చంద్రబాబు చేతిలో రెండంచుల కత్తి...

ఒకవైపు వైసిపి నేతలను కేసులతో జగన్ నుంచి దూరం చేయడం, మరొక వైపు జగన్ ఉన్న ఓట్ బ్యాంక్ ను లాక్కోవడం... మరిన్ని వివరాలు లోపల

Byline :  Jinka Nagaraju
Update: 2024-09-24 02:58 GMT

"ఏ యుద్ధం తర్వాతనైనా మనల్ని కాపాడడానికి ప్రజాస్వామ్యం మిగిలే ఉంటుందనుకుంటాం కానీ అది నిజం కాదు. ఆ మిగిలి ఉండే ప్రజాస్వామ్యం స్వల్పమే" అంటారు ప్రముఖ అమెరికన్ థియేటర్ క్రిటిక్ బ్రూక్స్ అట్కిన్సన్. అందుకు ఏపీ రాజకీయాలు ఏమాత్రం మినహాయింపు కాదు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టడమే నేటి రాజకీయ నీతి. ప్రతీకార రాజకీయాలకు ఆలవాలమైన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అది నిజమేమో అనిపిస్తుంది.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన ప్రత్యర్థి పార్టీ యువజన,శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ సీపీ)ని రాష్ట్ర చరిత్ర నుంచి కనుమరుగు చేసేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు అర్థమవుతోంది. "వైఎస్ జగన్ అనే వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. అతన్ని మళ్లీ లేవనీయకూడదు. వైసీపీ పాలనలో జగన్ తో సహా తప్పు చేసిన వారినెవ్వర్నీ క్షమించం" అని చంద్రబాబు తరచూ అంటుంటారు. దీనికి ప్రతిగా వైఎస్ జగన్ "చంద్రబాబు కుట్రదారుడు. ప్రతిపక్షాల కుట్ర సిద్ధాంతాలతో నేను పోరాడుతున్నాను" అంటుంటారు. ఈ వ్యాఖ్యలెలా ఉన్నా చంద్రబాబు 2024 జూన్ 4న అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి వైసీపీ పేరును రాష్ట్ర రాజకీయ చిత్రపటం నుంచి చెరిపేసే ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
చంద్రబాబు రెండంచు కత్తి ఇదే
అందుకు ఆయన ఎంచుకున్న పద్ధతులు రెండు.
ఒకటి: వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిన వారందరిపై "సామ దాన భేద దండోపాయాలు" అనే సూత్రాన్ని అమలు చేసి తొక్కేయడం. 
రెండు:  క్రిష్టియన్ అయిన వైఎస్ జగన్ పార్టీ వెనుకున్న ఓటు హిందూ  ఓట్లను ఆయననుంచి దూరం చేయడం.
చంద్రబాబు వ్యూహం మరింత వివరంగా
వైసిపిలో ధీమా: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా టార్గెట్ చేస్తూ జగన్ పాలనలో జరిగిందంటున్న విధ్వంసాన్ని ఎత్తిచూపుతున్నారు. వైసీపీ 2024 ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ జగన్ కి ఒక కోటీ 32 లక్షల 84వేల 134 ఓట్లు వచ్చాయి. అంటే మొత్తం పోలైన ఓట్లలో 39.37 శాతం వచ్చాయి.  ఇది చాలా  గొప్ప విషయం. సీట్లు లేకపోయినా జగన్ కు ధైర్యం ఇచ్చేందుకు ఓట్లు దండి గా ఉన్నాయన్న బాట. ఓడిపోయినప్పటి నుంచి వైసిపి నేత చెబుతున్నదదే.  సీట్లు టిడిపికి పోయిన మాకు తగ్గిన ఓట్లు చాలా తక్కువ  అని జగన్ నుంచి ఎమ్మెల్యేల దాదా వాదిస్తూ ఉన్నారు. ఈ ధీమాతో మేం మళ్లీ అధికారంలోకి వస్తాం అని చెబుతున్నారు. 
