హిట్టైట్ ధర్మశాస్త్రంలో వింతలు, విడ్డూరాలు

రామాయణంలో నిరుత్తరకాండ-24: రామాయణంలో నిరుత్తరకాండ-24: హిట్టైట్ల శిక్షాస్మృతి ఛాయలు మన ధర్మశాస్త్రాలలో కూడా కొద్దో గొప్పో కనిపిస్తాయి. ఎందువల్ల?

Update: 2024-09-05 07:19 GMT
A copy of Hittite cuneiform script tablet

రామాయణంలో నిరుత్తరకాండ-24

హిట్టైట్ ధర్మశాస్త్రంలో వింతలు, విడ్డూరాలు

హిట్టైట్ లిపిని ఛేదించి, సంస్కృతం మొదలైన భాషల్లానే హిట్టైట్లది కూడా ఇండో-యూరోపియన్ భాషేనని వెల్లడించింది బెడ్రిక్ హ్రోజ్నీయేనని ఇంతకుముందు చెప్పుకున్నాం. బహుశా రష్యానుంచి కాకసస్ మీదుగా ఆసియా మైనర్ కు, అంటే నేటి టర్కీ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి అక్కడి స్థానికులను లోబరచుకుని హిట్టైట్లు రాజ్యాన్ని స్థాపించారని ఆయన అంటాడు. రాంభట్లనే ఉటంకించుకుంటే, హిట్టైట్లనే పేరు బైబిల్ పెట్టినది, వారు మాత్రం తమను క్షత్రియులుగా చెప్పుకున్నారు. హ్రోజ్నీ, రాంభట్లలు ఇద్దరి ప్రకారం హిట్టైట్లకు ‘కుశు’లనే పేరుకూడా ఉంది. వారు ఆసియా మైనర్ లో మొదట స్థాపించుకున్న నగరం ‘కుశహార’...

‘కస్’ ధాతువునుంచి పుట్టిన కుశశబ్దం భిన్నభిన్న ఉచ్చారణాలతో అటు రష్యానుంచి ఇటు కశ్మీర్ వరకూ వ్యాపించింది. కాకసస్, కాస్పియన్ (సముద్రం), కుషాణులు మొదలైన పేర్లలో ఉన్నది ‘కస్’ ధాతువే. ఇక మన పురాణ, ఇతిహాసాల్లో చాలా విరివిగా కనిపించే శబ్దాలలో ‘కుశ’ ఒకటి. యజ్ఞాలలో, వైదికమైన ఇతర కర్మలలో ఉపయోగించే దర్భలను ఆ పేరుతో చెప్పడం ఉంది. ఇక ‘కుశ’పేరుతో ముడిపడిన క్షత్రియవంశమూ, క్షత్రియుల పేర్లూ మన పురాణ, ఇతిహాసప్రసిద్ధాలే. ఉదాహరణకు, క్షత్రియుడైన విశ్వామిత్రుడు కుశికవంశీయుడు, కౌశికుడు; జనకుడి తమ్ముడి పేరు కుశధ్వజుడు...

