అధ్యాపకుల కొరతతో మూసివేతకు గురవుతున్న యూనివర్శిటీ డిపార్ట్ మెంట్లు

యూనివర్శిటీల సంక్షోభం విశ్లేషణ: డాక్టర్ ముచ్చుకోట సురేష్ బాబు, ప్రజాసైన్స్ వేదిక, హైదరాబాద్

Update: 2024-12-13 10:25 GMT

ఆఫ్రికాలోని ఒక విశ్వవిద్యాలయం ప్రాంగణం లో శిలాఫలకంపై దేశం నాశనమై పోవడానికి అణుబాంబులు అక్కర్లేదు, అణ్వస్త్ర ఆయుధాలు అంతకంటే అక్కర్లేదు ఆ దేశ నీచమైన నిర్వీర్యమైన విద్య వ్యవస్థ అన్ని వ్యవస్థలను ఛిద్రం చేస్తుంది. సరస్వతీ నిలయాలుగా భాసిల్లుతున్న హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, అనంతపురం, తిరుపతి, విశాఖ, కర్నూలు జిల్లాలలో నేడు విశ్వవిద్యాలయాలల్లో శ్మశాన ప్రశాంతత నెలకొంది. న్యాక్, నేషనల్ ర్యాంకింగ్ ఫ్రెమ్ వర్క్ అంటే తెలియని విశ్వవిద్యాలయాలు. గత మూడు సంవత్సరాలుగా న్యాక్, ఎన్బీఏ, చివరికి దూరవిద్యలో డిస్టెన్స్ ఎజుకేషన్ కౌన్సిల్ అక్రిడేషన్ లేకుండా కాలం గడుపుతున్నారు. ఇక ఉన్నత విద్యకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు లేవు, విశ్వవిద్యాలయాలకు బ్లాక్ గ్రాంట్లు నామమాత్రంగా ఉన్నాయి. తల్లికి వందనం, విద్యార్థులకు వసతి దీవెన, ఫీజు రీఇంబర్స్మెంట్ లేక విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. గత ఐదు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క రీసర్చ్ ప్రాజెక్టు లేదంటే మన విశ్వవిద్యాలయాల ఘనత వేరే చెప్పనక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన నూతన విద్యా విధానం అరవై ఐదు పేజీల డాక్యుమెంట్లో ప్రముఖంగా ప్రస్తావించింది వ్యాపారీకరణ , కాషాయీకరణ, కేంద్రీకరణ. ప్రభుత్వం అశాస్త్రీయమైన విధానాలు, జీవం లేని విద్య ప్రమాణాలు తో నైపుణ్యం లేని సమాజాన్ని తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సమాన విద్యావకాశాలు లేక, శాస్త్రీయత లేక విద్య పూర్తిగా నిరుపయోగంగా మారనున్నది. మెరుగైన జీతాలు లేక ప్రభుత్వ ఉపాధ్యాయులు, జీతాలే లేక ప్రైవేటు ఉపాధ్యాయులు కాలం వెలిబుచ్చుతున్నారు. ఈ సంక్షోభం ఇక్కడితో ఆగదు, అజ్ఞాన సమాజం లో వికృత రూపాలు తో సామాజిక సంక్షోభం రాబోతున్నది. ఇప్పుడైనా ప్రభుత్వ సలహాదారులు, విద్యా రంగంలో నిష్ణాతులు, మేధావులు, ఉపాధ్యాయులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చదువంటే కేవలం ఇంజనీరింగ్ చదువు, అందులో కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ కోర్సులు అన్న భ్రమలో సమాజం ఉన్నది. దశాబ్ద కాలంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల దోపిడీని అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు మంచి జీతాలు ఇచ్చి పర్యవేక్షణ ఏర్పాటు చేసి విలువలు తో కూడిన విద్య ప్రమాణాలు ను తీసుకొని రావాలి. విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు లేవు అధ్యాపకులకు బోధన సామర్థ్యాలు అంతకంటే లేవు. యాభై సంవత్సరాలు ముందు వెలసిన విశ్వవిద్యాలయాల్లో అకడమిక్ స్టాఫ్ కాలేజీ లు మూతపడి దశాబ్దం అవుతుంది. రిఫ్రెషర్ కోర్సులు, ఓరియెంటేషన్, స్టాఫ్ డెవలప్మెంట్ కోర్సులు అన్నీ అనీత విద్య లాగా టీవీలు, కంప్యూటర్లలో బోధిస్తున్నారు. ఉన్న విశ్వవిద్యాలయాలు పటిష్టం చేయకుండా కొత్తగా