జర్నలిస్టు అంటే ఎవరు? నిర్వచనం ఏమిటి?: రేవంత్ లేవనెత్తిన చర్చ
ఒక్క రేవంత్ రెడ్డి కే కాదు, నేతలకు, అధికారులకు, జడ్జీలకు, వ్యాపారులకు, చివరకు కష్టార్జితంతో ఇళ్ళు కట్టుకుంటున్న బడుగు జీవులకు కూడా 'జర్నలిజం' సెగ తగులుతోంది.
By : డాక్టర్ ఎస్ రాము
Update: 2024-09-11 05:09 GMT
జర్నలిస్టు' అంటే ఎవరో నిర్వచించి చెప్పి ప్రభుత్వానికి సహకరించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 8, 2024 న హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కోరడం పెద్ద చర్చకు దారితీసింది. జర్నలిస్టుల 'ఎథికల్ లైన్' ఏమిటో కూడా చెప్పాలని అయన కోరడం విశేషం. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీకి భూమి కేటాయించే ఒక కీలకమైన కార్యక్రమంలో ఆయన లేవనెత్తిన ఈ మిలియన్ డాలర్ ప్రశ్నల మీద వాదోపవాదాలు, సిద్ధాంత రాద్ధాంతాలు జోరుగా జరుగుతున్నాయి. ఇది నిజానికి మంచి పరిణామం. జర్నలిజం, జర్నలిస్టుల పై చర్చకు గొప్ప అవకాశం.
ఒక్క రేవంత్ రెడ్డి కి మాత్రమే కాదు, అందరు రాజకీయ నాయకులకు, అధికారులకు, న్యాయాధీశులకు, వ్యాపారులకు, చివరకు సొంత స్థలాల్లో కష్టపడి కూడగట్టుకున్న డబ్బుతో ఇళ్ళు కట్టుకుంటున్న మధ్య తరగతి జీవులకు కూడా మున్నెన్నడూ లేనివిధంగా 'జర్నలిజం' సెగ తగులుతోంది. గొట్టం పట్టుకుని ఎవడొస్తాడో, ఏ లోటుపాటు ఎత్తిచూపుతాడో, ఎంత కావాలంటాడో, ప్రశ్నిస్తే 'భావప్రకటన హక్కు'ను హరిస్తున్నారంటూ ఏమి అరిచి గోల చేస్తాడో... అని జనం అల్లల్లాడుతున్న మాట నిజం. అధికారం లోకి వచ్చేదాకా తియ్యగా ఉన్న 'ఆ టూబు, ఈ టూబు' ఇప్పుడు ముఖ్యమంత్రి కి కాలకూట విషంగా అనిపించడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులు తన సొంత గ్రామానికి వెళ్లి ఒక అననుకూలమైన స్టోరీ చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇప్పుడు జర్నలిస్టు పదానికి ఉన్నపళంగా నిర్వచనం అడుగుతున్నట్లు మీడియా లో ఒక వర్గం అనుమానిస్తుండగా, మరో వర్గం అయన అన్నదాంట్లో తప్పేముందని వాదిస్తోంది.
1902 లో 'కృష్ణా పత్రిక', 1908 లో 'ఆంధ్రపత్రిక' వచ్చినప్పుడు గానీ, 1974 లో 'ఈనాడు' మొదలైనప్పుడు గానీ 'జర్నలిస్టు' ఎవరు? తన అర్హతలు ఏమిటి? తన రూపురేఖా విలాసాలు ఏమిటి? అన్న ప్రశ్నలు ఎవ్వరి మదిలోనూ మెదలలేదు. అరిగిపోయిన చెప్పులేసుకుని, లాల్చీ పైజామా ధరించి, భుజానికి అడ్డంగా గుడ్డ సంచీ తగిలించుకుని సత్యాన్వేషణ కోసం ఎక్కడో తిరిగి దొరికింది తిని రిపోర్ట్ చేసే వాళ్ళను జర్నలిస్టులని అనేవారు. సమాచారం సేకరించి, వార్తలు రాసి ప్రింటింగ్ స్టేషన్స్ కు ఆర్టీసీ బస్సులో కవర్ల ద్వారా పంపడం, అర్జెంట్ వార్త అయితే ట్రంక్ కాల్ చేసి ఆఫీసుకు సమాచారం ఇవ్వడం మీదనే వాళ్ళ దృష్టి ఉండేది. జర్నలిస్టులు లేదా విలేకరులు అనబడే వారంటే సమాజంలో ఎనలేని గౌరవం ఉండేది- వారి వృత్తి నిబద్ధత, చిత్తశుద్ధి, సత్య నిష్ఠ కారణంగా. జిల్లాకు మహా అయితే పది పదిహేను మంది అలాంటి వారు ఉండేవారు. ప్రింటింగ్ కేంద్రాల్లో ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు, బ్యూరో చీఫ్ లు ఉండేవారు. నిజానికి విలేకరులకు ఉండే గౌరవం సబ్ ఎడిటర్లకు అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. రిపోర్టర్ల వార్తలు దిద్ది, మంచి శీర్షిక పెట్టి ఆకర్షణీయంగా ప్రచురించే సబ్బులు అన్ సంగ్ హీరోలు, హీరోయిన్లనేది వేరే విషయం. నిజానికి వాళ్ళూ జర్నలిస్టులే.
