ఉత్తర తెలంగాణ కు మంచి రోజులు ఇంకా ఎప్పుడు ?

రాజుకుంటున్న ఉత్తర తెలంగాణ నిర్లక్ష్యం;

Update: 2025-05-19 02:30 GMT
source: Smile Foundation

ప్రాంతీయ అసమానతలు, అస్తిత్వ వాంఛల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రాంతీయ వివక్ష కొనసాగుతోందనే అభియోగం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రగతికి పాలకులు శ్రద్ధ చూపడం లేదనే వాదన బలపడుతోంది. వివక్ష రెండు రకాలుగా సాగుతోందని వివిధ ప్రాంతాలు, జిల్లాల ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు ప్రాతినిధ్యం వహించే మూడు - నాలుగు జిల్లాల క్లష్టర్లో జరిగే అభివృద్ధి ఇతర జిల్లాల్లో జరగటం లేదనేది మొదటి విమర్శ.

దక్షిణ తెలంగాణ జిల్లాల మీదున్న ప్రత్యేక శ్రద్ధ, ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై లేదనేది రెండవ విమర్శ . అంతా ఆధిపత్యం మరియు అభివృద్ధి కార్యక్రమాలు దక్షిణ తెలంగాణ వారి చేతిలో వుండటాన్ని మాత్రం ఉత్తర తెలంగాణ పార్టీల నాయకులు మాత్రం భరించలేకపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అభివృద్ధికి పుష్కలమైన అడవులు, ఖనిజసంపదకు కొదువ లేదు.

సాగు, తాగునీరు కల్పించేందుకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మన అవసరాలు తీర్చడమే కాకుండ పక్క రాష్ట్రాలను ఆదుకునేంత వర్షపాతము ఉన్నప్పటికీ అభివృద్ధి పరిచి ప్రజలకు అందించే విషయంలో ఉత్తర తెలంగాణ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది.