కుశులు, లేదా హిట్టైట్లు ‘కుశహార’ తర్వాత ‘నేసస్’ అనే మరో నగరాన్ని నిర్మించుకున్నారు. దీనినే ‘నాసలి’ అని కూడా పిలిచారు. వేద, ఇతిహాస, పురాణప్రసిద్ధులైన అశ్వినీదేవతలకు ‘నాసత్యు’లనే పేరు దానినుంచే వచ్చిందంటారు. ప్రత్యేకించి ఈ నేసస్ హిట్టైట్లు పుట్టు పాలకు(born rulers)లనీ, మంచి నిర్వహణదక్షులనీ హ్రోజ్నీ అంటాడు. హిట్టైట్లు పాలించడానికే పుట్టిన నిజమైన ‘యజమానుల జాతి’ అంటూ, ‘హెరెన్ వోక్ (Herrenvolk)’తో పోలుస్తాడు. ‘హెరెన్’ లోని ‘హెర్’ శబ్దానికి యజమాని, లేదా పాలకుడనీ; ‘వోక్’ అనే మాటకు సామాన్యప్రజలు, లేదా పాలితులనీ అర్థం. ‘హెర్’ అనే మాట మన దగ్గర ‘శ్రీ’ అనే గౌరవవాచకానికి సమానార్థకం. జర్మన్లు స్వాభావికంగానే ఇతరులకన్నా ఉన్నతజాతి అనే నాజీల చిత్రణ నుంచి ఈ మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. విశిష్టులు, సామాన్యులనే విభజన మహాభారతంలో కూడా చాలాచోట్ల కనిపిస్తుంది. ‘ప్రకృతిజనులు’ అనే మాటతో అది సామాన్యజనాన్ని సూచిస్తుంది. రామాయణంలో కూడా ఇలాంటి వింగడింపు కనిపిస్తుంది...

హిట్టైట్ పాలకవర్గం అల్పసంఖ్యాకులుగానూ, పాలితులైన సామాన్యజనం అధికసంఖ్యాకులుగానూ ఉండేవారనీ, దానికితోడు ప్రాచీనకాలపు తూర్పుదేశాల్లో రాజకీయపరిస్థితులు అస్థిరంగా ఉండేవనీ, హిట్టైట్లు తమ దౌత్య, రాజకీయ, రాజనీతిపరమైన నైపుణ్యాలతో ఈ పరిస్థితులను ఒడుపుగా ఉపయోగించుకుంటూ తమ ఉనికిని, ఆధిక్యాన్ని చాటుకోగలిగారనీ హ్రోజ్నీ అంటాడు. ఇటువంటి నిర్వాహకలక్షణాలు, నైపుణ్యాలు ఉన్నవారు ఒక శిక్షాస్మృతిని, లేదా ధర్మశాస్త్రాన్ని రూపొందించకుండా స్థానికులూ, తమకన్నా అధికసంఖ్యాకులూ అయిన పాలితులను శాసించడం సాధ్యమయ్యేది కాదంటాడు. విశేషమేమిటంటే, హిట్టైట్లే కాకుండా, ఉత్తర సిరియాలో రాజ్యం స్థాపించిన మితానీలు కూడా ప్రాథమికరూపంలోని సంస్కృత భాషకు, ఇండో-యూరోపియన్ తెగలకు చెందిన అల్పసంఖ్యాకజనాలే. హిట్టైట్లలానే వారు కూడా అధికసంఖ్యాకులైన పాలితులపై తమ ఆధిపత్యాన్ని స్థాపించుకున్నారు. ఇంకా విశేషమేమిటంటే, మన దగ్గర ధర్మశాస్త్రాల అవతరణ నేపథ్యాన్నీ; కొద్దిమందిని విశిష్టులుగా, అధికసంఖ్యాకులను సామాన్యులు, లేదా దాసులు, సేవకులుగా విభజిస్తూ వాటిని కూర్చిన తీరునూ అర్థం చేసుకోడానికి హిట్టైట్లు, మితానీల గురించిన పై వివరాలు సాయపడతాయి...