1980 లలో ఐదారు తెలుగు పత్రికలు పోటాపోటీగా తెలుగు ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నప్పుడు అంతా బాగానే ఉంది. అప్పుడూ రాజకీయ పక్షపాతం అనేది ఉన్నా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవడంలో పత్రికల పాత్ర గొప్పగా ఉండేది. రీచ్, ప్రాఫిట్ అనే వ్యాపార సిద్ధాంతం ఆధారంగా ఒక అద్భుతమైన మార్కెట్ ఫార్ములాతో 1989 లో 'ఈనాడు' జిల్లా అనుబంధాలను ఆరంభించిన తర్వాత కొత్త అధ్యాయం మొదలయ్యింది. అన్ని పత్రికలూ దాన్ని అనుసరించి ఈ ఫార్ములాను వేగంగా అందిపుచ్చుకున్నాయి. ముందుగా మండలానికో జర్నలిస్టు, ఆనక క్రమంగా గల్లీకో జర్నలిస్టు పుట్టుకొచ్చారు. రాసిన వార్త నిడివిని బట్టి కొలిచి సెంటీ మీటర్ కు ఇంతని చెల్లించి కంట్రిబ్యూటర్స్/ స్ట్రింగర్స్ పేరుతో అన్ని పత్రికలు ఏర్పరుచుకున్న ఒక మహా వ్యవస్థ ఇప్పుడు జర్నలిజానికి కేంద్రమయ్యింది. మంది ఎక్కువయ్యారు, సహజంగానే మజ్జిగ పల్చనయ్యింది. ఈ వ్యవస్థ నిరుద్యోగ సమస్యను కొద్దిమేర తీర్చినా సో కాల్డ్ జర్నలిస్టు కు స్వాత్రంత్య్ర కాలం నుంచీ ఉన్న ఎనలేని గౌరవాన్ని బాగా దిగజార్చింది. ఇక్కడ మైలు రాళ్లను గురించి చెప్పుకోవడమే చేయాలి గానీ ఎవ్వరినీ విమర్శించి, తప్పుబట్టి లాభంలేదు. ఇది ఒక పరిణామ క్రమం.
ప్రభుత్వ యూనివర్సిటీలలో పాశ్చాత్య దేశాల నుంచి స్వీకరించిన జర్నలిజం సిలబస్, శిక్షణ పద్ధతులు ఉన్నా... వాటితో సంబంధం లేకుండా సంస్థాగతంగా జర్నలిజం స్కూల్స్ పెట్టి పత్రికలు పెద్ద సంఖ్యలో ఇన్ హౌస్ జర్నలిస్టులను తయారు చేశాయి. స్టైపెండ్ ఇచ్చి
అవసరం ఉన్న మేర మాత్రమే విద్య నేర్పి వాడుకోవడం ఇప్పటికీ సాగుతోంది. వైద్యుడికి, ఇంజినీర్ కు, లాయర్ కు, లెక్చరర్ కు, ఇతర వృత్తుల వారికి నిర్దిష్ట డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు ఇస్తారు. కానీ జర్నలిజానికి ఆ అవసరం లేదని తెలుగు పత్రికలు నిరూపించాయి. ఆరో తరగతి నుంచి ఆర్డినరీ డిగ్రీ చదువుకున్న వారు కూడా జర్నలిస్టుల కేటగిరీలో చేరి ప్రభుత్వాల అక్రిడిటేషన్ కార్డులు పొందుతున్నారట. వేల సంఖ్యలో గుర్తింపు కార్డులు, సంబంధిత సౌకర్యాలు ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా కష్టమే.
శాటిలైట్ టెలివిజన్ ఛానెల్స్ వచ్చాక 'జర్నలిస్టుల' సంఖ్య ఇంకా పెద్ద సంఖ్యలో పెరిగింది. 1990 ఆరంభం నుంచి పరిస్థితి మరింత ప్రమాదంగా మారింది. పత్రికల యాజమాన్యాలు, టెలివిజన్ వార్తల రంగంలోకి సహజసిద్ధంగా రావడం మాత్రమే కాకుండా ఇతరేతర వ్యాపారాల్లోకి కూడా దిగడంతో పొలిటీషియన్ కు పని తేలికయ్యింది. పవర్ లో ఉన్నవారికి జై కొట్టక తప్పని పరిస్థితి వచ్చింది. జర్నలిస్టుల వేతనాలు, బతుకుల సంగతి ఎలా ఉన్నా పత్రికాధిపతులు మీడియా సామ్రాజ్యాధిపతులుగా, వ్యాపార వేత్తలుగా మారి సమాజంలో మహా శక్తివంతులుగా పరివర్తన చెందారు. 2019-2020 కాలంలో వచ్చిన కోవిడ్ మహమ్మారి సోషల్ మీడియా సామర్ధ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పి నెమ్మదిగా మీడియా మహామహుల గుత్తాధిపత్యాన్ని దారుణంగా గండి కొట్టింది. మోదీ దగ్గరి నుంచి రేవంత్, చంద్రబాబు ల వరకూ ప్రధాన మీడియానో, సోషల్ మీడియానో వాడుకుని విస్తృత ప్రచారం పొందని వారు లేరు. ఇందులో యూ ట్యూబ్ ల పాత్ర, టీవీ చర్చల పాత్ర ఎంతో ఉంది. సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ఆదాయ మార్గంగా కూడా కావడంతో ప్రజల నాడి పట్టిన జర్నలిస్టులు కొత్త ఫార్ములాలతో ముందుకొచ్చారు. బూతులు తిట్టడం, జర్నలిజం ఎథిక్స్ పట్టింపు లేకుండా, బాధితుల వెర్షన్ లేకుండా వార్తలు ప్రసారం చేయడం పెరిగింది. లైవ్ చర్చలు పెద్ద తలనొప్పిగా మారాయి. అప్పటిదాకా పత్రికలూ, ఛానెల్స్ లో పనిచేసిన వారితో పాటు పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్ తదితర డిగ్రీలు పొందిన యువకులు జర్నలిజం పాఠాలు చదవకపోయినా, శిక్షణ పొందకపోయినా మాటకారితనంతో ఛానెల్స్ పెట్టి రాణిస్తున్నారు. వారికి వస్తున్న ప్రజాదరణ భారీగానే ఉంది. ప్రజలకు ఏ వార్తలు, మసాలా ఇస్తే ఎక్కువ వ్యూవర్ షిప్ వస్తుందో అది నైతికత, సమాజ శ్రేయస్సు సంబంధం లేకుండా వాళ్ళు చేస్తున్నారు.
