొన్ని వేరువేరు కీలక అంశాలను చర్చకు తేవాలి. ఆ చర్చలలో ముందుకు వచ్చే అంశాలు, పరిష్కారాల పట్ల ఏకాభిప్రాయం కుదరాలి.
అలాంటి ప్రయత్నం ఎవరు చేస్తారన్నది ముఖ్యమే కానీ, పరిష్కరించుకోవాల్సిన అంశాలు కొన్ని:
1. నిజమైన అర్థంలో మార్వాడీ లు అంటే ఎవరు ? ఎవరిని ఈ ఉద్యమం వ్యతిరేకిస్తున్నది ?
2. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో , విద్యా సంస్థలలో సిట్లు కేటాయింపు సందర్భాలలో భ స్థానికులు అనే భావనకు ఒక నిర్వచనం ఉంది. వాటిపై భిన్నాభిప్రాయాలు ఇప్పటికీ ఇంకా ఉన్నాయి. కానీ వ్యాపార రంగంలో స్థానికులు అంటే ఎవరు? ఎప్పటి నుండీ రాష్ట్రంలో ఉన్న మార్వాడీలను, ఉత్తరాది వ్యాపారులను స్థానికులుగా గుర్తిస్తారు?
3. వ్యాపారం కోసమే వచ్చిన వారిని వెళ్ళిపొమ్మంటున్నారా ? మూకుమ్మడిగా తెలంగాణాకు వలస వచ్చిన ఉత్తరాది ప్రజలందరినీ (వలస కార్మికులతో సహా) వ్యతిరేకిస్తున్నారా ? వీరిలో ఎవరిని, ఎప్పటి నుండీ ఉన్న వారిని, తెలంగాణాలో జీవించడానికి అనుమతి ఇస్తారు ? ఎవరిని వెళ్ళిపోవాలని నినదిస్తున్నారు ? అనే అంశానికి స్పష్టత ఉందా ?
4. మార్వాడీలే కాకుండా, ప్రపంచీకరణలో భాగంగా విదేశీ బహుళ జాతి కంపనీలు కూడా వచ్చి ఆఫ్ లైన్, ఆన్ లైన్ రిటైల్ మార్కెట్ ను ఆక్రమించాయి. చాలా కాలం పాటు చైనా ఉత్పత్తులు ఇక్కడ రాజ్యమేలాయి. ఇవన్నీ స్థానిక వ్యాపారులను బాగా దెబ్బ తీశాయి. తీస్తున్నాయి. బడా జ్యువలరీ షాపులు, బడా ఫర్నీచర్ షాపులు కూడా వచ్చి ఆయా రంగాలకు చెందిన స్థానిక వృత్తి నిపుణుల పనిని చాలా వరకూ పోగొట్టాయి.
బడా బట్టల షాపులు, మిల్లులు వచ్చి చేనేత వృత్తి కారుల ఉపాధిని చావు దెబ్బ తీశాయి. ఇలా వచ్చి వ్యాపార పరంగా రాష్ట్ర మార్కెట్ ను ఆక్రమించిన ఆయా కంపనీల పట్ల వైఖరి ఏమిటి ?
5. సహజ వనరులైన సాగు భూమి, రియల్ ఎస్టేట్ భూములు, నగరాలలో పెద్ద ఎత్తున భవనాలు, ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారని మార్వాడీలపై తీవ్ర విమర్శ ఉంది. నిజంగా ఇది అవసరమైన విమర్శ. నిజానికి డబ్బులు, ముఖ్యంగా నల్ల ధనం పోగు చేసుకుంటున్న ప్రతి వాళ్ళూ, అవసరాలకు మించి అదనపు ఆదాయాలు ఉన్న స్థానికులు కూడా ఇదే పనిలో బిజి గా ఉన్నారు.
6. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఒక భూమి వినియోగ విధానం కావాలనీ, సాగు భూములు వ్యవసాయం చేసే నిజమైన రైతుల చేతుల్లో మాత్రమే ఉండాలనీ, కేవలం మార్వాడీ లే కాకుండా, స్థానికులైనా సరే, స్వయంగా వ్యవసాయం చేయని వ్యవసాయేతరులు ఎవరూ సాగు భూములు కొనకుండా ఆంక్షలు ఉండాలనీ, 1950 నాటి హైదరాబాద్ కౌల్దారీ చట్టం లాంటిది మళ్ళీ రావాలనీ, నగరాల భూముల కొనుగోలుపై కూడా పరిమితి ఉండాలనీ, ఎంతమంది గుర్తిస్తున్నారు ?
7. తెలంగాణా రాష్ట్రంలో ఏర్పడే ఏ సంస్థ( వ్యాపారం,సేవ, పరిశ్రమ) అయినా ( స్తానికులు ఏర్పాటు చేసినా) సరే తప్పకుండా తెలంగాణా యువతకే 80 శాతం ఉద్యోగ, ఉపాధి, అవకాశాలు కల్పించాలని, అలా కల్పించే సంస్థలకే రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలనీ, ఎంత మంది అడుగుతున్నారు?
8. వ్యాపారం అంటేనే, కల్తీ ఆహారం, నాసిరకం సరుకులు అనే భావన ప్రజలలో ఉంది. సరళీకరణ విధానాలు అమలులోకి వచ్చాక వీటిని పట్టించుకుని చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ శాఖల సామర్ధ్యం పూర్తిగా పడిపోయింది. ఆయా శాఖల తనిఖీలు కూడా బాగా తగ్గిపోయాయి . మార్వాడీ లే కాదు, స్థానిక వ్యాపారులు కూడా ఈ అంశంలో తక్కువ కాదనే విమర్శ ఉంది. రాష్ట్రంలో FSAAI అధికారుల సంఖ్య, తనిఖీల సంఖ్యా పెరిగి, క్షేత్ర పరిశీలనలో తప్పులు బయట పడితే, ఆయా దుకాణాలకు, హోటళ్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి. వాళ్ళు ఎవరైనా సరే, నాసిరకం, కల్తీ సరుకులు అమ్మిన వారిని , ఉత్పత్ఘి చేసిన వారిని కటినంగా శిక్షించాలి. మార్వాడీలను స్థానిక వ్యాపారులు ఈ డిమాండ్ చేయడానికి సిద్ధంగా ఉంటారా ?
9. ప్రపంచీకరణ పేరుతో ఎక్కడెక్కడి నుండో సరుకులు తెచ్చి( బయట రాష్ట్రాల నుండే కాదు, చైనా నుండీ,ఇతర దేశాల నుండీ కూడా ) స్థానికంగా అమ్మడం ఎప్పటి నుండో సాగుతున్నది. స్థానిక వ్యాపారులు, మార్వాడీలు కూడా అదే పని చేస్తున్నారు. వ్యాపారంలో అది సహజం అని అంటుంటారు. స్థానికులకు మించి, మార్వాడీ వ్యాపారులకు ఈ అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం,ప్రస్తుత ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక వ్యాపారులైనా, బయట వ్యాపారులైనా, రాష్ట్రంలోనే, స్థానిక రైతుల నుండీ, ఇతర ఉత్పత్తి దారుల నుండీ కనీసం 50 శాతం ఉత్పత్తులు కొని, ఆయా ఉత్పత్తి దారులకు కనీస మద్దతు ధరలు లేదా న్యాయమైన ధరలు చెల్లించాలని ఒక చట్టం చేస్తే ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారా? అలాంటి చట్టం చేయడానికి అసలు అవకాశం ఉందా అనేది వేరే విషయం.
10. చవక కూలీలు, చవక ముడి సరుకులు ఆధారంగా ఇప్పటి ఆర్ధిక వ్యవస్థ నడుస్తున్నది. ఈ ప్రక్రియలో ఏ వనరులు లేని, రెక్కల కష్టాన్ని నమ్ముకున్న శ్రామికులు ఎక్కువ దోపిడీకి గురవుతున్నారు. కార్మిక చట్టాలు, స్థానికి ఉత్పత్తులకు మంచి ధరలు చెల్లించడానికి ఎవరూ సిధంగా లేరు.