టర్కీలోని బోగజ్ కోయ్ అనే చోట తవ్వకాల్లో బయటపడిన హిట్టైట్ రాజుల పత్రాలలో వివిధవృత్తులవారిని ఉద్దేశించిన అనేక మార్గదర్శకాలు, ఆదేశాలు కనిపిస్తాయి. రాజుగారి ఆహారం సిద్ధం చేసే వంటవారు, రొట్టెలు కాల్చేవారు, వారిపై పర్యవేక్షణ చేసేవారు పరిశుభ్రతను లేదా మడిని పాటించాలని అవి చెబుతాయి. అలాగే, వంటసాలలో ఏ జంతువునైతే చంపి రాజుగారికోసం మాంసాహారాన్ని వండారో ఆ జంతువు చర్మంతోనే చర్మకారులు ఆయనకు పాదరక్షలు తయారు చేయాలి; రాజుగారి భోజనానికి వినియోగించిన ఆవు, లేదా మేక తాలూకు చర్మాన్ని మాత్రమే రాజుగారి రథం తయారీలో రథకారులు ఉపయోగించాలి; రాజుగారు ఉపయోగించే నీటిని శుభ్రంగా వడగట్టాలి. ఇలాంటి విధినిషేధాలను ఏమాత్రం పాటించకపోయినా మరణశిక్ష విధించాలని ఆ ఆదేశాలు చెబుతాయి...

ఒక రాజు చేతులు కడుక్కునే వెడల్పాటి రాగిపాత్రలో వెంట్రుక కనిపించినందుకు అందుకు బాధ్యుడైన వ్యక్తికి మరణశిక్ష అమలు చేసినట్లు ఒక పత్రం చెబుతోంది. ప్రత్యేకించి మతపరమైన మడి, ఆచారం పాటింపులో ఏ కొంచెం తేడా కనిపించినా ఇలాంటి తీవ్రశిక్షలు విధించడం పరిపాటి కావచ్చునని హ్రోజ్నీ అంటాడు. ఇప్పటికీ మన దగ్గర ఆహారంలో కానీ, తాగే వాటిలో కానీ వెంట్రుక కనిపిస్తే చీదరించుకుని వాటిని పక్కన పెట్టడం ఉంది. మహాభారతంలో ఉదంకుడనే బ్రాహ్మణుడికి పౌష్యుడనే రాజు భోజనం పెట్టినప్పుడు అందులో వెంట్రుక కనిపించగా ఉదంకుడు ఆగ్రహించి ఆ రాజును శపిస్తాడు, రాజు కూడా కోపగించి అతనికి ప్రతిశాపమిస్తాడు...

పురోహితులు, లేదా పూజారులకు; ఆలయాలలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన ఆదేశాలు కూడా హిట్టైట్ రాజపత్రాలలో కనిపిస్తాయి. శాశ్వతసైన్యంలో భాగమైన సైనికులకు వ్యవసాయభూములను కేటాయించడం హిట్టైట్లలోనూ, మితానీలలోనూ కూడా ఉండేది. వీరు కాక, కిరాయి సైనికులు కూడా ఉండేవారు. ఒక్కోసారి వారికి ప్రత్యేక హక్కులు కల్పించేవారు. ఉదాహరణకు, విలుకాండ్రుగా, ఆశ్వికులుగా, సైన్యం ముందుకు సాగడానికి మార్గాన్ని సుగమం చేసేవారుగా పనిచేసే ఆయా నగరాలకు చెందిన ‘మంద’ అనే ఉత్తరాది ఆర్యగణాలవారిని యుద్ధసమయంలో కొన్నిరకాల రోజువారీ ప్రజోపయోగవిధుల(పబ్లిక్ వర్క్స్)నుంచి మినహాయించాలని హిట్టైట్ శిక్షాస్మృతి చెబుతోంది. అలాగే, లోహకార్మికులకు కూడా యుద్ధసమయంలో ఇతరమైన పనులనుంచి మినహాయింపు ఉంటుంది; వారు అప్పుడు కోటలో అప్పగించిన ప్రత్యేకమైన పనులు మాత్రమే చేయాలి. అయితే, మిగతా సమయాల్లో రహదారులు, దేవాలయాల నిర్మాణం వంటి ఉమ్మడి శ్రేయస్సుకు సంబంధించిన పనుల్లో ప్రతి ఒకరూ విధిగా పాల్గొనాలి. ఇది ఒకవిధమైన ‘నిర్బంధశ్రమ’ అంటాడు హ్రోజ్నీ. ఇలాంటి నిర్బంధశ్రమ ఆనాడు ఈజిప్టు, మెసపొటేమియా వంటి ప్రాచీననాగరికతలలో కూడా ఉండేది. ‘చండశాసనం’ కింద దానిని అమలు చేసేవారనీ, ఆ శాసనం అమలులో ఉన్నన్ని రోజులూ పెళ్లిళ్లనూ, దాంపత్యసంబంధాలనూ నిషేధించేవారనీ రాంభట్ల అంటారు. మన దగ్గర చోళులు, పాండ్యులు మొదలైన వెనకటి దక్షణాదిరాజుల కాలంలో కూడా చండశాసనం లాంటి ఏర్పాటు ఉండేదనీ, రాజు, రాజు భార్యా కూడా అందరితోపాటు పనిలో పాల్గొనేవారనీ రాంభట్ల అంటారు.

