సుమేరుతో నారాయణుడి ముడి ఎలాంటిది?

రామాయణంలో నిరుత్తరకాండ-45. బాబిలోనియా పురాణకథలకు రామాయణానికి ఉన్న సామ్యం ఏమిటో కల్లూరి భాస్కరం చెబుతున్నారు.;

Update: 2025-02-19 05:59 GMT
నారాయణుడిలాగా నీళ్లలో నివసించే సుమేరు దేవుడు ఎంకి

దేవుడు ఉన్నాడా, లేడా అన్న చర్చను పక్కనపెడితే; ఆ ఉన్న దేవుడు ఒకడే అయుంటాడు తప్ప, అనేకులుగా ఉండకపోవచ్చన్న సంగతిని ఆస్తికులు కూడా అంగీకరిస్తారనే అనుకుందాం. అప్పుడు అనేకమైన పేర్లతో అనేకులైన దేవుళ్ళను మనిషే సృష్టించుకున్నాడనీ; ఆవిధంగా వివిధకాలాల మీదుగా, వివిధ కారణాలతో, లేదా వివిధ అవసరాలతో కొత్తదేవుళ్లు అవతరించారనీ అనుకోవలసివస్తుంది. క్రమంగా ఏమవుతుందంటే, మనిషే దేవుళ్ళను నిర్మించుకున్నాడన్న సంగతి మరుగున పడిపోయి, దేవుళ్లుగా పరిచయమైన అందరినీ స్వతంత్రదైవాలుగా, దాదాపు స్వయంభువులుగా భావించి పూజించడానికి అలవాటుపడతాం. గుళ్ళో విగ్రహమే కనిపిస్తుంది తప్ప, ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి కనిపించనట్టు అన్నమాట.

ఈ ఉపోద్ఘాతం దేనికంటే, నారాయణుడనే దేవుని నిర్మాణాన్నే కాక; రాముడు, కృష్ణుడితో సహా అనేకమంది దేవుళ్ళ నిర్మాణాన్ని కూడా పై అవగాహననుంచి అర్థం చేసుకోవచ్చునని చెప్పడానికే.

‘నారము’ అనే మాట ‘నీరు’ అనే అర్థంలో ద్రవిడభాషల్లో కూడా ఉందనీ; దానినిబట్టి ద్రవిడభాషాసంస్కృతుల నేపథ్యం నుంచి నారాయణుడు సంస్కృతంలోకి; వేద, ఇతిహాస, పురాణాదుల్లోకి, వాటి ద్వారా ఉత్తరభారతవైష్ణవంలోకి వెళ్లాడా అన్న సందేహానికి అవకాశం ఏర్పడుతుందనీ; అది పూర్తిగా నిరాధారమైన సందేహం కాదనీ కిందటిసారి అనుకున్నాం. డి.డి. కోశాంబి, రాంభట్ల కృష్ణమూర్తి, జోసెఫ్ కాంబెల్ ల వెలుగులో ఇప్పుడు అందులోకి వెడదాం:

జలాలు అనే అర్థమిచ్చే ‘నారా’ శబ్దం ఇండో-ఆర్యన్ మాట కాదని కోశాంబి అంటాడు. ఆయన తన ‘మిత్ అండ్ రియాలిటీ’(Myth and Reality)లో వివరించిన ప్రకారం, సుమేరియా పురాణగాథలూ, అక్కడి సీళ్లపై లభించిన చిత్రాల ప్రకారం మెసపొటేమియా దేవుడు ‘ఈ’, లేదా ‘ఎంకి’ జలమధ్యంలో నిద్రిస్తాడు; కనుక నారాయణ శబ్దమూ, దేవుడూ కూడా సింధునాగరికతాకాలానికి చెందినవారు. పశ్చిమాసియాలోని సుమేరియాతో సింధు నాగరికజనాలకు వర్తకపరంగా, ఇతరత్రా సంబంధాలు ఉన్నట్టు పురాచారిత్రక ఆధారాలు స్థాపించిన సంగతి తెలిసినదే.

