ట్రంప్ సాకుతో రొయ్య రైతుల్ని దోపిడీ చేస్తున్న ట్రేడర్లు

ట్రంప్ టారిఫ్ బూచి చూపి వ్యాపారస్తులు, మధ్య దళారులు రొయ్యల రైతుల్ని నిలువునా దోపిడి చేస్తున్నారు..;

Update: 2025-08-14 11:58 GMT
Source: Global sea food alliance

-పి.జమలయ్య

అమెరికా విధించిన టారిఫ్ బూచి చూపి స్థానిక వ్యాపారులు, దళారులు రొయ్యల రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. సగానికి సగం ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.

భారత దేశం నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్న వ్యవసాయ, ఆక్వా, మత్స తదితర ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50శాతం సుంకాలను విధించారు. ఈ పన్నులు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ సుంకాలతో అమెరికాకి రొయ్యలు ఎగుమతి చేసే వ్యాపారులు, అమెరికాలోని బయ్యర్లు చేతులెత్తేశారు. ఇది అదునుగా తీసుకుని భారతదేశం నుంచి ఎగుమతి చేసే వ్యాపారస్తులు, స్థానిక రొయ్యల వ్యాపారస్తులు, మధ్య దళారులు తక్కువ ధరలకు రొయ్యలు కొనుగోలు చేసి నిలువునా రైతుల శ్రమను దోచేస్తున్నారు.

అంతర్వేది గ్రామానికి చెందిన రొయ్యల రైతు చెన్నుబోయిన తాతాజీ

ప్రస్తుతం మార్కెట్ లో ధరలు..

-40 కౌంటు గల కేజీ రొయ్యలు రూ.400ల నుంచి రూ.320లకు

-50కౌంట్ గల రొయ్యల కేజీ రూ.340 నుంచి రూ.320లకు

-60 కౌంటర్ కలిగిన కేజీ రొయ్యలు ధర రూ.300 నుంచి 280లకు

-100కౌంట్ గల రొయ్యలు రూ.280 నుంచి రూ. 230లకు తగ్గించి నిట్ట నిలువునా రైతుల కష్టార్జితాన్ని కాజేస్తున్నారు.

ఈ సుంకాలు విధింపు నేపథ్యం ఏమిటంటే..

రష్యా నుంచి ముడి చమురును భారత దేశం కొనుగోలు చేస్తన్నదని దీని వల్ల రష్యాకు ఆదాయం పెరిగి ఉక్రెయిన్ పై దాడికి ఆ సొమ్మును వినియోగిస్తారని నెపంతో అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ భారత దేశం నుండి అమెరికాకు దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై 50% సుంకాలు విధించారు. మన దేశంలో వ్యవసాయ, మత్స్య, ఆక్వా తదితర ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం పడుతుంది.

రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే ఆహార ఉత్పత్తులు...

రాష్ట్రం నుంచి ఇప్పుడిప్పుడే అమెరికాకు పలు వ్యవసాయ, ఉద్యాన, ఇతర ఉత్పత్తులు ఎగుమతులు అవుతున్నాయి. వీటిలో రొయ్యలు, దంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యం, పాలిష్ బియ్యం, పిండి, జీడిపప్పు, బెల్లం పొడి, టమాట, పిస్తా, మినరల్ వాటర్, రోస్టెడ్ నట్స్, తృణ ధాన్యాల ఉత్పత్తులు ఉన్నాయి. వీటి వల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా మన దేశానికి చేకూరుతుంది. ట్రంపు విధానం వల్ల విదేశీ మారక ద్రవ్యానికి గండి పడుతుంది.

ఆక్వా రంగంపై భారీ దెబ్బ...

ట్రంపు భారీ సుంకాల వలన ఆక్వా రంగంపై భారీ దెబ్బ పడనున్నది. గతంలో 25శాతం సుంకాలు ఉంటేనే ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మరో 25శాతం పెంచి 50శాతం చేశారు. దీని వల్ల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు.

ముఖ్యంగా ఆక్వా రంగానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఆయువుపట్టు. ఈ రెండు జిల్లాల నుంచే 60 శాతం ఉత్పత్తి జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఏటా 10 నుంచి 11 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుండగా అందులో ఉభయగోదావరి జిల్లాలో 3 లక్షల టన్నులు రొయ్యలు ఉత్పత్తి జరుగుతుంది. మొత్తంగా ఉత్పత్తి అయిన రొయ్యలలో అమెరికాకు 60 శాతం, చైనాకు 30% ఎగుమతి అవుతున్నాయి. వీటి ద్వారా భారీగా విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుంది.

భీమవరం నుంచి కాకినాడ జిల్లా, తాళ్ళరేవు వరకు వందల సంఖ్యలో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి తీరా ప్రాంతంలో రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే హెచరీస్ లు ఉన్నాయి. పెంచిన సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి వస్తాయి. కానీ వ్యాపారస్తులు ఇప్పటినుంచే ధరలు తగ్గిస్తున్నారు. గతంలో 25 కౌంట్ గల కేజీ రొయ్యల ధరలు రూ.565 నుంచి రూ.430లకు తగ్గించారు. దీంతో రొయ్యల రైతులు లబో దిబోమంటున్నారు.

20వేల కోట్ల విలువైన రొయ్యల ఎగుమతి..

అమెరికాకు రొయ్యల ఎగుమతుల్లో ఏపీ ప్రధానమైన వాటదారుగా ఉంది. ప్రతి ఏడాది దాదాపు రూ.20వేల కోట్ల విలువ గలిగిన రొయ్యలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంటే ఇందులో అమెరికాకు వెళ్లే రొయ్యల విలువ రూ.16 వేల కోట్లు. ఈ సుంకాలు విధింపు వలన టన్నుకు రూ.40 వేలకు పైగా నష్టం వాటిల్లింది. భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గిపోతుంది.

రాష్ట్రంలో పరిస్థితి ఇలా...

రాష్ట్రంలో అధికారికంగా సుమారు 2.50 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. మరో లక్షన్నర ఎకరాల చెరువుల్లో అనధికారికంగా రొయ్యలు ఉత్పత్తి సాగవుతుంది. ఆక్వా రంగంపై ప్రత్యక్షంగాని, పరోక్షంగా గాని 20 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇవే గాక ప్రాసెసింగ్ యూనిట్లలోను, రొయ్యల పిల్లలు ఉత్పత్తి చేసే హెచరీస్ లో పనిచేసే అసంఘటిత కార్మికుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. ఎగుమతులు పడిపోతే ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. సాగు కుదించుకు పోయి దిగుబడి తగ్గి పోతుంది. దీంతో ప్రాసెసింగ్ యూనిట్లపై కూడా ప్రభావంపడి ఉపాధి దెబ్బతింటుంది. వారి కుటుంబాలు వీధిన పడి తీవ్ర సంక్షోభానికి గురవుతారు.

రొయ్యల చెరువులు

ఎకరా రొయ్యల చెరువుకుఅయ్యే ఖర్చు...

ప్రస్తుతం ఒక ఎకరాకు 1.50లక్షల రొయ్య పిల్లలు వదులుతున్నారు. టన్ను మేత రూ.80వేలు అయింది. చెరువులో వదిలే రొయ్య పిల్లల సంఖ్య 3 రెట్లు పెరగటంతో అదే రీతిలో మేత ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. ఎకరానికి కౌలు కూడా ఒక లక్ష నుంచి 1లక్ష 50 వేల రూపాయలకు చేరింది. పది ఎకరాలు లోపు ఉన్న రైతుకు యూనిట్ 1.50 పైసలకు విద్యుత్ ఇచ్చినప్పటికీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు బిల్లులు చాలా అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం వస్తున్న బిల్లులపై ట్రూ ఆఫ్ చార్జీలు భారీగా పెరిగాయి. చార్జీలు భారం మోయలేని పరిస్థితి ఏర్పడింది. రొయ్యలకు మద్దతు ధరలు ప్రకటించాలనే డిమాండ్ కూడా రైతుల నుంచి ఉంది. సీడ్, ఫీడ్, యాంటీ బయోటిక్ మందుల దరలు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా, కంటి తుడుపు చర్యలతో సరిపుచ్చుతున్నారు. ఈ సుంకాల బారి నుండి ఆక్వారంగాన్ని రక్షించడానికి ప్రత్యామ్నాయాలు అన్వేషించాలి.

మరి ఏమి చేయాలి

భారతదేశంపై ట్రంప్ విధించిన 50% సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికాతో ఉన్న ఒప్పందాలు, డబ్ల్యూటిఓలోని ఫిర్యాదు అవకాశాలు ఉపయోగించి సుంకాల తగ్గింపు కోసం చర్చలు జరపాలి. అమెరికా నుండి దిగుమతి అవుతున్న కొన్ని వస్తువులపై తగిన ప్రతిసుంకాలు విధించడం ద్వారా సమాన ఒత్తిడి సృష్టించాలి.

-ఎగుమతులు చేయడానికి అమెరికా మార్కెట్‌కి బదులుగా యూరోప్, దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి కొత్త మార్కెట్లు అన్వేషించాలి. ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాల ద్వారా లేదా ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా సుంకాల ప్రభావం తగ్గించుకోవచ్చు.


-ఎగుమతి సబ్సిడీలు, పన్ను రాయితీలు, ప్రభావితమైన రంగాలకు తాత్కాలిక సహాయం అందించాలి.

-ఒకే దేశంపై అధికంగా ఆధారపడటం తగ్గించి, ఎగుమతులను విస్తృతంగా పెంచుకోవాలి. దేశీయ డిమాండ్ పెంపుకు చర్యలు తీసుకోవాలి.

-ఎగుమతిదారులు తాము కొనుగోలు చేసిన రొయ్యలలో కనీసం 40 శాతం రొయ్యలను దేశీయంగా అమ్మే విధంగా ప్రభుత్వం చట్టం చేసి అమ్మించాలి.

-ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపే స్కూల్స్, కాలేజీ హాస్టల్స్, అంగన్వాడి కేంద్రాలలో 15 రోజులకు ఒకసారి రొయ్యలను పుడ్ మెనూ లో చేర్చాలి.

ఎగుమతి మార్కెట్ క్షీణించినపుడు దేశీయ వినియోగాన్ని పెంచడం ద్వారా ఉత్పత్తిదారులకు మద్దతు ఇవ్వాలి. ఉత్పత్తి ఖర్చు తగ్గించాలి.

వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను పెంచడానికి మౌలిక సదుపాయాల మెరుగుదల చేయాలి.

-రొయ్యల రైతులందరికీ సబ్సిడీతో ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా విద్యుత్తును యూనిట్ కు రూ. 1.50 అందించాలి.తగ్గిన సోయా ధరలకు అనుగుణంగా రొయ్యల ఫీడ్ ధరలను కనీసం కిలోకు రూ.15 కు తగ్గించాలి.రొయ్యల సాగులో ఉపయోగించే కెమికల్స్, మినరల్స్ ధరలను కనీసం 30శాతం తగ్గించాలి.రొయ్యల కనీస మద్దతు ధరను వెనామీ రొయ్యల కిలో 100 కౌంట్ కు రూ.250లు,30 కౌంట్ కు రూ.400 లకు తగ్గకుండా, టైగర్ రొయ్యల 30 కౌంట్ కు రూ.480లు ప్రకటించి ఎగుమతిదారులతో నేరుగా కొనుగోలు చేయించాలి, ధరలు తగ్గిన పరిస్థితుల్లో తగ్గిన ధరను ప్రభుత్వం బోనస్ గా రైతులకు చెల్లించాలి.

రొయ్య రైతులు ఏమి చెబుతున్నారంటే.. 