11. మార్వాడీలు తమ ప్రాంతం నుండీ కార్మికులను తెచ్చుకుంటారు అనే విమర్శ విషయం దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉపాధి చట్టం చేసి, స్థానికులనే పనిలో నియమించుకోవాలని చెబితే, తక్కువ కూలీలకు వలస కార్మికులను, ఉద్యోగులను నియమించుకోకుండా, మంచి వేతనాలు ఇచ్చి, స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు ఇవ్వడానికి ఎన్ని స్థానిక వ్యాపార సంస్థలు, పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి ?
12. GST, ఆదాయ పన్ను సహా, లాభాల విషయంలో తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వాలకు పన్నులు ఎగ్గొట్టడంలో అన్ని రకాల వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు కూడా ఆరి తేరి పోయారు. ఇందులో మార్వాడీ లు మరింతగా పండిపోయారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల దగ్గర నల్ల డబ్బు పోగు పాడేది అందుకే. ఈ నల్ల డబ్బు తోనే, ప్రతి వాళ్ళూ వెళ్లి, గ్రామాలపై పడి భూములు కొంటున్నది నిజం కాదా ? ప్రభుత్వాలకు, అధికారులకు ఎవరు పన్నులు ఎగ గొడుతున్నారో స్పష్టంగా తెలుసు. అవినీతి ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసు . ఇది కుమ్మక్కు వ్యవహారమన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. వ్యాపారులు రాజకీయ నాయకులకు అందించే చందాలు కూడా బహిరంగ రహస్యమే కదా?
13. ఎవరైనా వడ్డీ వ్యాపారం చేయాలంటే, ఆ స్థానిక జిల్లా కలెక్టర్ దగ్గర తమ పేరు చట్టం ప్రకారం రిజిస్టర్ చేయించు కోవాలి. స్తానికులైనా, మార్వాడీ లైనా ఎంతమంది వడ్డీ వ్యాపారులు తమ పేరు చట్టం ప్రకారం కలెక్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నారు ? న్యాయమైన వడ్డీతో ఎంతమంది వ్యాపారులు స్థానికులకు రుణాలు ఇస్తున్నారు? వడ్డీ వ్యాపార గణాంకాలు ఎంతమంది వ్యాపారులు స్థానిక అధికారులకు ప్రతి సంవత్సరం సబ్మిట్ చేస్తున్నారు ? ఎవరి దగ్గరైనా, లెక్కలేమైనా ఉన్నాయా ?
14. మార్వాడీ వ్యాపారుల దగ్గర పెట్టుబడి ఎక్కువ ఉంది. సరుకులను ఉత్పత్తి చేసే పరిశ్రమలున్నాయి.సాంస్కృతికంగా వాళ్లకు తొలి నుండీ కొంత వ్యాపారం తెలుసు. వారికి ఈ ప్రక్రియ మొత్తంలో పై నుండీ క్రింది వరకూ ఒక సప్లై చైన్ ఉంది. వారికి రాజకీయ నాయకుల, ప్రభుత్వాల మద్దతు ఉంది. స్థానిక వ్యాపారులకు ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దానిని మెరుగు పరుచుకోవడానికి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? ప్రభుత్వాల నుండీ ఎలాంటి పథకాలను స్థానిక వ్యాపారులు ఆశిస్తున్నారు ? మార్వాడీ లను గో బ్యాక్ అనడం కాకుండా, నిర్దిష్టంగా స్థానిక వ్యాపారుల డిమాండ్లు ఏమిటి ?