అయితే, హిట్టైట్ల పాలనలో అప్పుడు కూడా అన్ని పట్టణాలలోని పురోహితులు, లేదా పూజారులకు; పవిత్రస్థలాలుగా గుర్తింపు పొందిన పట్టణాలలో నివసించే జనానికి, కొన్ని తరగతులకు చెందిన సైనికులకు నిర్బంధశ్రమనుంచి మినహాయింపు ఉండేది…

హ్రోజ్నీ హిట్టైట్లపై పరిశోధన చేసే క్రమంలోనే రెండు పెద్దవైన మట్టిపిడకలపై క్యూనీఫామ్ లిపి(మేకు ఆకారంలోని లిపి)లో లిఖించిన హిట్టైట్ల శిక్షాస్మృతి కూడా బయటపడింది. ఒక్కొక్కదానిపై వంద పేరాగ్రాఫులున్నాయి. ఈ శిక్షాస్మృతి క్రీ.పూ 15వ శతాబ్దిలో రూపొందినది కావచ్చునని హ్రోజ్నీ అంచనా వేశాడు. అంతకుముందున్న శిక్షాస్మృతికి ఇది అక్కడక్కడ సవరించిన రూపంలా కనిపిస్తుందని ఆయన అంటాడు. బాబిలోనియా పాలకుడు హమ్మురాబీ, అసీరియా రాజుల శిక్షాస్మృతులతో పోల్చితే హిట్టైట్ల స్మృతి ఆయా నేరాలకు విధించే శిక్షలను రానురాను సరళం చేసినట్టు కనిపిస్తుందంటాడు. చిన్న నేరానికి కూడా మరణశిక్షను నిర్దేశించిన హమ్మురాబి శిక్షాస్మృతి గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే, అసీరియా రాజులు కూడా ఖైదీల కళ్ళు పొడిచేయడం; చెవులు, నాలుక కోయడం, కాళ్ళూ, చేతులూ నరకడం, కొరత వేయడం వంటి క్రూరమైన శిక్షలు అమలుచేసేవారు. విచిత్రమేమిటంటే, ఎనిమిదివందల ఏళ్ల క్రితంనాటి విజయనగరసామ్రాజ్యంలోనూ పాలకులు ఇలాంటి క్రౌర్యాన్ని చాటుకునేవారు. ప్రత్యేకించి కళ్ళు పొడిచేయడం పరిపాటిగా ఉండేది. రామాయణంలో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోయడంలోనూ ఇలాంటి క్రూరత్వపు ఛాయలు కనిపిస్తాయి. హిట్టైట్ల శిక్షాస్మృతిలో ఇలాంటి అమానుషాల స్థానంలో ఆస్తుల స్వాధీనం వంటివి అడుగుపెట్టాయి...