చంద్రబాబు గుబులు:   టీడీపీ కూటమికి నూటా అరవై నాలుగు సీట్లు వచ్చాయి. ఒక కోటీ 53 లక్షల 84వేల 576 ఓట్లు పడ్డాయి.. అంటే 45.60 శాతం. ఈరెండు పార్టీలకు ఉన్న తేడా 21 లక్షల ఓట్లు. ఈ తరుణంలో జగన్ రాజకీయంగా మళ్లీ కోలుకోకుండా ఉండాలంటే వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకు తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికలకు ముందు, ఆర్వాత జగన్, ఆయన అనుయాయులు చేసిన తెలుగుదేశ వ్యతిరేక పనులపై దృష్టి సారించినట్టు అర్థమవుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీపై చెలరేగిన వారందర్నీ చంద్రబాబు వేటాడుతున్నట్టుగా కనిపిస్తోంది.
వేట ఇలా మొదలైంది...
మొదట పల్నాడులో ఈవీఎంలను ధ్వంసం చేసిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్ని రామకృష్ణారెడ్డి అరెస్ట్ తో చంద్రబాబు దండయాత్ర ప్రారంభమైంది. ఆ తర్వాత ఫైళ్ల దగ్ధం కేసులో వైసీపీ హయాంలో సెకండ్ ఇన్ కమాండ్ గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డిని బుక్ చేశారు. సినీనటి కాదంబరీ జెత్వానీ కేసును తెరపైకి తీసుకువచ్చి నాటి ప్రభుత్వ సలహాదారు, జగన్ ప్రతినిధిగా భావిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ లో కీలకవ్యక్తిగా ఉన్న ఐఎఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డిని ఇరికించే ప్రక్రియ మొదలు పెట్టారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపైన దాడి కేసును తిరగదోడి మాజీ మంత్రి జోగి రమేష్, పార్లమెంటు మాజీ సభ్యుడు నందిగం సురేశ్ వంటి వారిపై కేసులు పెట్టించారు. అమరావతి రైతుల ఉద్యమంపై అవాకులు చెవాకులు పేలిన ఆనాటి వైసీపీ నాయకులందర్నీ కట్టడి చేసేలా కేసులు నమోదు చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై ఒంటికాలిపై లెగిచే సినీనటి, మాజీ మంత్రి రోజాపై టీటీడీ దర్శనం టికెట్లు, భూ కబ్జాల వంటి ఆరోపణలు వెల్లువెత్తేలా చేశారు. చంద్రబాబును నానా మాటలన్న మాజీ మంత్రులు కొడాలి నానీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ, అంబటి రాంబాబు లాంటి వాళ్లపై ఓపక్క కేసులు నమోదు చేస్తూనే మరోపక్క వారి ఆర్ధిక మూలాలను దెబ్బతీసే ప్రక్రియ కూడా మొదలైంది. తాజాగా అంబటి రాంబాబు సోదరుడు మురళీ గుంటూరులో వేసిన సుమారు 5 ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్ ను, అపార్ట్మెంట్లు అక్రమం అంటూ విచారణకు ఆదేశించారు. విజయసాయి రెడ్డి కి ఓ మహిళతో అక్రమ సంబంధమంటూ మీడియా హోరెత్తించి ఆయనకు కళ్లెం వేశారు. ఇప్పుడాయన కుమార్తెకు విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఉన్న భూమి చుట్టూ కట్టిన గోడను కూల్చి అక్రమ కట్టడంగా తేల్చారు.
ఇలా వైసీపీ హయాంలో టీటీపీపై చెలరేగి పోయిన వారందర్నీ రాజకీయంగా కట్టడి చేసే వ్యూహాన్ని చంద్రబాబు తాను అధికారంలోకి వస్తూనే ప్రారంభించినట్టు వైసీపీ నేతలు వాపోతున్నారు. మరోపక్క, వైసీపీకి సహకరించినట్టు చెబుతున్న ఐపీఎస్ లు, ఐఎఎస్ లనూ పక్కనబెట్టడమో లేక అప్రధాన్యమైన శాఖలకు బదిలీ చేయడమో జరుగుతూనే ఉంది.
ఓటు  బ్యాంకును గడ్డికొట్టడానికేనా లడ్డూ వివాదం?
చంద్రబాబు నాయుడు తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కంటే వైసీపీ విధ్వంసంపైన్నే దృష్టి సారించారు. జగన్ తిరిగి తలెత్తకుండా చేయడానికున్న అవకాశాలన్నింటినీ ఉపయోగిస్తున్నట్టు రాజకీయ పరిశీలకుల అంచనా. ఓరకమైన భయాన్ని కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. జగన్ వైఫల్యాలను ఎత్తిచూపడం, ప్రతికూల ప్రచారాన్ని ఉపయోగించడం నాయుడు వ్యూహంలా ఉంది. అధికారులతో జరిపే సమీక్షా సమావేశాల్లో ఆయన మాట్లాడుతున్న తీరు అదేవిధంగా ఉంటోంది. జగన్ మళ్లీ వస్తే పాలనలో గందరగోళం, అయోమయం, భూకబ్జాలు, వేధింపులు, అక్రమ కేసులు, అభివృద్ధిపై నీలినీడలే మిగులుతాయని ఆయన పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన జగన్ పై తిరుపతి లడ్డూ అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ అస్త్రంతో జగన్ వైపున్న హిందూ ఓట్లను ఆకట్టుకోవడం ఒకటి కాగా జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సన్నిహితుడు భూమన కరుణాకర్ రెడ్డిని ఇరుకున పెట్టి తద్వారా జగన్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం వంటి హిందూ పవిత్ర పుణ్యక్షేత్రం అప్రతిష్ట పాలైందని బాహ్య ప్రపంచానికి చెప్పడం ఉద్దేశంగా ఉన్నట్టు వైసీపీ నాయకుడు అప్పిరెడ్డి ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని నియమించి వైఎస్ జగన్ తప్పు చేశారన్నది టీడీపీ వాదన. జగన్ మతపరమైన మూలాలు క్రిస్టియన్ మతంతో ముడిపడి ఉన్నాయనే విషయాన్ని టీడీపీ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. జగన్ భార్య భారతి, ఆయన తల్లి విజయమ్మ ఎన్నడూ తిరుమలకు వెళ్లలేదని, తన పిన్నమ్మ, వైవీ సుబ్బారెడ్డి భార్య చేతిలో కూడా బైబిల్ ఉండేదని, వారికి హిందూ మతంపై విశ్వాసం లేదని అందువల్లే తిరుమల పవిత్రను భగ్నం చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు కూడా దాదాపు అదే అర్థం వచ్చేలా జగన్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం అస్తవ్యస్తమైందని, అందుకు జగనే కారణమని ధ్వజమెత్తారు. చంద్రబాబు వాదననే బీజేపీ శ్రేణులూ చేపట్టాయి. జగన్ ఇంటి ముందు బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగాయి. జగన్ అన్యమతస్తుడంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ కున్న హిందూ ఓట్ షేర్ ను తమ వైపు తిప్పుకునేందుకు అటు టీడీపీ ఇటు బీజేపీ పాట్లుపడుతున్నాయి. మరోవైపు టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏడుకొండల వాడా క్షమించు అంటూ ఉపవాస దీక్షకు దిగారు. వీటన్నింటిని బట్టి చూస్తే వైసీపీని ఆదిలోనే అణచివేయాలన్న వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నట్టు,అది ఫలితాలనిస్తున్నట్లు  కనిపిస్తోంది.
పార్టీకి సీనియర్లు గుడ్ బై..
ఇప్పటికే వైసీపీ సీనియర్లు వరుసగా జగన్ కు గుడ్ బై చెబుతున్నారు. జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలియాస్ వాసు తోపాటు మోపిదేవి వెంకటరమణ వంటి బీసీ నేత వైసీపీకి దూరం అయ్యారు. వైఎస్సార్ కి అభిమానిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వంటి కాపు నాయకులు కూడా పార్టీకి దూరం జరిగారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడుతారంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో మన్యం ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెబుతారని సోషల్ మీడియాలో హెరెత్తుతున్నా ఆ ఎమ్మెల్యే ఇంతవరకు ఖండించలేదు. ఇలాగే చాలామంది గోడ మీది పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. రానున్న కాలంలో ఎంతమంది పార్టీని వీడతారో మరెంతమంది జగన్ పై రాళ్లు విసురుతారో అంతుబట్టకుండా ఉంది.
మరోవైపు, వచ్చే నాలుగైదేళ్ల పాటు తన పార్టీని కాపాడుకునేందుకు జగన్ ఏమి చేస్తారన్నది ఇంకా తేలలేదు. అయితే టీటీపీ, దాని భాగస్వామ్య పక్షాల దాడిని ఎదుర్కోవడానికి చంద్రబాబు అమలు చేస్తానన్న ఆరు సంక్షేమ పథకాల అమలుపై దృష్టికేంద్రీకరించారు. తన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలకు దూరమైన వారిని ఏకం చేసి తన బలాన్ని కాపాడుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News