15. స్థానిక తెలంగాణా సంస్కృతి , మార్వాడీ సంస్కృతి మధ్య తేడాలు అంటారా ? నిజానికి మనం తెలంగాణా సంస్కృతి అనే భావనను ఎప్పుడైనా నిలబెట్టుకున్నామా ? రాష్ట్రం ఏర్పడిన గత పదేళ్ళ కాలంలో ఆ కృషి ఏదైనా సీరియస్ గా జరిగిందా ? జాతీయ మీడియా, టీ.వీ , సోషల్ మీడియా, వాట్సప్ యూనివర్సిటీ ప్రభావంలో పడి, స్థానిక తెలంగాణా ప్రజలు (మహిళలు, పురుషులు, పిల్లలు, యువకులు, వృద్ధులు కూడా) అత్యంత నాగరిక, అమానుష హిందుత్వ ఫాసిస్టు భావజాల ప్రభావానికి గురై, మార్వాడీ, ఉత్తరాది సంస్కృతిని ఇప్పటికే పుణికి పుచ్చుకున్నది నిజం కాదా ? గుజరాత్ వ్యాపారుల గురించి ఇంత ఆందోళన చెందుతున్న వాళ్ళం, మన విజయ పాల సహకార సంఘాన్ని నాశనం చేయడానికి గుజరాత్ కు చెందిన అమూల్ పాల సహకార సంఘానికి గజ్వేల్ ప్రాంతంలో అనుమతులు స్థానిక BRS ప్రభుత్వం ఇచ్చిన విషయం గురించి ఎప్పుడన్నా మాట్లాడామా ? హిందుత్వ పేరుతో ఈ పనికి మాలిన సంస్కృతి ని నింపుకున్న మన వాళ్ళ నుండీ “మార్వాడీ గో బ్యాక్” నినాదంతో దూరం చేయగలమా ?
ముస్లింలను, క్రిస్టియన్లను ద్వేషించకుండా ప్రేమతో సహ జీవనం సాగించే వారిగా మన ప్రజలను మార్చగలమా ?
16. గుజరాత్, రాజస్థాన్ ల నుండీ ఇక్కడికి వచ్చి, బీజేపీ పెరుగుదలకు సహకరిస్తున్న మార్వాడీల హిందుత్వ ధోరణులు సరే, గత 30 సంవత్సరాలలో బీజేపీ పార్టీ, సంఘ్ పరివారం తెలంగాణాలో మూల మూలకూ విస్తరించడానికి కారణమయ్యింది, ఆ పార్టీ తరపున అభ్యర్ధులుగా నిలబడింది, ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధుల గెలుపులో కీలక పాత్ర పోషించింది స్థానిక వ్యాపార వర్గాలే కదా ? రెడ్లు, బీసీలు, వెలమలు, దళితులు, ఆదివాసీల సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఎందరో సంఘ పరివార్ సైధాంతిక ఫాసిజం మర్చిపోయి, బీజేపీ విస్తరణకు ప్రత్యక్షంగానే కారణమయ్యారు కదా ? దీనిని ఎలా అర్థం చేసుకుంటాం ? ఇప్పుడు మార్వాడీల వల్ల తమ వ్యాపారాలకు దెబ్బ తగులుతుంటే బాధ పడుతున్నారు కానీ , బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ముందుకు తెస్తున్న ప్రపంచీకరణ, హిందుత్వ రాజకీయాల ప్రమాదాన్ని వీళ్ళు ఇప్పటికైనా గుర్తిస్తున్నారా, ఆ రొంపి నుండీ బయట పడడానికి సిద్ధంగా ఉన్నారా ? అదేమీ లేకుండా, మార్వాడీల దుకాణాలలో సరుకులు కొనవద్దు, స్థానిక ఆర్య వైశ్య దుకాణాలలో సరుకులు కొనండి అని పిలుపు ఇస్తే ఉపయోగం ఏమి ఉంటుంది ?