అయితే, హమ్మురాబి శిక్షాస్మృతికీ, హిట్టైట్ల శిక్షాస్మృతికీ మధ్య ఒక మౌలికమైన తేడా కనిపిస్తుంది. సామాజికంగా, సంపదపరంగా ఆధిక్యస్థానంలో ఉన్నతవర్గాలపై కన్నా, నిమ్నవర్గాలపై తక్కువ జరిమానాలు, శిక్షలు విధించడం హమ్మురాబి స్మృతిలో కనిపిస్తే; హిట్టైట్ల శిక్షాస్మృతి దీనికి పూర్తి తలకిందులుగా ఉన్నతవర్గాలపై పక్షపాతం చూపుతుంది. ఉదాహరణకు, ఎవరైనా ఒక తగాదాలో ఒక స్వతంత్రపౌరుని హత్య చేస్తే, నలుగురు వ్యక్తుల రూపంలో అందుకు పరిహారం చెల్లించాలనీ; అదే ఒక బానిసను హత్యచేస్తే ఇద్దరిని పరిహారంగా చెల్లించాలనీ అది చెబుతుంది(వ్యక్తులను పరిహారంగా చెల్లించడం ఎలాగో హ్రోజ్నీ స్పష్టం చేయలేదు). అదే ఒక స్వతంత్రపౌరుని వల్ల యాదృచ్ఛికంగా మరో స్వతంత్రపౌరుడు మరణిస్తే ఇద్దరు వ్యక్తులను; ఒక బానిస మరణిస్తే ఒకరిని పరిహారంగా చెల్లించాలి. ఒక వర్తకుని హత్యచేసినా, దోచుకున్నా భారీమొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒక స్వతంత్రపౌరుని అంధుణ్ణి చేసినప్పుడు మొదట్లో 60 షెకెళ్ళను జరిమానాగా చెల్లించవలసి ఉండగా, సవరించిన స్మృతిలో దానిని 20 షెకెళ్ళకు తగ్గించారు. అదే, ఒక బానిసను గాయపరిస్తే, 10 షెకెళ్లను చెల్లిస్తే చాలు. ఇలాగే అన్నింటిలోనూ స్వతంత్రపౌరునికీ, బానిసకీ మధ్య తారతమ్యాలను పాటించడం కనిపిస్తుంది...

హత్య చేసిన నేరం కన్నా, వ్యక్తులను అపహరించిన నేరాన్ని ఎక్కువ తీవ్రంగా పరిగణించి, ఎక్కువ జరిమానా విధించాలని హిట్టైట్ల స్మృతి చెప్పడం ఆసక్తికరం. నేరస్తుని ఇంటినీ, కుటుంబసభ్యులనూ కూడా బాధిత కుటుంబానికి అప్పగించాల్సి ఉంటుంది. రాజు కానీ, రాజు దగ్గర ఉన్నతస్థానాలలో ఉన్న ఉద్యోగులు కానీ ఇచ్చిన తీర్పును ఉల్లంఘించినా; దగ్గరి బంధువులపై లైంగిక అత్యాచారం చేసినా మరణశిక్ష విధించాలని ఈ స్మృతి నిర్దేశించింది. భార్య పరపురుషుడితో సంబంధంలో ఉండి ప్రత్యక్షంగా పట్టుబడినప్పుడు భర్త వాళ్ళిద్దరినీ హతమార్చడం నేరం కాదని అది చెబుతుంది. కొన్ని వింతగా తోచే నిర్దేశాలు కూడా ఈ స్మృతిలో ఉన్నాయి. ఉదాహరణకు, కొండప్రాంతాలలో ఏ స్త్రీపై నైనా అత్యాచారం చేస్తే అది నేరం కాదు! అదే, ఒక స్త్రీపై ఏదైనా ఒక ఇంట్లో అత్యాచారం చేసినప్పుడు ఆమె సహాయం కోసం కేకలు పెట్టకపోతే ఆమెకు మరణశిక్ష విధించమంటుంది...!