ప్రస్తుతసందర్భంలో అంతకన్నా ముఖ్యంగా పశ్చిమాసియాభాషలతో ద్రవిడభాషలకు సంబంధాలున్నాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అనే ఈ నాలుగు భాషలనూ అసలు ద్రవిడభాషలనడమే సరికాదనీ; సుమేరో-అసీరియన్ భాషలనాలనీ బెడ్రిక్ హ్రోజ్నీ అనే పురాతత్వ, భాషావేత్త అంటాడు. వాటిలోనూ తెలుగు, కన్నడాలు సుమేరుభాషలనీ; తమిళ, మళయాలు అసురభాషలనీ అంటాడు. సుమేరులో పుట్టిన అగద, లేదా అక్కడ్ భాషాప్రభావంతోనే తెలుగు అజంతభాష అయిందని ఇంకొక వివరణ. ఈ నాలుగు భాషలపైనా సెమెటిక్ భాషల ప్రభావం పడింది. అరబిక్, హిబ్రూ మొదలైన భాషలను సెమెటిక్ భాషలంటారు. మనవారు వాటిని ‘మ్లేచ్ఛ’భాషలన్నారు. మరోపక్క వాటి ప్రభావం వేదాల మీదా పడింది. ఇందుకు సాక్ష్యంగా పూర్వమీమాంసకర్త జైమిని అన్న మాటలను రాంభట్ల ఉదహరిస్తారు; వేదాలలో ఏమాటకైనా అర్థం దొరక్కపోతే, మ్లేచ్ఛభాషల్లో వెతకమని జైమిని అంటాడు. వేదాలపై మ్లేచ్ఛభాషల ప్రభావం నేరుగానే పడి ఉండవచ్చు, లేదా ద్రవిడభాషల మీదుగా పడవచ్చు.

పశ్చిమాసియా భాషలతో ద్రవిడభాషల సంబంధాన్ని బెడ్రిక్ హ్రోజ్నీయే కాక; ఎడ్విన్ నోరిస్, రాబర్ట్ కాల్డ్వెల్, డేవిడ్ డబ్ల్యు. మెకాల్పిన్, ఫ్రాంక్లిన్ సి. సౌత్ వర్త్ తదితర భాషావేత్తలు కూడా ఎత్తిచూపారు. ఆసక్తిగలవారు ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వ్యాసకర్త రచించిన ‘ఇవీ మన మూలాలు’ అనే పుస్తకంలో చూడవచ్చు.

తిరిగి నారాయణుడి విషయానికి వస్తే, ‘ఈ’ లేదా ‘ఎంకి’ అనే సుమేరుదేవుడు జలమధ్యంలో నిద్రిస్తాడని పైన అనుకున్నాం. ఒకానొక జలప్రళయం తర్వాత సృష్టి ప్రారంభమైందని చెప్పే పురాణకథలు మనతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు- ‘పురాణాలు చెప్పే జలప్రళయం వెనుక చారిత్రకత ఎలాంటి’ దనే వ్యాసభాగంలో ఇంతకుముందు చెప్పుకున్న సంగతిని ఇక్కడొకసారి గుర్తు చేసుకుందాం. బాబిలోనియా పురాణకథల్లో కూడా అలాంటి సృష్టిగాథ ఒకటుంది; దానిపేరు, ‘ఎనుమా ఎలిష్’. కొంచెం అటు ఇటుగా క్రీ.పూ. 1800 ప్రాంతానికి చెందినదిగా చెబుతున్నఆ కథ ఇలా ఉంటుంది:

‘తియామత్’ అనే స్త్రీదేవత, ‘అప్సు’ అనే పురుషదేవుడు ఆదిదంపతులు. వారికి ‘ముమ్ము’ అనే కుమారుడున్నాడు. అప్పటికి భూమి అంతా జలమయంగా ఉండేది, పచ్చికభూములు లేవు; ఆకాశదేవత, భూదేవత మొదలైన దేవతలు కూడా లేరు. క్రమంగా ఆదిదంపతులు దేవతలను సృష్టించడం ప్రారంభించారు. ఆ దేవతల సంతానం తెలివిలోనూ, బలంలోనూ వాళ్ళను మించిపోయారు. వాళ్ళలో ‘అను’ ఒకడు; అతని కొడుకే ‘ఈ’ అనే దేవుడు.

ఈ దేవతల అల్లరి భరించలేకపోయిన అప్సు వాళ్ళను చంపేద్దామని తియామత్ తో అన్నాడు. మన సంతానాన్ని మనమే చంపుకుంటామా అని చెప్పి తిమాయత్ అడ్డుపడింది. అయినా ‘అప్సు’ వినకుండా కొడుకు ముమ్ముతో కలసి దేవతలను చంపడానికి ఒక పథకం వేశాడు. ఈ సంగతి తెలిసిన ‘ఈ’ తన మంత్రశక్తితో దేవతల చుట్టూ ఒక రక్షణవలయాన్ని నిర్మించి, అప్సుకు నిద్ర వచ్చేలా చేసి, అతని శక్తులన్నీ తను లాక్కుని అతన్ని చంపేశాడు. అతని అవశేషాలమీద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని దానికి ‘అప్సు’ అని పేరుపెట్టాడు. ముమ్ము ముక్కుకు తాడేసి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.

‘దంకిన్’ అనే భార్యవల్ల ‘ఈ’కి ‘మర్దుక్’ అనే కొడుకు పుట్టాడు. దేవతల పాలు తాగి పెరిగిన మర్దుక్ -తండ్రి, తాతలకన్నా కూడా శక్తిమంతుడయ్యాడు. అతని తాత ‘అను’ ఈసారి తియామత్ పైనే యుద్ధానికి దిగాడు. నాలుగు మహావాయువులను సృష్టించి ఆమెను కల్లోలపరచడం ప్రారంభించాడు. దాంతో తియామత్ ఎదురుదాడికి దిగి ఘోరసర్పాలు, మహాసింహంతో సహా పదకొండు రకాల క్రూరశక్తులను సృష్టించింది. వాటిలో ప్రథముడైన ‘కింగు’ అనే అతణ్ణి తన భర్తగా చేసుకుని విధిలిఖితాన్ని పొందుపరచిన అధికారముద్రను అతని వక్షస్థలానికి కట్టి దేవతలపై ఆధిపత్యం ఇచ్చింది.

తియామత్ ప్రతాపానికి ‘ఈ’ కూడా భయపడిపోయాడు. ‘అను’ ఆమెతో యుద్ధంలో ఓడిపోయాడు. అప్పుడు ‘ఈ’ తన కొడుకు మర్దుక్ ను పిలిచి యుద్ధానికి సిద్ధమవమని చెప్పాడు. సభను ఏర్పాటు చేసి నీ స్థానంలో నన్ను దేవతలకు అధినాయకుడిగా నియమిస్తున్నట్టు ప్రకటిస్తే యుద్ధానికి దిగుతానని మర్దుక్ చెప్పాడు. అలాగే సభను ఏర్పాటుచేసి మర్దుక్ ను ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి విశ్వప్రభువుగా ప్రతిష్ఠించారు. రాజముద్రతోపాటు అజేయమైన వజ్రాయుధాన్ని అతని చేతికిచ్చారు.

విల్లమ్ములు, గదతోపాటు తియామత్ ను బంధించడానికి ఒక వలను కూడా తీసుకుని మర్దుక్ యుద్ధానికి వెళ్లాడు. తియామత్ ను సంహరించి, ఆమె అనుయాయులైన దేవతలను బందీలుగా చేశాడు. కింగునుంచి విధిలిఖితం పొందుపరచిన ముద్రను లాక్కున్నాడు. తియామత్ కళేబరాన్ని రెండు భాగాలుగా చీల్చి ఒకదానిని స్వర్గానికి కప్పుగా ఏర్పాటుచేశాడు. ఆ తర్వాత ‘అప్సు’ మీద భూమిని ప్రతిష్టించాడు. ‘అను’ ను ఆకాశదేవతగా, ‘ఎన్ లిన్’ అనే మరో దేవుణ్ణి భూదేవతగా, ‘ఈ’ ను పాతాళదేవతగా నియమించాడు.

ఆ తర్వాత సంవత్సరాన్నీ, పన్నెండు రాసులనూ, రోజులనూ, చంద్రకళలనూ నిర్దేశించి నక్షత్ర, గ్రహవ్యవస్థను ఏర్పరిచాడు. తియామత్ కు సహకరించిన దుష్టదేవత ‘కింగు’ను చంపి అతని రక్తంతోనూ, ఎముకలతోనూ మానవాళిని సృష్టించాడు. వారిని దేవతలను సేవించడానికి నియోగించి, దేవతలకు శ్రమనుంచి విముక్తి కలిగించాడు. అందుకు కృతజ్ఞతగా దేవతలందరి కోసం ఒక నివాసప్రాంతాన్ని నిర్మించి, అక్కడ మర్దుక్ కు గద్దెను ఏర్పాటు చేయాలని దేవతలు ప్రతిపాదించారు. ‘మీ కోరిక ప్రకారమే జరుగుతుంది. మీరు ప్రతిపాదించిన నిర్మాణమే బాబిలోనియాగా అవతరిస్తుం’దని మర్దుక్ అన్నాడు.

‘ఎనుమా ఎలిష్’ అనే ఈ సృష్టిగాథనుంచే ‘మర్దుక్’ అనే తొలి ఏకేశ్వరుడు ఉద్భవించాడని రాంభట్ల కృష్ణమూర్తి అంటూ; ఈ కథకూ, ఇందులోని తొలి ఏకేశ్వరుడికీ, మన వేద, ఇతిహాస, పురాణాలకూ ఉన్న సంబంధాన్ని తన ‘వేదభూమి’ అనే రచనలో వివరిస్తారు. అందులోకి వెళ్లబోయేముందు, నరనారాయణుల గురించిన కథనాలకు ఈ కథను అన్వయించుకుని చూద్దాం. దేవతలనే కాకుండా, మనిషిని, అంటే ‘నరు’ని సృష్టించడం గురించి కూడా ఈ కథ చెబుతుంది. అయితే ఈ కథలోని నరుడు దుష్టదేవత రక్తంతోనూ, ఎముకలతోనూ నిర్మించినవాడు. ఆవిధంగా ఈ పౌరాణికకల్పన వెనుక నరుని పట్ల తిరస్కారభావం, దేవతల పట్ల ఉన్నతభావం ఉన్నాయి. అంతేకాదు, ఈ కథ దేవతలను సేవించడానికే మనుషులను సృష్టించినట్టు చెప్పి వారికి దాస్యాన్ని కూడా విధిస్తోంది.

ఇలా నరుని చిన్నబుచ్చడం ఈ బాబిలోనియాకథలోనే కాక, మన పురాణ, ఇతిహాసాల్లోనూ, ఇతర పురాణకథల్లోనూ కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు, పాండవులు అజ్ఞాతవాసాన్ని విరాటనగరంలో గడపడానికి వెళ్లబోయేముందు, ’ఇంద్రుడు అర్ధసింహాసనమిచ్చి గౌరవించిన అర్జునుడు ఒక మానవమాత్రుని ఎలా సేవిస్తాడు’ అని మహాభారతం, విరాటపర్వంలో ధర్మరాజు అంటాడు. అదే పర్వంలో, కీచకుడి వల్ల తనకు కలిగిన భంగపాటుగురించి ద్రౌపది భీమునికి చెప్పిన సందర్భంలో, ‘కేవల మర్త్యుడే ధర్మసుతుడు’ అంటుంది. ధర్మరాజు ఓ సాధారణమానవుడు కాడని దానర్థం. భీష్మపర్వానికి వస్తే, కృష్ణార్జునులను ‘మర్త్యులు’గా భావించి లెక్క చేయనివారు చెడిపోతారని దుర్యోధనునితో భీష్ముడు అంటాడు. తను ప్రయోగించిన ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడు నిర్వీర్యం చేయడం చూసి, అలాంటి దివ్యాస్త్రం ‘మానవమాత్రు’లైన కృష్ణార్జునులను కూడా ఏమీ చేయలేకపోయిందే అనుకుని ద్రోణపర్వంలో అశ్వత్థామ ఆశ్చర్యపోతాడు.

అలాగే మహాభారతం సామాన్యజనాన్ని సూచించడానికి ‘ప్రకృతిజనులు’ అనే మాట వాడుతుంది. ఉదాహరణకు, కర్ణపర్వంలో దుర్యోధనుడు కర్ణుని గురించి శల్యునికి చెబుతూ, ‘ప్రకృతికాంత, అంటే ఒక సాధారణస్త్రీ కవచకుండలాలతో సూర్యుడిలా వెలిగిపోయే కొడుకును కంటుందా’ అని అడుగుతాడు. శాంతిపర్వానికి వస్తే, తమను పాలించడానికి ఎవరినైనా నియమించమని మానవులు బ్రహ్మను ప్రార్థించినప్పుడు ఆయన మనువుకు ఆ బాధ్యత అప్పజెప్పబోతాడు; ‘నరులు అసత్యచరితు’ లంటూ మొదట వ్యతిరేకించిన మనువు; అన్నివిధాలా సహకరిస్తామనీ, పంటలో ఆరోవంతు పన్నుగా చెల్లిస్తామనీ మానవులు హామీ ఇచ్చిన తర్వాత ఒప్పుకుంటాడు.

పౌరాణికశైలిలో భాగమైన మార్మికత అనే మేలిముసుగును తొలగించి బాబిలోనియా పురాణకథను చూస్తే; మన సాధారణహేతుబుద్ధికి అందే సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రకాంశాలు మరిన్ని బయటపడతాయి. అది దేవతలమధ్య యుద్ధాల ముసుగులో మనుషుల మధ్య జరిగిన యుద్ధాల గురించీ; ఆ యుద్ధాల పర్యవసానమైన రాజ్యస్థాపన గురించీ; ఆ క్రమంలో రాజే దైవంగానూ, ప్రజలు అతనికి విధేయంగా ఉంటూ సేవించుకోవలసినవారుగానూ మారడం గురించీ చెబుతోంది; అంతే ముఖ్యంగా, తియామత్ అనే స్త్రీదేవత ఆధిపత్యాన్ని కూలదోసి మర్దుక్ అనే పురుషదేవుడు తన ఆధిపత్యాన్ని స్థాపించుకోవడంలో- మనం ఇంతకు ముందు విస్తారంగా చర్చించుకున్న మాతృస్వామ్య, పితృస్వామ్యాల ఘర్షణ కోణం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది.

‘మాస్క్స్ ఆఫ్ గాడ్’ (Masks of God) పేరుతో ప్రపంచపౌరాణికకథలను, వాటి మధ్య ఉన్న పోలికలను అనేక కోణాలనుంచి విశ్లేషించిన జోసెఫ్ కాంబెల్, తన ‘ఆక్సిడెంటల్ మైథాలజీ’ (Occidental Mythology) అనే సంపుటంలో పై కథను చర్చిస్తూ, ఒక కోణంలో అది మనుషులపై ఆధిపత్యాన్ని చేజిక్కించుకునే రాజకీయకళకు అద్దంపడుతుందంటాడు. అలాగే, పౌరాణికకల్పనలు అద్వైతస్థితి(non-dual state)నుంచి ద్వైతస్థితి(dual state)కి పరివర్తన చెందడాన్ని కూడా సూచిస్తుందంటాడు.

ఎలాగంటే, మొదట్లో అంతా జలమయంగానే ఉండడం; తియామత్, అప్సు, ముమ్ము అనే ముగ్గురు దేవతలు మాత్రమే ఉండడం; ఆకాశ, భూదేవతలను నియమించకపోవడం అద్వైతస్థితి. అది మాతృస్వామ్యానికి చెందిన ఆదిమవ్యవస్థను కూడా సూచిస్తూ ఉండవచ్చు. మరికొందరు దేవతలను సృష్టించగానే అది ద్వైతస్థితి(dual state)లోకి వచ్చింది. దాంతో ఆధిపత్యంకోసం దేవతల మధ్య ఘర్షణ తలెత్తింది. ‘ఈ’ అనే దేవుడు ‘అప్సు’కున్న శక్తులన్నీ లాక్కుని అతన్ని చంపివేయడంతో మొదలైన ఈ పరివర్తన; తియామత్ పై మర్దుక్ విజయం సాధించడంతోనూ, బాబిలోనియా రాజ్యం అవతరించే ఘట్టానికీ చేరింది. దేవతల పరంగా చెప్పినా దీనిని మనుషులకు అన్వయించుకోవాలి. అంతిమంగా ఈ కథ మనిషి క్రియాశీలుడు కావడాన్ని సూచిస్తుందని కాంబెల్ అంటాడు.

ఇంతకీ మనిషి ఏవిధంగా క్రియాశీలుడయ్యాడో చెప్పుకోవడం ప్రారంభిస్తే, పౌరాణికమార్మికతనుంచి మనకు సూటిగా, స్పష్టంగా అర్థమయ్యే చారిత్రకకాలంలోకి అడుగుపెడతాం. కాంబెల్ వివరించిన ప్రకారం, క్రీ.పూ. 3000 నాటికి మెసపోటేమియాకు ఉత్తరంగా ఉన్న భూములనుంచీ, సిరియా-అరేబియా ఎడారినుంచీ వచ్చిన సెమెటిక్ సంచారజనాలు క్రీ.పూ. 2500 నాటికి మెసపోటేమియాను అధీనంలోకి తెచ్చుకుని రాజ్యాలు స్థాపించారు. అవే తూర్పుదేశాలలో నిరంకుశరాజ్యాల అవతరణకు నమూనా అయ్యాయి. అలాంటి ఒక రాజ్యం అవతరించడం గురించే ఈ బాబిలోనియా పురాణకథ చెబుతోంది. క్రీ.పూ. 1728-1686కు చెందిన బాబిలోనియా పాలకుడు హమ్మురాబి కాలంలోనో, దానికి ఒకింత తర్వాతి కాలంలోనో ఈ కథ రూపొందినట్టు కనిపిస్తున్నా, దాని బీజాలు ఇంకా వెనకటి కాలంలో; అంటే, క్రీ.పూ. 2500కు చెందిన మరో మెసపొటేమియా పాలకుడు సారగాన్ కాలంలో ఉండి ఉండవచ్చునని కాంబెల్ అంటాడు. సారగాన్ నిరంకుశరాజ్యస్థాపకులలో తొలి ముఖ్య ఉదాహరణ.