17. తెలంగాణా స్థానికులపై మార్వాడీ లకు చులకన భావం ఉందని, తెలంగాణా యువతను తాగుబోతులుగా, సోమరిపోతులుగా వాళ్ళు అన్నారని బాధ పడుతున్నాం. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మార్వాడీలు అహం భావంతో వ్యక్తం చేసే ఇలాంటి అభిప్రాయాలను తప్పకుండా నిరసించాలి. మన తెలంగాణా ప్రజల శ్రమ తత్వాన్ని తప్పకుండా ఎలుగెత్తి చాటాలి. అదే సమయంలో మన విద్యా విధాన వైఫల్యం వల్ల , మన యువతకు విద్యా సామర్ధ్యాలు, నైపుణ్యాలు పెరగడం లేదనే వాస్తవాన్ని గుర్తించాలి. దానికి కారణాలను అన్వేషించాలి. సరి చేసుకోవాలి. అలాగే తెలంగాణా లో పల్లె, పట్నం, అడవి అనే తేడా లేకుండా, మద్యం, గంజాయి యువతను, పిల్లలను కూడా నిర్వీర్యం చేస్తున్న విషయాలను కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణా సంస్కృతి పేరుతో, ఏ సందర్భం వచ్చినా మద్యం ఏరులై పారడాన్ని ఎత్తి పరిస్థితులలో ఆమోదించకూడదు . మద్యం ఆధారంగా ఆర్ధిక వ్యవస్థను, సంక్షేమ పథకాలను నడపాలనుకుంటున్న ప్రభుత్వ విధానాలను కూడా ప్రశ్నించాలి. మద్యం, గంజాయి, మన యువతలో శారీరక, మానసిక సామర్ధ్యాలను తగ్గిస్తుందని గుర్తించాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మాటకు నిజమైన స్పూర్తిని మన వాళ్ళకు ఇంకా అందించాలనే విషయాన్ని కూడా గుర్తించాలి. లేదా ఎలాంటి పరిశ్రమలు, వ్యాపారాలు తెలంగాణకు వచ్చినా వాటిలో మన వాళ్ళు పని చేయడనికి అర్హత సాధించలేరు అనేది కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
18. ఈ ప్రశ్నలు అడగడానికి కారణం, ఎవరినో దోషులుగా నిలబెట్టడానికి కాదు. “మార్వాడీ గో బ్యాక్ “ నినాదం ఇచ్చే ఫలితాల కంటే పై ప్రశ్నలకు జవాబులు వెతుక్కుంటే, తెలంగాణకు ఎక్కువ ఫలితం దక్కుతుందని మాత్రమే.
19. ప్రపంచీకరణ దుష్ప్రభావాల నుండీ బయట పడి, రాష్ట్రాన్ని స్థానిక ప్రజలు, వారి జీవనోపాధులు, స్థానిక సహజ వనరులకు రక్షణ, మన పర్యావరణం కేంద్రంగా అభివృద్ధి నమూనా అమలు చేసేట్లు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచితే , మనం నిజమైన విజయం సాధించినట్లు. అప్పుడు వ్యాపార పరంగా, సాంస్కృతికంగా మార్వాడీ వారి ఆధిపత్య ధోరణులను అడ్డుకోవడం చిటికెలో పని ఆవుతుంది.ఇందు కోసం, ముందుగా జరగాల్సింది,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి నమూనా గురించి మన ఆలోచనా ధోరణి లోనే మార్పు రావడం.
20. అప్పుడు అడ్డగోలు దోపిడీకి పాల్పడే మార్వాడీ వ్యాపారులనే కాదు, స్థానిక ప్రజల ఉపాధులను కొల్లగొడుతున్న అన్ని రకాల శక్తు లకు వ్యతిరేకంగా మనం పోరాడతాము. అడ్డగోలుగా మన భూములను కొల్ల గొడుతున్న పాలకులకు, విదేశీ కంపనీలకు వ్యతిరేకంగా గొంతెత్తుతాము. ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, NIMZ లాంటివి నిర్మించి కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వని అభివృద్ధి నమూనాను వ్యతిరేకిస్తాము. మన చేతి వృత్తులను రక్షించుకోవడానికి, మన స్థానిక వ్యాపారాలను, వ్యాపారులను కాపాడు కోవడానికి పోరాడతాము. ఇదే సమయంలో తెలంగాణాలో బీజేపీ రూపంలో పెరుగుతున్న మనువాద హిందుత్వ ఫాసిస్టు సంస్కృతిని, ప్రమాదాన్ని ఎన్నికలలోనూ, బయటా కూడా ఓడించగలుగుతాము .
(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలే)