కాదు గానీ, బ్యూటీ ఆఫ్ ఇండియాను ఆస్వాదిద్దాం...

నీ కొండకు నీవే రప్పించుకో.. ఆపద మొక్కులు మాతో ఇప్పించుకో..’ అంటూ సాగేది ఘంటసాల పాట ఒకటి. పాతరోజుల్లో పాటకచ్చేరీలు అంటే, ఇటువంటి భక్తి గీతాలతోనే అవి మొదలయ్యేవి.

Update: 2024-09-27 13:31 GMT

-జాన్ సన్ చోరగుడి

నీ కొండకు నీవే రప్పించుకో.. ఆపద మొక్కులు మాతో ఇప్పించుకో..’ అంటూ సాగేది ఘంటసాల పాట ఒకటి. పాతరోజుల్లో పాటకచ్చేరీలు అంటే, ఇటువంటి భక్తి గీతాలతోనే అవి మొదలయ్యేవి. భక్తుడిలో ఇటువంటి ప్రేరణ భగవంతుడే కల్పించి, మనిషి తనను తాను తగ్గించుకుని, ఎక్కడున్నా ఆయన వద్దకు వెళ్లి ఆయన ముందు ‘సరెండర్’ కావడం అనేది ఇందులోని తాత్పర్యం. అంటే, అప్పటికే మనలో పేరుకుపోయిన ‘అదనాన్ని’ ఈ పేరుతొ కరిగించుకోవడం అన్నమాట, ‘ఎక్సట్రా’కు కత్తెరవేసి ‘ప్రూన్’ చేసుకోవడం. ఇందులో మళ్ళీ ఏ ఒక్కరిదో కాకుండా ‘ఆయనది’ మనది ఇద్దరి ‘ఇన్వాల్వ్మెంట్’ ఉండడం, ఇక్కడ ప్రత్యేకం. కారణం ఏదైతేనేం, మనిషి కొండలు వైపు నడవడం అంటే, పర్వతాలు, సముద్రాలు మధ్య ఉన్న మైదానం మీద బ్రతికే మనిషి, ‘జీవించడానికి’ జరిగిన ఏర్పాటు ఇది!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 27-28న తిరుమల దర్శనానికి వెళ్ళడం చుట్టూ తిరుగుతున్న సంవాదం చూస్తున్నప్పుడు, ‘కొండ’ అనే అంశం చుట్టూ సహజంగానే అనేక ఆలోచనలు బయలుదేరుతున్నాయి. ప్రపంచ మతాలు అన్నీ ఆసియాలోనే పుట్టడం మనకు తెలిసిందే. ఇక్కడి పర్వతాలు సువిశాలమైన మైదానాల మధ్య జీవించే మనిషి ‘సైక్’లోనే విలక్షణత ఉంది, అంటారు స్వామి వివేకానందుడు.

వివేకానందుడు చెబుతున్నదాన్ని దృశ్యమానం చేసే సంఘటన ఒకటి బైబిల్లో కనిపిస్తుంది. జీసస్ తన శిష్యులతో కలిసి ఒక ఊరికి ప్రయాణంలో ఉంటాడు. మధ్యాహ్నం కావడంతో అలసి సేద తీరడానికి ఒక బావి వద్ద వాళ్ళు ఆగుతారు. జీసస్ ను అక్కడ వదిలి, వాళ్ళు ఆహారం కొని తేవడానికి సమీప గ్రామం సంతకు వెళతారు. ఒకామె నీళ్ళ కోసం అక్కడికి వస్తే, జీసస్ దాహానికి నీళ్ళు ఇవ్వమని ఆమెను అడుగుతాడు. మాటల మధ్య ఆమెకు ఆయన ప్రవక్త అని తెలుస్తుంది. అప్పుడామె అంటుంది. ‘మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు, కానీ నిజమైన చోటు జేరుసలేములో ఉందట...’ అంటుంది.