ఇప్పుడు ప్రపంచాన్ని కుదుపుతున్న కృత్రిమ మేథ అసలే సంక్లిష్టంగా ఉన్న పరిస్థితిని మరింత జటిలం చేసిందనే అనుకోవాలి.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వార్తా సంస్థ 'రాయిటర్స్' నిర్వచనం ప్రకారం- ఎవరైతే సమాచారాన్ని సేకరించి (Gathering), సత్యాన్ని బేరీజు (Assessing) వేసి, ఖచ్చితత్వం (Accuracy), న్యాయం (Fairness), స్వతంత్రత (Independent) లకు కట్టుబడి వార్తల రూపంలో ప్రజలకు అందిస్తారో వారు జర్నలిస్టులు. నిష్పాక్షికంగా, సమాచారాన్ని బాగా వెరిఫై చేసి, పక్షపాతాలకు, బైటి ప్రలోభాలకు, విరుద్ధ ప్రయోజనాలకు తావులేకుండా సత్యనిష్ఠ తో వాస్తవాలను నివేదించేది జర్నలిస్టు పాత్ర అని కూడా ఆ సంస్థ చెప్పింది. ప్రధాన మీడియా స్రవంతి లో ఏళ్ల తరబడి పనిచేస్తూ తామే నికార్సైన జర్నలిస్టులమని చెప్పుకునే వారైనా ఈ నిర్వచనం దరిదాపులకు వస్తారా? అంటే సందేహమే. దాదాపు అన్ని యాజమాన్యాలు పొలిటికల్ జెండాలు మోస్తూ విలువల వలువలు ఎప్పుడో విప్పి పారేస్తే... ఇంకెక్కడి సత్యనిష్ఠ?
పత్రికల్లో, టీవీ ఛానెల్స్ లో పనిచేసి అక్కడ సత్యనిష్ఠ, స్వంత్రత, న్యాయం మీడియా-పొలిటికల్-బిజినెస్-లంపెన్ చతుష్టయం గంగపాల్జేసిన వైనాన్ని మౌనంగా భరించి బైటికి వచ్చిన జర్నలిస్టులకు యూ ట్యూబ్ పెద్ద వరమయ్యిందనడంలో సందేహం లేదు. ఇప్పటికీ చాలా మంది మాజీ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు నిష్పాక్షిక దృక్కోణంతో ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. పొలిటీషియన్స్ కలుషితం చేయకపోతే వీరిలో చాలా మంది తమ పని తాముచేసుకునేవారు. ఫేస్ బుక్, యూ ట్యూబ్, ట్విట్టర్ వగైరా సోషల్ మీడియా వేదికలు కలుషితం కావడానికి బాధ్యులు జర్నలిస్టులు మాత్రమే అంటే అది తప్పు. దానికి బాధ్యత వహించాల్సింది ఇప్పటికే ఓట్లతో నోట్లను కొని, జనాలను కరప్ట్ చేసి ప్రజాభిప్రాయాన్ని కూడా తాజా సాంకేతిక పరిజ్ఞానంతో తుత్తినియలు చేస్తున్న రాజకీయపార్టీలదీ, నాయకులది. ఈ పాపం నుంచి ఏ ఒక్క ప్రధాన పార్టీకీ మినహాయింపు లేదు. అన్ని పార్టీలు సోషల్ మీడియా సైన్యాలను ఏర్పరుచుకుని ప్రత్యర్థులపై బురదజల్లుతూ, సత్యాన్ని పాతర వేస్తున్నారు. ఈ క్రమంలో స్వీయ నియంత్రణ అనేది అసంభవమైన పని అయి కూర్చుంది. నికార్సయిన జర్నలిస్టులు ఉక్కిరి బిక్కిరయ్యే దుస్థితి ఏర్పడింది. ఇది పట్టించుకోకుండా అందరినీ ఒకే గాటన కట్టి విమర్శించడం పాలకులకు సులువయ్యింది.
ఈ పరిస్థితుల్లో నిజంగా చిత్తశుద్ధి ఉంటే, జర్నలిజం బోధన, పరిశోధన రంగాల్లో పనిచేసిన మేధావులు, ప్రొఫెసర్లతో రాజకీయాలకు అతీతంగా ఒక నిష్పాక్షిక కమిటీ వేసి జర్నలిస్టు కు రేవంత్ రెడ్డి గారు నిర్వచనాన్ని రాబట్టవచ్చు. ప్రశ్నించే గొంతులను తొక్కెయ్యాలనుకునే దుష్ట తలంపును మెదడులో నిక్షిప్తం చేసే అధికార కిక్కు కు లోబడకుండా అయన వ్యవహరిస్తే ఒక పక్కన జర్నలిస్టు కు నిర్వచనం రాబడుతూనే, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఊరట కలిగించిన వారవుతారు. జర్నలిస్టిక్ ఎథిక్స్ గురించి జర్నలిస్టులతోనే మనసు విప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ దిశగా రాజకీయాలకు అతీతంగా ప్రయత్నాలు మొదలుపెట్టి ఫలితం సాధిస్తే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.