నేటికి ఆదే వెనుకబాటు...
మెరుగైన రవాణా వ్యవస్థ ఉంటే పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుంది. రహదారులు, రైలు, విమాన మార్గాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయి.పరిశ్రమల ఏర్పాటు, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఒక ఆవాస ప్రాంత రోడ్డు గ్రామ రోడ్డుతో, గ్రామం నుండి మండల కేంద్ర రహదారితో, మండల కేంద్ర రహదారులు జిల్లా ప్రధాన రహదారులతో కనెక్టివిటీ ఉండడం అవశ్యం. కాని ఉత్తర తెలంగాణలో నేటికీ నేడు గ్రామీణ రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.
నేటికి వందలాది గ్రామాలు, గిరిజన తండాలు, గోండు గూడేలకు సరైన దారుల్లేవు. అక్కడ వాగులు వంకలు దాటేందుకు చాలా చోట్ల కల్వర్టులు కూడా లేవు. జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్లడానికీ అవస్థలు పడుతున్నారు. 78 ఏళ్ల స్వతంత్ర్య చరిత్రలోనూ 'పల్లె వెలుగు' (ఆర్టీసీ బస్సు) ఎరుగని పల్లెలు వందల్లోనే ఉంటాయి. రైల్వే లైన్ల అభివృద్ధిలోనూ, విమానయానంలోనూ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది.
వ్యవసాయ రంగ అభివృద్ధి
వ్యవసాయంపైన చాలినంత శ్రద్ధ పెట్టలేదు.వ్యవసాయ రంగంలో సరైన దిగుబడులు రాక, ఇతర ఉపాధి అవకాశాలు లేక ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో నేడు 50 శాతం ప్రజల చేతిలో సెంటు భూమికూడా లేదు. భూ పంపిణీ పథకం కింద లక్షల్లో భూములు పంచినట్లు ప్రభుత్వ నివేదికల్లో ఉన్నా ఆ మొత్తం భూమి సంబంధిత లబ్ధిదారుల చేతుల్లో లేదు.మెజార్టీ భూములు బినామీ పేర్లతో నాయకుల చేతుల్లోకి వెళ్లి పోయింది. స్థానికంగా ఉపాధి కల్పన కోసం చేపట్టాల్సిన చిన్న తరహా, కుటీర పరిశ్రమలూ పెద్దగా నెలకొల్పబడలేదు.రవాణా సదుపాయాలు లేని మూలంగా పారిశ్రామిక విస్తరణ జరగలేదు. ఫలితంగా ఇక్కడ నేడు ప్రాంతీయ, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. ఉపాధి కోసం ఖండాంతర వలసలూ తప్పడం లేదు.ఈ ప్రాంత ప్రజల వెనకబాటుతనమే దాన్ని రుజువు చేస్తోంది.
మంత్రివర్గం లోనూ వివక్షేనా...
అన్నింటికీ మించి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోను ఉత్తర తెలంగాణ నుంచీ కేవలం ఇద్దరికి మాత్రమే బెర్తులు లభించడం మనకి తెలిసిందే. అనాదిగా నిర్లక్ష్యానికి గురవుతున్న భారీ విస్తీర్ణం గల అదిలాబాద్ నుంచి మంత్రివర్గంలో ఏ మాత్రం ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు నారాజ్ అవుతున్నారు. ఉత్తర తెలంగాణ తో దశాబ్దాలుగా విడదీయరాని అనుబంధం ఉన్న కాకా కుటుంబీకులైన వివేక్ వెంకట్ స్వామీ లేదా వినోద్ వెంకట్ స్వామీకి లేదా అనాదిగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న పార్టీ సీనియర్ నాయకుడు ప్రేమ సాగర్ కి మొదటి విడుతలో మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడాన్ని ఆ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోను ఇదే రకమైన నిర్లక్ష్యం కొనసాగుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేత గా ఆ జిల్లాల్లో పార్టీ కి పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన రెడ్డికి లేదా ప్రజా వైద్యునిగా పేరు తెచ్చుకున్న ఎం ఎల్ ఏ డాక్టర్ భూపతి రెడ్డీ కీ సముచిత స్థానం ఇవ్వాలని ఈ జిల్లా వాసులు కోరుతున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెండు మంత్రిపదవులు ఉన్నప్పటికీ, పార్టీకీ అత్యంత కీలకమైన నాయకుడైన శ్రీధర్ బాబుకి కనీసం ఉప ముఖ్యమంత్రి పదవీ ఇవ్వక లేక పోయారు. శ్రీధర్ బాబు లాంటి వాళ్లకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందేనని ఉత్తర తెలంగాణ వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.అటూ అభివృద్ధి విస్తరణలోను,ఇటూ మంత్రివర్గ విస్తరణలోను ఉత్తర తెలంగాణకు న్యాయం చేయలేకపోవడాన్ని సాక్షాత్తు కాంగ్రెస్ వాదులే నామోషిగా ఫీల్ అవుతున్నారు.
నిరసన గళాలు...
ఇప్పుడు మళ్ళీ ఉత్తర తెలంగాణకు జరుగుతున్న అవమానాలు చూసి ఉత్తర తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలన్న ఆలోచనల ఈ ప్రాంత మేధావుల్లో బలపడుతూ ఉంది. ఉత్తర తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపిస్తే ఉత్తర తెలంగాణ ఉద్యమం రాక తప్పదని ఉత్తర తెలంగాణకే చెందిన బిజేపి శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డీ బహిరంగంగానే చెబుతున్నారు.ఉత్తర తెలంగాణ ప్రాంతీయ అభివృధ్ధి బోర్డు ఏర్పాటు కోసం పోరాటం ప్రారంభించడానికి అనేకమంది నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆనాదిగా దగా పడుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇకనైనా ప్రభుత్వాలు మౌలిక వసతులు ఏర్పాటు, మానవ వనరుల అభివృద్ధి, సహజవనరుల సద్వినియోగం పైనా చట్టబద్ధమైనా జ్యుడీషియల్ కమీషన్ వేసి, అక్కడి ప్రజలతో మమేకమై కూలంకషంగా చర్చించి, అక్కడి వాస్తవ పరిస్థితులను అంచనా వేసి దానికి అనుకూలంగా రాజకీయంగా ,ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా, విద్యా, వైద్యం ఆరోగ్యపరంగా, సాంస్కృతి పరంగా, ఉద్యోగ కల్పన దిశగా మరియు మానవ వనరుల అభివృద్ధికి, యువత సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే దిశగా నిర్దిష్టమైన పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రాంతీయ మనోభావాలను మన్నించి, వివక్ష-అంతరాలు లేకుండా, అభివృద్ధి సమవర్తిగా వ్యవహరించడం పాలక-విపక్షాల బాధ్యతగా గుర్తెరిగి ముందుకెళ్లాలని ఉత్తర తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు.

(‘ఫెడరల్ తెలంగాణ’ భిన్నాభిప్రాయల ప్రజాస్వామిక వేదిక.ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ రచయితల వ్యక్తిగతం.) 

Tags:    

Similar News