అందుకు జీసస్- ‘అమ్మా ఒక కాలం వస్తుంది, అప్పుడు ఈ పర్వతం మీద గానీ జేరుసలేములో గానీ ఆరాధించరు. ఆత్మతోనూ... సత్యముతోను.. అప్పుడు మీరు ఆరాధిస్తారు...’ అని ఆయన చెబుతాడు.

కొండ సందర్భంలో తాదాత్మ్యం చెందడం గురించి చెప్పడం అంటే, ఇక్కడ మా ‘కొలీగ్’ లాల్ జాన్ సాబ్ చెప్పింది ఒకటి గుర్తుకొస్తున్నది. ఇది ఇప్పటి మాట కాదు, వాళ్ళది గుంటూరు జిల్లాలోని మాచెర్ల ప్రాంతం. వాళ్ళ బాబాయి పోలీస్ కానిస్టేబుల్, మంచి గాయకుడు కూడా. ఘంటసాల భక్తి గీతాలు గొప్పగా పాడేవాడు. ఒక ఊళ్ళో ఒక హత్య జరిగిన స్థలంలో అతనికి ‘సెంట్రీ’ డ్యూటీ వేసారు, పైవాళ్ళు మళ్ళీ చెప్పేవరకు ఈయన అక్కడ ఉండాలి.

చీకటి పడుతునప్పుడు దగ్గరలోని గుడి మైకులో హార్మోనియం, డోలక్, తాళాలతో ఎవరో లయబద్దంగా భజన చేయడం ఈయనకు వినిపించింది. తెలియకుండానే కాళ్ళు ఆయన్ని అటు తీసుకెళ్ళాయి. అంతే, మైక్ దొరకబుచ్చుకుని ఆ రాత్రి ఘంటసాల గారి భక్తిగీతాలు అన్ని పాడేసాడు. గుడి వాళ్ళు సర్దుకుని లైట్లు ఆర్పేశాక, అప్పుడు మన బాబాయి గారికి ‘డ్యూటీ’ గుర్తుకొచ్చింది. లేచి వెళ్లేసరికి అక్కడ శవము లేదు! ఈ సంగతి మా మిత్రుడు చెబుతుంటే, నవ్వులే నవ్వులు.

ఇప్పటికి ఇరవై ఏళ్ల క్రితం మాట ఇది.

అప్పట్లో లాల్ జాన్ సాబ్ రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలోని రాష్ట్ర సమాచార కేంద్రం అసిస్టెంట్ డైరక్టర్. ఒకరోజు ఆయన ఆఫీసు గదిలోకి వెళితే, గోడకు ఆన్చి ఒక తాజా రంగులు ఆరని పెయింటింగ్ కనిపించింది.

ఏమిటి విషయం? అంటే...చెప్పాడు- ‘రాష్ట్ర సమాచార కేంద్రం రీడింగ్ హాల్లో పెట్టడం కోసం రాజ రాజ నరేంద్రుడి చిత్రం వేయించాను’ అని చెప్పాడు.

ఆయన- దక్షణ భారత దేశంలో 1022- 1062 మధ్య వేంగి రాజ్యం యొక్క తూర్పు చాళుక్యు రాజు.

కించత్తు సంభ్రం కలిగి, ‘ఎవరు వేసారు ఈ పెయింటింగ్?’ అని అడిగాను

‘గువ్వల కెన్నడి అని, ఆయనది ఈ ఊరే అని లాల్ జాన్ సాబ్ చెప్పాడు.

ఇన్నాళ్ళ తర్వాత, ఇది రాస్తూ అక్కడ స్థిరపడ్డ జర్నలిస్టు మిత్రుడు పెద్దాడ నవీన్ ను ఈ చిత్రకారుడు గురించి సంప్రదిస్తే, చెప్పారు-‘ కెన్నడి ఇప్పుడు లేరు. ఆయన సుప్రసిద్ధ దక్షణ భారత గాయకుడు జేసుదాస్ కు సమీప బంధువు’ అని చెప్పాడు.

ఇక జేసుదాస్ విద్వత్తు గురించి మనమేమి మాట్లాడగలం?

Tags:    

Similar News