రాయలసీమ సాగునీటి రంగాన్ని సత్వరమే గాడిలో పెట్టండి !

వైసిపి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కంటే టిడిపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నిధులు అధికంగా కేటాయించినప్పటికి రాయలసీమ సాగునీటి రంగంలో పురోగతి ఆశించిన స్థాయిలో లేదు.

Update: 2024-09-24 08:53 GMT

రాయలసీమ సాగునీటి రంగం శిథిలావస్థకు చేరింది. ఈ పరిస్థితిని అత్యంత ప్రాధాన్యతతో చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.‌ రాయలసీమ సాగునీటి రంగం పరిస్థితిని సులభంగా అందరూ అర్థం చేసుకోవడడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది.‌

హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన పందికోన రిజర్వాయర్ కు సంబంధించిన మౌళికమైన "ఒకే ఒక అంశం” ద్వారా రాయలసీమ సాగునీటి రంగం స్థితిగతులను పాలకుల ముందుంచుతున్నాం. హంద్రీనీవా ప్రధాన కాలువకు అనుసంధానం అయి ఒక టిఎంసి నీటి నిలువ సామర్థ్యం ఉన్న మొట్ట మొదటి రిజర్వాయర్ పందికోన రిజర్వాయర్.


ఈ వర్ష సంవత్సరం అంటే జూన్ 1, 2024 నుండి సెప్టెంబర్ 21, 2024 వరకు 689 టి ఎం సీ ల కృష్ణా జలాలు సముద్రం పాలు అయ్యాయి. హంద్రీనీవా ప్రాజెక్టు లో భాగం అయిన 1.216 టి ఎం సీ నీటి నిలువ సామర్థ్యం ఉన్న పందికోన రిజర్వాయర్ ద్వారా 4 టి ఎం సీ ల కృష్ణా జలాలను వినియోగించుకొని 61400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి పుస్కర కాలం (12 సంవత్సరాలు) అయ్యింది.‌

ఈ వర్ష సంవత్సరం మొదలైన జూన్ 1, 2024 నుండి 21.9.2024 వరకు 81 రోజు లో పందికోన రిజర్వాయర్ లో నిలువ చేసిన నీరు సుమారు 0.700 టి ఎం సీ (8100 క్యూసెక్కులు), అంటే సగటున రోజుకు 100 క్యూసెక్కులు నిలువ చేయగలిగారు. ఈ లెక్కన, ఒక టి ఎం సీ (11574 క్యూసెక్కులం) నీరు నింపడానికి 116 రోజుల సమయం పడుతుంది. 4 టి ఎం సీ లు నింపడానికి 464 రోజుల సమయం పడుతుంది. సంవత్సరంలో ఉన్నది కేవలం 365 రోజులే.‌ పంట కాలం కూడా 90 నుండి 120 రోజులే ఉంటుంది. పంట కాలంలో నీరందించలేని ప్రాజెక్టు వల్ల పలితం తిరోగమన దిశగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే.

సులభంగా అర్ధం అవుతుందనే భావనతో ఈ ఒక్క అంశాన్నే ప్రస్తావించడం జరిగింది.‌ ఈ అంశమైన పాలకుల దృష్టిని ఆకర్షిస్తే, రాయలసీమ సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టే కార్యాచరణను ప్రాధాన్యతగా చేపడతారని చిరు ఆశ !

మరి పైన ఉదహరించిన లెక్క ప్రకారం రాయలసీమ నాలుగు జిల్లాలకు ఉపయౌగపడే హంద్రీనీవా ప్రాధాన కాలువ పైన ఉన్న రిజర్వాయర్లకు నీరు చేరేదెన్నడు ? హంద్రీనీవా ప్రాజెక్టు లో చివరిగా ఉన్న కుప్పంకు నీరు చేరేదెన్నడు ? చెరువులు నిండేదెప్పుడు ? ఆయకట్టు అభివృద్ధి చేసేది ఎన్నడు ? ప్రజల గొంతు తడిచేదెప్పుడు...?


శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా ఉన్నా, రాయలసీమ ప్రాజెక్టులకు నీరందడం లేదనే విషయాన్ని పౌర సమాజానికి తెలియజేస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేస్తూ రాయలసీమ సాగుకు సాధన సమితి సెప్టెంబర్ 12న నంద్యాల సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టులను స్థితిగతులు స్వయంగా తెలుసుకొని నేపథ్యంలో, ముందుగా హంద్రీనీవా ప్రాజెక్టు స్థితిగతులు తెలుసుకోవడానికి జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ జిల్లాల పర్యటనకు విచ్చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం.

2014 - 19 లో టి డి పి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాగునీటి బడ్జెట్ లో రాయలసీమకు సాగునీటి రంగానికి 17 శాతం నిధులు ఖర్చు చేసిందని జలవనురుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు హంద్రీ నీవా ప్రాజెక్టు సందర్భంగా 22.9.2024 న ప్రకటించారు. 2019 - 24 లో వైసిపి ప్రభుత్వం కేవలం 6 శాతం నిధులను మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేసారని ప్రకటించారు.

వైసిపి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కంటే టిడిపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నిధులు అధికంగా కేటాయించినప్పటికి రాయలసీమ సాగునీటి రంగంలో పురోగతి ఆశించిన స్థాయిలో లేదు. అందుకు నాలుగు దశాబ్దాలుగా ప్రారంభమైన హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణం, 12 సంవత్సారాల క్రితం జాతికి అంకితం చేసిన హంద్రీనీవా ప్రాజెక్టు మొదటి ఫేజ్ లోని పైన వివరించిన పందికోన ప్రాజెక్టే నిలువెత్తు నిదర్శనం.

ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం, ప్రజల దాహార్తిని తీరుస్తాం అనే వాగ్ధానాలు రాయలసీమను రత్నాల సీమను చేయలేవు.‌ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనకకు లాగా ఉన్న రాయలసీమ సాగునీటి రంగాన్ని తక్షణమే గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42 శాతం ఉన్న రాయలసీమ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి బడ్జెట్ లో 42 శాతం రాయలసీమకు కేటాయించి, రాయలసీమ సాగునీటి రంగంలో పురోగతి సత్వరమే సాధించడానికి కృషి చెయ్యాలి. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా రాయలసీమ సాగునీటి రంగం అభివృద్ధి చెందడానికి ఈ నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన లేదా వేరే ఫథకాల ద్వారా మరియు స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా లేదా ప్రపంచ బ్యాంకు రుణాల ద్వారా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


Tags:    

Similar News