లక్కీ నెంబర్ ‘ఆరు’ను అటకకెక్కించిన చంద్రబాబు

చంద్రబాబూ, ఆ ‘సూపర్ సిక్స్’ గుర్తుందా?.;

Update: 2025-01-25 07:39 GMT

ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు అయింది. జగన్ ఐదేళ్ల పాలనలో పెనం మీద వుంటే 2024 ఎన్నికల తర్వాత వచ్చిన కూటమి పాలనలో నిప్పుల పొయ్యిలో పడ్డట్టు అయింది.

గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చే దానికి ప్రధాన కారణాలు జగన్ ప్రభుత్వ వైఫల్యాలు,కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు. ప్రజలు సూపర్ సిక్స్ (Super Six) హామీలను నమ్మి కూటమిని గెలిపించారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. కానీ సూపర్ సిక్స్ హామీలలో ఒకటి తప్ప మిగతావి అమలు కావడం లేదు. ఇంతన్న డంతన్న డే గంగ రాజు ,ముంతమామిడి పండన్నడే గంగరాజు అని మోహన్ బాబు నటించిన తప్పు చేసి పప్పు కూడు సినిమా లోని పాట గుర్తుకొస్తోంది.సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయి. ప్రజలను మభ్యపెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రయోగించిన సూపర్ సిక్స్ ఉన్న హామీలు ఏమిటో ఒక సారి గుర్తు చేసుకుందాం.
1.నిరుద్యోగ భృతి
ఈ హామీ క్రింద నెలకు రు 3000 లు ఇస్తామన్నారు.రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు వున్నారు.ఏడాదికి రు 7200 కోట్లు విడుదల చేయాలి.ఇంతవరకు పైసా ఇవ్వలేదు.ఆ విధంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించింది.
2.తల్లికి వందనం
ఈ పథకం క్రింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ 15,000 లు ఇస్తామన్నారు.రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు వున్నారు.ఏడాదికి రు 12,450 కోట్లు ఇవ్వాలి.ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు.ఈ విధంగా తల్లులను,పిల్లలను నమ్మించి మోసగించింది.
3.అన్నదాత సుఖీభవ
ఈ పథకం కింద ప్రతి రైతు కు ఏటా రూ 20,000 లు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులున్నారు.ఏడాదికి రు 10,706 కోట్లు ఇవ్వాలి.ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు.ఈ విధంగా అన్నదాతలను నమ్మించి మోసగించింది.
4.మహిళలు
19 ఏళ్ల నుంచి 59 ఏళ్లవరకు ప్రతి మహిళకు నెలకు రు 1500 ఇస్తామన్నారు.రాష్ట్రం లో 2.07 కోట్ల మంది వున్నారు.రు37,313 కోట్లు ఇవ్వాలి.పైసా ఇవ్వలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఇచ్చారు.ఇప్పటివరకు అమలు కాలేదు. కర్నాటకలో ఎలా అమలు జరుగుతున్నదో చూసి వచ్చారు. పక్క తెలంగాణలో కూడా ఈ పథంక చక్కగా అమలు జరుగుతూ ఉంది.  ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అమలు కావడం లేదే.
5.బీసీ,యస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్
ఈ పెన్షన్ గురించి గొప్పగా చెప్పారు. రాష్ట్రంతో ఈ పెన్షన్ కు అర్హులైన వారు  17 లక్షల మంది వుంటారు.రు 8160 కోట్లు ఇవ్వాలి.పైసా ఇవ్వలేదు.
ఒక్క మాటలో చెబితే,  టిడిపి, జనసేన, భారతీయజనతా పార్టీల  కూటమి  (NDA)మాట తప్పింది.మడమ తిప్పింది. ఏరు దాటినంతవరకు ఓడ మల్లన్న,దాటినాక బోడి మల్లన్న అన్నట్లుంది కూటమి వాలకం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూపర్ సిక్స్ హామీలను చంద్ర బాబు ప్రభుత్వం అమలు చేయాలి.

(రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి)


Tags:    

Similar News