పురాతనకాలంలో పశుసంపద అత్యంతవిలువైనది కనుక పశువుల అపహరణకు తీవ్రశిక్ష విధించమని అది చెబుతుంది, ఇక వివాహాల విషయానికి వస్తే, హిట్టైట్లు పితృస్వామికవిధానాన్ని అమలుచేసేవారనీ, స్త్రీని అన్ని విధాలా అదుపాజ్ఞల్లో ఉంచేవారనీ హ్రోజ్నీ అంటాడు. వధువును శుల్కం చెల్లించి కొనుక్కోవడం ఉండేది. ఆ మేరకు రెండు కుటుంబాలవారూ వధూ, వరుల బాల్యంలోనే ఒప్పందం చేసుకునేవారు. ఒకవేళ వరుడి కుటుంబంవారు ఆ ఒప్పందాన్ని రద్దు చేయదలచుకుంటే, ఒప్పందం మొత్తానికి రెట్టింపు మొత్తాన్ని వధువు కుటుంబానికి చెల్లించాలి. వివాహసమయంలో వధువుకు పుట్టింటివారు ఆస్తిలో కొంత భాగం ఇవ్వాలి. విశేషమేమిటంటే, వధువును అపహరించుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి హిట్టైట్ స్మృతి అనుమతిస్తోంది. మన ధర్మశాస్త్రాలు ఎనిమిది రకాల వివాహాల గురించి చెబుతూ ‘రాక్షసవివాహం’ పేరిట దీనిని కూడా వాటిలో చేర్చడం ఇక్కడ గుర్తుచేసుకోవలసిన విషయం...

ఒక కులీనయువతి సామాజికంగా తనకన్నా అతితక్కువ స్థాయికి చెందిన ఏ గొర్రెల కాపరితోనో పోవడానికి ఇష్టపడినప్పుడు మూడేళ్ళపాటు ఆమె బానిసగా జీవించాల్సి ఉంటుంది. ఒక స్వతంత్రపౌరుడు ఒక బానిస స్త్రీ నుంచి విడాకులు తీసుకున్నప్పుడు తన ఆస్తిలో సగం ఆమెకు ఇవ్వాలి. వారికి కలిగిన సంతానంలో ఒకరిని మాత్రం ఆమెకిచ్చి మిగతావారిని తను తీసుకోవాలి. స్వతంత్రుల వర్గానికి చెందిన భార్యా, భర్తల విషయంలో కూడా ఇలాంటి నిబంధనే ఉండి ఉండచ్చని హ్రోజ్నీ అంటాడు. ఈ రోజున మనకు అత్యంతదారుణంగానూ, ఊహించడానికి కూడా ఎంతో కంపరంగా గానూ ఉండే ఒక నిర్దేశం హిట్టైట్ స్మృతిలో కనిపిస్తుంది; అదేమిటంటే, భర్త మరణించినప్పుడు అతని సోదరుడు లేదా అతని తండ్రి ఆ వితంతువును పెళ్లాడవలసి ఉంటుంది...!

కొంచెం సుదీర్ఘమే అయినా హిట్టైట్ల శిక్షాస్మృతి గురించి ఈ మాత్రం వివరాలను ఎందుకు చెప్పుకోవలసివచ్చిందంటే, మన ధర్మశాస్త్రాలలో కూడా వీటి ఛాయలు కొద్దో గొప్పో కనిపిస్తాయి కనుకనే! ముఖ్యంగా, శిక్ష విధింపులో ఉన్నతవర్ణ/కుల/సంపన్నవర్గాలపట్ల పక్షపాతాన్ని చూపించే విషయంలో! అలాగే, మొదట్లోనే చెప్పుకున్నట్టు ఇండో-యూరోపియన్ బంధుత్వంతో సహా ఉభయ ధర్మశాస్త్రాల అవతరణ నేపథ్యంలో కూడా ఎన్నో సామ్యాలు కనిపిస్తాయి...

మనుధర్మశాస్త్రం గురించి తర్వాత...

-కల్లూరి భాస్కరం



Tags:    

Similar News