క్లస్టర్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపన చేశారు. విద్యాలయాలంటే బిల్డింగులు స్థలాలు కాదు, అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాలు ఎలా నడుపుతారో బోధ పట్టం లేదు. పరీక్షలు సకాలంలో జరపరు, ఫలితాలు వెల్లడించరు, పిహెచ్డి వైవా జరపరు. పరిస్థితి ఇలా ఉంటే మరో రెండు సంవత్సరాలలో విశ్వవిద్యాలయాలను శాశ్వితంగా మూసివేయడం ఖాయమని పిస్తుంది. విశ్వవిద్యాలయాలు మొదలుపెట్టి ఐదు సంవత్సరాలైన నిధుల లేమితో ఎప్పుడూ స్మశాన ప్రశాంతత నెలకొంటున్నాయి. విద్యలో నాణ్యత ఉండాలని క్వాలిటీని పెంచడానికి కొత్తగా కన్సల్టెన్సీలు ద్వారా కో ఆర్డినేటర్ల ను నియమించి ఉన్న కొద్ది మంది అధ్యాపకులతో కమ్యూనిటీ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ ఏర్పాటు చేసి అర్థం పర్థం లేని పనులు చేయిస్తున్నారు. కొత్త కోర్సులు బోధించడానికి బోధకులు లేకపోవడంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అధ్యాపకులకు ఓరియెంటేషన్, రిఫ్రెషర్ కోర్సులు లేవు, బోధనా నైపుణ్యాలు మెరుగుపడాలంటే బోధకులకు కొత్త అంశాల పట్ల శిక్షణ ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణా మార్గదర్శి, మెటీరియల్ దొరకడం లేదు. అధ్యాపకులకు పునశ్చరణ తరగతులు, ఓరియెంటేషన్ కోర్సులు లేక కళాశాలలో బోధన చప్పగా ఉంది. చాలా అనుబంధ కళాశాలల్లో మరియు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలు లేకుండా కేవలం బి టెక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్సు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లార్న్ఇంగ్ కోర్సులు మాత్రమే ఉంటున్నాయి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలు సరండర్ చేసి కంప్యూటర్ కోర్సులు తెచ్చుకుంటున్నారు. ఇక ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, వాటికి అప్రూవల్ ఉందో తెలియని పరిస్థితి. యూజీసీ, ఏఐసిటిఇ లో పనిచేసిన ప్రబుద్ధులు పదవీ విరమణ తరువాత ఈ విశ్వవిద్యాలయాలకు ప్రో వైస్ ఛాన్సెలర్, ఛాన్సెలర్ గా చలామణి అవుతుంటారు, అలాగే ఇక్కడ పనిచేసిన వారు ఫీజు రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అడ్మిషన్ జూన్ నెలలో పూర్తి చేసి అకడమిక్ క్యాలెండర్ జూన్ లో మొదలు పెడితే ప్రభుత్వ కళాశాలలో, ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులలో అడ్మిషన్ డిసెంబర్ నెల వరకు జరుగుతూ ఉంటుంది. ఈ జాప్యానికి కారణం ఎవరికీ అర్థం కాదు. విద్య యొక్క అంతిమ లక్ష్యం ఉపాధి అన్న చందంగా విద్యాలయాలు మారుతున్నాయి. ప్రైవేటు కళాశాలలో అధ్యాపకులు లేకపోయినా, అధ్యాపకులు నకిలీ పీహెచ్డి ఉన్న, ఒక కళాశాలలో పనిచేసే అధ్యాపకులు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మరియొక కళాశాలలో దర్శనమిస్తున్న నియంత్రణ లేని అధికారులు. తొంభై శాతం అధ్యాపకులు వారు బోధిస్తున్న సబ్జెక్ట్ చదవని వారు. దశ దిశ లేకుండా, ముందుచూపు, ఆలోచనకు తావివ్వకుండా అస్తవ్యస్తంగా విద్యారంగం మారిపోతున్నది. నిలువరించాల్సిన ప్రభుత్వానికి పట్టింపు లేకపోగా, నియంత్రణకై ఒత్తిడి పెంచాల్సిన పౌర సంస్థలు, విద్యార్ధి సంఘాలు చతికిలబడుతున్నాయి.

Tags:    

Similar News