చారిత్రకనేపథ్యంతో సహా ఈ కథ గురించి ఇంత విపులంగా ఎందుకు ప్రస్తావించవలసివచ్చిందంటే, దాదాపు ఇందులోని ప్రతి ఒక్క వివరమూ, అన్వయమూ మన ఇతిహాస, పురాణకథలకూ వర్తిస్తాయి. ఉదాహరణకు, సామాన్యమానవుడిపట్ల ఈ కథలో కనిపించే తిరస్కారభావం మహాభారతంలోనూ ఎలా వ్యక్తమవుతుందో పైన చెప్పుకున్నాం. మరోవైపు అంతకన్నా ముఖ్యంగా అర్జునుని ‘నరు’నిగా చెప్పి నరుని ఇతిహాస స్థాయికి పెంచుతూనే, మళ్ళీ అతణ్ణి ఋషిగా మార్చి, నారాయణుడనే మరో ఋషితో కలపడం; మళ్ళీ ఆ నారాయణునే దైవంగా మార్చి ‘నరనారాయణు’ల పేరిట నరుని ఆ దైవంతో అనుసంధానం చేయడం కనిపిస్తుంది.

అంటే ఏమిటన్నమాట - మొదట్లో నరునిపట్ల తిరస్కారభావం ప్రకటిస్తూవచ్చిన ప్రపంచపౌరాణికవాఙ్మయం, క్రమంగా అతనికి కూడా పౌరాణికస్థాయిని కల్పించాల్సిన అనివార్యతను గుర్తించిందన్నమాట. ఆ స్థాయిని కల్పించడంలో కూడా పైన చెప్పుకున్నట్టు నరుడు-ఋషి-దేవుడు అనే అంచెలంచెల పద్ధతిని అనుసరించింది. సారగాన్, హమ్మురాబీ అనే మెసపొటేమియా పాలకుల విషయంలో జరిగింది కూడా దాదాపు ఇదే; నరుడు రాజుగా మారే క్రమంలో దైవప్రతినిధిగా, చివరికి దైవంగా మారాడు.

రామాయణ సందర్భానికి వస్తే, అందులో జరిగింది కూడా అచ్చంగా ఇదే! నరుడిగా అడుగుపెట్టిన రాముడే చివరికి దేవుడయ్యాడు!

నరునికి పౌరాణికస్థాయిని కల్పించాల్సిన అనివార్యత ఎలాంటిదన్న ప్రశ్నలోకి వెళ్లినప్పుడు, మాతృస్వామ్యంపై పురుషస్వామ్య స్థాపన అనే మౌలికసమాధానం ఎదురవుతుంది; అందులో భాగంగానే వీరపురుషులు అవతరించి రాజులు, దేవుళ్ళు అయ్యారు. అలా అయే క్రమంలో వారు మాతృస్వామికవ్యవస్థతో చేసిన పోరాటాన్ని ప్రపంచ పౌరాణిక, ఇతిహాసవాఙ్మయం ఏమాత్రం దాపరికం లేకుండా అక్షరబద్ధం చేసింది. పైన చెప్పుకున్న బాబిలోనియా పురాణకథలో అది కనిపిస్తుంది; మరీ ముఖ్యంగా రామాయణంలోనూ కనిపిస్తుంది.

శత్రుజనంపై రాక్షసులన్న ముద్రవేయడం, దేవాసురసంగ్రామాలు మన పురాణ, ఇతిహాసాలలోని ప్రధాన ఇతివృత్తాలలో ఒకటన్న సంగతి మనకు తెలుసు. విశేషమేమిటంటే, వాటికి నాంది పలికింది కూడా పైన చెప్పుకున్న బాబిలోనియా పురాణకథే నంటాడు కాంబెల్.

దానితోపాటు నారాయణుని గురించి రాంభట్ల కృష్ణమూర్తి చెప్పిన మరికొన్ని విశేషాలు తర్వాత...







Tags:    

Similar News