గడ్డం ప్రభాకర్,రొయ్యల రైతు అడ్డాలపాలెం, సఖినేటిపల్లి,కోనసీమ జిల్లా

-రొయ్యల ఉత్పత్తిలో కరెంటు వాడటం కీలకంగా ఉంటుంది. ఐదు ఎకరాలకు సంబంధించిన రైతుకు ట్రాన్స్ఫార్మర్ కు కరెంట్ బిల్ రూ.70వేలు వచ్చింది. కూటమి సర్కారు యూనిట్ కు 1.50 రాయితీ ఇవ్వటం వలన రూ.30వేలకు తగ్గింది. ఈ సంవత్సరం ట్రూ అప్ చార్జీల పేరుతో రూ.46 వేలు వరకు బిల్లు వచ్చింది. రాయితీ ఇచ్చినట్లు ఇచ్చి ట్రూ అప్ చార్జీల పేరుతో వెనక్కి గుంజుకుంటున్నారని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ట్రూ ఆఫ్ చర్చిలు ఎత్తివేయాలని సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన రొయ్యల సాగు చేసే రైతు చెన్నుబోయిన తాతాజీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

-రొయ్య పిల్లల రేట్లు కూడా పెరిగాయని గతంలో ఒక పిల్ల 35 పైసలు ఉంటే ఇప్పుడు 45 పైసలు దాక పెరిగిందన్నారు. ఒక ఎకరం చెరువులో లక్ష రొయ్య పిల్లలు వదలితే ఇప్పుడు 1,50,000 పిల్లలు వేయ్యవలసి వస్తుంది.రొయ్యల పిల్లలు కొనుగోలే సుమారు రూ.67వేలు అవుతుందని దీని వల్ల ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుందన్నారు. కనీసం ఒక రొయ్య పిల్లకు ఐదు పైసలు సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇంత పెట్టుబడి పెట్టిన దిగుబడి ఆశించినంతగా రావడం లేదని ట్రంప్ సుంకాల వలన కనీసం ఖర్చులు కూడా వస్తాయో రావని ఆవేదన వ్యక్తం చేశారు.

-రొయ్యల మేత టన్ను రూ.80 వేల నుంచి 90 వేలకు పెరిగింది. 10 సంవత్సరాల క్రితం 25 కేజీలు బస్తా రూ.1500 ఉంటే ప్రస్తుతం రూ.2600లకు పెరిగిందని,100 కౌంటు గల కేజీ రొయ్యలు ధర 10 సంవత్సరాల క్రితం రూ.270 ఉంటే ఇప్పుడు అదే రేటు ఉందని మేత ఖర్చులు పెరిగినప్పటికీ రొయ్యల ధరలు పెరగకపోవటం సాగు భారం అవుతుందని కోనసీమకు చెందిన అడ్డాలపాలెం గ్రామానికి చెందిన రొయ్యల రైతు గడ్డం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

-కేజీకి ధాణాకు రూ.4లు తగ్గించమని రైతుల డిమాండ్ చేయగా కూటమి సర్కార్ కేవలం రూ.2లు తగ్గించి చేతులు దులుపుకుంది. దాణాకు సబ్సిడీ కావాలని కోరుతున్నారు. దానితోపాటు రొయ్యలకు వాడే మందులు, వాటర్ ప్రొబ్రాయిటిక్, మినరల్, ఆక్సిజన్ టాబ్లెట్స్ తదితర వాటి రేట్లు కూడా పెరుగుతున్నాయని గత సంవత్సరం కేజీ ఆక్సిజన్ టాబ్లెట్ రూ.350లు ఉంటే ఇప్పుడు రూ.400లు పెరిగిందన్నారు.

-ఆక్వా రైతు నాయకులు సి హెచ్ కేశవ్ శెట్టి మాట్లాడుతూ ప్రతి ఏటా ఉత్పత్తి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 100 కౌంట్ గలిగిన కేజీ రొయ్యలకు కనీసం రూ.250 మద్దతు ధర ప్రకటించాలని దాని ప్రకారం వ్యాపారస్తులు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

వ్యాసకర్త- పి.జమలయ్య

(వ్యాసకర్త- ఆంధ్రప్రదేశ్ కౌలు సంఘం కార్యదర్శి, రైతు సంఘం నాయకులు)

Tags:    

Similar News